విశాఖపట్నం

సమయస్ఫూర్తి (కథానిక)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలేజీ క్యాంపస్‌లో అడుగు పెట్టింది మధువని. ఆకాశంలో మేఘాలు విడిపోయి నిర్మలంగా ఉన్నా ఆమె మనసు మాత్రం దట్టంగా అలుముకున్న నిశిరాత్రిలా ఉంది.
‘‘హాయ్ మధూ! అబ్బ ఎన్ని రోజులయిందే మనం కలుసుకుని. ఈ వర్షం, మన సెలవులు అన్నీ కలసి మనల్ని దూరం చేసాయి’’ మధువని భుజం మీద చేయి వేసి ఆప్యాయంగా అంది సుష్మిత.
వౌనంగా ఉండిపోయింది మధువని.
‘‘ఏంటే మధూ ఏంటా వౌనం? ఎందుకలా ఉన్నావ్? ముఖం పీక్కుపోయింది, కళ్లు మందారాల్లా ఉన్నాయి. ఒంట్లో బాగులేదా?’’
‘‘ఏం చెప్పమంటావే’’ బాధగా అంది మధువని.
‘‘ ఏమయిందేం?’’ రెట్టింపు ఆతృతతో అడిగింది.
‘‘అదే లేవే. స్మితా ఏ బెరుకు లేకుండా మనం రోడ్డు మీద హాయిగా తిరిగే రోజు వస్తుందంటావా?’’ అక్కడే ఉన్న సిమెంటు బెంచీ మీద కూర్చుంటూ అంది మధువని.
‘‘నీకొచ్చిన కష్టం ఏంటమ్మా’’ అప్పుడే అక్కడికొచ్చిన మనస్విని అంది ఆమె పక్కనే కూర్చుంటూ.
‘‘అద్గదీ అలా అడుగు’’ అంది అప్పుడే అక్కడికొచ్చి భుజానికున్న బ్యాగు ఒళ్లో పెట్టుకుని మనస్విని పక్కనే కూర్చుంటూ వౌనిక.
‘‘దానె్నందుకే అలా పీక్కు తింటారు? అసలు కారణం ఏంటో అడగొచ్చు కదా’’ సానుభూతిగా అంది సుస్మిత.
మధువని, సుస్మిత, మనస్విని, వౌనిక మంచి స్నేహితులు. ఒకే దగ్గర చదువుకుంటున్నారు.
‘‘చెప్పు తల్లీ నీ బాధేంటో’’ అన్నారు ముక్తకంఠంతో.
‘‘ఇప్పుడు కొత్తగా వచ్చిన బాధ కాదిది. ఈరోజు ప్రత్యేకంగా ఎదుర్కొంటున్న సమస్యా కాదు’’ అంటూ ఆగింది.
‘‘మరి’’ అంది వౌనిక.
‘‘అదేలేవే! ఆ కిశోర్‌గాడు లేడూ! వాడి పీడ ఎలా వదిలించుకోవాలా అని’’ బాధగా అంది మధువని.
‘‘మళ్లీ ఏం చేసాడేమిటి?’’ పళ్లు కొరుకుతూ అంది మనస్విని.
‘‘అదేనే ఆరోజు ఏదో పాట పాడుతూ వెంటపడ్డాడు. చెప్పాను కదా. నాలుగు రోజుల కింద మళ్లీ ఏదో అసహ్యంగా వాగాడు. వాడి పీడ ఎలా వదులుతుందో. ఈ నాలుగు రోజులు సెలవులు కదా. ప్రాణం హాయిగా ఉందనుకో. కాని ఇలా ఎన్నాళ్లు?’’
‘‘అవునే అదీ నిజమే’’ అంది వౌనిక.
‘‘అవును మరి! పసి నిమ్మపండులాంటి ఛాయ, దోర జామపండులా, ఆహా కాదుకాదు కాశ్మీర్ ఆపిల్లా అలా మెరిసిపోతున్న నిన్ను చూస్తే నాసామి రంగా ఆడదాన్ని నాకే కొరికేయాలనిపిస్తోంది. ఇంక రోమియోల సంగతి చెప్పేదేముంది?’’ మధువని బుగ్గలు సాగదీస్తూ అంది సుస్మిత.
‘‘ఏయ్ నీ కుళ్లు జోకులు ఆపవే. ఇంకా ఎక్కువ వాగావంటే పీక పిసికి చంపేస్తా’’ సుస్మిత మెడ దగ్గర చెయ్యి వేసి అంది మధువని చిరుకోపం అభినయిస్తూ.
కిలకిలా నవ్వారంతా.
‘ఈ సమస్యని ఎలా ఎదుర్కోవాలో దీర్ఘంగా ఆలోచిస్తున్నా. నా చదువుకి ఎంతో ఖర్చు పెట్టి, బోలెడు ఆశలు పెట్టుకున్నారు మా నాన్న. అమ్మ తన సరదాలు, సంతోషాలు, నా కోసం త్యాగం చేస్తుంది. ఇంకా తమ్ముడు, చెల్లాయి చదువులు ఉండనే ఉన్నాయి. ఈ సమస్య గురించి ఆలోచిస్తుంటే ఒక్కొక్కసారి ఛస్తే బాగుండుననిపిస్తోంది’’ కన్నీరు పెట్టుకుని అంది మధువని.
‘‘నీ ముఖం కాదూ! నీ గురించి మీ నాన్న పెట్టిన ఖర్చు, నీ మీద పెట్టుకున్న ఆశలు ఏం కాను?’’ మెత్తగా మందలించింది వౌనిక.
‘‘అవునే మధూ! ప్రతి సమస్యకి చావే పరిష్కారం అనుకుంటే ప్రపంచం శ్మశానమైపోదూ. ఏదీ నాకు మాటివ్వు ఎలాంటి అఘాయిత్యం చెయ్యనని’’ చెయ్యి చాపుతూ అంది మనస్విని.
ఆరోజు కాలేజీ అవర్స్ అయిపోయాక ఎవరి మటుకు వాళ్లు వెళ్లిపోయారు.
* * *
‘‘హాయ్ మనీ... ఈరోజు తప్పకుండా నీ అభిప్రాయం చెప్పాలి డియర్. ఇంక నేను తట్టుకోలేను. అసలు నువ్వు కాబట్టి ఇంత కాలం ఓపిక పట్టాను. అదే ఇంకో పిల్ల అయుంటేనా? ఎందుకులే ఆ సీను నీ ముందు’’ హఠాత్తుగా రోడ్డు మీద కనబడి ఇలా అడిగేసరికి భయపడిపోయింది మధువని.
‘అసలు ఆ సంబోధన ఏమిటి? ఆ భాషేంటి? మనీ అట మనీ. పిచ్చివెధవ’ తనలో తానే గొణుక్కుంది మధువని.
‘‘అసలు నీ అభిప్రాయం ఏంటే? చాలాసార్లు నా అభిప్రాయం చెప్పాను. ఉలకవు, పలకవు. ఇక లాభం లేదు రంగంలోకి దిగిపోవలసిందే’’ బైకు దిగుతూ అన్నాడు.
అతని మాటకి హడలిపోయింది మధువని. ‘నిజమే ఏం చేసినా చేస్తాడు ఈ మొరటు మనిషి. వీడిని మోసం చేసి తప్పించుకోవాలి కాని ఎదురు తిరిగి కాదు’
‘‘ఏంటే ఆలోచిస్తున్నావు’’ ఆమె తోవకు అడ్డు వస్తూ అన్నాడు.
‘‘అదే లేవోయ్ ఆలోచిస్తున్నా. ఎలాగూ ఇన్నాళ్లు ఆగావు. ఒక్క రెండు రోజులు ఆగలేవూ’’ ప్రేమ నటిస్తూ అంది.
‘‘ఆగి’’ అన్నాడు ఇంత కాలానికి బదులు చెప్పిందని సంబరపడుతూ.
‘‘నీ దగ్గరకొచ్చి నీ ఒళ్లో వాలడం నా వంతు. ఆ తరువాత ఏం చేస్తావో అది నీ వంతు’’ అంది చిలిపిగా చూస్తూ.
‘‘యాహూ! రియల్లీ వాటె సర్‌ప్రైజ్? ఇది కలా నిజమా?’’
‘‘ఇదేనా ఇంకా చూస్తావు నా ప్రేమని’’ అంది.
‘‘హాయ్ స్వీటీ, ఎంత ముద్దుగా ఉన్నావే. బైకెక్కు అలా అలా ఎక్కడికైనా తిరిగొద్దాం’’ అన్నాడు.
‘‘అదే తొందరంటే. అప్పుడే అలాంటివి వద్దు. నేను చెబుతానుగా’’ అంది.
‘‘సరే అయితే’’ అని బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్లిపోయాడు.
* * *
దూరం నుండి చూసాడు కిశోర్ మధువనిని. ఎవరితో మాట్లాడుతూ వస్తోంది. ‘రానీ అడుగుతాను వాడెవడో’ అప్పుడే ఆమె తన సొంతం అయిపోయినట్లు అనుకున్నాడు.
మధువనితో వచ్చిన ఆ వ్యక్తి ఆటో ఎక్కి వెళ్లిపోయాడు.
‘‘హాయ్ కిశోర్ ఎంత సేపు అయింది నువ్వు వచ్చి’’ అతనికి దగ్గరకి వెళ్లి ప్రేమ నటిస్తూ అడిగింది మధువని.
‘‘ఇప్పుడే అయిదు నిముషాలు అయింది గానీ ఎవడు వాడు’’ అప్పుడే అతనిలో అసూయ.
‘‘ఎవడో గొట్టంగాడులే. మా ఊరు నుండి వచ్చాడు. అలా ఊరెళ్లిపోతూ కలిసాడు. వాడో జిడ్డుగాడు. ఆ సంగతి ఎందుకు గాని మనం నెక్స్ట్ సాటర్‌డే ఎటైనా వెళదామా ప్లీజ్’’ ముద్దు ముద్దుగా అడిగింది.
‘‘తప్పకుండా’’ హుషారుగా అన్నాడు కిశోర్.
అప్పుడే బస్సొచ్చింది.
‘‘బై కిశోర్ బస్ వచ్చేసింది’’ అంటూ పరుగు పెట్టింది. ఆ హడావుడిలో ఆమె చేతిలోంచి ఓ పొడవాటి కవరు జారి కింద పడిపోయింది. బస్ వెళ్లిపోయింది.
కిశోర్ చూసాడు ఆ కవర్‌ని.
‘అరె కవరు కింద పడిపోయింది. ఈసారి కలిసినప్పుడు ఇద్దాం’ అనుకున్నాడు.
కవరు చూస్తూ ‘ఇందులో ఏముందో చూస్తేనో. ప్రేమలేఖా’ మనసు తొందర చేసింది.
కొన్ని మెడికల్ రిపోర్టులు, ఉత్తరం ఉన్నాయందులో.
ఉత్తరం చదవసాగాడు.
‘డియర్ కార్తీక్
ఈ విషయం నీకెలా చెప్పాలో తెలీడం లేదు. నాలుగు క్షణాలు నేను కనబడకపోతే తట్టుకోలేవు. మరి జీవితాంతం నన్ను వదలవలసి వస్తే ఏం చేస్తావ్? మన ప్రేమని చూసి భగవంతుడు అసూయపడ్డాడు. అందుకే నాకీ భయంకరమైన రోగం అంటగట్టాడు. ఎలా వచ్చిందో నాకు తెలియదు. ప్రాప్తం ఉంటే మరు జన్మలో కలుసుకుందాం. దీనిలో రిపోర్టులు ఉన్నాయి. చూసి తట్టుకోవాలి మరి తప్పదు.
- నీ ప్రేమని పొందలేని, నీకేమీ కాని మధువని.
‘అమ్మ రాక్షసీ నీ మనసులో ఇంత కుట్ర ఉందా? నిన్ను నమ్మి ఆరోజు బైకు మీద నిన్ను తీసుకెళ్లలేదు. నన్ను నిలువునా బంగాళాఖాతంలో ముంచేసేదానివి కదా. నీకో సలాం. నీ అందానికో సవాలక్ష సలాములు. నాకు కావలసింది ఆడది. నీలాంటి అందమైన రోగిష్టి కాదే’ బైక్ స్టార్ట్ చేసుకుని అక్కడి నుండి వెళ్లిపోయాడు.
* * *
‘‘ఆ కిశోర్ గాడి పీడ విరగడ అయిపోయిందా? ఎలా?’’ అడిగారు మధువని స్నేహితురాళ్లు.
‘‘చెబుతా వినండి’’ అంటూ తనకు ఎయిడ్స్ వచ్చినట్లు రిపోర్టులు పుట్టించడం, అందులో ఒక ఉత్తరం రాసి పెట్టడం, దానిని బస్టాప్‌లో జారవిడవడం, దానిని కిశోర్ చదివి భయపడిపోయి తన జోలికి రాకపోవడం గురించి అంతా వివరంగా తెలిపింది మధువని.
‘‘బాగుంది. కానీ అంతా నీకు నిజంగానే ఎయిడ్స్ అనుకుంటే’’
‘‘అనుకోనీ బాధేం ఉంది. ఆ రిపోర్టు తయారు చేయించిందీ, ఆ లెటర్ రాసిందీ మా బావే కదా’’ అంది మధువని.
అంతా హాయిగా నవ్వుకున్నారు.

- శివానీ, శృంగవరపుకోట-535145.
ఫోన్ : 08966266384.

మినీకథ

మార్పు

ఆ ఆఫీసులో పిల్లికి బిచ్చం పెట్టని వాడెవడంటే పాపారావు పేరు వినిపిస్తుంది. ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలని వాడెవడంటే పాపారావేఅంటారంతా. సదరు పాపారావు ఆ కార్యాలయంలో పదిహేనేళ్లై జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. కడుపు కట్టుకుని పైసాపైసా కూడబెట్టడం అతడి ప్రవృత్తి. ఎప్పుడు చూసినా ముతక బట్టలతో జిడ్డుగా కనిపిస్తాడు. ఏనాడూ యూనియన్‌కి పది రూపాయలు చందా కట్టిన పాపాన పోలేదు. ఎవరేమన్నా పట్టించుకోడు. బాధ్యతలేవైనా ఉన్నాయా అనుకుంటే పిల్లాపీచూ లేరు. వచ్చిన జీతంలో మూడొంతులు వెనకేసి మిగిలిన దాంతోనే సరిపెట్టుకుంటాడు. ఆలశ్యంగా ఆఫీసుకొచ్చి అధికారి చేత చీవాట్లైనా తింటాడు గానీ బస్సులో మాత్రం రాడు.
‘‘ ఉన్నవాళ్లంతా అనుభవించలేరు. తినడానికైనా, కట్టుకోవడానికైనా యోగం అనేది ఒకటుండాలి’’ అన్నాడు సుబ్బారావు ఆ రోజు జరిగే ఫేర్‌వెల్ పార్టీకి కంట్రిబ్యూషన్ ఇవ్వలేదన్న ఉక్రోషంతో.
‘‘ ఎవరిని గురించి నువ్వనేది? మన పాపారావు గురించేనా?’’ అడిగాడు అతడితో సన్నిహితంగా మెలిగే జగన్నాథం.
‘‘ ఇంకెవరు? సాక్షాత్తు మన పాపారావు’’ కసిగా అన్నాడు సుబ్బారావు.
‘‘అతడి నైజం తెలిసుండి కంట్రిబ్యూషన్ ఇమ్మని అడగడం మనదే బుద్ధి తక్కువ’’
‘‘్ఛ... డబ్బే పరమావధిలా ఉంది అతడికి. సిగ్గూసెరం లేదు... థూ’’ ఉమ్మినంత పని చేసాడు సుబ్బారావు.
‘‘అతడిలో మార్పు తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తా’’ అన్నాడు జగన్నాథం.
‘‘అది నీకీ జన్మకు సాధ్యం కాదు. వాడిని గాని మార్చగలిగితే నీకు గ్రాండ్ పార్టీ ఇస్తాను’’
‘‘సరే పార్టీ ఇవ్వడానికి సిద్ధంగా ఉండు’’ అంటూ అక్కడి నుండి వెళ్లిపోయాడు జగన్నాథం.
వారం రోజుల తర్వాత...
నిగనిగలాడే కొత్త దుస్తులతో ట్రిమ్‌గా తయారై ఆఫీసుకొచ్చాడు పాపారావు.
ఆరోజు అతడి గెటప్ చూసి స్ట్ఫాంతా విస్తుపోయారు.
‘‘సుబ్బారావుగారూ! మొన్న పార్టీకి కంట్రిబ్యూషన్ ఇద్దామనుకుంటే సమయానికి జేబులో డబ్బులు లేకుండా పోయాయి. పాపం మీరే పెట్టుకున్నట్లున్నారు. ఐయామ్ సారీ ఇదిగో వంద... అన్నట్లు యూనియన్ చందా రెండొందలు కదూ! తీస్కోండి’’ అంటూ జేబులోంచి మూడు వంద రూపాయల కొత్త కరెన్సీ నోట్లు తీసిచ్చాడు పాపారావు.
ఈమారు ఆశ్చర్యపోవడం సుబ్బారావు వంతయింది.
‘‘జగన్నాథం! నువ్వే మంత్రం వేసావో గాని సడన్‌గా మారిపోయాడు మన పాపారావు. ఇవాళ అడక్కుండానే అసోసియేషన్‌కి రెండు వందలు కట్టేసాడు’’ అన్నాడు సుబ్బారావు క్యాంటీన్‌లో కాఫీ తాగుతూ.
‘‘నాకు ఇస్తానన్న పార్టీ మరచిపోయావు గనక’’ గుర్తు చేసాడు జగన్నాథం.
‘‘ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను లేవోయ్. ఇంతకూ తనలో నువ్వెలా మార్పు తీసుకురాగలిగావో ముందది చెప్పు’’
‘‘సరే చెబుతాను విను’’ అంటూ నోరు విప్పాడు జగన్నాథం.
ఆత్రంగా చెవులు రిక్కించాడు సుబ్బారావు.
* * *
ఆరోజు సాయంత్రం జగన్నాథం పాపారావుని వెంటేసుకుని బీచికెళ్లాడు.
‘‘ ఇదిగో పాపారావు చెప్పడం మరిచాను చూసావా నా రిస్టు వాచీ ఎలా ఉంది?’’ సూపర్బ్‌గా ఉంది కదూ! ఇలాంటి వాచీ పెట్టుకోవాలన్న కోరిక ఎప్పటి నుండో ఉండేదోయ్. అందుకే రెండు వేలైనా తెగించి కొనేసాను. ఇలాంటి చిన్నచిన్న సరదాలు ఇప్పుడు కాకపోతే మరెప్పుడు చెప్పు. మన దేశంలో యావరేజీ లైఫ్‌స్పాన్ అరవై ఏళ్లని సర్వేలు వెల్లడిస్తున్నాయి. మనం నాలుగు పదులు ఎప్పుడో దాటిపోయాం. మహా బతికితే మరో పది పదిహేనేళ్లు. దాని కోసం కడుపు కట్టుకుని సరదాలు మానుకోవడం దేనికి? మనం పోతే మనం కూడవేసిన డబ్బు కోసం నేనంటే నేనని ఎంతో మంది వస్తారు. సంపాదించడం మన వంతైతే అనుభవించడం వాళ్ల వంతవుతుంది. జీవితంలో ఏం అనుభవించినా యాభై ఏళ్లలోపే. ఆ తర్వాత తిందామన్నా అరగదు. వంటి మీద బట్ట నిలవదు. వయసులో ఉన్నప్పుడు సరదాలు మానుకుని పైసాపైసా కూడబెట్టమని ఎవరు చెప్పారు?’’ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించినట్లు ఉపదేశించాడు జగన్నాథం.
అంతే, ఉన్న పళంగా మారిపోయాడు పాపారావు.

- డి.వి. రావు, విజయనగరం-2.
సెల్ : 9666991929.

పుస్తక సమీక్ష

ప్రేరణాత్మకం కవిత్వోదయం

కవిత్వం రాయాలంటే ఎంత కష్టమో పద్మవ్యూహంలో చిక్కిన అభిమన్యుడు లాంటి స్థితి అని చిత్రీకరించడంలో కవి వాస్తవాన్ని హృద్యంగా మన ముందుంచారు. ఒక ఖండికలో నేటి పిల్లలు హాస్టళ్లలో, పెద్దలు వృద్ధాశ్రమాల్లో అంటారు. మనుషులు కేవలం శరీరధారులు మాత్రమే. హృదయాలు బండబారినాయనడం అక్షరసత్యం. నేటి దుస్థితిని కళ్లకు కట్టారు.
పది తలలతో, ఇరవై కళ్లతో నాటి రావణుడు ఒక సీతనే చూసాడు. ఒక్క తలతో రెండు కళ్లతో నేటి రోమియో ఇరవై మందిని చూస్తున్నాడు. నేటి రోమియోలు పుష్పాలతో ఆమ్లవర్షాలు కురిపిస్తున్నారంటూ వాస్తవానికి అద్దం పట్టే సన్నివేశాలను చిత్రపటములో చిత్రీకరించిన రీతిగా తన కవితల్లో పొందుపరిచే ఎల్. ఆర్. వెంకటరమణ కవే కాకుండా గొప్ప చిత్రకారుడు, విద్యాధికారి, అధ్యాపకుడు అనంతపుర నివాసి. గురుతర బాధ్యతనొక వంక వహిస్తూ, పలు సంస్థల కార్యదర్శిగా సవ్యసాచిలా సేవలందిస్తూ తన కవిత్వం కవిత్వోదయంతో తెలుగు పాఠకుల ముందుకు వచ్చారు. చిత్రకారుడిగా అనేక అవార్డు కైవసం చేసుకుని తెలుగు భాషా సేవలో ఉద్యమించడం ముదావహం, అభినందనీయం. వారి కవిత్వం అటు చిత్రకళతో పోటీ పడుతూ కదం తొక్కింది. కవిగా నిలిపింది. పాఠక లోకానికి స్ఫూర్తినందించింది. యువ కవులకు ప్రేరణనిచ్చే ఊపిరిని అందించింది.
‘సృష్టికార్యం ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతనిచ్చింది. ఇందులో ఉచ్ఛనీచ భేదాలు లేవు అంటున్న’ గర్భం నుండి గర్భం దాకా’ అన్న కవితలో వెలిబుచ్చిన భావం గొప్ప తాత్విక చింతనతో కూడిన బరువైన భావం, వేదోపనిషత్ పురాణాల సారమంతా అందులో ఉంది. ఇది గమనార్హం, ప్రసంశాపాత్రం. ఇదే భావాన్ని ‘తెలుగులెంక’ కీర్తిశేషులు తమ్ముల సీతారామమూర్తి పంక్తులతో సరితూగాయి. కవి కవిత్వ భావసారాన్ని వ్యక్తం చేస్తాయి.
‘కలమెత్తిన, హలమెత్తిన, మలమెత్తినవాని నొక్కయై చూడవలెన్, అలతియు, నలతియు లేదిట, పలు వృత్తులు సాగునపుడే బ్రతుకులు సాగున్’ అంటారు. ‘తల దించవద్దు పదపద, పైపైకే కావాలి నీ గమనం’ అన్న పంక్తుల్లో శ్రీశ్రీ కవితా పంక్తులు స్మరణకు వస్తాయి. ఉత్సాహాన్ని నింపుతూ యువతని ముందుకు నడిపిస్తాయి.
హస్తకర్ణ భూషణం నేటి సెల్, నిజాలనే కాదు అబద్ధాలను అవలీలగా మోసేస్తుంది. పక్కనే ఉంటూ ఎక్కడో ఉన్నట్లు చెప్పిస్తుంది. సెల్‌లోనే నేడు స్వర్గ, నరకాలే కాదు త్రిశంకు స్వర్గం కూడా కనబడుతుంది. నేటి స్థితిని రుజువు చేస్తుంది.
‘అంగుష్ట మాత్రం’ కవితలో అర్జునుని ఆకాశానికెత్తడం కోసం ఏకలవ్యుని పాతాళానికి నెట్టడం’ అంటున్న వాస్తవం బడుగు బతుకుల బానిసత్వంపై ధనికోన్నత వర్గ పెత్తనం సాక్షాత్కరిస్తుంది.
సమాజ రుగ్మతలు, అబలలపై అత్యాచారాలు, వారి ఆక్రందనలు మున్నగు విషయాలను 21 కవితల్లో కనబరిచారు. సినారె వంటి ప్రముఖులు ముందు మాట రాసి పుస్తకానికి వనె్న పెంచారు. కవినభినందిస్తూ మరిన్ని కావ్యాలను అందించాలని ఆకాంక్షిద్దాం.
ప్రతులకు 9866158908 నెంబరులో సంప్రదించగలరు.

- చెళ్లపిళ్ల సన్యాసిరావు,
సెల్ : 9293327394.

మనోగీతికలు

ఎదురుచూపు!
నేనొక ఆవేశపు నగ్న ప్రవాహాన్ని
స్వేచ్ఛగా ఎగసి
ప్రవహించనివ్వండి
పత్తి వత్తిని ఖడ్గాన్ని చేసి
మరుమల్లె అత్తర్ల చమురు పోసి
రాలిన అకాలపు పిడుగుల్లో
మెరుపుతీగ దివ్వెగ మొలిపిస్తాను
ప్రతి పేజీలో నా ముఖం
ద్విముఖమై
భూతద్దంలో అందచందంగా
నిజ నిక్షిప్తంతో రవళిస్తాను
పైకెక్కి కూర్చున్న రాజును
ఒకే వేదికపై నిలిచే రోజున
కొత్త బతుకును స్వాగతిస్తాను

- ఎల్. రాజాగణేష్,
చైతన్యనగర్, పాతగాజువాక,
విశాఖపట్నం-530026.
సెల్ : 9247483700.

నానీలు
కేస్ వచ్చిందంటే కాసుల పంటే
కార్పొరేట్ సంస్థల ఏర్పాట్లే అర్హత
తక్షణ చర్య నోటికి తాళం
బంధువరాలు బంధికానాల్లో
వైద్య వ్యాపారం
సేద్యంలా కాదు
ఏనుగు చచ్చినా
బతికినా వేల రూకలే!

- శ్రీమాన్ శ్రీకాశ్యప,
సింహాచలం, విశాఖపట్నం
సెల్ : 9985520479.

జతగాడి తలపులు
ఆ॥ సిదిమి దీపమెట్టు సిన్ని నీ తలపులు
సూసి కన్ను సెదిరి సూపు కుదిరె
మనసు నిలిసిపోయె మరదలా నీ మోన
మాట నిచ్చుకొంటి మనువు కొరకు
ఆ॥ ముద్దబంతి పూవు ముద్దొచ్చె నీ మోము
అల్ల రేగుపండ్లు అతివ కనులు
దొండపండు పెదవి దొరలు ముత్తెములందు
బెల్లమంటి గెడ్డమెల్ల ముద్దు
ఆ॥ నాగుపాము జడను నలవోక తిప్పేవు
సన్న నడుము కేమో సన్నకోక
ఊసులాడ నీతో ఉబలాటమయ్యేను
ఎక్కిరించి పోకే ఎమ్మెలాడి
ఆ॥ గడ్డి కోసుకుంటూ గడుసుగా సూసేవు
నన్ను కదలనీవు ననుపగత్తె
బాస సేసుకుంటి బతిమాలుకొంటినే
ప్రాణమయ్యినావు పడుచుదాన
ఆ॥ ఒయ్యరంగ సూసి ఓపాలి నవ్వేవు
ఓపలేనె గుండె ఓటుగాక
సందె యేల వొత్త సందు మొగాలుంట
సన్న జాజి పూలు సారె పెడత
ఆ॥ పక్క వూరిలోన పరసకెల్లొద్దాము
కోరి మొక్కుదాము కోర్కె తీర
పూలపూల కోక పులి బొంగరాలను
సెలియ కొని పెడుదునె సెంత సేర
ఆ॥ తాటి తీగ తెచ్చి దాన్ని బద్దలు సేసి
పంచుకున్న రోజు పదిలమాయె
సిన్న నాటి గురుతు సెలరేగి ఎదలోన
సిలిపి యాస పుట్టె సెలియనేడు
ఆ॥ పంచదార సిలక పంచుకొందామటే
అటు ఇటు కొరుకుతు అందుకుంటు
తాకమన్న తాక తాళి కట్టేదాక
సిలిపి సరసమాడు సింతసేపు

- గుమ్మా నాగమంజరి, వెంకటరమణపేట, శృంగవరపుకోట, విజయనగరం జిల్లా-535145.
సెల్ : 9985667500.
email: merupuvsp@andhrabhoomi.net

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) ఎడిటర్, మెరుపు, ఆంధ్రభూమి దినపత్రిక, సెక్టర్-9, ఎం.వి.పి.కాలనీ, విశాఖపట్నం-17. అనే చిరునామాకు పంపండి. email: merupuvsp@andhrabhoomi.net ఇ-మెయల్‌కు పిడిఎఫ్‌లో పంపించవచ్చు.

- శివానీ