సుమధుర రామాయణం

సుమధుర రామాయణం.. (యుద్ధకాండ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1146. కన్నులు విడివడని జాంబవంతు డితడు
ధర్మపరుడు విభీషణుడంచు కంఠ
నాదమున బోల్చుక విభీషణాఖ్య! నేను
కుశలమేనని హనుమక్షేమమ్ము నడుగ

1147. హనుమ యచ్చటకేతెంచి తాత నేను
కుశలముగ నుంటి ననిబల్క వత్స! నీవు
ఉత్తరమ్మున కైలాస పర్వతమున
ద్రోణగిరి యందు గలవు దివ్యౌషధములు

1148. వానిగొనివచ్చి మనవారి దాశరధుల
రక్షణను జేయగల సమర్ధుండవీవె
ననగ నొక్కవూపున గగనంబు కెగసి
ద్రోణగిరిపైన దిగి వోషధులను వెదకి

1149. వాని గుర్తింపజాలక పర్వతమును
బెల్లగించి యెత్తుకవైనయేయు మార్గ
మందు పయనించి లంకలో దిగెడు హనుమ
చక్రధారి విష్ణువువలె గోచరించె

1150. ఓషదుల గాలిసోకగ సమరభూమి
ప్రాణములునిల్చి చేష్టలు బాసియున్న
వానరులు నూతనోత్సాహవంతులౌచు
లేచిరందరు నిద్ర మేల్కొన్న రీతి

1151. యుద్ధమున నేల గూలిన రాక్షసులను
వెంట వెంటనె కడలిని విసరివేయ
నానతిచ్చెను దశకంఠు డందు వలన
తిరిగి జీవింప రసురులెవ్వరును నపుడు

1152. హనుమ హరి వీరులందర జీవితులుగ
శౌర్యమంతులౌటను జూచి హర్షచిత్తు
డౌచు పర్వతమును యథాస్థాన మందు
నుంచి వచ్చెను త్రైలోక్కవందితుండు

1153. వానరులు మహోత్సాహులై లంకనగ్ని
కాహుతినొసగ రజతపు కొండలవలె
నున్న సౌధమ్ములకు నగ్ని నంటబెట్ట
పెళ పెళ ధ్వనులతొ గూలె భవనచయము

1154. ప్రళయకాల దవానలమద్రి గుహల
జుట్టి వైవగ సింహముల్ జూలు లెగయ
పారినట్లుగ నసురులు పరువులిడిరి
దగ్ధవౌ సౌధములు వీడి దూరమునకు

1155. వార్త తెలిపిన దశకంఠుడాగ్రహమున
లంకనున్నట్టి యసుర వీరులతొ కంప
న ప్రకంపనులను బంపె రణము సల్ప
వారి తృణములవలె ద్రెంచె వాలిసుతుడు

1156. శోణితాక్ష విరూపాక్షులాహవమున
కరుగుదెంచిరి మైందద్వివిదుల చేత
మడిసిరంతట కుంభ వికుంభులనిని
సూర్యజ పవనాత్మజులకర్పించి రుసురు

1157. క్రోధమున రావణుడు ఖరపుత్రుడైన
యుద్ధముల నారితేరిన యోధవరుడు
వీరు మకరాక్షు బిల్చి నీవరిగి శత్రు
మర్దనము జేయుమని మకరాక్షునంపె

1158. వీరులౌ యాతుధానులు వెంట నడువ
నపరిమిత సేనలతొవచ్చె ననికి నంత
ఘోర యుద్ధము యిరుసేనలకును జరుగ
సాగె రామభద్రు నెదిర్చె ఖరసుతుండు

1159. రామ బాణము నకరాక్షు రధము విరిచి
వాడు విసిరిన శూలము పిండొనర్చె
రధ పతాక కేతన సారధులను గూల్చి
తండ్రి మార్గముజూపె వేరొక శరమ్ము

1160. ఖర సుతుడు మరణించగ కవులు రామ!
కీర్తనముజేసి గెంతుచు రాత్రి చరుల
చెట్ల మోదుచు గోళ్ళతో పీకి చంపు
చుండ నిలువలే కసురులు పరువులిడిరి

1161. ఖరసుతుడు మరణించగ రావణుండు
ఇంద్రజిత్తును రావించి’’ పుత్ర! యింక
యుద్ధ్భారము నీవె వహింపవలయు’’
నన్న తండ్రి యానతి నౌదలను ధరించి

1162. ముందుగా మేఘనాధుడగ్నిని రగిల్చి
నల్లమేకను బలియిచ్చి నళిన సంభ
వాస్తమ్రుననెన్నొ దివ్యాస్త్ర శస్తమ్రులను
పొంది రణభూమికేగి యంబరముకెగసి

1163. బాణ వర్షము గురిపించె కవులపైన
వచ్చిపడు శరములకు వానరులు కలగి
రామచంద్రుని వెనుకకు జేరుకొనిరి
రామభద్రుడు వారి భయమ్ముబాపి

1164. వీని నిప్పుడె విషసదృశ శరములను
నంతమొందింతునను రామచంద్రు మాట
విన్న హరిజిత్తు క్షణములో నగరుజొచ్చి
మంత్ర శక్తితొ మాయసీతను సృజించి

1165. రథము నందిడుకొని పశ్చిమపు కవాట
ము గడచి యచట యుద్ధము సల్పుహనుమ
జాంబవంతాది కపివరుల్ జూచుచుండ
ఖలుడు మాయసీతను జంపె ఖడ్గమునను

టంగుటూరి మహాలక్ష్మి