విజయవాడ

అసలైన ఆనందం ( కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అమ్మా! ఆనందం అంటే ఏమిటి?’ స్కూలు నుంచి వస్తూనే తల్లిని ప్రశ్నించాడు ఆరో తరగతి చదువుతున్న పదేళ్ల సురేష్.
‘అదేమిటిరా? అలా అడుగుతున్నావూ?’ అన్నది తల్లి.
‘అది కాదమ్మా! నాన్న నిన్న నాకు సైకిలు కొన్నారుకదా! ఈరోజు నేను దాన్ని వేసుకుని స్కూలుకు వెళ్లాను. నువ్విచ్చిన చాక్లెట్లు మా ఫ్రెండ్సందరికీ ఇచ్చి ‘ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉన్నది. మా నాన్న సైకిలు కొనిపెట్టారుగా’.. అన్నాను.
నా మాటలు విన్న మా సార్ నా దగ్గరకు వచ్చి ‘దానికే అంత ఆనందమా?’ అన్నారమ్మా. ‘అవున్ సార్’ అన్నాను నేను. ‘ఇదికాదు, ఇంకా ఆనందించే విషయాలు ఉంటాయి తెలుసుకో!’ అని వెళ్లిపోయారమ్మా! ఆయన ఎందుకు అలా అన్నారు?’ అడిగాడు సురేష్ తల్లిని.
‘అలాకాదు సురేష్! నాన్న కొనిపెట్టినందుకే నువు ఇంత హేపీగా ఫీలవుతుంటే, అందరూ నిన్ను మెచ్చుకుంటుంటే నీకు, మాకు ఇంకా ఎక్కువ హేపీగా ఉంటుంది అనే ఉద్దేశ్యంతో అలా అని ఉంటారు’ చెప్పింది తల్లి.
‘అంటే? ఎలా?’ మళ్లీ ప్రశ్నించాడు సురేష్.
‘నువ్వు ఎవరికైనా, ఏదైనా మంచి సహాయం చేసినప్పుడు అందరూ నిన్ను మెచ్చుకుంటుంటే నీకు ఇంకా ఎక్కువ ఆనందంగా ఉంటుందని మాస్టారి ఉద్దేశ్యం’ కాస్త వివరించి చెప్పింది తల్లి.
‘ఓహో! అలాగా!’ అన్నాడు సురేష్
మామూలుగా రోజూ బడికి వెళ్లివస్తున్నాడు. కాలం గడిచిపోతోంది.

ఒకరోజు సాయంత్రం సురేష్ ఫ్రెండ్సందరితో కలిసి ప్లేగ్రౌండ్‌లో ఆడుకుంటున్నాడు. అప్పుడు వాడికి 100 రూపాయల నోటు ఒకటి దొరికింది. ముందు దాన్ని వాళ్ల అమ్మకు ఇవ్వాలనుకున్నాడు. కానీ అది స్కూల్ ప్లేగ్రౌండ్‌లో దొరికింది కనుక, పిల్లలెవరిదైనానేమో అని మాస్టారికే ఇద్దామని అనుకున్నాడు.
అనుకున్నదే తడవుగా ఆటల మధ్యలో నుంచి ప్రధానోపాధ్యాయుడి గది దగ్గరకు వెళ్లాడు సురేష్. ఆయన చూసి ‘ఏం కావాలి? సురేష్’ అని అడిగారు.
‘సార్! మేము ఆడుకుంటుంటే గ్రౌండ్‌లో ఈ 100 రూపాయల నోటు కనిపించింది. పాపం ఎవరిదో మరి. మీరు వాళ్లకిస్తారని మీకిద్దామని వచ్చాను సార్’ అన్నాడు సురేష్.
‘గుడ్! మంచిపని చేశావు. రేపు కనుక్కుని ఎవరిదో వాళ్లకు ఇద్దాంలే!’ అన్నారు ఆయన.
‘సరే సార్! నమస్తే’ అని చెప్పి వెళ్లాడు సురేష్.
సాయంత్రం ఇంటికి వెళ్లగానే అమ్మతో జరిగినదంతా చెప్పాడు.
‘మంచిపని చేశావు నాన్నా! ఎవరిదో? ఎందుకు తెచ్చుకున్నారో పాపం. రేపు ఉదయం మీ సార్ వాళ్లకు ఇస్తారులే’ అన్నది తల్లి.
మరునాడు ఉదయం రోజూలాగానే స్కూల్లో అసెంబ్లీ పెట్టారు. అసెంబ్లీ అయిన తరువాత ప్రధానోపాధ్యాయుడు ‘పిల్లలూ.. నిన్న మీలో ఎవరైనా డబ్బులు పారేసుకున్నారా? పోయినాయా?’ అని అడిగాడు.
అప్పుడు రమేష్ అనే పిల్లవాడు ముందుకొచ్చి ‘అవును సార్! నిన్న సాయంత్రం ప్లేగ్రౌండులో ఆడుకుంటున్నప్పుడు నావి 100 రూపాయలు పోయాయి. అవి మా అమ్మ పుస్తకాలు కొనుక్కోవటం కోసమని ఇచ్చింది’ అని చెప్పాడు.
‘ఇటురా’! అని వాడిని పిలిచి ‘ఇంత అజాగ్రత్తగా ఉంటే ఎలా?’ అని మందలించి ‘ఇవేనా! నీవి’ అని అడిగి ఆ 100 రూపాయలు రమేష్‌కి ఇచ్చారు ఆయన. రమేష్ వెంటనే ‘్థ్యంక్యూ సార్!’ అన్నాడు.
అప్పుడు ప్రధానోపాధ్యాయుడు ‘నువు థ్యాంక్స్ సురేష్‌కు చెప్పాలి. అతనికి దొరికితే తెచ్చి నాకు ఇచ్చాడు’ అని అన్నారాయన.
‘సురేష్, నువ్వు కూడా ఇటురా!’ అని పిలిచారు సార్.
వెంటనే నిన్నటి విషయమంతా పిల్లలకు వివరించి చెప్పారు ఆయన.
‘పిల్లలూ.. చూశారా! మనది కాని వస్తువు ఏదీ మనం తీసుకోకూడదు. స్కూల్లో దొరికింది కనుక సురేష్ నాకిచ్చాడు. రోడ్డు మీద దొరికిందనుకోండి పోలీసులకు అప్పజెపితే పోగొట్టుకున్నవారు ఎవరైనా వస్తే వాళ్లు తీసుకుంటారు’ అని వివరించారు ఆయన.
‘సురేష్ చేసిన మంచిపనికి అందరూ చప్పట్లతో అతన్ని అభినందించండి’ అన్నారు. ఒక్కసారిగా స్కూలంతా చప్పట్లతో మార్మోగింది. పిల్లలంతా సురేష్‌ను అభినందించారు.
సురేష్‌కు పట్టలేనంత ఆనందం కలిగింది.
అప్పుడు సురేష్ వాళ్ళ సార్ దగ్గరకు వెళ్ళి ‘సార్! మీరన్నట్లుగా ఆనందం అంటే ఏమిటో ఇప్పుడు తెలిసింది’ అన్నాడు.
‘సరే! నీవేం నేర్చుకున్నావు దీనివల్ల?’ అడిగారు ఆయన.
‘ఎదుటివారికి సహాయం చేయటంలో ఎంతో ఆనందం వున్నది అని!’ బదులిచ్చాడు సురేష్.

- డా. మైలవరపు లలితకుమారి,
గుంటూరు.
చరవాణి : 9959510422
చిన్ని కథ

బాల్య స్నేహితులు

శేఖర్, సుధాకర్, సూర్యం బాల్య స్నేహితులు. శిశు విద్యామందిరంలో 10వరకూ కలిసి చదువుకున్నారు.
టెన్త్‌లో చదువాపి తండ్రి వ్యాపారంలో తోడుగా వున్నాడు శేఖర్. తీర్థయాత్రలకి భక్తులను తీసుకెళ్లడం.. పుణ్యక్షేత్రాలు దర్శించి రావడం.. ఈవిధంగా ఎక్కడెక్కడ ఏమేమి చూడాలో, ఎలా వెళ్లాలో క్షుణ్ణంగా తెలుసుకున్నాడు శేఖర్.
ఇంటర్‌తో చదువాపేసిన సుధాకర్ తండ్రి వెంట వుండి కొబ్బరికాయల వ్యాపారంలోకి దిగాడు. బాబా గుడి దగ్గర దుకాణం కావడంతో లాభాలు బాగానే వస్తాయి.
ఇక సూర్యం డిగ్రీ పూర్తిచేసి గవర్నమెంట్ జాబ్ దొరక్క ఒక కానె్వంట్‌లో టీచర్‌గా పనిచేస్తున్నాడు.
ముగ్గురూ కలుసుకున్నారు ఆరోజు. ఈ నెల నీ సంపాదన ఎంతని? ఒకరినొకరు అడిగి తెలుసుకున్నారు.
‘ఒక పెద్దాయన వెంట వెళ్లి ఆయనకి కొన్ని క్షేత్రాలు చూపించాను. ఆయన రూ.6వేలు ఇచ్చారు’ అన్నాడు శేఖర్.
ఈసారి గురువారాలు కాకుండా, గురుపూర్ణిమ కూడా వచ్చిందిగా.. బాబా దయవల్ల రూ.10వేలు సంపాదించాను’ అన్నాడు సుధాకర్.
‘మా హెడ్‌మాష్టర్ నా జీతం ఐదువందలు పెంచాడు ఈ సంవత్సరం. ఇకనుంచీ నా జీతం 3 వేల రూపాయలు’ చెప్పాడు డిగ్రీ చదివిన సూర్యం.

- విఎస్ రామలక్ష్మి, విజయవాడ.

పుస్తక పరిచయం

సామాజిక చైతన్యరేఖలు ‘కచటతపలు’!
ప్రతులకు:
శ్రీ మధులత పబ్లికేషన్స్,
డోర్ నం: 28- 3- 49,
సంజీవయ్య కాలనీ, అరండల్‌పేట,
విజయవాడ - 520002.
స్థిరవాణి : 0866-2434320
చరవాణి : 9032088555
శ్రీమతి భూమిడిపాటి బాలాత్రిపుర సుందరి ఆధ్యాత్మిక వ్యాస పరంపరనీ, బాల సాహిత్యాన్నీ విరివిగా వెలువరిస్తున్న విదుషీమణి. రామకృష్ణప్రభ వంటి ప్రముఖ పత్రికల్లో రచనలు చేస్తున్నారు. భాషా సాహిత్యాన్ని అధ్యయనం చేసినవారు. సంస్కృతీ సంప్రదాయాల్ని ముందుతరాలకి అందజేయాలనే చిత్తశుద్ధితో, నిబద్ధతతో యువతకు స్ఫూర్తి ప్రదాయకమైన పది గ్రంథాల్ని ప్రచురించారు. ‘ముంగిట ముత్యాలు’, ‘అవతారాల కథలు’ వంటి పుస్తకాల్ని పాఠకులు ప్రశంసించారు. సుందరి గారి ఈనాటి కృషిలో భాగంగా వచ్చిన పుస్తకం ఈ ‘కచటతపలు’ సంపుటి. ఇవన్నీ ఇంటింటి కథలు. ఈ కథలన్నీ ఒకవిధంగా హితోక్తులు, శాంతిసూక్తాలు, ఆచరణాత్మకమైన సందేశాలు. వాటన్నిటి సారాంశం - జనక్షేమం, వ్యక్తిత్వ వికాసాన్ని ప్రోదిచేసే దైనందిన హెచ్చరికలు. ‘మనమంతా మరింత హేతుబద్ధంగా ఆలోచించాలని చెప్పటం నా ఉద్దేశ్యం’ అన్నారు రచయిత్రి ఈ కథల గురించి చెబుతూ! ఈ కథా సంపుటిలో పదమూడు కథలున్నాయి. ‘రైల్లో సైల్లు ప్రయాణం’ - రైలెక్కినప్పట్నుంచీ క్షణక్షణం విచారణలతో ప్రయాణం ఎంత దుఃఖ భాజనంగా పరిణమిస్తున్నదో వివరిస్తుంది. ‘తల్లిప్రేమ తల్లికి చేటా’ కథలో గారాబంకొద్దీ, ప్రేమకొద్దీ స్కూటర్ కొనిస్తే కొడుక్కి అదికాస్తా ప్రమాదహేతువైతే.. వగచి బాధపడాల్సి వస్తుంది! మానవ సంబంధాలూ, కుటుంబ సంబంధాలూ - క్రమేపీ సన్నిహిత బంధువుల ముక్కూ మొహం కూడా తెలియని దుస్థితిలోకి నడుస్తున్నాయి. దగ్గరకు వచ్చిన పెద్దన్నయ్యని కూడా గుర్తించలేకపోయానని బాధపడుతుంది ఒక వసుంధర ఈ కథలో! రాబోయే కాలంలో ఏదో ఆపద కలుగుతుందేమోనని - పిల్లల్ని ఒక ‘షెల్’లోకి నెట్టి, భయభ్రాంతుల్ని చేస్తూ పెంచితే - రేపటితరం ఎలా తయారవుతుంది? సంఘంలో సంబంధ బాంధవ్యాలెవా స్థిరపడతాయి? ఆచనీయమైన ప్రశ్నలతో - మార్గదర్శనం చేస్తున్న కథ. ఈ సంపుటి మొత్తానికీ వనె్న తెస్తున్న ప్రయోజనాత్మకమైన మరింత మంచి కథ ‘ఎవర్ని ఎవరు గౌరవించాలి?’ అనేది. యవ్వనారంభ దశలో తోటివారి ప్రభావం విద్యార్థుల మీద పడుతుంది. పెద్దవాళ్లని ఎదిరించే ధైర్యం వస్తుంది. తెలిసీ తెలియకుండా దారితప్పే ప్రమాదమూ ఉంది. వచ్చీరాని వయసులో పిల్లలకి పెద్దవారే జాగ్రత్తలు చెప్పాలన్నది సందేశం! ఇలాంటి సామాజిక ప్రయోజనం కలిగినవే మిగిలిన కథలు కూడా.
దైనందిన జీవితంలో మనలో చాలామందిని సతమతం చేస్తున్న స్వయం కృతాపరాధాల్నే కథాత్మకంగా ఆవిష్కరించారు రచయిత్రి. మనముందొక అక్షర దర్పణాన్ని నిలిపి - మనల్ని మనం చూసుకునే అవకాశం కలిగించారు. అందుకనే ‘కచటతపలు’ మన బలాన్నీ, బలహీనతనీ కూడా మనకు స్పష్టంగా చూపుతాయి. అంర్ముఖీనతతో - మచ్చల్నీ, మరకల్నీ సరిదిద్దుకొనే అవకాశాన్నీ కలిగిస్తాయి. వ్యక్తి చైతన్యానికి, సంఘ శ్రేయస్సుకూ దోహదం చేసే - ఒక సాహిత్యావసరాన్ని తమ కథల ద్వారా అందిస్తున్న రచయిత్రికి అభినందనలు!

- విహారి,
చరవాణి : 9848025600

మనోగీతికలు

ఒకరోజు..
అతడు
ఏమీ దాచుకోడు
ఎవ్వరినీ దోచుకోడు
తనకున్నదంతా పంచుతాడు
నీతిగా బతకాలంటాడు
అమాయకంగా నమ్ముతాడు
చిన్న పొగడ్తకే ఉబ్బితబ్బిబ్బవుతాడు
చిరకాలం తాను గుర్తుండాలనుకుంటాడు
ఇంకా ఇంకా నేర్చుకోవాలంటాడు
తరగతి గదిలో విశ్వాన్ని ఆవిష్కరిస్తాడు
ప్రపంచ సమస్యలన్నీ చర్చిస్తాడు
జీవవైవిధ్యాన్ని రక్షించాలంటాడు
కొత్త విధానాలు సృష్టించమంటాడు
నోరెండుతున్నా తర్కిస్తాడు
కడుపు మండుతున్నా చల్లనిమాటై వర్షిస్తాడు
సమాజం దిశ మారాలంటాడు
సామాజిక దశ తిరగాలంటాడు
తన బిడ్డలను మించి ఇతరులను ప్రేమిస్తాడు
ఒక్కదినం విశ్రాంతి కోసం ఎదురుచూస్తాడు
నెలకొక్కరోజు పండుగ చేస్తాడు
పిసరంత సాయమందినట్లు కలగంటాడు
తాను తీర్చిదిద్దిన శిల్పాలు చూసి ఆనందిస్తాడు
ఒతకలేక బడిపంతులన్నా నవ్వేస్తాడు
తనకూ ఒకరోజుందని గర్విస్తాడు!

- షేక్ బషీరున్నీసా బేగం,
గుంటూరు.
చరవాణి : 9985193970

కుంపటి
చాన్నాళ్ల తరువాత
సొంతూరుకొచ్చాడు కొడుకు
తల్లిదండ్రుల ఆనందానికి
అవధుల్లేవు!
ఇల్లంతా పండగ శోభ
వంటిల్లు ఘుమఘుమలు
కోడలు, మనవళ్ల
కుశల ప్రశ్నలు
ఉద్యోగ రెక్కలు వచ్చాక
ఎగిరిపోయిన పక్షి
ఒకసారైనా తిరిగొస్తుందా అని
ఎన్ని రాత్రులు వెక్కివెక్కి ఏడ్చాయో
పిచ్చి మనసులు!
కన్నపేగును చూడగానే
ఒంటరి బతుకులకు కొంచెమైనా
ద్వేషం కలగలేదు సరికదా
ప్రేమ రెట్టింపైంది
కన్నప్రేమ మహిమ అంతేమరి!
కొడుకు మాత్రం చుట్టంలానే వున్నాడు
ఆతిథ్యం కూడా స్వీకరించాడు
‘బాగున్నారా?’ అని
ఒక్కమాటైనా అడగలేదు
సొంతిట్లోనే
నిప్పులపై నిలబడ్డట్టే ఉన్నాడు
ఇంటికేసి చుట్టూరా చూసి
ధర ఎంత పలుకొచ్చు అన్నాడు
ముసలి ప్రాణాలు
పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్లు
తల్లడిల్లుతూ.. లోలోపలే కుములిపోతూ..
ఒకరినొకరు చూసుకున్నారు!

- దాసరోజు శ్రీనివాస్,
ఖమ్మం.
చరవాణి: 9010972169

నమోనమో..!
నమోనమో శ్రీ ఉపాధ్యాయుడా
నమహో నమహో నమోనమః నమోనమో
విద్యార్థిని కన్నబిడ్డగా చూసే సుందర దరహాసం
భావిభారత భాగ్యవిధాతగ మార్చే
దీక్షాపరతంత్రం
నిండు మనసుతో ప్రేమను పంచి
అందించిన విజ్ఞాన ధనం
నీకు సాటి మరి లేనేలేరని
సాగిలపడె నవభారతం
పేరులోనే ‘సర్’ బిరుదు దాగిన
సర్వేపల్లి ఆదర్శం
గురుతర బాధ్యత నెరవేర్చాలని
శిరమున మోసిన సంకల్పం
తడబడే అడుగుల తప్పని తాళం
అందరికీ నువ్వే మార్గదర్శకం
చిన్నలైన మరి పెద్దలైన
నీకర్పించే నీరాజనం
సమయపాలనకు మారుపేరుగా
నిలిచే ఏకైక ఎంప్లారుూ
జీతం తప్ప ‘గీతం’ ఎరుగని
నీతినియమాల అనుయారుూ
ప్రజల మనిషిగా తలలో నాల్కగ
జీవింతే ఓ విధేయుడా..
ఏ విధినైనా సక్రమమ్ముగా
నిర్వర్తించే సైనికుడా..
నమోనమో!

- కె దేవికారత్నాకర్,
తెనాలి, గుంటూరు జిల్లా.
చరవాణి : 9908706218

గురువు
గురువంటే విలువల బరువు
గురువంటే శిష్యుల కల్పతరువు
గురువంటే మహోన్నత మేరువు
గురువంటే మధుర బోధల వేణువు
ఆది శంకురుని వారసుడు
రామకృష్ణుని అనుచరుడు
రాధాకృష్ణుని మార్గానే్వషకుడు
అబ్దుల్ కలాం ఆశయదీపకుడు
పతనవౌతున్న మానవీయ విలువల్ని
నిటారుగా నిలపాలని పరితపించే బోధకుడు
విజ్ఞానం విశ్వవ్యాప్తవౌతున్న జగాన
శిష్యుల ప్రగతికి మురిసిపోయే మానవుడు
జ్ఞానంతో వివేకాన్ని
ఆలోచనలతో వివేచనను
సహనంతో శాంతికాముకతను
విజ్ఞానంతో విశ్వాభివృద్ధిని
మిశ్రమింపజేసి ఆనందించే మహాత్ముడు
జీతంతో జీవితాన్ని గడుపుతూ
నిత్యం శిష్యుల జ్ఞాపకాల్ని నెమరేస్తూ
బోధనావృత్తిలో సంతృప్తతను
అనుభవించే అసలైన అమృతమూర్తి
గురువన్న పదం అమూల్యం
గురువృత్తిలో జీవితం
అజరామరం!

- మద్ది పుల్లారావు,
నందిగామ, కృష్ణా జిల్లా.
చరవాణి: 9951287113

email: merupuvj@andhrabhoomi.ne

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ప్లాట్ నంబర్ సి- 3, 4, ఇండస్ట్రియల్ ఎస్టేట్, విజయవాడ - 520 007. email: merupuvj@andhrabhoomi.net

- డా. మైలవరపు లలితకుమారి