భక్తి కథలు

హరివంశం-26

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీకింత పాడు నిద్ర ఏమరిపాటు ఎట్లా కలిగాయి? అని యశోద నడిగాడు విహ్వలించిపోతూ. ‘కడుపు నిండా పాలిచ్చాను. నిద్ర కళ్ళు వాలిపోతుంటే కన్నయ్యను పడుకోబెట్టాను. ఇప్పటిదాకా దీపం కూడా వెలుగుతూనే వుంది. అలసట వల్ల రెప్పలు మూతబడుతూ ఉండటం, ఏదీ బాగా పొద్దుపోయింది కదా అని కూరుకువచ్చి నెత్తిమీద కూచోగా ఇట్లా కాస్త ఒత్తిగిల్లాను. నిద్రతో తూగిపోయిందేముంది, జాగు చేసిందేముంది! ఇంకా క్షణం కూడా కాలేదు. ఈ పాపిష్టి రాక్షసి ఎపుడు వచ్చిందో, బుజ్జివాణ్ణి ఎట్లా ఎత్తుకొని వెళ్లిందో, నామీద ఏదో మచ్చు చల్లినట్లుగానే అయిపోయింది ఈ నా అజాగ్రత్త. ఇదేదో పెనుమాయలాగా వుంది.
ఎనె్నన్ని జన్మల పుణ్యఫలమో ఈ నా కన్నవాడు! లేక లేక నాకీ చందమామ కలిగాడు. ఈ దుష్ట రాక్షసి పాలబడ్డాడు. అయినా కసుగందలేదు. నా బంగారు ముల్లె నాకు దక్కింది. నా అంత అదృష్టవంతురాలు ఏ లోకంలోనైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఉంటుందా? ఇంత గండం గడిచింది, నేను ఎంత తపస్సు చేశానో కదా! వీడికింక ఎటువంటి భయం లేదు, ఏ ప్రమాదమూ కలగదు, వెయ్యేళ్ళు జీవిస్తాడు నా కన్నతండ్రి! అని ఆతురురాలైంది యశోద. అప్పుడు గోపాలకులంతా ఇంత ఘోరపాయం తప్పిపోయినందుకు చాలా సంతోషించారు.
ఆ డాకినీ శవాన్ని ఈడ్చుకుంటూ ఊరి బయట పారేశారు. నందుడప్పుడు తన నందనుణ్ణి ఎత్తుకుని భూమి మీదనుంచి ఇంత మట్టి తీసుకొని కొంచెం ఆవు పేడ దానికి కలిపి కొడుక్కి దానితో రక్ష కలిగేందుకు తిలకం దిద్దాడు. శిశువులకు ఆపద కలిగినపుడు పఠించాల్సిన మంత్రాలు చదివాడు. అవి పూర్వ ఋషులు లోకానికుపదేశించిన రక్షా మంత్రాలు. నందుడిట్లా వాటిని పఠించాడు. తండ్రీ! నీ ముందర ప్రత్యక్షమై శ్రీపతి రక్షిస్తాడు. నీ వెనుకవైపు బ్రహ్మదేవుడు కనిపెట్టి ఉంటాడు. నీ కుడివైపూ ఎడమ వైపూ విరూపాక్షుడూ, గుహుడూ కాచి రక్షిస్తారురా కన్నవాడా! నీ పైదిక్కూ దిగువవైపూ సూర్యుడూ, వాసుకీ సంరక్షిస్తారు. దిక్కులూ, వాయుదేవుడూ అన్ని వైపుల నుంచి నిన్ను కాపాడుతారు. నీకు గోరంత కూడా ప్రమాదం రాకుండా వీళ్ళంతా చూస్తుంటారు. నా కులదేవత పినాకపాణి, వృషధ్వజుడు నీకు స్వస్తి పలుకుతాడు. ఈనా ఐశ్వర్యమంతా ఆయన ప్రసాదానుగ్రహమే. నిత్యమంగళ సంపన్న సంధాయకాలైన గోవులు, అనంత పుణ్య నిలయ అయిన భూదేవీ నిన్ను సతతం ప్రోచి రక్షిస్తాయి అని మంత్రాలు జపించాడు నందుడు.
అప్పటినుంచి తల్లి తండ్రీ కొడుకును వేయి కళ్ళతో కాపాడుకుంటూ వచ్చారు. ఆ తరువాత కొన్ని రోజులకు వసుదేవుడి ప్రార్థనపై గర్గ మహాముని నందుడి పల్లెకు వచ్చి కుమారుల నామకరణతోత్సవం జరిపించిపోయినాడు. ఆయన రాకపోకలు ఎవరికీ తెలియకుండా వసుదేవుడూ, వ్రేపల్లె వాసులూ జాగ్రత్తపడ్డారు. ఆ మహాముని యశోద తనయుడికి కృష్ణుడనీ, రోహిణి తనయుడికి రాముడనీ విధి విధానంగా జాతకర్మాదికం సంస్కరించి పేర్లు పెట్టాడు. ఈ రెండు పేర్లు సర్వలోకాలకు అత్యంత ప్రియమైనవిగా ప్రసిద్ధి పొందగలవని గర్గముని అభిలషించాడు.
ఈ విధంగా వాళ్ళ నామకరణోత్సవం జరిగినందుకు నందుడెంతగానో పొంగిపోయినాడు. మంత్రవిదుడైన బ్రాహ్మణులను ఆహ్వానించి వాళ్ళకు పూజలు సలిపాడు. షడ్రసోపేతంగా వాళ్ళకు భోజనాలు పెట్టాడు. అధికాధిక సంఖ్యలో గోవులను సమర్పించాడు. జాంబూనదాంబరాదులతో వాళ్ళను తనియింపజేశాడు. వ్రేపల్లె అంతా పండుగ చేసుకున్నారు.

- ఇంకాఉంది

-అక్కిరాజు రమాపతిరావు