సబ్ ఫీచర్

మద్రాసు తొలి తెలుగు మేయర్ త్యాగరాయశెట్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరయగ కార్యదక్షత మహా గుణశీలము ప్రజ్ఞతాల్మియున్
పరహిత చింత పట్టుదల ప్రాజ్ఞుల సఖ్యము శ్రద్ధసేవయున్
గురుతర కార్యనిర్వహణ కూర్మిజెలంగు ప్రజానురాగమున్
స్థిరమగు భావసంపదయు ధీరతగల్గిన నాయకుండగున్.
సాహిత్య పిపాసి విద్వాన్ గోసు ధర్మయ్యగారు రచించిన రుూ పద్యం నాయకునికి వుండవలసిన లక్షణాలను గుఱించి వివరిస్తున్నది. దీక్ష, పట్టుదల, గురుతర బాధ్యత, పరహిత చింతన, నిస్వార్థమైన సేవ, నిరంతర శ్రమ, మొక్కవోని దేశభక్తి యివన్ని సంఘసేవాపరాయణులకు ఉండే లక్షణాలు. ఈ లక్షణాలన్నీ ఉండబట్టే సర్ త్యాగరాయశెట్టి నలుబదేండ్లపాటు మద్రాసు నగరపాలక సభ్యుడుగా, తదుపరి మద్రాసు నగర తొలి తెలుగు మేయరుగా విశేషమైన సేవలందించి నేటి చెన్నై నగర వైభవానికి ఆనాడే పునాదులు వేశారు.
సర్ త్యాగరాయం పూర్వీకులు మద్రాసుకు అరువది కిలోమీటర్ల దూరంలోవున్న మానెల్లూరు గ్రామానికి చెందినవారు. మానెల్లూరు తిరువళ్ళూరు జిల్లా గుమ్మిడిపూండి తాలూకాలో వున్నది. పిట్టి త్యాగరాయం పెద్దలు మద్రాసులో చర్మ వ్యాపారం చేసుకుంటూ అక్కడే స్థిరపడిపోయారు. త్యాగరాయం తండ్రి అయ్యప్ప. తల్లి భద్రమ్మ. వీరికి ముగ్గురు కుమారులు. రెండవ, మూడవ కుమారులిద్దరికీ త్యాగరాయం అనే పేరు పెట్టడంతో రెండవ వాడు పెద్ద త్యాగరాయమని, మూడవవాడు చిన్న త్యాగరాయం అని పిలువబడ్డారు.
చిన్న త్యాగరాయం ఎల్లవేళల తెల్లని దుస్తులు ధరించి దానికి తగ్గట్టు పవిత్ర హృదయం కలిగి యుండడంవల్ల ఆయన శే్వతాంబరయోగి (White Robed Saint) అని వాసికెక్కాడు. ఆయన రూపురేఖలు, వస్తధ్రారణ విలక్షణంగా వుంటూ హైందవ సంస్కృతికి అద్దంపట్టేది. చిన్న త్యాగరాయం 1852వ సంవత్సరం ఏప్రిల్ నెల 27వ తేదీ జన్మించాడు. పూవు పుట్టగనే పరిమళించునట్లు చిన్న త్యాగరాయం శైశవ దశనుండి చురుగ్గా వుండేవాడు. స్ఫురద్రూపి అయిన త్యాగరాయం ప్రాథమిక విద్యనుండే మేటి విద్యార్థిగా రాణించాడు. ఉన్నత విద్యనభ్యసించి మద్రాసు ప్రెసిడెన్సి కళాశాలలో 1876వ సంవత్సరం బి.ఏ. పట్టా పుచ్చుకున్నాడు. ఆనాటి చేనేత కుటుంబాలలో ఆయనే తొలి పట్ట్భద్రుడు. త్యాగరాయం చిన్ననాడే వివిధ నాయకుల యొక్క, మహనీయుల యొక్క గాధలు చదివి నాయక లక్షణాలను జీర్ణించుకున్నాడు. భవిష్యత్తులో మహానాయకుడు కావడానికి త్యాగరాయునికి ఎంతో తోడ్పడ్డాయి.
తెలుగు, తమిళం, ఆంగ్లంతోపాటు, కన్నడం, ఫ్రెంచి, లాటిన్ భాషలలో ఆరితేరిన వాడయ్యాడు. పెరిగి పెద్దయ్యాక తాను ఆంధ్ర, ఆంగ్ల, ద్రవిడ పత్రికలు నడపడానికి రుూ భాషాజ్ఞానం చక్కగా ఉపయోగపడింది. తొలినుండీ పెద్ద త్యాగరాయం, చిన్న త్యాగరాయం ఇరువురూ ఐకమత్యంతో యుండి తోళ్ళ వ్యాపారమును మిక్కిలి నేర్చుతో కొనసాగించి పేరుప్రఖ్యాతులు సంపాదించారు. విద్యావంతులైన చిన్న త్యాగరాయం చిన్నతనమునుండే సేవాభావం కలిగి యుండేవాడు. ఔత్సాహిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. 1876లో కనివిని ఎరుగని భయంకరమైన కరవు ఏర్పడింది. అది ధాతునామ సంవత్సరం కావడంతో దానిని ధాతు కరువంటారు. ప్రజలు కూడు గుడ్డలేక అనేక ఇబ్బందులకు గురయ్యారు. పూట గడవని పేదల దుస్థితిని చూసి చలించిపోయాడు త్యాగరాయుడు. ఆనాటి ఆంగ్ల ప్రభుత్వంనుండి సాయంకోసం ఎదురుచూడక స్వంత ఖర్చులతోనే గంజి కేంద్రాలను ఏర్పాటుచేసి పేద ప్రజల ఆకలి తీర్చాడు. ఆ మహానుభావుడేర్పఱచిన గంజి కేంద్రములుండిన స్థలమే గంజి దొడ్డి. ఆ స్థలంలో కట్టబడిన ఆసుపత్రికి గంజిదొడ్డి ఆసుపత్రి అని పేరువచ్చింది. అదే చెన్నై నగరంలోని యిప్పటి స్టాన్లీ హాస్పిటల్. త్యాగరాయంశెట్టిగారి విజ్ఞతకు, మహోన్నత దానగుణానికి అటు ప్రభుత్వము ఇటు ప్రజలు మెచ్చి ప్రశంసాజల్లులు కురిపించారు. అలా సార్థకనామధేయుడయ్యాడు త్యాగరాయం. సేవాతత్పరుడైన త్యాగరాయం నిరుపేదల సంక్షేమంకోసం శాశ్వత సంక్షేమ పథకాలుండాలని ఆశించేవాడు. ప్రజాసేవ చేసేందుకు క్రియాశీలక రాజకీయాలే మార్గమనుకున్నాడు. కాలం కలిసి వచ్చింది. 1882లో మద్రాసు నగర పాలక సభ్యుడుగా పోటీ లేకుండా పిట్టి త్యాగరాయశెట్టి నియమితులయ్యారు. ఆ పదవిలో ఆయన 1920వ సంవత్సరం వఱకు 38 ఏళ్ళపాటు కొనసాగి సమాజానికి మెరుగైన సేవలందించారు. తత్ఫలితంగా 1920వ సంవత్సరంలో మద్రాసు నగర పాలక సంస్థకు ఏకగ్రీవంగా మేయరయ్యాడు. మద్రాసు నగర ప్రథమ మేయరు అనే గౌరవం పిట్టి త్యాగరాయశెట్టిగారికే దక్కింది. ప్రతిభకు పట్టంగట్టడం అంటే యిదే మరి. మద్రాసు నగర ప్రథమ మేయరు తెలుగువాడు కావడం ఎంతో ముదావహం.
మేయరు పదవిని చేపట్టిన శెట్టిగారు ఆ పదవిలో 1923వ సంవత్సరం వఱకు వుండి నగరాభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమించారు. తనకు తనవారికంటూ ఆలోచింపక కేవలం ప్రజాసేవకే అంకితమయిపోయారు. ప్రజల ఆర్థిక పరిస్థితిని మెఱుగుపరచడానికి, వారి ఆరోగ్యమును పెంపొందించడానికి పగలనక రేయనక పాటుపడ్డాడు. శెట్టిగారి అపూర్వమైన సేవలకు, ఆదర్శపాలనా విధానానికి బ్రిటీషు ప్రభుత్వం మెచ్చి 1909లో రావుబహదూర్, 1919లో దివాన్ బహదూర్ అను బిరుదులతోపాటు 1921లో విశిష్టమైన సర్వోన్నతమైన ‘సర్’ అను బిరుదునిచ్చి సత్కరించింది. ఆనాటినుండి ఆయన సర్ పిట్టి త్యాగరాయశెట్టి అని పిలువబడ్డాడు.
సర్ పిట్టి ఎన్ని బిరుదులు అందుకున్నా తాను చేపట్టిన ప్రజాసేవను యధాతథంగా కొనసాగించాడు. మద్రాసు నగర ప్రథమ పౌరుడైన సర్ పిట్టి త్యాగరాయం ఆనాటి ఆంగ్ల ప్రభుత్వంతో సంప్రదించి వెనుకబడిన తరగతుల వారికి గృహవసతులను, ఉద్యోగ అవకాశాలను, విద్యా సౌకర్యాలను, విద్యార్థులకు ఉచిత ఉపకార వేతనాలను కల్పించాడు. దక్షిణ ఇండియా వర్తక సంఘమును స్థాపించి ఆ సంఘ అధ్యక్షుడుగా 1910నుండి 1921 వఱకు దాని అభివృద్ధికి గట్టి చర్యలు తీసుకున్నాడు. దక్షిణ ఇండియా సంక్షేమ హక్కుల సంఘమును స్థాపించాడు. చెన్నపురి ఆంధ్ర మహాసభ స్థాపనలో సర్ పిట్టి పాత్ర గణనీయమైనది. నగరంలోని ప్రసిద్ధ పచ్చయప్ప కళాశాల ధార్మిక సంస్థకు అధ్యక్షుడుగా చాలా ఏళ్ళపాటు పనిచేసి ఆ సంస్థ మూడుపువ్వులు ఆరుకాయలుగా విరాజిల్లడానికి కారకుడయ్యాడు. మద్రాసు నగరానికి ఆయన చేసిన సేవ విలువకట్టలేనిది.
మద్రాసు నగరానికి బహుముఖ సేవలందించిన శెట్టిగారు 1885లో కాంగ్రెసు పార్టీలో సభ్యుడుగా ఉండేవాడు. కొన్ని విషయాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో విభేదించి ఆ పార్టీని వీడి తన సహచరుడైన డా.టి.యం.నాయరుతో కలసి 1916వ సంవత్సరంలో జస్టిస్ పార్టీని స్థాపించాడు. పార్టీకొఱకు ఆనాడు తన స్వయార్జితాన్ని కోటి రూపాయల వఱకు వెచ్చించాడు. 1920లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో జస్టిస్ పార్టీ మెజారిటీ స్థానాలను సంపాదించింది. ముఖ్యమంత్రి పదవి త్యాగరాయం గారిని వరించింది. కాని ఆ పదవి తనకు వలదని చెప్పి తన పార్టీలోని మరొక నాయకునికి యిప్పించాడు. ముఖ్యమంత్రి పదవిని మూడుసార్లు తిరస్కరించి తనకు పదవీ వ్యామోహం లేదని లోకానికి చాటి చెప్పాడు. జస్టిస్ పార్టీ నాయకులైన సర్ పిట్టి త్యాగరాయం, డా.టి.యం. నాయర్‌ల తరువాత పార్టీ ప్రాభవం వేగంగా తగ్గి తుదకు ఉనికినే కోల్పోయింది. నలుబదేళ్ళపాటు అవిశ్రాంతంగా మద్రాసు నగరానికి సేవలందించిన సర్ పిట్టి త్యాగరాయశెట్టిగారు 1925వ సంవత్సరం ఏప్రిల్ 28వ తేదీన పరమపదించారు.
వారీనాడు లేకున్నా వారుచేసిన అపారమైన సేవలకు నిదర్శనంగా ఎన్నో జ్ఞాపక చిహ్నాలు నేటికీ ఎన్నోచోట్ల మన కళ్ళముందు దర్శనమిస్తున్నాయి. పాత చాకలిపేటలో ఆయన పేర వెలసిన విద్యాలయాలు, పార్కులు, చెన్నై నగర పాలక భవనమైన రిప్పన్ బిల్డింగు ఎదుట ప్రతిష్టింపబడిన సర్ పిట్టి త్యాగరాయం శిలాప్రతిమ, ఆయన పేరుతో వ్యాపార కేంద్రంగా వెలసియున్న త్యాగరాగనగర్. టి.నగర్‌లో జి.ఎన్.చెట్టి వీధిలోని త్యాగరాయం ఆడిటోరియం ఇవన్నీ సర్ పిట్టి త్యాగరాయశెట్టిగారిని స్ఫురింపజేసేవే!
*
(డా. నాగసూరి వేణుగోపాల్ సంపాదకత్వంలో వెలువడిన
‘దక్షిణాంధ్ర దారిదీపాలు’ పుస్తకం నుంచి కొంత భాగం)

- పోజుల ముద్దుకృష్ణుడు