బిజినెస్

ఉపాధికి చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఊతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 8: దీర్ఘకాలంగా వెనుకబడి, ఉపాధి అవకాశాలకు నోచుకోని, సామాజిక న్యాయానికి దూరంగా ఉన్న ప్రకాశం, వైఎస్‌ఆర్ కడప జిల్లాలు నేడు బ్యాంకుల నుంచి రుణాలు పొంది జీవనోపాధి కల్పించుకోవడంలో అగ్రస్థానంలో నిలిచాయి. సాధారణంగా రాష్ట్రంలో అభివృద్ధికి సంబంధించిన ప్రతి అంశంలో కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలు ముందుంటాయి. ప్రకాశం, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలు కరువుకు నిలయాలు. ఈ జిల్లాల్లో ఉపాధి అవకాశాలు కూడా చాలా తక్కువ. సామాజికంగా వెనుకబడిన వర్గాలు కూడా ఎక్కువగానే ఉన్నాయ. అటువంటి ఈ జిల్లాలు కూడా ప్రభుత్వ ప్రోత్సాహంతో అభివృద్ధి బాటపట్టాయి. బ్యాంకులు కూడా ఈ జిల్లాలపై ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తున్నాయి. ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఇ-మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్) రంగంలో ప్రకాశం, కడప జిల్లాల్లో అత్యధిక మంది బ్యాంకుల నుంచి రుణాలు పొంది తమ ఉపాధి అవకాశాలను మెరుగుపరచుకున్నారు. ఈ రంగంలో ఉపాధి అవకాశాలు చాలా ఎక్కువ. దేశం మొత్తం మీద ఈ రంగంలో దాదాపు 12 కోట్ల మందికి ఉపాధి లభిస్తున్నట్లు అంచనా. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో 40 శాతం వాటా ఈ రంగం నుంచే వస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలో కూడా అధిక శాతం మంది ఈ రంగం ద్వారా ఉపాధి పొందుతున్నారు. అందువల్ల ప్రభుత్వ సూచనలను అనుసరించి బ్యాంకులు కూడా అత్యధిక మందికి రుణాలు అందజేస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరానికి (2015-16) సంబంధించి నాబ్ కాన్ (ఎన్‌ఏబిసిఓఎన్‌ఎస్-వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి జాతీయ బ్యాంకు కనె్సల్టెన్సీ సర్వీసెస్) రూపొందించిన వివరాలను ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలపై ఆధారపడే 5,87,913 మందికి రుణాలు అందజేయాలని నాబార్డ్, రాష్టస్థ్రాయి బ్యాంకింగ్ కమిటీలు లక్ష్యంగా నిర్ణయించాయి. అయితే 3,76,634 మందికి రూ. 16,960 కోట్లు బ్యాంకులు రుణాలుగా ఇచ్చి 64.06 శాతం లక్ష్యాలను సాధించాయి. ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్‌ఆర్ కడప జిల్లాల్లో లక్ష్యాలకు మించి రుణాలు ఇవ్వడంతో అవి వరుసగా 1,2,3 స్థానాల్లో నిలిచాయి. ప్రకాశం జిల్లాలో 18,841 మందికి లబ్ధి చేకూర్చాలన్నది లక్ష్యం కాగా 27,691 మందికి రుణాలు అందజేసి, 146.97 శాతం లక్ష్యాలను సాధించింది. నెల్లూరు జిల్లాలో 36,092 మంది లక్ష్యం కాగా, 52,694 మంది (146 శాతం)కి, కడప జిల్లాలో 16వేల ఒక్కరు లక్ష్యం కాగా 22,512 మంది (140.69 శాతం)కి రుణాలు అందజేశారు. శ్రీకాకుళం జిల్లా కేవలం 3.86 శాతం లక్ష్యాలను పూర్తిచేసి చిట్టచివరి స్థానంలో ఉంది. ఈ జిల్లాలో 68,374 మందికి రుణాలు ఇవ్వాలన్నది లక్ష్యం కాగా, 2,637 మందికి మాత్రమే ఇచ్చారు. మిగిలిన జిల్లాలను పరిశీలిస్తే విజయనగరం జిల్లాలో 66,432 మంది లక్ష్యం కాగా, 12,650 మంది (19.04 శాతం)కి, విశాఖపట్నం జిల్లాలో 63,154 మంది లక్ష్యం కాగా, 30,192 మంది (58.89 శాతం)కి మాత్రమే ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లాలో 33,704 మందికి ఇవ్వాలన్నది లక్ష్యం కాగా, 21,348 మంది (63.34శాతం)కి, పశ్చిమగోదావరి జిల్లాలో 56,186 మంది లక్ష్యం కాగా, 35,731 మంది (63.59 శాతం)కి, గుంటూరు జిల్లాలో 42,675 మంది లక్ష్యం కాగా, 29,810 మంది (69.85 శాతం)కి రుణాలు అందజేశారు. చిత్తూరు జిల్లాలో 24,563 మంది లబ్ధిదారులు లక్ష్యం కాగా, 23,944 మంది (97.48 శాతం)కి, అనంతపురం జిల్లాలో 39,669 మంది లక్ష్యం కాగా, 31,305 మంది (78.92)కి, కర్నూలు జిల్లాలో 33,153 మంది లక్ష్యం కాగా, 30,868 మంది (93.11 శాతం)కి రుణాలు ఇచ్చారు. చిత్తూరు, కర్నూలు జిల్లాలు కూడా మంచి ఫలితాలు సాధించడం విశేషం. ప్రభుత్వం రెండంకెల అభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఆ క్రమంలో ఈ రంగంలో ఎక్కువ ఉత్పత్తి సాధించాలని, అధిక మందికి ఉపాధి కల్పించాలని ఈ ఏడాది 22 వేల కోట్ల రూపాయలు కేటాయించారు. అంటే గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది అదనంగా 30 శాతం ఎక్కువగా బ్యాంకులు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు.