భక్తి కథలు

హరివంశం 190

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హల, ముసల లాంఛనుడివి కూడా నీవే. ద్విధావిభక్తమైంది నీ తేజస్సు. నీ బల పరాక్రమ శౌర్యతా స్ఫూర్తి కృష్ణ బలరామ రూపం పొంది రాక్షస సంహార కీర్తి అయింది. గత యుగంలో రావణ సంహారం చేసిన శ్రీరామచంద్రమూర్తివి నీవే. బలిని నిర్జించిన త్రివిక్రముడివి కదా నీవు. భూమ్యాకాశాలు, దిశలు, కాలము, చంద్రసూర్య వాయువహ్నులు నీ స్వరూప రూపాలే కదా దేవాదిదేవా! సృష్టి స్థితిలయకారుడివి నీవే! నిన్ను స్తుతించినవారికి నీవు సద్గతులు ప్రసాదిస్తావు. చింతలు తీరుస్తావు. వంతలు పోగొడుతావు అని గరుత్మంతుడు వేదవేద్యుణ్ణి స్తుతించాడు. ఇంతకూ ఇప్పుడు మీరు ననె్నందుకు పిలిపించుకున్నారో చెప్పండి. ఆ కార్య భారం నెరవేర్చటానికి నేను సర్వసంసిద్ధుణ్ణి అని విన్నవించుకున్నాడు గరుత్మంతుడు ద్వారాకాధీశుడితో. నన్ను మీ సేవకు వినినియోగించుకోవటం నా మహద్భాగ్యం అని ప్రణుతాంజలి అయినాడు పన్నగవైరి. ‘మనం ఇప్పుడు ఎక్కడకు వెళ్ళాలో చెప్పండి’ అని కేలు మొగుడ్చి అర్థించాడు. అపుడు శ్రీకృష్ణుడు గరుత్మంణ్ణి కౌగిలించుకున్నాడు. ఆయనకు అర్ఘ్యమిచ్చి సత్కరించాడు. పూజ్యుడికి అర్ఘ్యమివ్వటం జయహేతువని శాస్త్రాలు వాకొంటున్నాయి. మనమిప్పుడు శోణ నగరానికి పోవాలి. నాతో బలరాముడూ, ప్రద్యుమ్నుడూ కూడా ఉంటారు అని చెప్పాడు శ్రీకృష్ణుడు.
యదు వృద్ధులందరూ శ్రీకృష్ణుణ్ణి దీవించారు. విప్రవరులు ఆశీర్వదించారు. పుణ్యాంగనలు అక్షతలు చల్లారు. వంది మాగధులు కైవారాలు చేశారు. తూర్యాలు మోగాయి. భేరులు ధ్వనించాయి. అప్పుడు శ్రీకృష్ణుడితోపాటు, బలరాముడు, ప్రద్యుమ్నుడు కూడా గరుత్మంతుణ్ణి అధిరోహించగా గరుత్మంతుడు రివ్వున ఆకాశానికి ఎగిసాడు.
గగనతనంలో సిద్ధచారణులు, విద్యాధరులు, సకల లోక నుతులైన మునులు, ఋషులు ఆయనను ప్రశంసించారు. జయ వాచకాలు పలికారు. ఇట్లా వారు ఆకాశ మార్గంలో ప్రయాణిస్తూ ఉండగా ఒక ప్రదేశంలో వాళ్ళ శరీరాలు, గరుడుడి శరీరమూ వింత కాంతులతో వెలుగొందాయి. అపరంజి కాంతులు ప్రతిఫలించాయి. బలరాముడప్పుడు ఇట్లా ఉజ్జ్వలకాంతులు, సువర్ణచ్ఛాయలు మన శరీరాలు వహించటానికి కారణం ఏమిటి? అని కృష్ణుణ్ణి అడిగాడు. మనమిప్పుడు మేరునగ సమీప ప్రాంతానికి చేరుకున్నామా? కనకక్ష్మాధరం కాంతులు మన దేహాలతో ప్రతిఫలిస్తున్నాయా? ఈ తప్తకాంచన వర్ణం ఎక్కడనుంచి వచ్చింది మనకు? నీవు మాత్రమే చెప్పగలవు అని తమ్ముణ్ణి అర్థించాడు బలరాముడు.
అప్పుడు శ్రీకృష్ణుడిట్లా చెప్పాడు. ఇప్పుడు మనం బాణుడి శోణనగరం సమీపానికి వచ్చాము. శోణ నగరాన్ని పరిపంధుల ప్రవేశ నిర్గమంగా రుద్రుడు నగరం చుట్టూ సకల వహ్నులను పరివేష్టించి ఉండవలసిందిగా నియమించాడు. ఇప్పుడు మనం ఆ నగరాన్ని సమీపించకుండా ఉండటానికి ఆహవనీయమైన అగ్ని ఘోరాకారంతో రుద్రాజ్ఞకు కట్టుబడి మన మీదకు వస్తున్నది. అందువల్ల ఆ ప్రజ్వలిత కాంతులు మన తను ప్రతిఫలమైనాయి. ఈ వహ్నిని ఎదుర్కోవటం కష్టం. ఇది మనలను అడ్డగిస్తుంది. దీనికి ప్రతీకారం మన వినతాసుతుడు చేయగలడు అని చెప్పాడు జలధిశాయి. అప్పుడు సుపర్ణుడు వేయి నోళ్ళులాగా తన వక్త్రం విస్తరింపజేసి ఆకాశగంగనుంచి ఆ జలాన్ని పుక్కిట బట్టి ఆ అగ్నిపై క్రుమ్మరించాడు గండూషంగా. అంతటితో ఆ అగ్ని చల్లారిపోయింది. విలయకాలంలో కల్పాంతం సంభవించేపుడు సమస్త విశ్వాన్ని భస్మీకరించే ఘోరానలజ్వాల ఇది. దీనిని మన గరుడుడు ఎంతో చాకచక్యంతో ఆర్పివేశాడు అని శ్రీకృష్ణుడు మెచ్చుకున్నాడు గరుడుణ్ణి.

ఇంకాఉంది

-అక్కిరాజు రమాపతిరావు