సబ్ ఫీచర్

పరిపూర్ణ సాహిత్య సృజనశీలి.. శేషేంద్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సర్వకావ్య సుకవిత్వ బాంధవుడు- కవి విప్లవసేనా నాయకమ్మన్యుడు
మానవత్వ కవితా కరుణారసావిష్కరణ హృదయుడు- నవ్య కవితా పితామహుడు
శేషేంద్రకు ప్రణతులివే, శేషేంద్రశర్మ నవ్య కవిత్వోపాసకుడు- ప్రతిభాషాశేముషి!!
సన్నుతిలివే, సాక్ష్యరతాతీరపు అక్షరాలివే!
గుంటూరు శేషేంద్రశర్మగారి కావ్యాలు వౌలికత- ప్రామాణికతలకు గీటురాళ్ళు తెలుగుల సమగ్ర సాహిత్య చరిత్రకు మార్గదర్శనులుగా కాలం సంపుటాల్లో నమోదుకాబడ్డాయి.
శేషేంద్రశర్మగారి కవిత్వం- వచనం, విమర్శ, కథ, పాట, గేయం, ఇలా సామాజిక చేతనకు ప్రత్యక్ష, పరోక్ష సత్యానే్వషణకు నిలిచాయి. ఆలంబనలైనాయన్నది అశేష అభిమానుల, సాహితీవేత్తల గౌరవభావానలంటే అతిశయోక్తికాదు.
ఒక ఏకైక కవిత్వ సిద్ధాంత గ్రంథంగా కవిసేన మేనిఫెస్టో తన కవిత్వం గౌరవాన్ని నిలుపుకుంది. శబ్దం, భావం, భాషాభివ్యక్తి సార్వకాలికంగా రూపుకట్టుకునే రచనలుచేసిన ఆధునిక మహాభారతకర్తగా శేషేంద్ర స్థానం ఎప్పటికీ నిలిచే ఉంటుంది. కవిత్వమంటే అర్థవైచిత్రి, శబ్ధవైచిత్రి సాహిత్య స్పృహలనుంచి, రసానుభూతిని, విశ్వకవిగా అమరకోశపు పఠన భావనలు కలుగచేస్తాయి. ఆయనకు సమాజంలోని సాహిత్యావరణం గురించి సాహిత్య సమూహాంతరంగాల్లోని ఉత్తానపతనాల పట్ల ఎంతో అప్రమత్తత కలిగి ఉన్నారనే చెప్పాలి. ఎంతోమంది సాహిత్యకారులకు శేషేంద్ర వెలార్చిన గ్రంథాలు మార్గదర్శనం చేసాయి. తారల సుగంధాల్ని ఆస్వాదించేందుకు దేశపు గాలుల్లో పక్షులై పాడుకుంటూ నిదురించే తోటల్లోకి పాటల్ని ఒక్కొక్కటిగా వచ్చి చేర్చిన కవితా సౌగంధికుడాయన. కవిత్వాన్ని జీవన విధానం చేసుకున్నారు. 1951లో అనువదించిన సాంద్ర సంభాషణాశైలిని నవీన భావనలు మనకు షానామా పర్షియన్ రచనలో గమనిస్తా అలాగే దళిత జీవుల వేదనాస్వరాల్ని మొరల్ని ఒరల్లోని ధరించిన ఖడ్గాలుగా, ధ్వని విన్పింపచేసిన పద్యంతో తెలుస్తుంది. ఒక ధిక్కార స్వరం, లౌక్యం లేని నిర్భయత్వపు ప్రకటనలు తన అధ్యయన అనే్వషణల ద్వారా సత్యవాదిగా కనిపిస్తారు.
//శంఖారావముఃజేయుడో దళిత శ్రామిక// అంటూ తన పద్యంలో జీవులార భువన ద్వారంబు భేదిల్లగన్// అని కూడా అన్నారు. అలాగే 1972లో వెలువరించిన // శేష జ్యోత్న//లో నూతన మానవుణ్ణి ఆవిష్కరించారు. సమాజంలోంచి సమూసాలలో ప్రవహించడానికి వెలార్చిన గ్రంథ రాజాలు ఎన్నో వున్నాయి. వీటన్నిటిలోనూ కవి కాలపు ఉనికిని సర్వాంగ సుందరంగా సహేతుకంగా, నిరసన వ్యక్తం చేయడానికి ఉన్న అవకాశాలున్నాయి. కొంతమంది ముసుగువీరుల నీతి బాహ్యతల్ని, పైరవీకారుల కుతంత్రాలను ధైర్యంగా ఎదుర్కొన్న అంశాలు ఇవన్నీ శేషేంద్ర జీవితంలోనూ, సాహిత్య ప్రస్థానంకు తారసపడ్డాయి. దీనికి ఆయన నిర్భీతిగా మరిన్ని కాలపు రచనలు, శబ్ధఅర్ధాలపై సమగ్ర విమర్శన సాహిత్యం అర్ధం-అద్దం పట్టాయని చెప్పవచ్చు.
శేషేంద్రలో సనాతన వాదిగా రామాయణ షోదశి, సర్ణహంస, మంత్ర తంత్ర యోగాది రహస్యాలు ఎన్నో ఆయన పరిశోధించారు. అందుకే శేషేంద్రలో పలు భాషల సాహిత్యం వాటి పరిణామశీలతను ఆపాదించుకున్నట్లు మనకుతోస్తుంది. అలాగే కవిసేన మేనిఫెస్టోలో మార్క్సిస్టు భావ ధోరణి, సరికొత్త సిద్ధాంత ఏకత్ర సమాహితసారం నింపుకున్న కావ్యశాస్త్రం ప్రమాణికతను సంతరించుకున్నది. ఎందుకంటే ఆనాటి విప్లవ కవులు కవిత్వోద్యమ వెలుగులు, శేషేంద్ర భావాంభర వీధిలో నక్షత్రకాంతుల్ని ఆవిష్కరింపజేసాయి. తెలుగు భాషకు జవజీవాల్నందించిన విజయ కేతనుడు- శేషేంద్రుడు.
ఒక ప్రక్క వ్యాసవాల్మీకులు కాళిదాసు భావానుభూతులు, మరొకప్రక్క దార్శనికత్వం చిరునామాలైన మార్క్స్ ఏంగిల్స్ సిద్ధాంత దర్శనాలు ఏక కాలంలో ఔపోసన పట్టిన సాహిత్యాగస్తుడు శేషేంద్ర అంటే అతిశయోక్తికాదు. యిక ఆకాశం గురించి, జాబిల్లి గురించి ఈ క్రింది రసస్ఫురితమైన పద చిత్రాల్ని పరిశీలనలోనికి తీసుకోవచ్చు. శేషేంద్ర కవిత్వంలో ధనిక వ్యాపారుల అక్రమార్జనలపై నిరసన గళం ఉన్నది. మరొకప్రక్క గుప్పెడు మెతుకులు కరువైన దీనులపైన, ఎడతెగని ఆవేదనా స్వరంతో కలం చిలికించాడు. ఒక్కొక్కసారి దేముణ్ణి ధిక్కరించిన దాఖలాలు ఉన్నాయి.
విద్వత్‌కవి అనుపమాన ప్రతిభను ఎంతైనా ఎన్ని అక్షరాల్లో పొదిగినా యింకా మిగిలే ఉంటుంది.
‘‘మన దేశం మండిపోతున్న ఒక బోటు
మనిషి కేవలం ఒక ఓటు.’’
- యివి శేషేంద్ర మాటలు, ఆచంద్రార్కం అక్షర సత్యాలు.
జన్మలో మరణబీజం ఉంది. చరిత్రలో మార్పుఉంది. ప్రజలు ప్రభుత్వాలు మానవ చరిత్రలో ఏదో రూపంలో ఎప్పుడూ ఉన్నారు. ప్రభుత్వం లేని యుగం చైతన్యవంతుల మహాస్వప్నం. తరతరాలుగా ఎప్పుడూ మారుతూ ప్రతితరమూ తన నూతన ప్రపంచం తన చేతులతోనే సృష్టించుకుంటూ, ప్రవహించిపోయే రుూ నిరంతర ప్రజావాహిని ఎప్పుడైనా ప్రభుత్వం లేని యుగం చూస్తుందో లేదోగాని, కొన్ని రాజ్యాలు మానవ చరిత్రలో గులాబీ తోటల్లో స్మృతులై నిలిచిపోయాయి. అలాంటి ఒక స్మృతినే ఇప్పుడు నెమరువేసుకున్నాము. ఆ స్మృతి స్వగ్రామమే భాగ్యనగర్, నాటి నేటి హైదరాబాద్-నా ప్రియ హైదరాబాద్. ఈ నగరం జాబిల్లి దక్కను ప్రేమగల్లీ అని కూడా భావనలు చేసారు.
అడవిలో లేడికి ఆకస్మాత్తుగా పులి ఎదురైనప్పుడు లేడి నోట్లోనుంచి తటాల్న బయటికివచ్చే శబ్దం ఏదైతే ఉందో దాని పేరు గజల్ అని కొందరు గణనీయులైన గజల్ తత్వజ్ఞులు అంటారు. ఇది కళాత్మకతలో బుద్ధికుశలుడైన వాడికి రోచకమైన మాట. గజల్ అంటే ప్రేమ గురించి ప్రేయసి గురించి చేసే వర్ణన లేక రాసే లేఖ అనే మాట మందాధికారులకు తెలిసిన మామూలు జార్గన్. కానీ లేడి నోట్లోనుంచి వచ్చే ఆశ్చర్యాది సంకుల భావార్ధక శబ్దం గజల్ విషయంలో తత్వావిష్కర సమర్ధమైన సంకేతము.
అంటే చెప్పేవాడి నోట్లోనుంచి గజల్ వెలువడగానే, శ్రోత నోట్లో నుంచి సహజవేగంతో ‘‘వాహ్’’ అనే శబ్దం వెలువడుతుంది. లేడి నోట్లో నుంచి వచ్చిన శబ్దంలా మధువుతో తడిసిన రాత్రి, పాత్రలో పడతాయేమో అనే నక్షత్రాలు, హృదయజ్ఞులైన మిత్రుల సమూహము, గొంతు సవరించుకుంటున్న తంత్రులు, తబలాలు యిది అపురూపమైన గజల్ తత్త్వవివేచనం. కవిత్వం మనిషిని కర్తవ్యోన్ముఖుణ్ణి కార్యోన్ముఖుణ్ణిచేయాలి. కవిత్వశక్తి ఆశయాల్ని ఆరని జ్యోతుల్ని చేయాలి. ఇదే వౌలికత. శేషేంద్ర భావుకత. జీవితం ఒక మహాసముద్రం కావచ్చు కాని ఆశ అనే నావలో ఆశయాల తీరాన్ని దాటే ప్రయత్న పధికుడన్న భావన విలక్షణమైనది.
‘‘మనిషి కన్నీరు తుడవటం నీవంతు
శరీరం పోయినా నిలిచేది నీ గొంతు’’
అన్న యదార్ధవాది. స్వేదబిందువులు అక్షరాల్ని మధించి తాగే సూర్యునిలా తేజస్వంతం దర్శించిన భావుకుడు. ప్రభాత పుష్పాలను రంగుల్లో స్నానం చేయించిన సౌందర్యోపాసకుడు. నిశ్శబ్దదేవతల్ని, సౌకుమార్య భావ శబలతల్ని తాత్వికంగా హృదయంలో ఆవిష్కరింప చేసుకున్నాడు.
అలా తెలుగునాట అక్షరాల పూలతోటలున్నాయి. అవి కమ్మని కలల్ని పండిస్తూనే ఉంటాయి. అదో రసానంద మాధుర్యం.
ఆధునిక మహాభారత కర్త శేషేంద్రగారి విలక్షణ ఖండికలెన్నో ఉన్నాయి. శేషేంద్ర చేసిన ప్రాకృతిక వర్ణనలు, ప్రణయం, సామాజిక విప్లవం, సాంద్ర కవితా చైతన్యం వెరసి కవితత్త్వంతో పరిపూర్ణ సాహితీ సృజనను చేపట్టారు.

- వి.ఎస్.ఆర్. సోమయాజులు 9441148158