సుమధుర రామాయణం

సుందరకాండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

436. నూరుయోజనముల జలనిధిని దాటి
వచ్చినను నలసట నిసుమంత యేని
పొందడయ్యె ధీశాలి వాతాత్మజుండు
సూక్ష్మ రూపముతో లంక సొరగనెంచి

437. శైల సదృశవౌ మేనును సంకుచితము
జేయు హనుమంతు డమ్మహావిష్ణుదేవు
డ త్రివిక్రమ రూపము వామనమును
జేయు విధమును దలపింపజేసే నపుడు

438. వెనుక పరమేష్టి యాజ్ఞను విశ్వకర్మ
రమ్యతరముగ నిర్మించి ధనదు కిచ్చి
నట్టి లంకను రావణు డాక్రమించె
ధనదునిం పరాజితు జేసి దర్ప మొప్ప

439. ముజ్జగంబుల తన శాసనమ్ము తోడ
బద్ధ మొనరించి పాలించు దశముఖుండు
జానకి నపహరించి దెచ్చినది మొదలు
నప్రమత్తం బొనర్చెను నగర రక్ష

440. స్వర్ణమయమైన వివిధ సౌధములతోడ
మత్యమకర సర్పాదు లెధేచ్ఛ దిరుగు
కందకమువలె పురిచుట్టు కడలి గల్గి
ఘోర రూపులు రాక్షసుల్ గాచుచున్న

441. రావణాసుర పాలితమీ పురమ్ము
లోనికిం బ్రవేశించుట సులభ తరము
గాదటంచును జింతించి గాడ్పుసుతుడు
రామశౌర్యము దలచి యాశ్వాసమొందె

442. ఇపుడు ముదుగ మైథిలి నె్వదకవలయు
తపను డస్తాద్రి కేగిన పిదప సూక్ష్మ
రూపినై పురము బ్రవేశించ రాక్ష
సుల కెరుక పడకుండ జనకిని జూతు

443. నని దలంచి పవన నందనుండప్పుడు
పుర సమీపమునకు జేరి సూర్యు
డస్తమించి నింగి రజనీకరుండుద
యించగనియె లంక సుందరతను

444. రత్న కాంతులు పట్టు వస్రతములుగాగ
కోట బురుజులు చెవుల కాభరణములుగ
శూలములు శతఘు్నలు కేశసంపదగను
లంక గన్నట్టె సుందరీరత్న మట్లు

445. ధీరవర్యుడు పవననందనుడు చిన్ని
పిల్లివలె పొంచి నగరములోని కేగు
సమయ మందున వానర! యెడ్వడవుర
లోనికరుగగ గలవె నాకన్ను గప్పి

446. నిజము బల్కనిచో నిను జంపు దాన
ననుచు లంఖిణి వికృత దేహంబుతోడ
ఎదురు నిల్వగ హనుమ యింతకును నీవు
యెవ్వరవొ దెల్చుమన్ననాలంక యపుడు

447. రావణప్రభు వాజ్ఞచే నగర రక్ష
జేయు లంకాధిదేవతన్ నేను నీదు
జీవముల హరించక మొన్న జెప్పు మీవు
ఎవ్వడవు యెందు కొరకిట కొచ్చినావు

448. అనిన వానర ముఖ్యుడీ నగర సుంద
రతను దర్శించి పోయెద నింతకన్న
నేనిలేదన్న కోపించి లంఖిణి యర
చేత హనుమనొక్క చరువు చెరగె నంత

449. సింహనాదము జేసి కేసరిసుతుండు
యెడమ పిడికిలి బిగియించి లంక నొక్క
పోటు పొడువగ రాక్షసి పడియె నేల
వనితయన జంపక విడిచె వాయుజుండు

450. తేరుకొని లేచి లంఖిణి ‘‘ఓ మహాత్మ!
మున్ను ధాత జెప్పిన మాట స్మృతికి వచ్చె
నిన్ను నెవ్వడు బడగొట్టు నతడె లంక
నాశనమునకు కారణుడౌ నటంచు

451. ఎదురు లేదిక శూరాగ్రగణ్య! నీకు
లంకలో యధేచ్ఛగ సంచరించి జనక
పుత్రినింగాంచి శ్రీరామచంద్రుడు కార్య
మందు సఫలతగాంచి జయమ్ము గొనుము
*

టంగుటూరి మహాలక్ష్మి