విశాఖపట్నం

మాతృభాష (కథానిక)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మన స్కూల్లో ఎడ్మిషన్ కోసం వచ్చారట సార్’’ అన్నాడు ప్రిన్సిపాల్‌తో అటెండర్.
‘‘కూర్చోండి’’ మమ్మల్ని చూసి అన్నారు ప్రిన్సిపాల్‌గారు.
‘‘నమస్తే సార్. వీడు మా అబ్బాయి వినీత్’’ అని చెబుతూనే వినీత్ వైపు తిరిగి ‘‘సార్‌కి నమస్కారం చెప్పరా’’ అని చెవి దగ్గర గొణిగాను.
రెండు చేతులూ జోడించాడు వినీత్.
‘‘ఇంతకు ముందు ఏ స్కూల్లో చదివావు వినీత్?’’ నవ్వుతూ అడిగారు ప్రిన్సిపాల్.
‘‘జ్ఞాననిధి ప్రైవేటు స్కూల్లో సార్’’ చెప్పాడు వినీత్.
‘‘ఓహో... అక్కడ తెలుగుకి కూడా ప్రాధాన్యత ఉందని విన్నాను ఔనా?’’ తలపంకిస్తూ అన్నారు.
‘ ఔన’నన్నట్లు తలూపాను.
‘‘మాది ఇంగ్లీసు స్టాండర్డ్‌లో నెంబర్‌వన్ స్కూల్. అయినా సరే మేము మాతృభాషకు ప్రాధాన్యమిస్తూ సెవెంత్ క్లాసు వరకు తెలుగు నేర్పుతున్నాం. అద్సరే మీ వాడికి టెస్టు పెట్టాలిప్పుడు’’ అన్నారాయన.
వినీత్‌ని పరీక్ష రూంలో కూర్చుండబెట్టి నేను బయటికి వచ్చి హాల్లో కూర్చున్నాను. చూడముచ్చటగా ఉన్న ఇద్దరు దంపతులు నాతో పాటు కూర్చున్నారు. వాళ్లసలు తెలుగు వాళ్లు కానట్టు, తెలుగసలు రాన్నట్టు చోద్యంగా ఇంగ్లీషులోనే మాట్లాడుకుంటున్నారు. ఒకటి రెండు సార్లు వాళ్ల చూపులూ, నా చూపులూ కలిసాయి. పలకరింపుగా నవ్వాను.
‘‘ప్లీజ్ టు మీట్‌యు. మైనేమ్ ఈస్ వైభవ్. దిసీజ్ రోజీ మై వైఫ్’’ అన్నాడతను.
నేను నవ్వేసి ఊరుకోలేక ‘‘నా పేరు రాజా. మా బాబు వినీత్ ఆరవ తరగతి ఎంట్రెస్ రాస్తున్నాడు’’ అన్నాను.
మాకు దగ్గగా వచ్చిన అటెండర్ ‘‘సార్ ఈ కవర్ ఎవరిదో చదివి చెప్పండి సార్’’ అంటూ అతనికి ఇచ్చాడు.
కవర్ అటు ఇటు తిప్పి చూసిన అతను ‘‘ఐ డోంట్ నో తెల్గూ. మై రోజీ ఆల్సో’’ అని కవర్ తిరిగి ఇచ్చేసాడు.
ఆ కవర్ని అందుకుని నేను ‘‘కరుణాకర్. తెలుగు సార్’’ అన్నాను.
‘‘తెలుగు పండిట్‌గారా’’ అంటూ వెళ్లిపోయాడు అటెండర్.
పిల్లలు పరీక్ష రాసి తిరిగి వచ్చేశారు.
‘‘ఎలా రాశావు నాన్నా?’’ అడిగాను నేను వినీత్‌ని.
‘‘బాగా రాశాను నాన్నా’’ చెప్పాడు వినీత్.
మా వాడు నాన్నా అని సంబోధించడం, నేను అచ్చమైన తెలుగులో మాట్లాడడం వాళ్లు విచిత్రంగా చూస్తున్నారు. ఆ దంపతుల చూపుల్లో వెటకారం వివరంగా కనిపిస్తుంది.
‘‘హౌ అటెండ్ ఎగ్జామ్ సన్?’’ అని వాళ్లబ్బాయిని అడిగాడు అతను.
‘‘బాగానే రాశాను’’ ముక్తసరిగా చెప్పాడా అబ్బాయి.
‘‘యు డర్టీఫెలో... ఐసే డోంటాక్ తెల్గూ’’ అని పళ్లు కొరికాడు అతను. ఆమె కళ్లెర్ర చేసి ‘‘యు డర్టీ క్రీచర్’’ అని కొడుకుని కుదిపేసింది.
నేనది సహించలేకపోయాను. కల్పించుకోకుండా ఉండలేకపోయాను. వెంటనే ‘‘మీరు తెలుగువారు కాదా అండీ’’ అని అడిగాను.
‘‘టెల్గూ... ఎందుకొచ్చిన టెల్గూ? మావాడు పెద్ద చదువు చదవాలి. ఆమెరికా వెళ్లి అక్కడే ఉండిపోవాలి. టెల్గూ చదవాలా? ఎందుకు?’’ అని కోపంగా నా వైపు చూస్తూ అన్నాడు.
ప్రిన్సిపాల్‌గారు మమ్మల్ని లోపలికి రమ్మన్నారని అటెండర్ చెప్పాడు. వౌనంగా లోపలికి నడిచాం.
‘‘కూర్చోండి’’ అన్నారాయన నావైపు చూస్తూ.
‘‘అన్ని సబ్జెక్టుల్లో రెండేసి ప్రశ్నలిచ్చాను. మీ అబ్బాయి వినీత్ బాగా రాశాడు. అన్నింటిలోను నూటికి నూరు మార్కులు వచ్చాయి. మీరు ఈ రోజే వినీత్‌ని స్కూల్లో జాయిన్ చెయ్యండి’’ అని షేక్‌హ్యాండిచ్చారు ప్రిన్సిపాల్.
నా ఆనందానికి అవధుల్లేవు. వినీత్‌ని పట్టుకుని దగ్గరకు హత్తుకున్నాను.
ప్రాథమిక విద్య మాతృభాషలోనే నేర్పించి వినీత్‌లో మనోవికాసం కలిగించినందుకు నన్ను నేను లోలోపల అభినందించుకున్నాను.
‘‘సారీ వైభవ్‌గారు! మీ అబ్బాయికి అన్నీ జీరో మార్కులే! తెలుగులో జీరో... మిగతా సబ్జెక్టుల్లో పూర్. వెరీవెరీ పూర్. మా స్కూల్లో ఎడ్మిట్ చేసుకోలేం. బాగా కోచింగ్ ఇప్పించి వచ్చే ఏటికి ఎడ్మిషన్‌కి తీసుకురండి’’ అని ముగించారు ప్రిన్సిపాల్‌గారు.
‘‘వియ్ డోంట్ వాంట్ టు ఎడ్మిట్ ఇన్ యువర్ స్కూల్. యు ఆర్ గివింగ్ ఇంపార్టెన్స్ టు టెల్గూ. సో ఇట్స్ ఓకే’’ అనేసి వాళ్లు కోసంగా వెనుదిరగబోయారు.
‘‘మిస్టర్ వైభవ్! మాతృభాషలో విద్యాబోధన పిల్లల మనోవికాసానికి తోడ్పడుతుందని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి...’’ అని చెబుతుంటే వారు వినిపించుకోలేదు.
‘‘డర్టీ స్కూల్... డర్టీ టెల్గూ’’ ఆమె బిగ్గరగా అంటూ కదిలింది. గాబరా గాబరాగా వెళ్లబోతున్న ఆవిడకి అటెండర్ కూర్చునే స్టూల్ కాలికి తగిలింది. జారిన ఊపుకి ఆగలేక బోర్లా పడిపోయింది. ఆమె హైహీల్స్ చెప్పు విసురగా పైకెగిరి ఆమె మొహానికి గట్టిగా తగిలింది. వాళ్లనే చూస్తున్న నాకూ, ప్రిన్సిపాల్‌గారికి దిగ్భ్రాంతి కలిగింది.
‘‘ఓలమ్మో సచ్చిపోనే్న...’’ అని గావుకేక పెట్టిందామె.
ఆ కేక మొత్తం స్కూలు స్కూలంతా మార్మోగింది.

- యల్. రాజాగణేష్,
పాతగాజువాక,
విశాఖపట్నం-530026.
సెల్ : 9247483700

చిన్నకథ

చదువుకోరా కన్నా!

‘ట్రింగ్.. ట్రింగ్’మని బెల్లు మోగించి సైకిల్‌పై పోస్టుమాన్ వచ్చి ‘‘ఇది రామయ్య ఇల్లు కదా’’ అని పక్కవారిని అడిగాడు.
వారు ‘అవు’నని సమాధానం చెప్పారు.
దాంతో ‘‘రామయ్యా... రామయ్యా’’ అని పిలిచాడు.
‘‘ఏమిటి బాబూ’’ అంటూ రామయ్య వచ్చి అడిగాడు.
‘‘మీ పేరున కవరొచ్చింది’’ అని అతనికి కవరు ఇచ్చి వెళ్లిపోయాడు పోస్టుమేన్.
ఆ కవరు పట్టుకొని అరుగుపై ఆశ్చర్యంతో కూర్చుండిపోయాడు రామయ్య. రామాపురంలో చదివిస్తే ఎవరైనా ఏమైనా అనుకుంటారని పక్కనున్న సీతాపురం గ్రామం వెళ్లి బడి పండులతో చదివించాడు రామయ్య.
‘‘నీ కుమార్తె పెళ్లికి సొసైటీ అప్పు తీసుకున్నావని, అది ఇంకా బాకీ ఉన్నది కనుక తీర్చమని తాఖీదు ఇది’’ అని చదివి వినిపించారు పంతులుగారు.
‘‘కాగితాలు, రశీదులు తెస్తాను బాబూ. మీరే జవాబు రాయండి’’ అని పంతులుగారిని ఒప్పించి ఇంటికి తిరుగుముఖం పట్టాడు రామయ్య. ఇల్లు చేరగానే కొడుకు గణేశ్‌ని చూసి ‘‘ఒరే ఇది చూడరా. వచ్చిన కాగితం చదవలేవు. జవాబు రాయలేవు. ఒక్కగానొక్క కొడుకువని గారాబం చేశాము. చదువుకెళ్లమంటే మారాం చేశావు. నీవు చదువుకుంటే ఈ బాధలు తప్పేవిగా. అక్షర జ్ఞానం అలవరచుకో. విద్య విలువ తెలుసుకో. ఇప్పటికైనా పక్క ఊర్లో వయోజన విద్యా కేంద్రానికి పద అక్కడ చేర్పిస్తాను. చక్కగా చదువుకో... రారా నా కన్నా’’ అని రామయ్య తన కొడుకు గణేశుని తీసుకెళ్లాడు.

- సీరపు మల్లేశ్వరరావు, కాశీబుగ్గ.
సెల్ : 7680812592.

మినీకథలు

కన్యాశుల్కం
‘‘పసిమొగ్గపై పైశాచికత్వం’’ నిత్యం దినపత్రికల్లో పతాక శీర్షికలు చదివి పళ్లు నూరాడు సత్యం.
వివరాలోకి వెళితే అమ్మాయిని మానభంగం చేసి అత్యాచారం చేశారు. ఆపైన నీళ్లట్యాంక్‌లో ముంచి చంపేసిన కామాంధుడు అంటూ వార్త. అది ఫొటోలతో పేపర్లో వచ్చింది.
అలాగే మరిన్ని క్రైం వార్తలు కనిపించాయి.
మహిళల మెడల్లో గొలుసు తెంచుకుపోయిన వార్త, ఇళ్లలో కన్నాలు వేసిన వార్త, చిట్‌ఫండ్‌ల మోసం, బ్యాంకులో తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి లోన్లు కాజేసిన వైనం, భూతగాదాలు, కబ్జాలు ఇలా అనేక వార్తలు వచ్చాయి. అందులో కొన్నిచోట్ల నేరస్తుల ముఖాలకు నల్లటి ముసుగులు వేసిన ఫొటోలు ఉన్నాయి. ఇలా ముసుగులు వేయడం వల్ల ఎవరికి ఉపయోగం? నేరస్తులు తమ గుర్తులు తెలియకుండా జాగ్రత్తపడడం, తర్వాత మళ్లీ నేరాలు చేయడం పరిపాటిగా మారిపోవడానికేనా? అనుకున్నాడు సత్యం.
ఆ రాత్రి సత్యానికి నిద్రపట్టలేదు.
ఆలోచనలు ముప్పిరిగొంటున్నాయి.
ఆధార్‌కార్డు నెంబరు బట్టి వ్యక్తుల వివరాలు నమోదు చేయడం భారతదేశమంతటా ఊపందుకుంది.
నేరగాళ్లకు ఇచ్చిన ఆధార్ కార్డు నెంబర్‌ను శాశ్వతంగా నిషేధించి, వాళ్లకి ఏ సౌకర్యాలు లేకుండా శిక్షిస్తే సమాజం బాగుపడుతుందేమో అనిపించింది సత్యానికి.
ప్రభుత్వపరంగా అందే సౌకర్యాలన్నీ నేరం చేసిన రుజువైన వాళ్లకి తీసేస్తూపోతే వాళ్లు నేరం చేసేందుకు భయపడే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు బయటికి వచ్చేటప్పుడు ఆధార్‌కార్డు నెంబరు కలిగి ఉండడం, కుటుంబ వివరాలు తెలియపరిచే విధంగా సాఫ్ట్‌వేర్ రూపొందించగలిగితే నేరాల్ని అదుపు చేయగలగడం సులువవుతుందని అనిపించింది సత్యానికి.
అలా ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకున్నాడు.
కొంతసేపటి తర్వాత మెలకువ వచ్చింది.
అరగంట సేపు వౌనంగా కూర్చున్నాడు.
తర్వాత మాగన్నుగా నిద్రపట్టింది.
మళ్లీ మరొక కల.
అమ్మాయిలు పుట్టడం మానేసి దాదాపు ఆరేళ్లవుతోంది. అమ్మాయిలు చాలక అబ్బాయిలు తమలో తామే పోటీ పడుతున్నారు. ఇంటర్నెట్‌లో అసభ్యకర చిత్రాలు, విషయాలు, ఫేస్‌బుక్, ట్విట్టర్లు అన్నీ మాయమైపోయాయి. అమ్మాయిల్ని తమ జీతంతో, ఆస్తులతో ఇంప్రెస్ చేయాలని అబ్బాయిలు తంటాలు పడుతున్నారు.
అబ్బాయిలు వందమందికి అమ్మాయిలు కేవలం నలభై మందే ఉంటున్నారు.
కన్యాశుల్కం మళ్లీ కొత్తగా పురుడు పోసుకుంది.
హఠాత్తుగా మెలకువ వచ్చింది సత్యానికి.
రాబోయే కొద్ది రోజుల్లో జరగబోయే వాస్తవం కళ్ల ముందు ప్రత్యక్షం అయినట్లు అనిపించింది.
‘దేవుడా! ఇలాగైనా నా దేశాన్ని బాగుపడనివ్వు’ అనుకున్నాడు సత్యం.

- శ్రీనివాస్‌భారతి,
శ్రీకాకుళం.

విజేత!

‘‘ఒరేయ్ విజయ్! ఇది చాలా పెద్ద కంపెనీ. మంచి జీతం. మరిచిపోకుండా ఇంటర్వ్యూకి వెళ్లు. సర్ట్ఫికెట్లు అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో ఒక్కసారి సరిగ్గా చూసుకో’’ గోపాలరావు కొడుక్కి పదేపదే జ్ఞాపకం చేయసాగాడు.
‘‘ ఇంటర్వ్యూలన్నీ అబద్ధాలే నాన్న. ఊరికే ఒక ఫార్మాలిటీ కోసం నడుపుతారు. ఎన్ని ఇంటర్వ్యూలలో చూడలేదు. అంతా అయిన తర్వాత వాళ్లకి కావలసిన వాళ్లకి ఉద్యోగం ఇస్తారు. ఇది అందరికీ తెలిసిందే కదా’’ అన్నాడు విజయ్ ఏమాత్రం ఉత్సాహం చూపించకుండా.
‘‘ ఈసారి వాళ్లకి కావలసినవాడు, రికమెండేషన్ ఉన్నవాడివి నువ్వే’’ అని తండ్రి అనగానే ఒక్కసారిగా షాకయ్యాడు విజయ్.
‘‘అవున్రా ఆ కంపెనీ మేనేజర్‌గా క్లాస్‌మేట్, మంచి ఫ్రెండు. బాగా తెలిసినవాడు. ఆ ఉద్యోగం నీకే అని చెప్పాడు. అందువల్ల ధైర్యంగా వెళ్లు’’ అన్నాడు గోపాలరావు కొడుకు భుజం తడుతూ.
ఆశ్చర్యంగా ఇంటర్వ్యూలో తనకి అన్నీ తెలిసిన ప్రశ్నలే అడిగారు. అందువల్ల అన్నింటికీ టకీమని జవాబులు చెప్పాడు విజయ్.
‘‘యు ఆర్ అపాయింటెడ్ మిస్టర్ విజయ్. ఎప్పుడొచ్చి జాయినవుతారు?’’ అడిగాడు ఆ కంపెనీ మేనేజర్.
‘‘రేపే జాయినవుతాను సార్’’ అని చెప్పి తండ్రి దగ్గరకి వచ్చి ‘‘మీ ఫ్రెండుకి కృతజ్ఞతలు చెప్పండి నాన్నగారు’’ అన్నాడు సంతోషం పట్టలేదక.
‘‘నాకెలాంటి ఫ్రెండూ లేడురా’’ అని తండ్రి చెప్పగానే విజయ్‌కి ఏమీ అర్ధం కాలేదు’’.
‘‘ఇన్ని రోజులూ నువ్వు ఆ ఉద్యోగం నాకెలాగూ రాదు అన్న ఒక అపనమ్మకంతో ఇంటర్వ్యూకి వెళ్లేవాడివి. దానికి తగ్గట్టుగానే సరిగ్గా సమాధానాలు చెప్పలేకపోయే వాడివి. ఈసారి మాత్రం ఆ ఉద్యోగం నీకే అన్న నమ్మకంతో వెళ్లావు. గెలిచావు. నేను అనుకున్నవి కరెక్టే అని నిరూపించావు’’ అని తండ్రి చెబుతుంటే ఆశ్చర్యంతో వినసాగాడు విజయ్.

- వసంతకుమార్ సూరిశెట్టి,
నెల్లిమర్ల, విజయనగరం,
సెల్ : 8297191810.

పుస్తక సమీక్ష

భావ కవితల నైవేద్యం

ఆత్మలో మమతల వనం నవనవలాడింది అక్షరామృత ఆస్వాదనలో మానవత్వపు విశ్వరూపం ఆవిష్కృతమైంది. సర్వులకు చిరునవ్వు కన్నీళ్లు ఒక్కటే యని ఆ భావ సమైక్య మైకమే నన్ను మనిషిని చేసింది. అంటూ బుద్ధికి జల్లెడ పట్టే జన హృదిని స్పృశించే ఏభైఏడు కవితల్ని ‘నైవేద్యంగా’ ఆవిష్కరించారు శ్రీమతి ఎస్ సుమత్రాదేవి. ఎంతో జీవితానుభవం గలిగిన చేయి తిరిగిన రచయిత్రిగా తన రెండవ కృతిగా మధుర మంజుల, భావరంజిత, కావ్యాన్నందించారు. ఆకాశవాణిలో కవి సమ్మేళనాలలో, ప్రముఖ పత్రికలలో వెలుగుచూసినవే. ఇందలి కవితలు, అవార్డులెన్నో అందించాయి. విదుషీమణి ఉపాధ్యాయురాలైనందున కవిత్వంలో స్పష్టత, క్లుప్తత, గుప్తతలతో పాటు మానవ మస్తిష్కానికి పదునుపెట్టేవిగా రూపొందించబడ్డాయి.
అక్షరంలో అద్భుతమైన సౌందర్యం ఉంది, అచంచల శక్తి ఉంది. అనంత విశ్వం ఉంది. జ్ఞానోద్దీపనను రగిలించే భావం అక్షరమైంది అని అక్షర వలువను వెలువరించి అక్షరంపై ఆత్మీయతను ప్రకటించడంలో అక్షరం, అక్షౌహిణీల సేనా బలంకన్నా మిన్నయన్న భావాన్ని ధ్వనింపజేశారు.
‘నయనం’ సున్నితత్వాన్ని ఇముడ్చుకున్న హృదయం, చైతన్యం కోల్పోతున్న మరో దేహానికి, కొత్త చిగురు వేస్తుందంటే, నిరభ్యంతరంగా బహూకరించండి, అప్పుడు కాశీ గంగలో అస్థికల్ని ముంచినంత ఫలం, అంటూ అంధులకు బంధువై ఆసరాయై, అభ్యర్థించడం, ఆహ్వానించదగింది.
నేడు చెట్టు, గట్టు, పువ్వు, పండు, నవ్వు, అన్నీ రసాయన పూతలే అదృశ్యపు సాలెగూడులో చిక్కుకున్న ప్రగతి మనది, ప్రవరాఖ్యుని కాలి లేపనంలా కరిగిపోతోంది. ఈ దిశలో మనిషిని మనిషిగా బతికించగల యుగకర్తలు వైతాళికులు కావాలి, రావాలి అనడం గమనించదగింది.
నిజం కాదా! కవితలో నేడు గాలికి కొట్టుకుపోయి, ఎగిరెగిరి వచ్చాయి ముదనష్టపు ఫ్యాషన్ల గుడ్డలు కురుచ బట్టలు అందాలట, నీటి తెరల్లాంటి పారదర్శక పొరలు వేసుకు తిరుగుతూ, అందాల్ని ఆరేస్తుంటే, కీచకులు పుట్టుకురావచ్చు, నీ దుస్తులే నీకు శ్రీరామరక్ష, అంటూ నేటి యువతులకు (యువతే-రచయిత్రి) సందేశం ఓ కనువిప్పు, ఓ మెరుపు పలుకు, ఓ హెచ్చరిక తునక, ఓ సున్నితపు సైగ.
నేడు ఉమ్మడి కుటుంబాల గూడు చెదరడంతో, మహిళ భద్రత, ఎడారిలో మంచుముద్ద, ప్రపంచీకరణ విపణిలో ‘స్ర్తి’ ఒక విలాస వస్తువు, అంతర్జాలంలో నగ్న ప్రదర్శనలు అంటూ వెర్రి పోకడలను నిరశిస్తూ ఖండిస్తారు.
ప్రేమంటే వెనె్నల మాధుర్యం, వసంతపు ఝంకారం, ఎదలో కదిలే వేణుగానం, గుప్పెడు గుండెలో ఒదిగిన ప్రణయ సాగరం అనడంలో వలపుల సడి, మాధుర్య జీవితాల ఒడి, పూపరిమళాల సందడి సమైక్యమై దర్శనమిస్తాయి.
చాలా కవితల్లో సున్నితపు సూచనల వాతలు. సోమరితనం తగదని యువతకి హెచ్చరిక, అత్యాచారాల నెదిరించే నినాదం, ఆక్రోశం, వాస్తవ జగత్తులో నడవాలనే ఆకాంక్ష, కాలుష్యపు కాట్లకు ఛీత్కారాలు, స్వచ్ఛ భారత్‌కి స్వాగతం, అంధకారంలో మగ్గిన బడుగులకు వెలుగుల గొడుగులు దురాగతాలనంతం చేయాలన్న గర్జన, అక్షరానికి అంజలి ఘటింపులతో వైవిధ్యభరిత వస్తు విశే్లషణలతో రమ్యంగా సాగిందీ కావ్యం. సుమితా దేవిని అభినందిద్దాం.

- చెళ్లపిళ్ల సన్యాసిరావు
సెల్ : 9293327394

మనోగీతికలు

ప్రేమా! వర్ధిల్లు
ప్రేమా... నీకో నమస్కారం!
నువ్వు వరిస్తే పెద్దల నుండి వస్తుంది తిరస్కారం
అయినా నువ్వంటే మమకారం
ఏమిటో ఎవరికీ అంతుపట్టదు నీ వ్యవహారం
సృష్టించిన బ్రహ్మనీ, జన్మనిచ్చిన వారిని
ఎదిరించేలా చేస్తావు!
ఆకలి, నిద్ర, రంగు, రుచి, రేయి, పగలు, గాలి, వాన
వేటికీ తలవంచవు... మంచిచెడ్డలు ఎంచవు!
సంతోషాన్ని ఇస్తావు సమస్యలను సృష్టిస్తావు!
యుద్ధాలు, మారణహోమాలకు నీవు ఆలవాలం
అయినా నీపై తగ్గదు ఎవరికీ వ్యామోహం!

- కాళ్ల గోవిందరావు,
జె. నాయుడు కాలనీ,
ఆముదాలవలస-532185.
సెల్ : 9550443449.

ఓ నా అందాల భరిణ!
చక్కనైన ముఖారవిందం ఆకట్టుకుంది నన్ను అమితంగా
కలువలాంటి కనులు దేదీప్యమానంగా వెలుగుతూ
ఆకర్షించాయి నన్ను అలవోకగా
విల్లంబుల వోలె ఒంగిన అధరాలు రారమ్మని
నను ఆహ్వానించాయి గాఢ ఛుంబన కోసం
మంచువోలె ముత్యాంలా మెరిసే నునువైన చెక్కిళ్లు
స్పర్శించమంటూ తహతహలాడుతున్నాయి
గాఢ పరిష్వంగన కోసం మనసు ఉవ్విళ్లూరుతోంది
అందాలలొలికే నీ నడుము దగ్గరకు తీసుకోమంటుంది
ఆప్యాయతల సందడి చేయమంటోంది
అందమైన నీ సోయగాలు ఊరిస్తున్నాయి నన్ను
నీ ప్రేమ ఆప్యాయతలు చేరువ కమ్మంటున్నాయి
నీ జ్ఞాపకాలు ఉత్తేజాన్ని ఇస్తున్నాయి
నీ సన్నిధే నాకు పెన్నిధి అని
మేని పులకిస్తోంది

- మల్లారెడ్డి రామకృష్ణ, బుడితి-532427,
సారవకోట మండలం, శ్రీకాకుళం జిల్లా.
సెల్ : 8985920620.

వృథా వద్దు!
నాటికీ నేటికీ ఏ నాటికీ
ముమ్మాటికీ నానాటికీ
నీటి కోసం కటకటలు
నీటి కోసం విధ్వంసాలు
జలవనరులకై కొట్లాటలు
బోరుబావులతో
భూమాత హృదయానికి తూట్లు
ఎడాపెడా ఎగాదిగా
నీరు పారబోసే వృథా వద్దే వద్దు
తరువులను పెంచు
ఒక్కొక్క వర్షపు చుక్క
ఒడిసి పట్టుట ముద్దు
భావితరాలకై దాచుట కద్దు!

- కొంకేపూడి అనూరాధ,
విజయనగరం.
సెల్ : 9618425243

బాలకార్మికుడు
పేదరికమో, పరిస్థితుల ప్రభావమో
కారణం తెలియదు కానీ
పుట్టుకొస్తాడు బాలకార్మికుడు
బడిలో ఉండాల్సిన వయసులో
బాలలు పనిలో ఉండడం
సిగ్గుచేటు విషయం
బాలకార్మిక వ్యవస్థను
సమూలంగా నిర్మూలించాలి
ఆ దిశగా పోరాటం సాగిస్తున్న
కైలాష్ సత్యర్థి మనందరకు
స్ఫూర్తి కావాలి
ఒక్కరే పోరాడితే గెలవలేం మనం
సంఘటితంగా యుద్ధం చేస్తే
గెలుస్తాం ఇది నిజం

- నాగాస్త్రం నాగు,
వడ్లపూడి, విశాఖపట్నం.
సెల్ : 99660 23970.

ఎదగాలంటే ఒదగాలి
అతడు అమితమైన హు‘షా’రుతో
తిరుగులేని బావుటా ప్రతి రాష్ట్రంలో
ఎగరేద్దామని ఎడతెరిపి లేని విశ్వాసంతో
పావులు కదుపుతుంటే
ఆవులు అకారణంగా అడ్డొచ్చాయి
కుడి భుజంపై ‘అతి’ భుజంగం
పడగవిప్పి కాటేస్తే
అడగడానికి విపక్షీయులూ
కడగడానికి అవకాశవాదులు
గొంతెత్తి, వింత రీతుల్లో నిరసన
అత్యధిక మెజారిటీ మోదంలో
ప్రమాద ఘంటికలు మోగిన వైనం కానరాక
క్రోధం విభేదమై ఎన్నికల ఫలితాలు ఖేదమై
గెలుపు మత్తుకు ఒక అప్రమత్త కొరఢా
తమలో మతంలో అభిమతంలో
ఒక నిశిత పరిశీలన... విశే్లషణ అవసరమైంది
దేహభాష సందేహ ఘోష అయినప్పుడు
గర్వం సర్వ నాశనానికి మూలమై మొలకెత్తుతుంది
ప్రజా పరిపాలనలో కావల్సినవి
పరమతాల మధ్య సభ్యత
దైనందిన అవసరాల లభ్యత!

- జోగారావు గుండాన, శ్రీసాయినగర్ కాలనీ,
సింహాచలం పోస్టు, విశాఖపట్నం - 530028.
సెల్ : 9490185708.

email: merupuvsp@andhrabhoomi.net

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) ఎడిటర్, మెరుపు, ఆంధ్రభూమి దినపత్రిక, సెక్టర్-9, ఎం.వి.పి.కాలనీ, విశాఖపట్నం-17. అనే చిరునామాకు పంపండి. email: merupuvsp@andhrabhoomi.net ఇ-మెయల్‌కు పిడిఎఫ్‌లో పంపించవచ్చు.

- యల్. రాజాగణేష్