విజయవాడ

దోపిడీ, పీడనల్ని కళ్లకు కట్టిన ‘చొరబాటు’ (పుస్తక పరిచయం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘కంచి మేకలు’ కథా సంపుటితో ప్రారంభించి ‘చొరబాటు’తో కథకుడిగా తన స్థానం సుస్థిరం చేసుకున్న కథా రచయిత శిరంశెట్టి కాంతారావు. నాలుగో కథా సంపుటిగా ఆయన ‘చొరబాటు’ను ప్రచురించారు. ఈ కథలన్నీ ఇంతకుముందు వివిధ పత్రికల్లో ప్రచురించినవే. ఇందులో మొత్తం పద్దెనిమిది కథలున్నాయి. ప్రతి కథలోనూ దోపిడీ, పీడన సామాన్యుని జీవితంలోకి ఎలా చొరబడతాయో దృశ్యమానం చేసి చూపారు రచయిత. చదువరి తన చుట్టూ నిత్యం జరుగుతున్న దోపిడీలను చూస్తున్నా, తనదాకా రానంత వరకు పట్టించుకోడు. కాంతారావు లాంటి సామాజిక బాధ్యత ఏమిటో తెలిసిన రచయిత చెప్పినప్పుడు కాస్త ఆలోచిస్తాడు. ‘అవును నిజమేకదా!’ అనుకుంటాడు. కాస్తంత చైతన్యం కలిగిన పాఠకుడు స్పందిస్తాడు, ప్రశ్నిస్తాడు. అవసరమైతే ఎదురు తిరుగుతాడు. చివరిది ఎక్కువ మంది చేయగలిగేటట్టు చేసినప్పుడు రచయిత ధన్యుడవుతాడు.
కాంతారావు కథలు చెప్పడానికి రాయడు. చెప్పింది రాస్తాడు. ఒక సమస్య మీద కథ రాయాలంటే, ఆ సమస్య ఎక్కడుందో అక్కడికి వెళ్తాడు. ఆ సమస్య చుట్టూ వున్న పాత్రల్ని ప్రశ్నిస్తాడు. వాళ్లు చెప్పింది కథగా చెక్కుతాడు. ఆ చెక్కడంలో నైపుణ్యముంది. ఆయా ప్రాంతాల్లో ఆయా పాత్రలు వాడే భాష, యాసలతో పాటు వాళ్లు, మనం వాడే సామెతలు చక్కగా ఒడిదిపోయేలా కూర్చుతాడు. అందువల్ల పాఠకుడే స్వయంగా ఆ దృశ్యాల్ని చూస్తున్న అనుభూతిని పొందుతాడు. ప్రతి కథలోనూ జీవితాలుంటాయి. వాస్తవాలుంటాయి. దోపిడీ ఉంటుంది. దోపిడీకి గురై దుఃఖపడే పాత్రలుంటాయి. ఆ దుఃఖానికి ‘చొరబాటు’ ఎంతవరకు కారణమో విస్తృతంగా వివరిస్తాడు రచయిత. కేవలం ఇవే కాదు. కథా కథనంలో ఈజ్ ఉంటుంది. ఉపమానాలుంటాయి, రూపకాలుంటాయి.
తాజా సంపుటిలో మొదటి కథ ‘చొరబాటు’ చక్కని దృశ్యంతో మొదలవుతుంది. ‘పచ్చటి తూరుపు కొండలు.. నారింజ రంగు సూరీడు.. పసిడి కాంతుల కిరణాలు..’ ఇంకా ఈ కథలోనే - ‘పుష్పక విమానం లాంటి వీరాంజనేయ లాంచి.. నెగళ్ల మీద బూడిద.. ఆబోతు మూపురం వంటి కొండ వంపులు- చీకటి కడుపున జారిపోతున్న సూరీడు- నల్లటి చీకటి దుప్పటి ముసుగు’! ఇవన్నీ కథకు అవసరమా? ఇంత చెబితే గానీ పాఠకుడికి ఎంత విధ్వంసం జరుగుతోందో అర్థంకాదు. కథలో కథలు చెబుతాడు కాంతారావు సీరియస్‌గాను, సరదాగానూ. నాకు మాత్రం కొన్ని కథల్లో విస్తృతి ఎక్కువైనట్టు అనిపిస్తుంది. కానీ, కథలు రాయడంలో చేయి తిరిగిన కాంతారావుకు ఈవిషయం తెలీక కాకపోవచ్చు. కుదించలేక కావచ్చు., పాఠకుడికి మరింత ఆసక్తి కలిగించడానికీ కావచ్చు.
పాపికొండల్లో బడి కట్టడానికి వచ్చిన కాంట్రాక్టర్ సత్తిరెడ్డి. ఆ కొండల్లోని గిరిజన గ్రామాల్లోకి ఎలా చొరబాటు చేసిందీ, అభివృద్ధి పేరిట జరుగుతున్న సంస్కృతి విచ్ఛిన్నం, సంపద దోపిడీ గురించి చెప్పి, ఉచ్చులో చిక్కిన జింకకూనల్లా విలవిలాడుతున్న గిరిజన స్ర్తిల గురించి హృదయ విదారకంగా చిత్రీకరించాడు రచయిత.
రెండో కథ ‘పాముకాటు’లో పాపామియా పాత్ర ఇంకా మన చుట్టూ సంచరిస్తున్న సజీవ పాత్రనే. ‘ఇంకా’ అని ఎందుకంటున్నానంటే, సాంకేతికంగా ఎంతో ఎదిగిపోయామని బీరాలు పలుకుతున్న మన పాలకులు, మూఢ నమ్మకాల్ని మాత్రం యథాశక్తి పెంచి పోషిస్తూనే వున్నారు. పాముకాటుకు మంత్రాలు చదివే పాపామియా గురించి చెబుతూ.. ‘పాపామియాకి ఇప్పుడు అరవై మూడేళ్లు. మనిషి ఎర్రటి ఎరుపుతో సాంబ్రాణి కడ్డీలా సన్నగా, పొడవుగా ఉంటాడు. నున్నటి గుండు మీద తెల్లటి టోపీ. కళ్లకు మందపాటి అద్దాలు. తెల్లగా పండిపోయిన గడ్డం. తెల్లటి పైజమా మీద లాల్చీతో ఒక్కసారి చూస్తే కొంతకాలం దాకా గుర్తుండిపోయేలా కన్పిస్తుంటాడు’ అంటూ అతని రూపురేఖల్ని చిత్రించడంలో శ్రద్ధ కనబర్చాడు రచయిత. తన కొడుకే వైద్యుడై వచ్చి, తండ్రి తాయెత్తుల మీద చేసిన కామెంట్.. పాపం! పాఠాలు చెప్పే పంతులు చేయలేకపోవడం మన వ్యవస్థకు దర్పణం పడుతుంది. మరో కథ ‘సలీమ్ కాకా’లో ఈ భూమండలంలో ఏ మూలకు వెళ్లినా శ్రమజీవుల దోపిడీ ఏదోరూపంలో కొనసాగుతూనే వుంటుందని, అదే సమయంలో శ్రమజీవులు ఎవరి దయాదాక్షిణ్యాలకు ఎదురుచూడరని, ఆత్మాభిమానం కలిగి వుంటారని చెప్తాడు రచయిత వారి పట్ల వకాల్తా పుచ్చుకొని. థర్మల్ ప్రాజెక్టు నిర్మాణానికి పదిహేను వందల ఎకరాలు కొనడం, ఆ భూమిలోని వాగును పూడ్చడం, దాని ఫలితంగా దిగువనున్న అబ్బపల్లి గ్రామస్తులకు నీటి ఎద్దడి ఏర్పడటం, అబ్బపల్లి గ్రామస్తుల్లో సగం మంది కొంప, గోడు, పుట్రా వదిలిపెట్టి గూడు చెదిరిన గవ్వల్లా ఎక్కడెక్కడికో వలస బోవడం ‘మా ఊరు అమ్ముతాం కొనుక్కోండ్రీ’ కథలో దృశ్యాదృశ్య వాస్తవాల్ని కథకుడు తనదైన శైలిలో చిత్రించాడు. చొరబాటు సర్వాంతర్యామి. ఇందుగలదందు లేదను మాట లేదు. రూపాలు వేరైనా పాపాలు ఒక్కటే అని చెప్పిన ఈ కథ కాంతారావు నిక్కమైన ప్రతిభకు నిదర్శనం.
‘అనివార్యం’ కథలో గుడుల పేరుతో జరుగుతున్న దోపిడీని, కులానికో దేవుడు, ఆ దేవుడికో గుడి, ఆ గుడికో పురాణ కథ.. ఇత్యాదులు చెబుతూనే, సెంచులచ్మి మాటల్లో.. ‘దేవుల్లను గూడ మాకు దూరం జేయబట్టిరి. దాంతోటి ఇగ మాగ్గూడ మారక తప్పట్లే’ అంటూ ‘కింద పడ్డవాడెప్పుడూ కిందనే ఉండడు. వాడికీ ఓరోజొస్తుంది. వాడూ లేస్తాడు. తన సత్తా ఏంటో సమాజానికి చూపిస్తాడు. అది అనివార్యం’ అని హెచ్చరిస్తాడు రచయిత. దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల మీద చాలా కథలు, కవితలూ వచ్చాయి. కాంతారావు ఈ సంఘటనకు సెంటిమెంట్‌తో కూడిన కథారూపం కలిగించి ‘ఆ గాయం మాననిది’ అని ఒక్కమాటలో తన నిశ్చలాభిప్రాయాన్ని వ్యక్తీకరించాడు. ‘ఇంటింటి’ కథలో విచ్ఛిన్నమవుతున్న మానవ సంబంధాల గురించి, రెక్కలు ముక్కలు జేసుకొని పెంచి పెద్దజేసిన పిల్లలే రెక్కలొచ్చాక రెక్కలుడిగిపోయిన తల్లిదండ్రుల్ని ఇంకా ఏదో సంపాదించి పెట్టలేదని నిందిండం, వారి కర్మకాండలకు పెట్టే ఖర్చుల్ని లెక్కించుకోవడం, మనం రోజూ వింటున్న, చూస్తున్న దృశ్యాలే. ఐతే దీనికి కారణం కనిపిస్తున్న వ్యక్తులు కాదు, విజృంభిస్తున్న వ్యవస్థ అని గ్రహిస్తే పరిష్కారం లభిస్తుంది. రాజకీయ ఆధిపత్యాలు నిరూపించుకునే క్రమంలో గ్రామాల మధ్య వైరాన్ని పెంచి పోషించటం చూపించిన కథ ‘పూర్ణమ్మ చెరువు’. సీతంపేట, రామాపురం మధ్య గొడవల్లో కూలి జనం, రెక్కడితే గానీ డొక్కాడనివారు బలైపోవడం పాత కథే. ‘మనలాంటి వాళ్లంతా కళ్లు తెరిచి ఏకంకావాలనే ఆలోచన మన జనాలకు అంత తొందరగా తట్టదు’ అంటూ ముగించడం కాంతారావు లాంటి రచయితలకు తగిన పనికాదు! బహూశా పరిష్కారాన్ని సమాజానికి వదిలేసి వౌనం వహించడమే ఉచితమనుకున్నారేమో?
చివరి కథ ‘సంపెంగపూలు’ మనిషి బతికినంత కాలం ప్రశాంతంగా బతకాలని, ఎలాంటి రోగానికైనా నేడో, రేపో మందు కనిపెడతారని ఆశా జలాలను అందించే ప్రయత్నం చేశాడు రచయిత. ఇంకా ‘అభిజాత్యం’, ‘ఓ అమ్మ కథ’, ‘తిరిగొచ్చిన బాల్యం’ లాంటి కథలున్నాయి ఈ సంపుటిలో. ప్రతి కథా ఓ జీవితం. ఓ వ్యథ, ఓ చైతన్యం, ఓ ఆలోచన, ఓ వ్యవహారం. ఇన్ని పార్శ్వాలతో కథల్ని ఒక్కచోట గుదిగుచ్చిన శిరంశెట్టి కాంతారావు అభినందనీయుడు.
- మండవ సుబ్బారావు,
కొత్తగూడెం, ఖమ్మం జిల్లా.