మంచి మాట

మానవత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మన దేశాన్ని రక్షించేవి అణుబాంబులు కావు వివేకానందుని బోధనలే’’ అని ఒక సందర్భంలో భారత ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ అన్నారు. ఆ రోజుల్లో నేడున్నంత అవినీతి లేదు, అశాంతి లేదు. ఆధ్యాత్మిక ధర్మచింతన బాగా కనిపిస్తూ ఉండేది. నేడు ఉన్నంత అరాచకం, హింసాయుత వాతావరణం ఆనాడు అంతగా లేదు. మరి నెహ్రూ ఆ మాటలనెందుకన్నారు? మనుష్యులమధ్య అంతరాలు తగ్గుతున్నా, మనస్సుల మధ్య అగాథలు పెరుగుతున్నాయి. సుఖ సాధనాలు పెరుగుతున్నా సుఖ సంతోషాలు తరుగుతున్నాయి. మానవ మేథ వికసిస్తుంది, మానవ హృదయం కృశిస్తుంది. ధనాన్ని ఆర్జించడంలోగాని, సుఖాలను అనుభవించడంలో గాని మనిషి ధర్మమార్గాన నడుచుకోవడం లేదు. మనిషి స్వార్థపూరితుడౌతున్నాడు.
సత్కర్మలు, పరోపకారం, దయ, త్యాగము ఇలాంటి శబ్దాలు పుస్తకాలకే పరిమితమవుతున్నాయి. లేదా ఏ సత్పురుషుడో తన ప్రవచనాలలో వీటిని చొప్పిస్తున్నాడు. అది ముళ్ళబాట. ఆచరణ యోగ్యం కానిదని ఎవరికి వారే తలబోసుకుంటున్నారు. ‘నేనొక్కడినే ఆ కంటకాకృత మార్గంలో నడుస్తే సరిపోతుందా? దేశం ఉద్ధరించబడుతుందా? పొరుగువాడి మాటేమిటి? అతనికి చెప్పండి’ అంటారు. కాని తను మాత్రం ఆ పొరుగువాడిని పట్టించుకోడు. పొరుగువాడి కష్టసుఖాలు తెలుసుకుని సహాయం చేసే పని చెయ్యడు. అంత తీరికేదీ అంటాడు. అతనికేదైనా కష్టం కలిగితే అతను వచ్చి చెప్తాడు కదా అన్న ధీమా! ఇది ఉదాసీనత, స్పందించే మనస్సు లేకపోవడం, ఇది అందరిలోనూ ఉంది. కొందరిలో అధికంగాను కొందరిలో తక్కువగాను, నలుగురు కలిసికట్టుగా పనిచేస్తే దేశం ఉన్నతి చెందుతుంది.
చదువుకున్నవాడికి చదువురానివాడంటే చిన్నచూపు. ధనవంతుడు పేదవాడు అంటే అసహ్యం అని అనుకొంటాడు. అందరూ సమానంగా పురోభివృద్ధి చెందాలంటే మనిషిలో మానవత్వ లక్షణం కావాలి. చదువుకున్నవాడు చదువురానివాడికి చదువుకునే అవకాశం కల్పించాలి. ధనవంతుడు పేదవాడిని ఆదుకుంటే అతనూ బీదతనం నుంచి బయటపడతాడు. కాని ఎవరు సమాజ శ్రేయస్సు కోరుకుంటున్నారు? తన అధికారం హోదా, గౌరవ ప్రతిష్ఠలు కాపాడుకోవాలనే దురుద్దేశంతో బలహీనుడిని మరింత అణచివేస్తున్నారు.
కలిసి నడుద్దాం, కలసి మాట్లాడుదాం అని ఋగ్వేదం చెబుతుంది. కలసి నడుద్దాం అనేది జీవన గమనాన్ని తెలియజేస్తే, కలసి మాట్లాడుదాం అనేది వ్యక్తీకరణను తెలియజేస్తుంది. మన అందరి ప్రవర్తన, అభిప్రాయం, వ్యక్తీకరణం ఏకమవ్వాలి. లక్ష్యపరమైన ఐక్యతే హృదయాలను గమనాన్ని సమన్వయపరుస్తుంది. ఇది ప్రగతికి పురోగతికి చాలా అవసరం. స్నేహశీలత, సహకార భావన మానవత్వపు పరాకాష్ట- అనేది భారతీయ జీవన విధానంలో ఉంది. దానిని అనుసరించాలే కాని స్వార్థం కొరకు విడనాడరాదని ఋషులు మనలను హెచ్చరించారు. ఈ సందర్భంలో స్వామి వివేకానంద ఇచ్చిన అమూల్యమైన సందేశాన్ని గుర్తుచేసుకోవాలి. ‘సమాజ మనుగడ, శాంతి, మనిషిమీద, మనిషి మంచితనం మీద ఆధారపడి ఉంటాయి. విజ్ఞానం, రాజకీయ చట్టాలు, బాహ్య ప్రపంచంలో మాత్రమే మార్పులు తేగలవు. మనిషిలో మార్పు తీసుకురాగల శక్తి, విజ్ఞానాన్ని వివేకంగా మార్చగల శక్తి, ఆచరణాత్మకమైన ఒక్క ఆధ్యాత్మిక విలువలకు మాత్రమే ఉంది. మానవత్వంతో మనిషిగా మెలగమని మన ధర్మం ప్రబోధిస్తుంది. అందువలన అందరు శక్తి మేరకు సత్కర్మలు చేయాలి. పూర్వకాలంలో మన పితరులు నూతులు త్రవ్వించి పాంధుల దాహంతీర్చేరు. సత్రములు కట్టించేరు. బాటసారులకు పట్టపగలు, రాత్రులు బడలిక తీర్చుకోవడానికి సుఖంగా నిద్రించేందుకు సదుపాయాలు కల్పించారు. చలివేంద్రాలు పెట్టేవారు అన్నదానాలు చేసేవారు. కామినీ కాంచనాలవైపో, పేరు ప్రఖ్యాతులవైపో మనస్సు మరలి రాగద్వేషాలకు లోనవడం మనిషికి సహజమే అయనా మానవత్వానికి గొడ్డలిపెట్టు. భగవద్గీత ఐదవ అధ్యయం, మూడో శ్లోకంలో శ్రీకృష్ణపరమాత్మ ఇలా వచించాడు. ‘ఎవరు రాగద్వేషాలకు వశుడు కాడో అతడు సదా సన్న్యాసి అని తెలుసుకోమని, ద్వందాతీతుడైనవాడు సులభంగా కర్మబంధాలనుంచి విముక్తుడౌతాడు’. కర్మబంధాలంటే తన ఉన్నతి కోసం పాటుపడుతూ ఇతరులకు సహాయం చేయలేని స్థితి. మనిషి జన్మనెత్తినందుకు సమాజశ్రేయస్సుని కాంక్షించాలి.
ఒక సంఘం, ఒక సమాజం అంతా మానవత్వంతో మెలిగి సౌభాతృత్వం, సౌమన్యసం, సామరస్యం కోసం చిత్తశుద్ధిగా పాటుపడితే క్షేమానికి, సౌఖ్యానికి కొదవేముంటుంది అంటారు స్వామి వివేకానంద. ఇది నిజమే కనుక మనం కూడా తోటివారికి చేతనైనంత సాయం చేద్దాం. మనిషిగా బతుకుదాం.

నేడు చాలామందిది పైన పటారం లోన లొటారం. మంచి మనిషిలా నటిస్తాడు కాని లోపల ఈర్ష్య, అసూయ, స్వార్థం, నిజాయితీ లోపం. సంఘంలో మంచి మనిషిగా చలామణి అవుతున్నా అలాంటివారిని వారి అంతరాత్మ ప్రశ్నించదా?

- గుమ్మా ప్రసాదరావు