ఈ వారం కథ

నిన్నటిదాకా శిలనైనా (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నిన్నటిదాకా ఏమన్నా రాయిలా పడుండేదానివి, ఈ రోజేం బంతిలా ఎగురుతున్నావ్!’’ తీక్షణంగా అడిగాడు జయంత్.
‘‘బంతిని కాను ముద్దబంతిని కాను నేనిప్పుడు బూమెరాంగ్‌ని’’ దృఢంగా పలికింది సరిత.
‘‘ఏ రాంగ్‌వో కాని నాకు మాత్రం రాంగ్ నంబరువి అయిపోతున్నావు’’.
‘‘అదేమాట నేనంటే?’’ తలెత్తి భర్తనే సూటిగా అడిగింది.
‘‘అనక్కరలేకుండానే అంటున్నావు కదా?’’
‘‘అంటే మాత్రమేం? సరిత గొంతు ఖంగుమంది.
‘‘ఎంత పొగరు! భర్తననే గౌరవం కూడా లేకుండా’’. మాటకు మాట బదులిస్తున్న భార్యను ఆశ్చర్యం, తెచ్చిపెట్టుకున్న ఆగ్రహం కలబోసి చూసాడు.
‘‘గౌరవమనేది పరస్పరం ఇచ్చిపుచ్చుకోవాల్సినది. వన్ వేలు పోయి టు వేలు వచ్చి చాలా రోజులయింది’’. మనసులో ఓ మూల బాధగా ఉన్నా పని సానుకూలం చేసుకోవాలంటే ఈ మాత్రం రిపార్టీ ఉండాల్సిందే అనుకుంటూ గొంతులో స్థిరత్వాన్ని మరింత దృఢంగా నిలిపింది.
‘‘నీ ప్రపంచ జ్ఞానానికి జోహార్లు. ఇంతకీ నువ్వు నీ మంకుపట్టు విడవన్నమాట’’.
‘‘ఐయాం సారీ! నన్నిక వదిలెయ్యండి. ఇన్నాళ్లు మీరు చెప్పినదానికంతా గంగిరెద్దులా తలాడించాను. ఇక నావల్ల కాదు. నాకడ్డుపడకండి. నన్ను దయచేసి ఆపకండి. ఇంత నిక్కచ్చిగా చెప్పాక కూడా మీరు నా దారిలో ముళ్లు పరిస్తే నేను బెదిరిపోతానని అనుకోకండి. వాటిని నుసిచేసి నా గమ్యం చేరుకుంటాను’’.
‘‘నుసిచేస్తుందట మసి. చేసావులే, చాణక్యుడి చెల్లెలివి కదా!’’ గొణుక్కున్నాడు తనలో తనే. పైకంటే మళ్లీ మాటల తూటాలు వెలువడుతాయేమోనని.
‘‘ఏమిటో గొణుక్కుంటున్నారు. గట్టిగా అంటేకదా తెలిసేది’’ నవ్వునాపుకుంటూ అడిగింది సరిత.
‘‘హమ్మయ్య మొత్తానికి భలే చూపించావు నాటకం. నీలో మంచి నటి ఉంది సుమా!’’ సరితను మెచ్చుకుంటూ భుజం తట్టాడు.
‘‘మీరు మాత్రం తక్కువా! కాలేజీలో వేసేవారటగా నాటకాలు, మీ అమ్మగారే చెప్పారు’’.
‘‘అమ్మో, మా అమ్మ దగ్గర నేనేం వేషాలు వేసానో కూపీ లాగుతున్నావా?’’
‘‘అయ్యోరామ గుమ్మడికాయల దొంగంటే అన్నట్టు నిజంగానే ఉలిక్కిపడుతున్నారే’’ మరింత ఉడికిస్తూ పకపకా నవ్వింది సరిత.
నవ్వులు కురిపించిన నాటకం వెనుక తన దృఢమైన నిర్ణయాన్నీ చూచాయగా తెలిపాననుకుంది సరిత.
‘‘ఏదో తేడా కనబడుతోంది. తనపై నిఘా పెట్టినట్లు మాట్లాడుతోంది. నవ్వుతూనే చెప్పాల్సినవన్నీ చెప్పకనే చెప్పింది. ‘సరితలో ఎక్కడిదీ బలం? ఎవరు నేర్పుతున్నారు ఈ విపరీత బుద్ధులు? ఆ... ఫోనులో తెగ మాట్లాడుతుందే నాలుగో అంతస్తులోని నేస్తం, ఆ మహాతల్లే అయుంటుంది. ఆవిడ మొగుడికన్నా ముందే స్కూటీ ఎక్కి జారుకుంటుంది. ఆమేనా లేక మరెవరైనానా అనేది కనుక్కోవాలి. అమ్మకు కూడా చెప్పాలి ఈ కుట్ర వెనుకనున్న భస్మాసుర హస్తాన్ని ఓ కంట కనిపెట్టమని. పచ్చని తన కాపురంలో చిచ్చు పెడ్తున్న విదేశీ హస్తాన్ని లాఘవంగా పట్టుకుని తీరాలెలాగైనా అనుకున్నాడు.
ఆలోచనలో పడ్డ భర్తవైపు విజయ దరహాసంతో చూసి వంటింటిలో టీ కాస్తున్న అత్తగారిని ఆగమని కప్పు నిండుగా కాచిన టీని వడబోసి భర్తకందించబోయి అతడిక మాట్లాడే అవకాశాన్ని పెంచకూడదనుకుని అక్కడే ఉన్న టీపాయ్ పైన కప్పును పెట్టి వంటింటిలో పని ఉన్నట్టు హడావిడిగా వెళ్లిపోయింది సరిత.
‘అమ్మ వచ్చి మూడు రోజులే అయింది. అప్పటినుండి సన్నాయిమేళం మొదలైంది. పాపం ఎప్పుడోకాని రాని అమ్మకు వంటిల్లు అప్పజెప్పి ఊరేగుతుందా? ఛ.. ఛ.. రాత్రంతా చిలక్కి చెప్పినట్లు చెప్పాడు. నువ్వు బయటకు వెళ్లి ఉద్యోగం చేసే పని పెట్టుకోకు. అమ్మకన్నీ చక్కగా అమర్చి వేళకు మందులవీ ఇవ్వాలనీ, గుడికి, భజనలకు అడిగితే నొచ్చుకోకుండా తీసుకెళ్లాలని.. ఇంత చెప్పాక కూడా ఉదయమే లేవగానే ఇంత హడావిడి చేస్తుందా? అందునా అమ్మ ముందే! అమ్మ కూడా మా వాగ్యుద్ధం వినే వుంటుంది. మాటా మాటా రావడంతో అమ్మ వచ్చిన ధ్యాసే మరచి నోరు పెంచాడు. ఎప్పటిలానే కిమ్మనకుండా ఉంటుందనుకున్నాడు కాని ఇలా ఎదురుదాడి జరుగుతుందనుకోలేదు.
‘్ఛ.. ఛ..్ఛ..్ఛ.. అమ్మ ఎప్పుడైనా నాన్న ముందు ఇలా తిరగబడి మాట్లాడేదా! ఆయనను ఎదిరించి మాట్లాడటం అటుంచి ఆయన ముందు అమ్మ నోరెత్తిన జ్ఞాపకమే లేదు కాదు. అన్నిటికీ కళ్లతోనే జవాబులు, అవును అని చెప్పాలన్నా కాదని చెప్పాలన్నా! అన్నిటికీ నాన్న రంకెలే. నానమ్మే గొణిగేది ‘దాన్ని సతాయిస్తున్నావురా’ అని. అమ్మ నవ్వుకుంటూ తన పని తను చేసుకునేది తప్ప ఎందుకలా అరుస్తారని నాన్నను అడిగిన దాఖలా లేదు. ‘ఎంతంటే ఎంత’ అంటూ గొంతు పెంచిన భార్య నోటికి జిప్ వేయాలన్నంత కోపంగా ఉంది జయంత్‌కు.
‘అమ్మ ముందు ఎంత తలవంపులు? తల కొట్టేసినట్లయింది. ఇక నా మర్యాద, గౌరవం ఏమున్నాయి? పెళ్లాం చేతిలో కీలుబొమ్మ అని ఎవరో ఎందుకు అమ్మే అనుకోదూ! అసలు మగాడికి పోనీ భర్తకు గౌరవం, మర్యాద ఇవ్వని భార్య ఉంటుందా? మొగుడు భోంచేయనిదే భోంచేయని భార్యలున్నారు. అంతెందుకు తన ఆఫీసులో ఉండేది ఆడ బాసే. అయితేనేం వాళ్లాయన రాగానే తనలాంటి చెట్టంత మగాళ్లున్నా సరే లేచి నిలబడుతుంది. బాస్ లేచింది కదా అని తాను లేచి నిలబడక తప్పదు మనసులో తిట్టుకున్నా. ఆడ బాస్‌కు కంప్యూటర్ ఆపరేటర్‌గా చస్తే ఉండకూడదు అనుకుంటాడు. అమ్మో బాసు! అక్కడ ఆడ బాసు ఇక్కడ ఈడ బాసు తయారయింది. భార్య ఇంకా ఉద్యోగంలో చేరనే లేదు, ఇంటర్వ్యూకు వెళ్తున్నాను అనిందో లేదో తనలో ఎందుకింత సంఘర్షణ రాజుకుంటుందో తనకే అర్థంకాని అయోమయంలో పడిపోతున్నాడు జయంత్.
‘‘సరితా టిఫిన్ బాక్స్!’’ తన అసంతృప్తినంతా తన పెంచిన గొంతులో కనబడేలా అరిచాడు.
‘‘ఇదిగోరా’’ తల్లి అందించింది టిఫిను డబ్బాను.
‘‘అమ్మా, నువ్వు కోడలిని గారాబం చేస్తున్నావు. నువ్విలా వచ్చి ఫ్యాను కింద కూర్చో నింపాదిగా. నువ్వు కాలు కదపక్కరలేకుండా నీ కోడలు నీకన్నీ చేసి పెడుతుంది. హాయిగా కూర్చో నువ్వున్నన్ని రోజులు. ఇక్కడే ఉండిపోమ్మంటే వినవు. పొలం పని, వాన, మట్టి అంటూ అక్కడే ఉంటానంటావు’’ బలవంతంగా కూర్చోబెడుతున్న కొడుకును నవ్వుతూ చూసింది జయంత్ తల్లి.
‘‘అమ్మాయికి కూడా టిఫిను డబ్బా సర్దిచ్చి వస్తాను.. ఆగరా’’ అంటూ లేచి వెళ్లింది.
‘హవ్వ!’ నానమ్మలా బుగ్గలు నొక్కుకోవాలనిపించింది జయంత్‌కు. మరీ అంతలా బావుండదనుకుని దగ్గరున్న బల్లమీద ఓ చరుపు చరిచాడు.
‘నువ్వు కోడలి మాటకు తందానతాన అంటున్నావు. తరువాత నీ ఇష్టం. తరువాత కష్టం నాకే’ అని మనసులో అనుకుని తల్లిని, భార్యను టోకుగా వందసార్లయినా గొణుక్కుని ఉంటాడు.
షూ వేసుకుని బైకు తాళాలందుకున్నాడు.
‘‘నాయనా కాస్త ఆగరా, అమ్మాయి కూడా నీతోనే వస్తుంది. నువ్వెళ్లే దారినే కదా, కాస్త వదిలిపెట్టు, బస్సులెక్కి వెళ్తే ఆలస్యమైపోదూ!’’
కోడలికి తల్లి అందించే సహకారం చూస్తే తాననుకున్న హస్తం అమ్మది కాదు కదా అని అనుమానం జయంత్‌ను ఒకసారి కుదిపినట్లయింది.
‘సరే.. సాయంత్రం చూద్దాం. ఇప్పుడు మరో దృశ్యాన్ని పండించలేం’ అనుకుని అక్కడితో ఆపి, ‘‘రండి మేడమ్, హైకమాండ్ రికమెండేషన్ ఉన్న క్యాండిడేట్‌వి కదా!’’ అంటూ బైక్‌ను స్టార్ట్ చేశాడు.
‘‘హమ్మ సరితా అన్నీ పకడ్బందీగా ప్రణాళిక వేసుకుని.. ఇంటర్వ్యూ ముందు రోజు నాకు చెప్తావా! హాయిగా ఇంట్లో కూర్చోకుండా, ఉద్యోగం వద్దన్నా పంతం పట్టి బయలుదేరుతున్నావు. ఐ కెనాట్ విష్ యు బెస్ట్ఫా లక్’- తనలో తనే అనుకోవాలనుకుంటూనే బయటకే అనేసాడు.
అదే గారడీ. వెనక కూర్చోబోతున్న సరితకు ‘బెస్ట్ఫా లక్’ మాత్రమే వినబడింది.
‘‘్థ్యంక్యూ’’ అంటూ అందంగా నవ్వింది.
‘‘్థ్యంక్యూనా?’’ ఆశ్చర్యంతో భుజాలెగరేసి వాహనాన్ని ముందుకు పరుగు తీయించాడు.
‘‘ఎక్కడ ఆపాలో చెప్పండి సరితగారు’’ జయంత్ నవ్వు, ఏడవలేక నవ్వినట్లుంది.
‘‘రాత్రే చెప్పానుగా, మీ ఆఫీసు వెనుక వీధిలో ఉన్న ఓ ఆఫీసులోనే నాకు ఇంటర్వ్యూ అని’’.
హడావిడిగా దిగి బై చెప్పి వెళ్లిపోతున్న భార్యకు టిఫిన్ డబ్బా అందించాడు.
‘‘షుక్రియా’’ అంటూ నవ్వుతూ వెళ్లిపోతున్న భార్యను ఆప్యాయంగా చూశాడు. ‘కష్టం తెలియకుండా భార్యను అపురూపంగా జీవితాంతం చూసుకోవాలనుకున్నాడు. కాని ఇదేమిటిలా మంకుపట్టు పట్టింది!’’
తన ఆఫీసు చేరేదాకా మనసంతా భార్య గురించే ఆలోచనలు జయంత్‌ను వలవేసినట్లు బంధించాయి.
ఉద్యోగం వచ్చిన సంబరంలో సరిత ఆటోలో ఇల్లు చేరుకుంది.
‘‘నాకు తెలుసమ్మా, నీకు తప్పకుండా ఉద్యోగం వస్తుందని. కాని వాడికి కష్టమవుతుందని నీవు కష్టం పెంచుకుంటున్నావు. రేపు పిల్లా పాపా కలిగితే రెండు పనులు నిన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కాపురంలో కలతలకు దారితీస్తాయి’’ అత్త మాటలలో అమ్మ మనసు పలికింది.
‘‘అంతదాకా నేను రానివ్వను కదా అత్తయ్యా. వారి క్షేమమే కదా మనకు కావలసినది. అదృష్టంకొద్దీ నా స్నేహితురాలి భర్త డాక్టరు. వారి దగ్గరికే మీ అబ్బాయి వెళ్తారు. తను ఫోను చేసి చెప్తే తెలిసింది కాని మీ అబ్బాయి కనీసం మీకైనా తన బాధను చెప్పాడా? తనలోని అనారోగ్యాన్ని మనతోకాక మరెవరితో చెప్తారు? తగినంత విశ్రాంతి తీసుకోకుండా పనిచేస్తే ఆపైన పెరిగే మైగ్రెయిన్ తలనొప్పి మనిషిలో చిరాకును పెంచడమే కాక కళ్లకు, గుండెకు కూడా ఒత్తిడి పెంచుతాయి. అత్యధికంగా ఆడవాళ్లను మాత్రమే విసిగించే ఈ తలనొప్పి వీరికి ఎందుకొచ్చిందో ఏమో! అందుకే వారిపై వత్తిడి తగ్గాలంటే నా సహకారం తప్పదు. ఆఫీసులో అడిగి మరీ అదనంగా పనివేళలు పుచ్చుకుని సంపాదించాలనుకుంటారు. ఎందుకలా అంటే బండిపై అప్పు, ఇంటిపై అప్పు అని నన్ను మాట్లాడనీయరు. మరెలా అత్తయ్యా, వారి కష్టాన్ని చూస్తూ ఊరికే ఇంట్లోనే తిని కూర్చునేది?’’- భర్త కుటుంబానికై పడే కష్టం తలచుకున్న సరిత కళ్లు వర్షిస్తున్నాయి.
మరోసారి డాక్టరుకు కనబడదామని బయలుదేరిన జయంత్‌కు డాక్టర్ ఇచ్చిన తన ఫైలు కనబడలేదు. ‘ఇంట్లో పెడితే, ఒకవేళ సరిత చూస్తే ఊరకనే హైరానా పడి తనకిక ఊపిరాడనివ్వదు. అలసిపోతావు తలనొప్పితో అని పోరుతుంది. ఆరు నూరైనా అన్ని వాయిదాలను సమయానికి చెల్లించాల్సిందే. అదే తన ధ్యేయం. తనకు కాస్త తలనొప్పికే ఇల్లు పీకి పందిరి వేస్తుంది. ఇక డాక్టరిలా అన్నారు, అలా అన్నారు అంటే అమ్మో!’ భార్య హడావిడి గుర్తుకొచ్చి జయంత్‌లో చిన్న చిరునవ్వు తొంగిచూసింది.
బాధపడుతున్న సరితను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంది జయంత్ తల్లి.
పొరపాటున ఇంట్లో పెట్టానేమో అని హడావిడి పడుతూ వచ్చిన జయంత్‌కు భార్య చేతిలో తన ఫైలు కనబడి ఆశ్చర్యపోయాడు. తల్లికి ఏదో చూపిస్తూ డాక్టరు రాసిచ్చిన మందుల పేర్లు చదువుతోంది.
‘‘అబ్బ! ఇందుకా! నీ నాటకమంతా, నాకేం దుక్కలా ఉన్నాను. కాస్త తలనొప్పికే హడావిడి పడతావు. ఇక డాక్టరు ఇచ్చిన మందులు అవీ చదివి ఉన్నవీ లేనివీ ఆలోచించి అమ్మను గాభరా పెట్టేస్తావు. ఇలా ఇవ్వు ఆ ఫైలు. నాకేమైనా ప్రాణాలు పోయే జబ్బా ఇంతగా ఆలోచిస్తావ్? అందుకేనా ఉద్యోగమంటూ పరుగులు తీస్తునావు?’’
‘‘ఏమిటో మీ మాటలు! చూడండి అత్తమ్మా, నాకు అడ్డుచెప్పవద్దని చెప్పండి’’.
‘‘ఓ, అయితే ఉద్యోగం పిలిచి ఇచ్చినట్లున్నారే. ఇక నా మాట వినిపించుకుంటావా నువ్వు’’ విసుగ్గా అన్నాడు జయంత్.
‘‘పెళ్లినాడు ఒకరికొకరం అని ఏడడుగులు వేస్తాం. వధూవరులలో పెళ్లంటే అంబరాన్నంటే సంబరమే మరి. అయితే కష్టాన్ని వదిలి సుఖాలనే పంచుకుంటే అది దాంపత్య బంధమనిపించుకోదు’’.
‘‘అంటే!’’ కళ్లు చిట్లించి చూసాడు జయంత్.
‘‘అంటే ఏముంది? అది వ్యాపార బంధమవుతుంది’’.
‘‘సూక్తులు బాగానే ఉన్నాయి అమ్మా మీ కోడలివి’’ పకపకా నవ్వాడు జయంత్.
‘‘ఎన్నో జీవితాలలో ఇదే అంశంపై రాద్ధాంతాలు జరిగి సమన్వయ లోపంతో కూలిన కాపురాలున్నాయి జయంత్ బాబు’’
ఆ మాటలన్న తల్లి వైపు ఆశ్చర్యంగా చూశాడు జయంత్. ‘తండ్రి ముందు తల ఊపిన అమ్మలో ఇన్ని ఆలోచనలుంటే ఆ రోజులలో మారు మాటలాడేదికాదెందుకని!’’
‘‘నీ వౌనం నాకర్థమైంది జయంత్. కాలం మనకన్నా తెలివైనది. నేటి యువతీ యువకులకు ఏమీ తెలియదనుకుంటాం కాని పెద్దవారి జీవితాలను దగ్గరగా చూసినవారు తప్పొప్పుల సమతూకంలో తాము పోషించాల్సిన పాత్రను అర్థం చేసుకోగలుగుతున్నారు’’.
‘‘ఎంతమందిని చూడడం లేదమ్మా, నువ్వెంతంటే నువ్వెంత అని కాపురాలను కూల్చుకుంటున్న వాళ్లను. సరితే మరీ హడావిడి చేస్తుంది. తను ఉద్యోగం చేయాలని నేనేనాడు కోరలేదు కదా? ఎందుకు చేరుతోందో నాకైతే అర్థం కావడంలేదు.’’
‘‘ఎందుకర్థం కాదు? మీరు కాస్త నింపాదిగా కూర్చోండి. అయిదు నిమిషాలలో వచ్చి చెప్తాను’’ లేచి వంటింట్లోకి వెళ్లింది సరిత.
మరు నిమిషంలోనే చేతిలో పళ్లెం నిండుగా చక్కెర పొంగలి మరో చేతిలో నీళ్లసీసాతో వచ్చిన సరితను ఆప్యాయంగా చూసారిద్దరూ.
చేతిలోని పళ్లేన్ని జయంత్‌కు అందిస్తూ.
‘‘ఇందుకు. మీరు సాయంత్రానికే వచ్చేస్తే నేను అదే సమయంలో వచ్చేసి కబుర్లు కలబోసుకుని మనకంటూ కాస్త సమయాన్ని సృష్టించుకోగలం. ఎవరి జీవితం వారిది అన్నట్లు బ్రతకటానికి పెళ్లెందుకు? కాపురాలెందుకు? ఏమంటారు?’’’
‘‘అన్నీ నువ్వే అంటుంటే నేనేమనగలను?’’
‘‘హమ్మయ్యా మావారు మంచివారు’’ చిన్నపిల్లలా సంబరపడసాగింది సరిత.
‘అమ్మ’ అన్నట్లు కళ్లతోనే సైగ చేసాడు జయంత్.
పనున్నట్లు తల్లి లేచి వెళ్లబోతుంటే, ‘‘కూర్చోమ్మా నువ్వూ తిను నాతోపాటు’’ తల్లికి పళ్లెమందించబోయాడు.
‘‘నేను తిన్నానులేరా, మీ ఆవిడే నీకోసం చూస్తూ..’’ నవ్వింది జయంత్ తల్లి.
‘‘అవునా మరీ పాతకాలం పిల్లలా ఉన్నావే!’’
‘‘అదేం లేదు, భార్యాభర్తా ఇద్దరూ సమానమే. కానీ’’ ఆగింది సరిత.
సరితనేడ్పించటానికి తను చెప్పే సినిమా డైలాగు- ‘‘అవును, భర్త ఇంకొంచెం ఎక్కువ సమానం’’ గుర్తుతెచ్చుకున్న ఇద్దరు నవ్వులకు చిరునామాగా నిలిచారు.
చక్కెర పొంగలి ఆప్యాయంగా తినబోయి సరితకు పళ్లాన్నందించాడు జయంత్.
‘‘మీ కష్టం గమనించకుండా నిన్నటిదాకా శిలలా పడున్నాను, నన్ను క్షమించండి. చదువుండి మీకు సహకరించలేకపోయాను’’.
‘‘శిలలానా అంటే రాయిలా కదా అదేదో రాంగ్‌వి అన్నట్లున్నావ్!’’ నవ్వాడు జయంత్.
సరిత కళ్లలో చిరునవ్వుల వెలుగులు.
‘‘ఒకరిపైనొకరికి ఉండే ఆప్యాయతే మధుర దాంపత్యాన్ని నిర్వచించాల్సిన శిలాక్షరం’’. తల్లి మాటలకు నిజమేనన్నట్లు తలూపాడు జయంత్.
*

రచయిత్రి సెల్ నెం: 9885809250

-సి.ఉమాదేవి