విజయవాడ

తెప్పరిల్లుతున్న లోతట్టు ప్రాంతాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), ఆగస్టు 18: గత ఐదారు రోజులుగా ఉగ్రరూపంతో నదీ పరివాహక ప్రాంతాలను ముంచేసిన కృష్ణమ్మ శాంతిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి ప్రకాశం బ్యారేజీకి వరద నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ముంపునకు గురైన ప్రాంతాల్లో కూడా వరద ఉధృతి తగ్గి లోతట్టు ప్రాంతాలు తెప్పరిల్లుతున్నాయి. వరద తగ్గుముఖం పట్టినా అక్కడి పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపడే వరకూ పునరావాసం పొందిన బాధితులు కేంద్రాల్లో ఉండే విధంగా చూడాలని కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్ అధికారులకు సూచనలు చేశారు. వరద ముంపు ప్రాంతాలకు నేతలు, ప్రజాప్రతినిధుల తాకిడి ఆదివారం ఎక్కువయింది. విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తోపాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తదితరులు ముంపునకు గురైన కృష్ణలంక పరిసర ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించారు. ప్రభుత్వ పరంగా అందిస్తున్న సహాయక చర్యలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. నగరంలోని భూపేష్ గుప్తానగర్‌లో వరద తగ్గడంతో ఆయా ప్రాంతాల ప్రజలు తమ ఇళ్లు, వాటిలో సామాన్ల పరిస్థితులను పరిశీలించుకుంటున్నారు. ఆదివారం సెలవు రోజు కావడంతో వరద ఉధృతిని వీక్షించేందుకు నగరం నలు మూలల నుంచే కాకుండా రూరల్ గ్రామాల నుంచి కూడా వేలాది మంది సందర్శకులు ప్రకాశం బ్యారేజీకి చేరుకుని వరద దృశ్యాలను వీక్షిస్తున్నారు. దీనితో బ్యారేజీపై ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. పలువురు వీక్షకులు వరద దృశ్యాలను సెల్‌ఫోన్లలో బంధించారు. వరదలతో నెలకొనే అపరిశుభ్రతకు అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకంగా పారిశుద్ధ్య పనులు చేపట్టాలని, ఇందుకు అవసరమైన సిబ్బందిని ఇతర ప్రాంతాల నుంచి ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధితోపాటు జగ్గయ్యపేట, కంచికచర్ల, పెనమలూరు, నందిగామ, తోట్లవల్లూరు, చందర్లపాడు తదితర ప్రాంతాల్లో పరిసరాల పరిశుభ్రతమై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ చెప్పారు. వరద బాధితులకు అందించే సహాయక చర్యల్లో ఎటువంటి లోపాలు తలెత్తకుండా సరిచూసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 46 పునరావాస కేంద్రాలలో వేలాది మంది ఆశ్రయం పొందుతున్నారు. వీరికి రెండు పూటలా భోజనం, అల్పాహారం, వైద్యం, చిన్నారులకు పాల సరఫరా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న మొత్తం 8 పునరావాస కేంద్రాలలో సుమారు 8వేల మంది వరకూ ఆశ్రయం పొందగా మరికొందరు ఏటి గట్లపైనే ఉంటున్నారు. వీరికి కూడా ప్రభుత్వం తరఫున అందించే సహాయక చర్యలను అందిస్తున్నారు. వరదలకు తరలివచ్చే విష జంతువులైన పాములు ఇతర క్రిమికీటకాల కాటుకు గురైన వారికి వైద్యం అందించేందుకు యాంటీ వేనం మందులను అందుబాటులో ఉంచాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. తాగునీటి కలుషితం కాకుండా రక్షిత నీటి సరఫరాకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈమేరకు ఆదివారం నగరంలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించిన కలెక్టర్ ఇంతియాజ్ మరో రెండు మూడు రోజుల మేర సహాయక చర్యలను ముమ్మరం చేయాలన్నారు. ఈ సమీక్షలో జాయింట్ కలెక్టర్ కే మోహన్‌కుమార్, జిల్లా పంచాయతీ అధికారి డాక్టర్ అరుణ, ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో జీ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వంతోపాటు స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా ముందుకు రావాలని కలెక్టర్ ఇంతియాజ్ పిలుపునిచ్చారు. ఆదివారం పటమటలంకలోని జడ్‌పీ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ అక్కడ జరుగుతున్న సహాయక చర్యలపై బాధితులను అడిగి తెలుసుకున్నారు. పేద, అల్పాదాయ వర్గాలకు అవసరమైన సహాయక చర్యలందించడంలో సేవా సంస్థలు కూడా సహకరించాలని కోరారు. 15, 16వ డివిజన్ రాణిగారి తోట వరద బాధితులు పునరావాసం పొందిన ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్న సహాయక చర్యలను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త బొప్పన భవకుమార్, వార్డు వలంటీర్లను భోజన సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు.