విజయవాడ

ఆలయాల్ని పునరుద్ధరిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాతబస్తీ, జూలై 4: నగరంలో అభివృద్ధి పేరిట హిందూ దేవాలయాల విధ్వంసం జరుగుతోందని ప్రతిఘటించిన హిందూ ధర్మ పరిరక్షణ సమితి వ్యూహం ఫలించింది. సోమవారం సాయంత్రం పాతబస్తీ కెనాల్ రోడ్డులో జరిగిన బహిరంగ సభలో మంత్రులు ప్రభుత్వ ప్రతినిధులుగా ఆలయాలను పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి కామినేని శ్రీనివాసరావుని విశ్వహిందూ పరిషత్ వారు ఘెరావ్ చేయడంతో సభ మధ్యలోనే ఆయన వెళ్లిపోయారు. హిందూ దేవాలయాల తొలగింపుపై రేగిన నిరసనకు మంత్రి కామినేని స్పందించారు. ఏదైనా కార్యక్రమాలు చేపట్టినప్పుడు ఎవ్వరూ పూర్తిస్థాయిలో న్యాయం చేయలేరు. చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయని ఆయనన్నారు. విశ్వహిందూ పరిషత్, హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం కెనాల్ రోడ్డులో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. విజయేశ్వర ఆలయాన్ని కూల్చే ప్రశక్తి లేదని, అలాగే వినాయకుని గుడిని కూల్చబోమన్నారు. గోశాల విషయంపై చర్చించి అందరికీ ఆమోదమైన నిర్ణయం తీసుకుంటామన్నారు. గోశాల పునర్నిర్మాణం జరుగుతుందని హామీ ఇచ్చారు. సీతమ్మవారి పాదాల వద్ద శనైశ్చరాలయం పునర్నిర్మిస్తామన్నారు. సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. హిందూ ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు, విశ్వహిందూ పరిరక్షణ సభ్యులు కామినేనికి వ్యతిరేకంగా నినదించడంతో ఆయన సహనం కోల్పోయి సభ నుండి వెళ్లిపోయారు.
కేశినేని భవిష్యత్‌లో ఎక్కడా గెలవరు
విజయవాడలో హిందూ దేవాలయాల కూల్చివేత విషయంలో ఎంపి కేశినేని క్షమాపణలు చెప్పాలని ఆయన పీఠాధిపతుల పట్ల అభ్యంతరకరమైన వ్యాఖ్యలు విరమించుకోవాలని లేకుంటే భవిష్యత్తులో కేశినేని నాని ఎక్కడా గెలుపు ఉండదని శివక్షేత్రం పీఠాధిపతి శివస్వామి శాపనార్థాలు పెట్టారు. స్వామీజీలను, పీఠాధిపతులను దొంగస్వాములని కేశినేని కామెంట్ చేయడంపై శివస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. నాని ఎలా ఎదిగారు, కోట్లు ఎలా సంపాదించారని, తన బ్యాంకు ఖాతా కేవలం 3వేల బ్యాలెన్స్ ఉంటుందని, కేశినేని అవినీతి సంపాదన కోట్లలో ఉందని ఆయన ధ్వజమెత్తారు. ఉదయించే, అస్తమించే సూరీడు కాషాయం రంగులో ఉంటాడని, తాము కూడా అంత నిర్మలంగా కాషాయ వస్త్రాలు ధరించామని, శివదర్శనం పొందిన తాము స్వచ్ఛమైనవారమన్నారు. ఉదయం, సాయంత్రం మధ్య సూరీడు భగభగలు ఈ మాయా ప్రపంచ తీరుని గుర్తుచేస్తుందని, అలాంటి మాయా ప్రపంచంలో ఉన్న కేశినేని నానికి రాజకీయంగా ఓటములే ఉంటాయని శివస్వామి శాపనార్ధాలు పెట్టారు. తనకు ఎన్నో బెదిరింపులు వచ్చాయని, సంఘ వ్యతిరేక శక్తుల నుండి ఫోన్‌కాల్స్ వచ్చాయని, అలాంటి వాటికి భయపడనని హిందూ ధర్మ పరిరక్షణకు ప్రాణత్యాగానికైనా తాను సిద్ధంగా వున్నానని శివస్వామి ఉద్ఘాటించారు.
ఆలయాల కూల్చివేతలుండవు:ఎంపి గోకరాజు
రోడ్డు విస్తరణ పేరుతో ఆలయాలు కూల్చడం దారుణమైన అంశమేనని మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చినందున ప్రజలు ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదని నర్సాపురం ఎంపి గోకరాజు గంగరాజు అన్నారు. ఇప్పటివరకూ జరిగినదాన్ని రాష్ట్ర ప్రభుత్వం సరిదిద్దుకుంటుందన్నారు. మున్ముందు ఏవైనా కూల్చాలంటే ముందు అందరితోనూ సంప్రదింపులు జరిపాక అందరి ఆమోదంతోనే కార్యక్రమాలు జరుగుతాయని ఎంపి అన్నారు. ఇదిలావుండగా ఆలయాలు కూల్చివేత విషయంలో ఎంపి కేశినేని నాని క్షమాపణ చెప్పాలని, అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని విహెచ్‌పి కార్యకర్తలు డిమాండ్ చేశారు. పీఠాధిపతులు, స్వామీజీలు మాత్రం రాజకీయ నాయకులను ఘాటుగా విమర్శించారు. నామినేషన్లకు బయలుదేరినప్పుడు ఎలాంటి విఘ్నాలు లేకుండా విఘ్నేశ్వరస్వామికి పూజలు చేసిన విషయాలు మర్చిపోయి వినాయకుని గుడి కూల్చడానికి రంగం సిద్ధం చేయడంపై ధ్వజమెత్తారు. సభలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, శివక్షేత్రం శివస్వామి, శ్రీనివాసానందస్వామి, కమలానంద భారతి, తదితరులు పాల్గొన్నారు.