మంచి మాట

సేవే ఉత్తమ ధర్మం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తియ్యని పండ్లను కాసే చెట్లు తమ కాయలను అవి భుజింపవు. ఆవులు, గేదెలు తమ పాలను మానవాళికే అందిస్తాయి. దాహం తీర్చే నదీ జలాలు ప్రాణికోటి దాహార్తిని తీర్చి సేవ చేస్తున్నాయి. అడగకుండానే మేఘాలు వర్ష ధారలను కురిపించి పుష్కలంగా పంటలు పండడానికి దోహదం చేస్తున్నాయి.
సేవ అనేది ధర్మాలన్నింటిలోకల్లా ఉత్తమ ధర్మం. పరమ పవిత్రమైన ఈ భూమిపై పుట్టిన మహనీయులంతా కుల, మత జాతులకు అతీతంగా మానవసేవే మాధవసేవ అని బోధించి సేవా ధర్మాన్ని ఆచరించి తరించారు. అయితే ఈ సేవ అనేది ప్రతిఫలం ఆశించకుండా చేసినపుడే అది నిజమైన సేవ అనిపించుకుంటుంది. పేరు ప్రతిష్ఠలు, ధనం, అధికారం లాంటివి ఏవో ప్రయోజనాలు ఆశించి చేసే సేవలో స్వార్ధం ఉంటుంది.
అవసరంలో వున్నవారికి ఆర్తులకు, అనాధలకు, రోగులకు చేసే సేవ నిజమైన సేవ. అందులో దైవత్వం కనపడుతుంది. సనాతన భారతీయ ధర్మం సేవను అత్యుత్తమ ధర్మంగా అభివర్ణించింది. ఎర్రటి మండుటెండలో నడుచుకుంటు వచ్చిన మనిషికి చల్లటి మజ్జిగ నోటికి అందించి దాహం తీర్చడం కోటి యజ్ఞాలు చేసినంత ఫలితాన్ని ఇస్తుందని చెపుతారు. అందుకే మన దేశంలో ఏ పల్లెటూరికి వెళ్లినా ముందుగా కాళ్లు కడుక్కునేందుకు చెంబుతో నీళ్లిచ్చి దాహం తీర్చుకోవడానికి మజ్జిగ ఇచ్చేవారు. ఇలా సేవ ధర్మాన్ని ఒక అలవాటుగా ఆచారంగా మనకు అలవాటు చేసారు.
భారతీయ నాగరికతకు మూలస్థంభాలుగా చెప్పుకునే రామాయణ మహాభారత ఇతిహాసాలలో మన ప్రబంధాలలో, కావ్యాల్లో ఎన్నో విభిన్న పాత్రల ద్వారా సేవా ధర్మ ప్రాముఖ్యాన్ని గురించి వివరించారు. రామాయణంలో వాల్మీకి శ్రీరామ, లక్ష్మణ, సుగ్రీవ, హనుమంత పాత్రలద్వారా సేవా ధర్మం ఎంత అత్యుత్తమైనదో వివరించడమే కాక మానవ సంబంధాలకు సేవ వలన ఎంత విలువ వస్తుందో చెప్పాడు. తన సుఖాన్ని వదిలిపెట్టి అన్నగారి సేవకు అంకితమైన లక్ష్మణుడు ఉత్తమ సేవా ధర్మానికి ప్రతీక. రాజ్యంలో భాగాన్ని కానీ, అధికారాన్ని కానీ, సంపదను కానీ ఆశించకుండా అన్నగారిని వనవాసంలో సేవించుకోవడమే పరమభాగ్యంగా భావించి లక్ష్మణుడు తాను కూడా సీతారాములతో వనవాసానికి బయలుదేరతాడు. వనవాస కాలం అంతా సీతారాములను తల్లిదండ్రులుగా భావించి సేవిస్తాడు లక్ష్మణుడు.
అలాగే తాను స్వయంగా సర్వకార్య సమర్ధుడై ఉండి కూడా సుగ్రీవునికి మంత్రిగా వెంట ఉండి అడుగడుగునా ఎన్నో విలువైన సలహాలు ఇచ్చి కాపాడాడు హనుమంతుడు. సేవాధర్మంలో సేవించేవాడు, సేవించబడేవాడు కూడా యోగ్యుడు అర్హుడు అయి ఉండాలి.
మహాభారతంలో విదురుడు తన అన్నగారైన ధృతరాష్ట్రుడు అతి పుత్ర వ్యామోహంతో ఎవరు చెప్పినా వినకుండా సర్వనాశన కారకుడయ్యాడని తెలిసినా విదురుడు చివరి దాకా ధృతరాష్ట్రుని సేవిస్తూనే ఉన్నాడు. అలాగే మనుచరిత్ర ప్రబంధంలో ప్రవరుడు అనునిత్యం అతిథులను సేవించుకోవడం ఒక వ్రతంగా ఆచరిస్తాడు.
ఆధునిక కాలంలో సేవ అనగానే మనకు గుర్తువచ్చే నిర్మల సేవామూర్తి మదర్ థెరిస్సా. అనాధలు, రోగులు, దీనజనులు, అనాధ శిశువుల సేవకోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఆదర్శమూర్తి. ఆమె ఏ అవార్డులు బిరుదులు ఆశించి ఆ సేవలు చేయలేదు. అవార్డులు, బిరుదులే ఆమెను వరించాయి. సేవ అన్న భావనలోనే ఒకరకమైన ఆత్మసంతృప్తి ఉంది. అందులో ఆనందం, దైవత్వం ఉన్నాయి. సేవలన్నీ డబ్బుతోనే ముడిపడి ఉన్నాయని సహజంగా భావిస్తుంటాం. కొంతమంది వ్యక్తులు స్వచ్ఛంద సేవా సంస్థలు ఏ ప్రతిఫలం ఆశించకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం నేడు మనం చూస్తున్నాం. నేను-నాది-నాకు-ఈపనిచేస్తే నాకేంటి అన్న స్వార్ధ భావనలోనుండి బయటపడి విశాల దృక్పథంతో ఆలోచిస్తే సేవ అన్న భావనలో ఎంత సంతృప్తి, మాధుర్యం ఉన్నాయో అర్ధం అవుతుంది.

-సూరికుచ్చి బదరీనాధ్