భక్తి కథలు

హరివంశం -132

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృష్ణుడామెను కౌగిలించుకుని లేవనెత్తి తన ఎదకు చేర్చుకున్నాడు. ప్రాణప్రియా! నీకు భయం వద్దు. నేను రుక్మిని ఇక దండించను. అతడికేమీ కాలేదు. సొమ్మసిల్లిపడిపోయినాడు. ఇప్పుడే మళ్లా చైతన్యవంతుడవుతాడు అని పరి పరి అభయమిచ్చాడు. ఊరార్చాడు. తన సారధిని వెంటనే రథాన్ని వెనక్కు తిప్పి వేగంగా గుర్రాలను తోలమని చెప్పాడు కృష్ణుడు. మార్గమధ్యంలో ఆమెను పరిపరివిధాల ఓదార్చాడు. దగ్గరకు తీసుకున్నాడు. కన్నీరు తుడిచాడు. కౌగిలించుకుని ఆశ్వాసించాడు. ప్రణయ సుందరుడైనాడు. బుజ్జగించాడు. వాళ్ళు ఇంతలో ద్వారకానగరంలో ప్రవేశించారు.
ఇంతలో బలరాముడు, సాత్యకి విజయోత్సాహంతో ద్వారకా నగరిలో ప్రవేశించారు. ద్వారకవాసుల ఆనందానికి మేరలేదు. మంగళవాద్యాలు భోరుకొన్నాయి. కన్లు పండుగ్గా కృష్ణుణ్ణీ, రుక్మిణినీ చూసి హర్షధ్వానాలు చేశారు. బలరామ సాత్యకులకు స్వాగతం పలికారు. రంగు రంగుల జెండాలు ఎగురవేశారు. ఇల్లిల్లూ అలకరించారు. బ్రాహ్మణులు స్వస్తి చెప్పారు. పురోహితులు వేదోక్తంగా ఆశీర్వదించారు. యాదవ వృద్ధులు మళ్లీ యువకులైనంతగా సంబరపడ్డారు. వసుదేవుడూ, దేవకీ కొడుకునూ కోడలును ముద్దుచేశారు. దిష్టితీశారు. గారాబం చేశారు. పుణ్యాంగనలు హారతులు పట్టారు.
ఇక నర్మదా నదీ తీరంలో యుద్ధ మూర్ఛితుడై పడి ఉన్న రుక్మిని ఎత్తి రథంలో చేర్చి శ్రుతపర్వుడు విచారంతో ప్రయాణం సాగించాడు. అట్లానే జరాసంధుడు నగుబాటుకు గురి అయి, పరిభవ దుఃఖ విమనస్కుడైన శిశుపాలుణ్ణి వెంట తీసుకుని గిరివ్రజం ప్రయాణమైనాడు.
రుక్మిణిని తీసుకొని రానిది కుండిన నగరంలో నేను ప్రవేశించనని రుక్మి శపథం చేశాడు కాబట్టి, భోజ కటకం పేరుతో కొత్తగా నగరం నిర్మించవలసి వచ్చింది రుక్మికోసం.
ఇక ద్వారకలో ఊరు ఊరుంతా పెండ్లివారై కల్యాణ వేదిక నిర్మించి శుభముహూర్తం పెట్టించి రుక్మిణీ కృష్ణుల పెళ్లి చేశారు. ధరసింహాసనం, నభంబు గొడుగుగా ఆ పెళ్లి శోభించింది. ఊరంతా ఇల్లు, ఆకాశమంత పందిరిలాగా కళకలాడింది వారి కల్యాణవేదిక. యాదవుల బంధువులైన భూపతులంతా వచ్చారు రుక్మిణీ కృష్ణుల కల్యాణానికి. మునులంతా కదలి వచ్చారు.
ఇపుడు కదా మా తపస్సులన్నీ పండాయి అని ప్రహ్లాదించారు. చాతుర్వర్ణ్యం తరలి వచ్చింది రుక్మిణీ కృష్ణుల పెళ్లి చూడటానికి. సాత్యకి వచ్చిన వారందరికీ మర్యాదలు చేశాడు. సత్కరించాడు. వేద ఘోష మిన్ను ముట్టింది. వచ్చిన రాజులు, బంధువులు సరస సల్లాప సంతోష అభినందనలలో తేలిపోయినారు. పట్టుచీరల హోరంగులు, పసిడి నగల తెరంగులు ప్రదర్శించుకొని మురిసిపోయినారు పేరంటాండ్రు. చపల నేత్రులు తమ సోయగ విభవాన్ని ఒకరినొకరు అభినందన పాత్రంగా ప్రదర్శించుకున్నారు. కల్యాణ వాద్యాలు మనోహరంగా మోగాయి. దేవ దుందుభి నాదాలు మింట మ్రోసాయి.
రుక్మిణీ దేవి సౌందర్యం ఎటువంటిదంటే సౌకుమార్యానికి సౌకుమార్యం దిద్దుతుంది. సౌందర్యానికే సౌందర్యం సమకూర్చగల లావణ్య యోగం ఆమెది. సౌభాగ్యానికే సౌభాగ్యం ఆమె మూర్తిమంతం. సౌశీల్యానికే సౌశీల్యం ప్రసాదించగల తను యష్టి ఆమెది. శ్రీకృష్ణుడామె పాణిగ్రహణం చేసి పరిణమయమాడాడు. భూమి మీద పేరంటాళ్ళు వాళ్ళ మీద అక్షతలు చల్లారు. వియత్తులం నుంచి అమర కాంతలు వారిపై కుసుమ వర్షం కురిపించారు. నూతన దంపతులు గోవిందుడి జననీ జనకులకు, వంశ వృద్ధులకు నమస్కరించారు.

ఇంకాఉంది

-అక్కిరాజు రమాపతిరావు