సబ్ ఫీచర్

కర్తవ్యాన్ని విస్మరిస్తున్న ‘సంఘాలు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు సాహిత్య రంగంలో సాహితీప్రియులుంటారు. పోషకులు ఉంటారు. సాహిత్య సేవాసంస్థలు వెలుస్తూ తమకు తోచిన రీతిలో సాహితీ సేవలు అందిస్తూ ఉంటాయి. అలాగే రచయితలు స్థానికంనుంచి జిల్లా రచయితల సంఘాలు, రాష్ట్ర రచయితల సంఘాల వరకు తమ పరిధిని విస్తరించుకుంటూ చిన్నతరహానుండి భారీ సభలు-మహాసభలు- సమావేశాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇటువంటి సాహిత్య సంస్థలు సాధారణంగా దివంగత ప్రసిద్ధ రచయితలు, కవుల జయంతులు, వర్థంతులు నిర్వహిస్తూ వారి రచనలను, వారి సాహిత్య సేవలను, భవిష్యత్ తరాలకు జ్ఞాపకాలుగా చరిత్రకు అందిస్తుంటారు. అలాగే స్థానికంనుండి జిల్లాస్థాయి, రాష్టస్థ్రాయి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో కవి సమ్మేళనాలు, సాహిత్య సమావేశాలు, సంబరాలు, సెమినార్లు, వర్క్‌షాపులు నిర్వహిస్తూ ఉంటారు. తెలుగు సాహిత్య సంస్థలు, జిల్లా రచయితల సంఘాలు ఎక్కువగా కవిసమ్మేళనాలు, జయంతులు, వర్థంతుల సందర్భాలలో ప్రముఖుల ప్రసంగాలతోపాటు, రచయితలు ప్రచురించుకునే పుస్తకాల ఆవిష్కరణ సభల నిర్వహణ ఎక్కువగా జరుగుతుండడం చూస్తుంటాము. ఇంతవరకు వారు చేస్తున్న సాహిత్య సేవని మనం గుర్తించతగ్గదే. అభినందించతగ్గదే. కాని రచయితల ప్రాథమిక కర్తవ్యాలను తెలియజేయడంలో రచయితల సంఘాలు విస్మరిస్తున్నాయన్నది గుర్తించవలసిన అంశం. అసలు ప్రాథమిక కర్తవ్యాలన్నవి ఉన్నాయా? ఉంటే అవి ఏమిటి? అన్నది తెలుసున్న సాహిత్య సంస్థలు, రచయితల సంఘాలు ఉన్నాయా అంటే చెప్పలేక తెల్లముఖాలెయ్యాల్సిందే.
చాలామంది సాహిత్యప్రియులు సాహిత్య సంస్థలు నిర్వహించే సభలకు వెళ్ళడంవల్లో, లేక పుస్తకాలు ఎక్కువగా చదవడంవల్లో తామూ తమ ఆలోచనల్ని కాగితం మీద పెట్టాలని ఉబలాటంపడేవాళ్ళు చాలామంది ఉంటుంటారు. కొందరికి తమకు తెలిసిన రచయితల దగ్గరకో, సాహితీ ప్రముఖుల దగ్గరకోవెళ్ళి తాము రాసిన రచనకి మెరుగులు దిద్దుకుంటుంటారు. మరికొందరు ఎవరిదగ్గరికీ వెళ్ళలేక అలా తటస్థంగా ఉండేవాళ్ళూ ఎక్కడవేసిన గొంగళి అక్కడేలాగా పడి వుంటారు. ఇది అక్షరాల జరుగుతున్న సత్యం. నిజానికి వీళ్ళే రేపటి తరం రచయితలుగా తీర్చిదిద్దబడేవాళ్ళు. కాని ఈనాటి తరంలో ఇలా తయారయ్యేవారి సంఖ్య ఎంత? చాలామందికి మెరుగులు దిద్దుకునే సమయంకూడా లేనివారు ఈనాడు ఫేస్‌బుక్‌లోనో, వాట్సాప్ గ్రూపుల్లోనో తమ రచనల్ని డైరెక్టుగా ప్రచురించుకుంటున్నారు. ఒక్కొక్క సందర్భంలో అసలు అది రచనో, వచనమో, మాటల పేరికో అర్థంకాని పరిస్థితి నెలకొనటం చూస్తున్నాము. వీటిని మెరుగులుదిద్ది సరైన రచనగా మలిచి, తర్ఫీదునిచ్చే బాధ్యత ఎవరు తీసుకుంటున్నారు? ఎవరు తీసుకుంటున్నారు? ఒకప్పుడు సాహిత్య సంస్థలు, రచయితల సంఘాలు కవులకు, కథా, విమర్శనా రచనలకు ప్రత్యేక వర్క్‌షాపులు నిర్వహించేవారు. ఆయా సమావేశాలలో, ప్రత్యేక సభలలో-సాహిత్య రంగంలో ఆయా ప్రక్రియల్లో ఉద్దండులైన సాహితీ ప్రముఖులచేత ఉపన్యాసాలు, తర్ఫీదులు ఇప్పించేవారు. దానివలన కొత్తగా రచయితలు కాగోరువారు ఆయా దినాలలో అక్కడే బసచేసి ప్రముఖులు చెప్పేవి శ్రద్ధగా విని ఆయా ప్రక్రియలలో మెళుకువలు నేర్చుకునేవారు. తమకు కలిగే సందేహాలను అడిగిమరీ తెలుసుకొని తమకుతాము తీర్చుకునేవారు. ఆ విధంగా తాము రచయితగా నాలుగు రచనలుచేసి సాహిత్య రంగంలో నిలబడే స్థాయిని కలిగుండేవారు. కాని ఈనాడు ఆ పరిస్థితి అలా ఉందా? ఎక్కడైనా జరిగితే అది మొక్కుబడిగా జరగడం తప్పించి ఓపికగా ఆ వర్క్‌షాపులో పెద్దలు చెప్పేవి విని నేర్చుకునేవారు ఎంతమంది?
ఒకప్పుడు సుదూర తీరాలలో సాహిత్య సభ జరిగినా రచయితలు, కవులు వ్యయప్రయాసలకోర్చి ఏమాత్రం లెఖ్ఖచెయ్యకుండా అక్కడికి-కాలాన్ని, సమయాన్ని వృథాచేసుకొనిమరీ వెళ్ళేవారు. అక్కడి సభలలో ప్రముఖుల ప్రసంగాలు విని చైతన్యవంతులై తామూ ఆస్థాయికి ఎదగాలన్న ఉత్సాహం పెల్లుబికేది. రెట్టించిన ఉత్సాహంతో కవితల పోటీలలో, కథల పోటీలలో పాల్గొని పోటీపడిమరీ బహుమతులు సాధించేందుకు ఉరకలెత్తేవారు. కాని ఈనాడు అన్ని విషయాల్లో పరిచయాలతోనో, పైరవీలతోనో, సాధించే అసంకల్ప ప్రయత్నాలకు ప్రేరేపకులే ఎక్కువగా ఉండటం శోచనీయం.
అలాగే కవులు చాలామంది కవులు కవిసమ్మేళనాలకి వెళతారు. తాము చదివింది వినిపించడం కోసం. దానివలన నిజమైన ప్రయోజనం ఏమిటి? ఒకరు చదివిన కవితలో సమకాలీన సమాజానికి ఉపయోగపడేది. ఎక్కువమంది కవులు ఏ సమస్యపై స్పందించి కవితలు రాస్తున్నారు?... ఆ సమస్య నుండి ప్రజలను కాపాడేందుకు ఆ సమస్యపై సమిష్ఠిగా పాలకుల దృష్టిలోకి తీసుకెళ్ళే విధంగా... గొంతెత్తి కవితానాదాలతో నినాదాలై ప్రతిధ్వనించేలా ఎలుగెత్తి చాటేందుకు ఉపయోగిస్తుంది. అలాగే బాగా చదివే కవి నుండి తాను చదివే కవిత ఏ విధంగా మరింత మెరుగుపర్చుకోవచ్చో కూడా తెలుసుకునే ఒక కార్యశాలగా కూడా కవిసమ్మేళనాలు ఉపయోగిస్తాయి. కాని నేటి కవిసమ్మేళనాలు- సంఖ్యకోసమో, వారిచ్చే జ్ఞాపికలు, శాలువా సత్కారాలకోసమో, వారిచ్చే ఆతిథ్యంకోసం తప్పించి నిజంగా సరైన రీతిలో కవిత చదివే వారి సంఖ్య ఎంతో, ఒకసారి మనకు మనం ఆలోచించుకోవాల్సిన తరుణం.
నిజానికి కవులు/ రచయితలు తమ స్వంత ఖర్చులతో పుస్తకాలు ముద్రించుకుంటూ ఉంటారు. ప్రచురించుకున్న గ్రంథాలను చాలావరకు ఉచితంగా పంచుకుంటూ ఉంటారు. కాని ఈ విధంగా ప్రభుత్వం నుంచి పుస్తకాలు కొనుగోలుచేసే విధానాన్ని రచయితలకు తెలియజెప్పే విధానం ఆయా సాహిత్య సంస్థలు/ జిల్లా, రాష్ట్ర రచయితలు సంఘాలు ప్రాథమికంగా తెలియజెప్పవలసిన బాధ్యత తీసుకొని ఉండాలి. రచయితలు పుస్తకాలు ప్రచురించుకోవడంలో ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహకారం (హైదరాబాద్‌లో పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం స్వల్ప ఆర్థిక సహాయం, ఆంధ్రప్రదేశ్‌లో భాషా సాంస్కృతిక శాఖ ఇచ్చే పూర్తి ఆర్థిక సహాయం, బెంగళూరులోని భాషా కేంద్రం వ్యాసాలకు, వ్యాస సంపుటాలకు ఇచ్చే ఆర్థిక సహాయం) ఎక్కడ ఏమాత్రం ఇస్తున్నారో తెలియజెప్పే విధంగా రచయితల సంఘాలు బాధ్యత తీసుకోవాలి. ఈ రకంగా రచయితలకు ప్రయోజనాలు చేకూర్చే... ప్రాథమిక విషయాలపై అవగాహన కల్పించడంలో రచయితల సంఘాలు బాధ్యతలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

- చలపాక ప్రకాష్, 9247475975