పెరటి చెట్టు

అమృతం కురిసిన రాత్రి -బాలగంగాధర తిలక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘సంకుచితమైన జాతిమతాల సరిహద్దుల్ని చెరిపివేస్తున్నాను నేడు అకుంఠితమైన మానవీయ పతాకను ఎగురవేస్తున్నాను చూడు చరిత్ర రక్త జలధికి స్నేహసేతువు నిర్మిస్తున్నాను రండి..’’
అంటూ బలమైన కంఠంతో విశ్వమానవ సౌభ్రాతృత్వానికి నిబద్ధుడై మానవతా కేతనాన్ని ఎగురవెయ్యటమే ధ్యేయంగా, కరుణ కలికితురాయిగా తన అపురూపమైన అనుభూతుల్ని అక్షరబద్ధం చేస్తూ, అమృతమయమైన కవితాఝురిని ప్రవహింపజేసిన కవితా తపస్వి శ్రీ దేవరకొండ బాలగంగాధర తిలక్.
కవితా సతి నుదుట నిత్య రసగంగాధర తిలకంగా, ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో సుస్థిర స్థానాన్ని పొందిన తిలక్ తన అమృతం కురిసిన రాత్రి కవితా సంకలనం ద్వారా సామాజికమైన తన ఆలోచనల్ని కవిత్వీకరించి కవిత్వానికే సార్థకత కలిగించాడు.
సమాజంలోని అన్ని కోణాలనూ స్పృశించే యత్నం మనకు తిలక్ అమృతం కురిసిన రాత్రిలో కనిపిస్తుంది. తాలోత్తాలంగా ఎగిసిన భావ, అభ్యుదయ కవిత్యోద్యమాల నేపథ్యంలో తిలక్ కవిత్వ రచన ప్రారంభమైంది. ప్రభాతము- సంధ్యతో కవిగా జీవితాన్ని ప్రారంభించిన దేవరకొండ బాలగంగాధర తిలక్ తొలి రోజుల్లో భావకవుల్లాగానే పద్యాన్ని ఆశ్రయించాడు. గోరువంకలు, అద్వైత మాన్మధం, సీత, వివేకానందుడు వంటి శీర్షికలతో ఎన్నో పద్య ఖండికలను తిలక్ రాశాడు. గురజాడ, కృష్ణశాస్ర్తీ, విశ్వనాధ, శ్రీశ్రీ వంటి నాటి కాలపు కవుల రచనలతోపాటు ఎందరో ప్రాచ్య, పాశ్చాత్య కవుల కవిత్వాలను, వారి కవిత్వ సిద్ధాంతాలనూ గాఢంగా అధ్యయనం చేసినట్లు తిలక్ రచనలు చదివితే స్పష్టంగా తెలుస్తుంది. వ్యావహారిక భాష, రసదృష్టి, వాస్తవికతా దృక్పథం, అనితర సాధ్యమైన శైలి తిలక్‌లో మనకు గోచరించే కొన్ని కోణాలు. పరిశీలించే కొద్దీ ఆయన అమృతం కురిసిన రాత్రి అనేకానేకమైన ఆధునిక భావాల సమాహారంగా, సహృదయుల హృదయాల్లో నినదించే గుండె చప్పుళ్ళకు ప్రతిబింబంగా నిలుస్తుంది.
అమృతం కురిసిన రాత్రిలోని మొదటి కవితే, కవిత్వం పట్ల ఆయనకున్న స్పష్టమైన దృక్పధాన్ని తెలుపుతుంది. అభ్యుదయ కవితోద్యమ ప్రభావం వచన కవిత్వానికి పట్టం కట్టింది. సమకాలీన కవుల్లాగానే తిలక్ కూడా వచన కవిత్వాన్ని తన అనుభూతులకు వాహికగా ఎంచుకున్నాడు.
కవిత్వాన్ని లోకం ముందు ఉంచేటపుడు కవిత్వంపైన మంచి పట్టు, స్పష్టమైన అవగాహన కవికి ఉండాలి. తిలక్ అమృతం కురిసిన రాత్రిలో చాలాచోట్ల కవిత్వాన్ని గురించి, కవులను గురించి తన అభిప్రాయాల్ని దాపరికం లేకుండా వెల్లడించాడు. నా కవిత్వం, నవత - కవిత, నాకవిత్వంలో నేను దొరుకుతాను వంటి ఖండికలు ప్రత్యేకించి కవిత్వాన్ని గురించి చెప్పేవే. ఇవికాక అక్కడక్కడా ప్రాసంగికంగా కూడా కవిత్వాన్నీ దాని తత్వాన్నీ గూర్చి స్పృశించాడు.
కవిత్వం ఎట్లా ఉండాలో అని చెప్పేముందు ఎట్లా ఉండరాదోనన్న విషయాన్ని తిలక్ చాలా బాగా చెప్పాడు.
‘‘నాకవిత్వం కాదొక తత్వం
మరికాదు మీరనే మనస్తత్వం
కాదు ధనిక వాదం, కాదు సామ్యవాదం
కాదయ్యా అయోమయం, జరామయం
అనడంలో వాదాలను ఆశ్రయించి కవిత్వం చెప్పడం కవిత్వానికి అన్యాయం చెయ్యడమే. అది అయోమయానికి దారితీసే అంశం. ఆ కవిత్వం అజరామరం కాదు. అందుకే కవిత్వంలో వాస్తవికత పేరుతో వాదాలను, ఇజాలను నింపరాదన్నది తిలక్ ఆలోచన. కాబట్టే ‘ఇజంలో ఇంప్రిజన్ అయితే ఇంగితజ్ఞానం నశిస్తుంది’’ అన్నాడు. అంతేకాదు, కవిత్వంలో ఉండే అస్పష్టతపై కూడా తిలక్ ధ్వజమెత్తాడు.

-సశేషం

-జి.గిరిజా మనోహర్‌బాబు