మంచి మాట

జీవన మార్గదర్శి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత / అభ్యుత్దాన మధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్’ అనే భగవద్గీతలోని ఈ శ్లోకం అందరికీ తెలుసు లేదా వినే వుంటారు. ఎక్కడెక్కడ, ఎపుడెప్పుడు ధర్మానికి తగ్గుదల సంభవిస్తుందో, అధర్మానికి విజృంభణం సాగుతుందో ఆ సమయాల్లో, ఆ యుగంలో ఆ పరమేశ్వరుడైన శ్రీకృష్ణుడు శ్రీ మహావిష్ణు రూపములో మాత్రమే కాక ఆయా యుగాలకి సరిపడే రూపంలో అవతరిస్తానని తెలిపాడు.
ఉపనిషత్తులన్నీ ఏ పునాదిమీద నిలబడుతున్నాయో అదే భగవద్గీత. ఉపనిషత్తులనే గోవుల క్షీరమే భగవద్గీత’ అని పురాణోక్తి.
జీవాత్మ పరమాత్మలకు గల అవినాభావ సంబంధాన్ని తెలిపేది తత్త్వం. ఉపనిషత్తులలో మనకు తత్త్వానే్వషణ కనబడుతుంది. ఉపనిషత్తులు తాత్విక మార్గాలు. విశ్వమానవ కల్యాణం కొరకు సమస్త ప్రాణకోటికి శ్రీకృష్ణపరమాత్ముడు ఉపదేశించిన తత్త్వామృతమే, జ్ఞానోపదేశమే మానవులను బుద్ధి వ్యామోహములనుండి తప్పించి కర్తవ్యోన్ముఖులుగా తీర్చిదిద్దేదే భగవద్గీత. పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ ప్రాణాలు, దృశ్యం, దేహం, మనస్సు అను ఈ పదునెనిమిదియు మోక్షసాధనానికి మెట్లుగా చెప్పే భారతీయ సంస్కృతికి మణిదీపమైన భగవద్గీత వంటి ఉద్గ్రంధం మరొకటి లేదు అని చెప్పవచ్చును. ఉపనిషత్తుల వేదసారమే భగవద్గీత.
శ్రీమద్భగవద్గీతలోని పదునెనిమిది అధ్యాయాలలో, కర్మ, భక్తి, జ్ఞాన యోగములు ముఖ్యమైన సిద్ధాంతాలుగా పేర్కొదగిన గీతను మూడు షట్కాలుగా విభజించటం జరిగింది. మొదటి షట్కము కర్మయోగములో 1వ అధ్యాయము నుండి 6వ అధ్యాయాల వరకు ఇందులో కర్మయోగ, జ్ఞానయోగాలు ఉపదేశింపబడ్డాయి. రెండవ షట్కము 7 నుండి 12 అధ్యాయాలు జ్ఞాన కర్మలచే నిర్వర్తించబడు భక్తియోగం ఉపదేశించబడగా మూడో షట్కములో 13వ అధ్యాయము నుండి 18వ అధ్యాయముల వరకు మొదటి షట్కానికి శేషభూతమని, దీనే్న జ్ఞాన షట్కమన్నారు.
చిత్, అచిత్ విశిష్టం తత్త్వం విశిష్టాద్వైతం అంటే పరమాత్మ, ప్రకృతి జీవాత్మ నిత్యులు. పరమాత్మ జీవాత్మయందు, ప్రకృతియందు ఉండేవాడు ఒక్కడే అని చెప్పుట. చిత్ + అచిత్ = పరబ్రహ్మం. శ్రీమద్రామానుజులవారు తమ సిద్ధాంతాల్ని తత్త్వం, హితం, పురుషార్థం అను మూడు విధాలుగా విభజించారు.
ప్రకృతి - జీవుడు - పరమాత్మ ఈ మూడింటి యొక్క సంవిధానంవల్ల ప్రతి వస్తువు ఏర్పడుతుంది. జీవాత్మ మరియు పరమాత్మలకు గల అవినాభావ సంబంధాన్ని తెలిపేది తత్త్వం. ఆత్మ పరమాత్మను చేరు ఉపాయమే హితం. భగవంతుని చేరుటకు ఉపాయమే పురుషార్థం. భగవంతుని చేరి అనుభవించెడు ఆనందమే పురుషార్థం.
‘మహాపాపాది పాపాని / గీతాధ్యానం కరోతిచేత్ క్వచిత్స్పర్శం కర్వంతి నళినీదళ మంభసా’ అంటే తామరాకును అంటని నిర్మల జలంలా భగవద్గీత పఠించేవారిని ఎటువంటి ఘోర పాపాలు అంటజాలవని, ఎవరైతే నిత్యం గీతా పారాయణం చేస్తారో వారు భూలోకంలో బ్రహ్మజ్ఞానియై, జన్మాంతరాన మోక్షం పొందుతారని, భగవద్గీతలోని కనీసం ఒక శ్లోకమైనా లేదా చివరి పాదమైనా పఠించినా పదివేల సంవత్సరాలపాటు చంద్రలోక వాసులౌతారు. గీతాధ్యయనం చేస్తూ చనిపోతే, తిరిగి వారు ఉత్తమమైన మానవ జన్మనే పొందుతారని వరాహపురాణంలో భగవద్గీతను గురించి పేర్కొనబడింది. ఈ ప్రపంచంలో క్రియాశీలకంగా ఉండి, ఆధ్యాత్మికమైన జీవితం గడిపేందుకు ఒక మార్గదర్శియైన గీత సమాజంలో స్వార్థరహితంగా జీవించేందుకు మనల్ని ప్రోత్సహిస్తుంది.
నేడు మానవాళి ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించుకోవటానికి సమాధానాలు భగవద్గీతలోని కర్మ, జ్ఞాన, భక్తి యోగాలలో ఉన్నాయి. వాటిని అన్వయించుకుంటూ జీవితాలను సుగమం చేసుకోవాలి. కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి, ధ్యానయోగం లాంటి ప్రక్రియలతో భగవంతుని కృపకు పాత్రుడౌతాడు మానవుడు.

-రసస్రవంతి కావ్యసుధ