భక్తి కథలు

కాశీ ఖండం.. 86

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాహ్నవీ నదీ సలిల సేవ బ్రహ్మజ్ఞాన సంపద ప్రాప్తించడానికి హేతువు. కలియుగంలో కలుష చిత్తులకి, మనఃక్షోభం కలిగించే శఠులకీ, పరుల విత్తం అపహరించు నరులకీ, నియమ నిష్ఠలు పాటింపని జనులకీ, అంతరాత్మలో ప్రాయశ్చిత్తం కావించుకొనే కాంక్ష కలిగినపుడు మానవులకందరికీ గంగయే దిక్కు. శివరక్ష!
తొలియుగమైన కృతయుగంలో అన్నీ తీర్థాలే. త్రేతాద్వాపర కలియుగాల మూడింటిలోనూ పుష్కరం, కురుక్షేత్రం గంగయున్ను మానవులు తరించడానికి బ్రహ్మ నిర్మితాలైన తీర్థాలు.
కృతయుగంలో కేవలం ధ్యానమే మోక్షకారణం. త్రేతాయుగంలో తపస్సు, ద్వాపర యుగంలో యజ్ఞయాగాలు, కలికాలంలో పుణ్య గంగానదీ సేవనం మానవుల మనోభీష్టాలు సిద్ధించడానికి సాధనాలు. స్వారాజైన ఇంద్రుడి తమ్ముడా! పురాజన్మలందభ్యాసంవల్ల లభించిన సంస్కారమూ, నా అనుగ్రహమున్ను లేనిదే ఈ వారణాసీ సమీప ప్రదేశంలో పొంగి పొరలు జల ప్రవాహ తరంగ సమూహ ద్వని విన్న మాత్రాన గంగానదిలో స్నానం ఆచరించే యోగం లభిస్తుందా?
విష్ణుమూర్తీ! కంఠాగ్రభాంనుంచి గజ ముఖం కల డుంఠి విఘ్నేశ్వరుడు గండ జనిత మదజలం జిడ్డు చేత నెమలి పింఛాలు పరచినట్లు వున్న పలు ప్రవాహాలు కల జాహ్నవీ స్నాన యోగం ఒకపాటి వాళ్లకి లభించదు. ఏ మానవుడు తరువాత మేల్కొంటూనే గంగానది గంగానది గంగానది అని ముమ్మారు స్మరిస్తాడో ఆ మానవుడు పాప సంచయాన్ని పటాపంచలు చేస్తాడు.
కాశికా నగరానికి కట్టెదుట ప్రవహించే ఆకాశ గంగలో పుణ్యస్నానం ఆచరిస్తే జ్యేష్ట్యాదేవి తొలగిపోతుంది. అమంగళాలన్నీ మాయం అవుతాయి. దుర్నిమిత్తాలు కానరావు. అపకీర్తి తొలగిపోతుంది. శ్రేయస్సులను అడ్డగించే ప్రతిబంధం మాసిపోతుంది. శుభం కలుగుతుంది. క్షేమాలు కలుగుతాయి. మనోరథాలు నెరవేరుతాయి.
గంగానదిలో స్నానమాడే అదృష్టం లభిస్తే ఉపవాస వ్రతాన్ని ఆచరించడం ఎందుకు? యమ నియమ ఆసన ప్రముఖ అష్టాంగాలతో కూడిన యోగసాధన దేనికి? యజ్ఞం చెయ్యడం ఎందుకు? తపస్సు ఆచరించడం ఎందుకు?
శ్రీహరీ! శ్రద్ధాపూర్వకంగా సహజ సిద్ధమైన గంగా జలాల్లో తల ముంచి క్రుంకులాడుటలో మగ్నం అయిన మనస్సు కలవారికి మోక్షం చేరువనే సిద్ధిస్తుంది. ఏ మనుజుడి మనస్సు ఆరపండి పరిపక్వం అయి విశే్వశ్వరుడి ఆస్థానం అయిన కాశీ క్షేత్రంలోని గంగ మున్నగు తీర్థాల సేవనం చేయడానికి తలచూపకుంటుందో ఆ మనుజుడి కులమూ ఒక కులమేనా? వాడు ఒనర్చిన తపస్సులూ తపస్సులేనా? వాడు చేసుకొన్న సుకృతమూ ఒక సుకృతమేనా?
ఓ కైటభ మర్దనా! ఆకాశ గంగ నా తేజోగ్నిని తన గర్భంలో తాల్చింది. ఆ విధంగా కాకుంటే నిమేషకాల మాత్రంలో కలికాల దురితాల్ని భస్మంచేస్తుందా? అచ్చెరువు ఎందుకు?
నడచునప్పుడు కూర్చుండువేళ, నవ్వుతూ నిలుచుంటూ, పరుగుపెడుతూ, భుజిస్తూ పవ్వళిస్తూ, నిద్రిస్తూ మేలుకొంటూ, క్రీడిస్తూ, పడిపోతూ, లేస్తూ- నరుడు భావమునందు కాశీ సమీపంలో ప్రవహించే గగన గంగను మనసా స్మరించి పాపాలను విడనాడుతాడు.
గరుడవాహనా! బ్రహ్మాండం నడుమ ప్రవహిస్తున్న పరబ్రహ్మమయ జల ప్రవాహం అయిన గంగాతరంగిణి తత్త్వాన్ని కుటిలమతులైనవారు చిరకాలానికైనా తెలిసికొనగలరా?

-ఇంకా ఉంది

-శ్రీపాద కృష్ణమూర్తి