మంచి మాట

ఆత్మవికాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికసించిన పుష్పం చూపులకు ఆహ్లాదాన్నిస్తుంది. వికసించిన హృదయం సదా భగవంతుని తనలో స్మరిస్తుంది. ఆధ్యాత్మిక వికాసం కలిగిన వ్యక్తి సాధనతో మరింత లోతులకు అనగా తనలోకి తాను పయనించగలడు. అలా పయనించినపుడు అతని యొక్క ఆత్మ వికసిస్తుంది. ఈ రకమైన ఆత్మవికాసం అలనాడు శ్రీకృష్ణుడి బోధన విన్న అర్జునుడికి కలిగింది. అంతక్రితంవరకూ అర్జునుడు యుద్ధం చేయుటకు సంశయించాడు. నావాళ్ళతో నేను యుద్ధం చేయాలా? నావాళ్ళను నేను చంపాలా? నా వాళ్ళతో నేను తలపడాలా? అని సంకోచించినది అర్జునుడి యొక్క అంతరాత్మ. గీతా ప్రవచనం విననంతవరకూ అర్జునుడికి ఆత్మవికాసం కాలేదు. ఎప్పుడైతే కృష్ణపరమాత్మ నోటి నుండి పవిత్రమైన గీతను విన్నాడో అతనిలో సంశయాలన్నీ తొలగిపోయాయి. అతనిలో అజ్ఞానం తొలగిపోయింది. అతని యొక్క ఆత్మజ్ఞానాన్ని పొంది పరిపూర్ణం కాసాగింది. ఆత్మవికాసం అయింది. ఉన్నదంతా ఏకాత్మ అనే భావన కలిగింది అర్జునుడికి ఆ సమయాన. నీలో, నాలో, లోనా బయట పశుపక్ష్యాదులలో అన్నిటా, అంతటా వున్నది ఆ పరమాత్మ స్వరూపమే అని గ్రహించాడు అర్జునుడు.
ఇక అప్పుడు ధైర్యంగా యుద్ధంలో దిగాడు. విజయం సాధించాడు. వ్యక్తికి ఎప్పుడు ఆత్మవికాసం కలుగుతుంది? ఎలా కలుగుతుంది? అని లోతుగా ఆలోచిస్తే భగవంతుడు అన్నిటా అంతటా అందరిలో వున్నాడు అని తెలుసుకోగలిగినపుడు అలా తెలుసుకోవడం అంత తేలిక కాదు. అలా అని అంత కష్టమూ కాదు. అందుకు కావాల్సిందల్లా తెలుసుకోవాలనే చింతన, తపన. నేను ఎవరు? అని రమణ మహర్షి వారు తెలుసుకోవాలనుకున్నారు. దానికి ఆయన ఎంతో సాధన చేశారు. ఎంతో తపన పడ్డారు. అహర్నిశలు అంతరంగాన్ని మధించారు. చివరికి అనుకున్నది సాధించారు. తానొక ఆత్మని గుర్తించి గ్రహించాడు.
ఆ విధంగా ఆయన యొక్క ఆత్మ వికాసం జరిగింది. జ్ఞానోదయం అయింది. అతనిలాగే మరో వ్యక్తి కూడా మనకు బాగా తెలిసి వున్నాడు. అతనో మహారాజు. రాజ్యాలను ఏలే చక్రవర్తి. ఎనె్నన్నో భోగాలను అనుభవించగల ధనికుడు. కానీ అతనికి ఇవేవి తృప్తినివ్వలేదు. అతని కళ్ళముందు తన రాజ్యంలో జనన మరణాలు, పేదరికం ఇవన్నీ అతని మనసుని చలింపజేశాయి. అసలు ఏమిటిదంతా? ఈ రోగాలు, భోగాలు, జనన మరణాలు ఏమిటి? వీటి రహస్యం ఏమిటి? అని తదేకంగా తీక్షణంగా ఆలోచించసాగాడు. ఎంత ప్రయత్నించినా ఎంత మనసుని తర్కించినా తనకు జవాబు దొరకలేదు. ఇక రాత్రికి రాత్రే రాజ్యాన్ని వదిలి వంటరిగా అడవి మార్గాన్ని పట్టాడు. బోధివృక్షం క్రింద కూర్చుని తపము చేశాడు. తనని తాను తర్కించుకుని తనలోకి తాను ప్రయాణించాడు. అప్పుడే అతనికి కావాల్సింది లభించింది. తను పొందాలనుకున్న నిధి దొరికింది. తన ప్రశ్నల్నింటికి సంతృప్తికరమైన సమాధానం లభించింది. అతని యొక్క ఆత్మ వికసించింది. అలా వికసించిన ఆత్మతో అతను ప్రపంచానికి జ్ఞానాన్ని పంచాడు. అతను మరెవరో కాదు గౌతమబుద్ధుడు.
బుద్ధం శరణం గచ్ఛామి.. సంఘం శరణం గచ్ఛామీ అనే శాంతి మంత్రంతో ఎందరెందరికో ఉపశమనం కలిగించాడు. ఎందరో జీవితాలతో జ్ఞాన జ్యోతులను వెలిగించాడు. ఒక దీపం ముందు తాను వెలిగి తరువాత అవతలి దాన్ని వెలిగించగలదు. అలాగే వ్యక్తి కూడా ముందుగా తనని తాను వికసింపచేసుకుని ఆపై మరెందరినో వికసింపజేయాలి. ఆధ్యాత్మిక మార్గాన పయనించినంత మాత్రాన అందరికీ ఆత్మ వికాసం కలగదు. దానికి సరైన గురువులు, పరమ గురువుల యొక్క మార్గనిర్దేశం కావాలి. వారి యొక్క అనుగ్రహం లభించాలి. ఇది కొందరికి సులభంగా, శీఘ్రంగా లభిస్తే, ఇంకొందరికి దీర్ఘకాలంలో కఠిన, కఠోర సాధనా మార్గాల ద్వారా లభ్యమగును. అందుకే మనం కూడా నిత్యం కొంత సాధన చేయాలి. మనల్ని మనం తెలుసుకునేందుకు అనే్వషణ ప్రారంభించాలి. చివరికి ఆత్మవికాసం కలగాలి.

-శ్రీష్టి శేషగిరి