సబ్ ఫీచర్

33 ఏళ్ళకు మళ్లీ ఏపీ సాహిత్య అకాడెమీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొద్దిరోజుల ముందర ఆంధ్రప్రదేశ్ సాహితి అకాడెమీ ఏర్పాటు పూర్తిస్థాయి ప్రకటన వెలువడింది. ముప్ఫై మూడేళ్ళ తరువాత, తెలుగు రచయితలకు ఈపాటి ఆలంబన ఏర్పడడం జరుగుతున్నది. అలనాడు 1980ల్లో ఎన్‌టిఆర్ ప్రభుత్వం అటు మద్య నిషేధం, ఇటు అకాడెమీల రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నది. అకాడెమీలను తెలుగు విశ్వవిద్యాలయం పరిపాలనా వ్యవహారాల్లో భాగం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. మద్యనిషేధంపై కొద్దికాలంలోనే సమీక్ష జరిగి దాన్ని తొలగించారు. అది రెవెన్యూకి, ప్రభుత్వాదాయానికి సంబంధించిన విషయం కావడవంవల్ల సత్వర నిర్ణయం తీసుకున్నారు అనుకున్నా, తరువాత వచ్చిన ఏ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో సాహిత్య, సంగీత, నాటక అకాడెమీలు అవసరం అని భావించలేదు. అది వారికి ఎన్నికలలో కలిసి వచ్చే అంశమూ కాదు. కానీ జాతి సాహిత్య సాంస్కృతిక స్థాయికి చాలా అవసరమైన ప్రభుత్వ కట్టుబాటు, అంకితభావనలకు చెందినది. ఇది లేకపోతే ఏమి నష్టం జరగాలో, అదే తెలుగువారికి గత 35 ఏళ్ళుగా జరుగుతున్నది.
అలా 1956 తరువాత, దక్షిణాది రాష్ట్రాల్లో అటు కేరళ, 1961లో కర్నాటకలో ఏర్పడ్డ ఆ రాష్ట్రాల సాహిత్య అకాడెమీలు నేటికీ అరవై ఏళ్ళు పైబడి పనిచేస్తూ ఉండగా, మనం తెలుగు ప్రజలం మాత్రం, మన పని రాజకీయ వర్గాల పుణ్యమాని మధ్యలోనే గండికొట్టబడి, గత మూడున్నర దశాబ్దాలుగా, సాహిత్య అనాథలుగా బతుకుతూ వచ్చాము. తెలుగు విశ్వవిద్యాలయం ప్రకటించే వార్షిక పురస్కారాలు కొంత లోటు దీర్చినా, కొందరి పేర్లపై వారి కుటుంబ సభ్యులు, తెలుగు విశ్వవిద్యాలయ నిర్వహణలో జరిగేలా ఎండోమెంటులు ఇచ్చి ‘్ధర్మనిధి పురస్కారాలు’ అంటూ కొంత కార్యక్రమాలు జరిగినా, అవేవీ కూడా, ఒక రాష్ట్ర సాహిత్య అకాడెమీ స్థాయిని చేరుకునే అంశాలు కావు.
పూర్తిగా తెలుగు సాహిత్య, సాంస్కృతిక సమాజం ఎటువంటి ప్రభుత్వ గుర్తింపు, మద్దతు లేకుండా 1985 నుంచీ 2019 వరకూ అవస్థలు పడుతూనే ఉన్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, రెండేళ్ల కిందటలో ఒక భాషా దినోత్సవం నాడు, ఏడు అకాడెమీలు ఏర్పాటుచేస్తామని ప్రకటించింది. గత ఏడాది నాటక అకాడెమీ ఏర్పాటుచేశారు. ఈ ఏడాది సాహిత్య, సంగీత అకాడెమీలకు కూడా ముందు చైర్మన్‌లను ప్రకటించి, కొద్ది రోజుల ముందరే కమిటీల విషయమై స్పష్టత, సభ్యుల వివరాలు ప్రకటించారు. ఆచార్య కొలకలూరి ఇనాక్ రాష్ట్ర సాహిత్య అకాడెమీ అధ్యక్షులుగా, వందేమాతరం శ్రీనివాస్ సంగీత అకాడెమీ అధ్యక్షులుగా జానపద కళలు అకాడెమీకి పొట్నూరి హరికృష్ణ అధ్యక్షులుగా నియమితులయ్యారు. రచయితలు అట్టాడ అప్పలనాయుడు ఉపాధ్యక్షులుగా, నారంశెట్టి ఉమామమహేశ్వరరావు, జగద్ధాత్రి, కత్తిమండ ప్రతాప్, రసరాజు, పాటిబండ్ల రజని, కంతేటి శివరామ్ కుమార్, పి.దక్షిణామూర్తి, నాగభైరవ ఆదినారాయణ, ఆర్.ఎం.ఉమామహేశ్వరరావు, వి.ఆర్.రాసాని సభ్యులుగా ప్రకటించారు.
తెలుగు సాహిత్యంలో ఎనభై ఏళ్ల వయసులో, నిరంతర శ్రమ, సాహిత్య రచన, అనువాదాలు, సాహిత్య వ్యాసాలు వెలువరిస్తూ, తన కృషికి తగు గుర్తింపులు పొందుతూ వస్తున్న సృజనశీలిగా, ఇనాక్‌గారి ఎంపిక, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ అధ్యక్షులుగా సరైనది. క్రియాశీలకంగా ఎన్నో పదవులు నిర్వహించిన అనుభవశాలిగా కొలకలూరి ఇనాక్‌గారి మార్గదర్శకత్వంలో కొలువుదీరే ఈ అకాడెమీ ముందర పనుల దొంతర ఉన్నది. ఇతర దక్షిణాది రాష్ట్రాల సాహిత్య అకాడెమీలతో పోలిస్తే, మనం మూడున్నర దశాబ్దాలుగా వెనుకబడి ఉన్నాము. అరవై ఏళ్ళకు మించి నిరంతర కృషి, సమిష్టి భాగస్వామ్యం, ప్రభుత్వాల మద్దతుతో అటు కర్నాటక, ఇటు కేరళ అకాడెమీలు కూడా చాలా ప్రగతి సాధించిన సందర్భంలో, ప్రస్తుతం తెలుగు సాహిత్య అకాడెమీ రూపొంది, తన కార్యక్రమ ప్రణాళికను సిద్ధం చేసుకోవలసి ఉన్నది. దీనికై ముందర, అకాడెమీ ఏర్పడగానే, రచయితల బృందాలు అటు కర్నాటక, ఇటు కేరళ అకాడెమీలు కూడా చాలా ప్రగతి సాధించిన సందర్భంలో, ప్రస్తుత తెలుగు సాహిత్య అకాడెమీ రూపొంది, తన కార్యక్రమ ప్రణాళికను సిద్ధం చేసుకోవలసి వున్నది.
దీనికై ముందర, అకాడెమీ ఏర్పడగానే, రచయితల బృందాలు, అటు కర్నాటక, ఇటు కేరళ రాష్ట్రాలకు అధ్యయన యాత్రలుగా వెళ్లి, అక్కడ, ఈ ముప్ఫై అయిదేళ్లుగా జరుగుతూ వచ్చిన ప్రగతిని ఆకళింపు చేసుకోవాలి. ఈ రెండు రాష్ట్రాల్లో అకాడెమీలు డిజిటల్ ప్రతులుగా సాహిత్యాన్ని భద్రపర్చడంలో ముందంజవేశాయి. రచయితలకు గుర్తింపులు, ప్రయాణ / పరిశోధన గ్రాంట్‌లు, పురస్కారాలు అందించడంలో మంచి కృషి చేస్తున్నాయి. అనువాద లక్ష్యాలను ఖరారు చేసుకుని కూడా తమ భాషా సాహిత్యాలు, తగు సమయంలో దేశంలో ఇతర భాషలకు, ఆంగ్లంలోనికి చేరేలా పనిచేస్తున్నారు.
2015లో కన్నడ సాహిత్య అకాడమీ అయిదుగురు రచయితలకు జీవిత సాఫల్య పురస్కారాలు ప్రదానం చేసింది. ఏదో ఒక సాహిత్య ప్రక్రియలకు ఒక ఏడాది కాకుండా, భిన్న సాహిత్య శాఖల్లో తమ వార్షిక పురస్కారాలను ప్రకటిస్తున్నది. అలా చూసుకుంటే, ఏకంగా పదహారు మంది రచయితలకు సాహిత్య విశిష్ట పురస్కారాలు అందజేసింది. ఇవి కాకుండా ఎండోమెంట్ అవార్డులుగా అచ్చులో వున్న పుస్తకానికి సహాయాలు, అలాగే నవల, ఆత్మకథ, సాహిత్య విమర్శ, సృజనాత్మక అనువాదం, తొలి రచనకి అవార్డు, కన్నడ నుంచి ఇంగ్లీషుకి అనువాదం- ఇలా దాదాపు ఇరవై మూడు రంగాల్లో సాహిత్య ప్రగతి, పరిణామ దశలకు తాను ప్రోత్సాహ వేదికగా నిలుస్తున్నది. ఒక ఏడాదికి ఒకరికే అవార్డు అనే రోజులు పోయాయి. బహుళ రూపాల్లో సాహిత్య రచన, సమాజాన్ని చిత్రించే రోజుల్లోకి వచ్చాము. ఆ రూపాలనన్నిటినీ ఇతర అకాడెమీలు గుర్తిస్తున్నట్టే మనం కూడా చేయాలి. అనువాదాలు రియల్ టైమ్‌లో అంటే, ఒక మంచి రచన వచ్చిన రెండు మూడేళ్లలో జరిగేలా, అక్కడి అకాడెమీలు శ్రద్ధ తీసుకుంటున్నాయి. మనమూ పాటించవలసిన మంచి క్రమశిక్షణ ఇది. కన్నడ దేశంలో, ఈ సాహిత్య అకాడెమీ మాత్రమే కాకుండా, కన్నడ అనువాద పరిషత్ కూడా వున్నది. కర్నాటక సాహిత్య అకాడెమీని డైరెక్టరేట్ ఆఫ్ కన్నడ మరియు కల్చర్ శాఖ ప్రభుత్వ నిధులతో అటానమస్ సంస్థగా నడుపుతున్నారు. 1961 నుంచీ ఈ సంస్థ పనిచేస్తున్నది. ట్రావెల్ గ్రాంట్లు, సెమినార్లు, వర్క్‌షాపులు, సాహిత్య షార్ట్ ప్రెస్ గ్రాంట్స్, యువకవి సమ్మేళనాలు వీరి సాధారణ వార్షిక కార్యక్రమాలుగా రాష్ట్రం అంతటా జరుగుతున్నాయి.
1956 నుంచి త్రిసూర్‌లో కేరళ సాహిత్య అకాడెమీ పనిచేస్తున్నది. ఇది కూడా అటానమస్ సంస్థ. పాలన వ్యవహార మండలి రచయితలతో కూడి ఉండగా, ఆర్థిక మండలి, జిల్లా కలెక్టర్ నియంత్రణలో పనిచేస్తున్నది. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రతినిధులు కూడా ఈ సభ్య మండలిలో ఉంటారు. సాహిత్య చక్రవలం మాసపత్రిక, సాహిత్యలోకం ద్వైమాసిక పత్రిక, అలాగే మలయాళం లిటరేచర్ సర్వేపై ఒక త్రైమాసిక ఆంగ్లంలో నడుపుతున్నారు. మలయాళం, ఇంగ్లీష్‌లో విరివిగా సాహిత్య అకాడెమీ పుస్తక ప్రచురణలు చేస్తున్నది. ఏడాదికి ఎనిమిది మంది సాహిత్యవేత్తలకు పురస్కారాలు అందజేస్తున్నది. కవిత్వం, నవల, కథ, నాటకం, సాహిత్య విమర్శ, ఆత్మకథ, జీవిత కథ, యాత్రా సాహిత్యం, బాలల సాహిత్యం, హాస్యరచనలు, భాషా శాస్త్ర రచనలు, అనువాదం, అలాగే జీవితకాల సాహిత్యరంగ సేవలకుగాను అయిదుగురికి ప్రత్యేక అవార్డులు వీరు 2016లో ప్రకటించారు.
ఇలా చూస్తే, దక్షిణాదిలో తెలుగు అగ్రగామి భాషగా, మనం రూపొందించుకోవలసిన లక్ష్యాలు, వీరు అమలుపరుస్తున్న వాటికి అవకాశం ఇస్తూ, మన సాహిత్య ఉన్నతి, జరుగవలసిన పరిశోధన రంగాలకు తగు విలువ, భాషా శాస్త్ర నిర్మాణాలు, భాష ఆధునీకరణ ప్రాగ్రూపాలు నమోదయ్యే ప్రణాళికలు, పుస్తకాల ప్రచురణలు, డిజిటల్ ప్రక్రియ, స్పష్టమైన లక్ష్యాలతో సాహిత్య అనువాద విధానం, రచయితల సమాజానికి పని ప్రగతితో కూడిన ఖచ్చితమైన ప్రోత్సాహాలు, అకాడెమీ తరఫున తెలుగు, అలాగే ఇంగ్లీష్ భాషల్లో, మాస, ద్విమాస పత్రికలు ప్రచురణ, ట్రావెల్ గ్రాంట్‌లు, విరివిగా పనుల కాలెండర్ తయారుచేసుకుని తెలుగు సాహిత్య అకాడమీ, వెనుకబడ్డ వాస్తవాన్ని గుర్తించి, వేగంగా, లెవెల్ ఫీల్డ్‌కి వెళ్ళే రోడ్ మాప్ (దారిపటం) ఆవిష్కరణ అమలు, ఆచరణాత్మక సమీక్షలతో ముందుకు వెళ్తే తప్ప, కనీసం మనం తోటి దిక్షిణాది భాషలు అకాడెమీల రూపేణా సాధించిన ప్రగతిని అందుకోలేము.
ఇందుకై, వైస్ ఛాన్సలర్‌గా పనిచేసి, దశాబ్దాల బోధనానుభవం, పాలనానుభవం గలవారు, పలు గుర్తింపుల గౌరవాలు పొందిన సీనియర్ రచయిత, ఉదార దృష్టిగల ఆచార్య కొలకలూరి ఇనాక్, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అధ్యక్షులుగా, వారు వారి బృందం ముందరున్న కార్య సంభరిత సదవకావాలు, తెలుగు జాతి గర్వించేలా ఫలితాలు అందించాలని, అస్తిత్వం కోల్పోయిన మూడున్నర దశాబ్దాలకు తిరిగి ఏర్పడ్డ అకాడెమీకి తెలుగు ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. పూర్ణకుంభం లోగోగా గల మన రాష్ట్ర సాహిత్య అకాడెమీ, కళాభవన్ సైఫాబాద్ నుంచి పనిచేసింది. ఈ లోగో మనం ఇప్పుడు కూడా వాడుకోవచ్చును. ఇలా ఎన్నో సాహిత్య సంక్రాంతులకు మళ్లీ వీరు శ్రీకారం చుట్టి, సాహిత్య, సామాజిక సర్వతోముఖ వికాస హేతువులుగా వీరి ఆచరణ ఉండాలని హృదయపూర్వకంగా ప్రజలు ఆశిస్తున్నారు.

- రామతీర్థ, 9849200385