ఈ వారం కథ

రాబందు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథల పోటీలో ఎంపికైన రచన
------------------
అదిరిపడ్డాడు చైతన్య.
ఎదుట వ్యక్తి చెప్పింది వినేసరికి ఒళ్ళంతా ముచ్చెమటలు పట్టాయి.
‘‘ఇదంతా నిజమేనా? నువ్వు చెప్పిందంతా యధార్థమేనా?’’ ఆందోళనగా అడిగాడు చైతన్య. అతను దేవునిమీద ప్రమాణం చేసి మరీ చెప్పాడు.
ఇదే నిజమైతే? అమ్మో! ఇంకేమైనా ఉందా? ఊరంతా ఒల్లకాడు కాదూ?
‘‘ఈ విషయం ఇంతటితో వదిలెయ్యడానికి వీల్లేదు. దీన్ని అమీ తుమీ తేల్చిపారెయ్యాలి’’ మనసులోనే స్థిరంగా అనుకున్నాడు చైతన్య.
అతను.. ఈ వార్త తెచ్చిన వ్యక్తి.. అనామకుడు కాదు. అలగా మనిషి కాదు. అంతో.. ఇంతో బాధ్యతగల పౌరుడు. పంచాయతీ వార్డు సభ్యుడు. ఊర్లో పరపతి.. పలుకుబడిగల వ్యక్తి. జరుగుతున్న అన్యాయాన్ని అతను ఖండించలేకపోయాడు. చేయబోతున్న అరాచకాన్ని అతను అంగీకరించలేకపోయాడు. తనకు నచ్చని విషయాన్ని అతను సమర్థించలేకపోయాడు.
చైతన్య ఎవరో కాదు ఊర్లో యువజన సంఘానికి నాయకుడు. ఊరి యువకులకు మార్గదర్శకుడు. గ్రామ అభివృద్ధికి కంకణం కట్టుకున్న యువకిశోరం. గ్రామంలో ఉన్న యువతీ యువకులను అందర్నీ సంఘటితపరచిన అభ్యుదయ వాది.
అందుకే ఆ వార్త అతను చైతన్య చెవిలో పడేసాడు.
ఆ వార్త చైతన్యని అతలాకుతలం చేసేసింది. రాత్రి రాత్రంతా చైతన్య మస్తిష్కపు మైదానంలో మథించిన మదపుటేనుగులా సంచరించింది. సంచలనం కలిగించింది.
ఏం చేయాలి? ఎలా ఎదుర్కోవాలి? ఎలా?... ఎలా?... ఎలా?
ఆ మర్నాడు..
యువజన సంఘం సర్వసభ్య సమావేశం ఏర్పాటుచేశాడు చైతన్య. యువజన సంఘ సభ్యులందరికి ఆ వార్త విపులంగా వివరించి చెప్పాడు.
‘‘జగన్ ఎవరు? మన ఊరికే మకుటం లేని మహా జులాయి. బాధ్యత.. బంధాలు తెలియని ఆకతాయి రౌడీ. మన యువకులకు చెడ్డ పేరు తెస్తున్న ఒక దుష్ట యువ కిశోరం.
అతన్ని మన యువజన సంఘంలో ఎందుకు చేర్చుకోలేదో మీ అందరకూ తెలుసు. అలాంటి వ్యక్తి.. ఆ జులాయ్ జగన్.. నో.. నెవ్వర్.. ఇలా జరగడానికి వీల్లేదు కాక వీల్లేదు. ఇదే జరిగితే మన ఊరే వల్లకాడవుతుంది. మన ఊరు మనతోనే అంతమైపోతుంది. చెప్పండి.. ఏం చేద్దాం?
తన అభిప్రాయం కుండబద్దలు కొట్టినట్టూ చెప్పాడు చైతన్య.
అందరూ విన్నారు. అంతా విన్నారు. ఆలోచిస్తూ కూర్చున్నారు. కొందరు అయోమయంగా చూస్తుండిపోయారు.
యువజన సంఘం అధ్యక్షుడు లేచి నిలబడ్డాడు. గొంతు సవరించుకున్నాడు.
‘‘ఇంతవరకూ మన యువజన సంఘం వ్యవస్థాపక కార్యదర్శి చైతన్య చెప్పింది విన్నారు కదా. జగన్ సామాన్యుడు కాడు. అతని వెనుక గ్రామ పెద్దలెందరో ఉన్నారు. స్థానిక శాసనసభ్యుని అండదండలు కూడా జగన్‌కున్నాయి. ఆ విషయం మీ అందరికీ తెలుసు. మనం ఏం చేయగలం? ఎలా?.. ఎలా?.. అతన్ని.. అతని అరాచకాన్ని అడ్డుకోగలం? అందరూ ఆలోచించండి’’ అంటూ తన అభిప్రాయాన్ని నిస్సంశయంగా తెలియజేసాడతను.
‘‘ఈ విషయం నాకు ముందే తెలుసు. మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకి కొత్తగా భవనం నిర్మించడానికి నిధులు మంజూరయ్యాయి. అది పైవారికెవరికీ కాంట్రాక్టు ఇవ్వకూడదని ఒక రూలుందట. స్థానికంగా ఉండే యువకులు ఓ ఐదుగురు కమిటీగా ఏర్పడితే వారికే ఆ బిల్డింగ్ కట్టే అవకాశం ఇవ్వాలని నిబందనలో వుందట. అందుకని మన పంచాయతీ సర్పంచ్‌గారే ఓ ఐదుగురు వ్యక్తులతో ఒక అనామక కమిటీని వేసి దానికి తన తమ్ముడైన జగన్ గారిని చైర్మన్‌ని చేశారు. ఆ కమిటీ చైర్మన్ జగన్ ఆ స్కూలు బిల్డింగ్ కట్టడానికి కాంట్రాక్టర్ అవతారం కూడా ఎత్తాడు. ఇదంతా జరిగి రెండు నెలలు కావస్తోంది’’ అంటూ తనకు తెలిసిందంతా వివరించాడు యువజన సంఘం కోశాధికారి.
మరోసారి అదిరిపడ్డాడు చైతన్య.
ఇతను యువకుడేనా? ‘ఇంత జరుగుతున్నా... అంతా తెలిసినా.. చీమ కుట్టినట్టు కూడా చలించకుండా.. ఇంత నిబ్బరంగా ఎలా ఉన్నాడు. ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా దీన్ని ప్రతిఘటిద్దామన్న ఆలోచనైనా కలుగలేదా?’ చైతన్యకి కోపం శిరాన్ని తాకింది. యువజన సంఘంలో కోశాధికారిగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్న యువకుడు నిస్తేజంగా.. నిర్వికారంగా.. మిన్నకున్నందుకు బాధ కలిగింది.
‘‘ఇది మీ ఇల్లో.. నా ఇల్లో కాదు. ఊరికి చెందినది. మన అందరికీ చెందిన సమస్య. జగన్ ఎలాంటి పొరపాటు చేసినా మన ఊరే వల్లకాడవుతుంది. భావితరమే అంతరించిపోతుంది’’ ఆవేదనగా అరిచాడు చైతన్య.
‘‘అంతా అయిపోయింది. పునాదులు కూడా తవ్వేస్తున్నారు. ఇప్పుడు మనం ఏం చేయగలం? ఎంత ఆలోచించినా లాభం లేదు’’ అన్నాడు కోశాధికారి.
అందరూ అదే బాట.. ఒకే మాట. ఏక కంఠంతో పలికారు.
అయితే.. చైతన్య ఆ సమస్యని అంతటితో వదిలెయ్యలేదు.
ఊర్లో ప్రతి ఒక్కరికీ చెప్పాడు. ఇంటింటికీ తిరిగి మరీ చెప్పాడు.
అందరూ అదే మాట... అదే పాట.
‘మనమేం చేయగలం?... మన మేం చేయగలం?’ అంటూ తమ నిస్సహాయతని వ్యక్తపరిచారు. మనకెందుకంటూ తలలు తిప్పుకున్నారు.
చైతన్య మాట చెల్లలేదు. చైతన్య బాధ ఎవరికీ బోధపడలేదు. అతని ఆవేదన ఏ ఒక్కరూ అర్థం చేసుకోలేదు.
ఊరు.. ఊరంతా మాకెందుకులెమ్మని నోర్మూసుక్కూర్చుంది.
చైతన్య అంతటితో ఆగలేదు. ఎవరూ తోడు రాకున్నా తన పట్టు విడువలేదు.
జిల్లా పరిషత్ చైర్మన్‌కి , జిల్లా కలెక్టర్‌కి అర్జీలు రాసి పంపించాడు..
నిర్మాణం పని ఆగింది. స్కూలు బిల్డింగ్ నిర్మాణాన్ని ఆపేసింది చైతనే్యనని తెలిసి ఊరంతా చైతన్యమీద తిరగబడ్డారు.
ఆ వారం తిరక్కుండానే అధికారులంతా ఊర్లోకివచ్చి గ్రామ సభ నిర్వహించారు. ఊరు.. ఊరంతా పిల్లా పీచులతో గ్రామ పంచాయితీ ఆఫీసుకువచ్చి చేరుకున్నారు.
అందరూ అదే విషయం మీద చర్చ.
అధికారులు ఒక ప్రక్క కూర్చున్నారు. గ్రామ పెద్దలందరూ మరో ప్రక్క కూర్చున్నారు. చైతన్య పెట్టిన అర్జీ చదివి వినిపించాడో అధికారి. దీనిమీద గ్రామస్థులందరూ తమ తమ అభిప్రాయాలు చెప్పాలని అడిగాడు.
‘‘ఈ కుర్రాడు మా ఊరికే గర్వకారణం అనుకున్నామండీ. కానీ చైతన్యలో లోపం ఒక్కటే. ప్రతీ పనిని భూతద్దంలో చూస్తాడు. అందరూ దొంగలేననుకుంటాడు. అందరిమీద లేనిపోని అభాండాలు వేస్తూ పై అధికారులకు ఫిర్యాదులు చేస్తూ ఉంటాడు. అలాంటిదే ఇప్పుడు ఇదీను. జగన్ ఇంతకుముందు ఎలా తిరిగితే మనకెందుకు? స్కూలు బిల్డింగ్ కాంట్రాక్టు సంపాదించి బుద్ధిమంతుడిగా పనిచేసుకుంటున్నాడు. ఆ ఊసు నీకేల? అంటే వినకుండా ఇలా మీకు ఇబ్బంది కలిగించాడు. మన్నించండి’’ అంటూ ఊర్లో అంతో.. ఇంతో పేరున్న ఓ పెద్దమనిషి అన్నాడు.
చైతన్య ముద్దాయిగా ఓ మూలన చేతులు కట్టుకు నిలబడ్డాడు. అచేతనంగా గోడకు చేరగిలబడ్డాడు.
‘‘ఇతను ఇలాంటివాడని తెలిసి... ఇతని ఆగడాలు సహించలేక మా యువజనసంఘం నుండి చైతన్యని ఇప్పుడే.. ఇక్కడే.. ఈ రోజునుండే తొలగిస్తున్నాం’’ ఉన్నట్టుండి యువజన సంఘం అధ్యక్షుడు లేచి ప్రకటించాడు.
‘‘అవును. ఇతనే యువజన సంఘాన్ని స్థాపించానన్న గర్వంతో.. మా అందరి మాట లెక్క చేయకుండా మీకు ఫిర్యాదు చేసాడు. మా యువజన సంఘానికే తలవంపులు తెచ్చాడు. ఇతన్ని సంఘం ఉండి తొలగించడం సమంజసమే’’ కోశాధికారి ఉక్రోషంగా అన్నాడు.
చైతన్య ఒంటరివాడయ్యాడు.
అధికారులంతా చైతన్యకి వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోయారు. ఇక ముందు ఇలాంటి తప్పుడు సమాచారంతో ఫిర్యాదులు ఇస్తే అరెస్టు చేస్తామని చెప్పి వెళ్లిపోయారు.
ఊరు.. ఊరంతా ఫక్కున నవ్వింది.
చైతన్య కించిత్ కూడా కలవరపడలేదు. చైతన్య తన పట్టు విడవలేదు.
ఏడాది లోపే పాఠశాల భవన నిర్మాణం ఆగమేఘాలమీద పూర్తిచేసాడు జగన్. ప్రారంభోత్సవానికి సుముహూర్తం కూడా నిర్ణయించేసారు.
అయితే, చైతన్య మాత్రం చోద్యం చూస్తున్నట్టు చూస్తూ ఉండలేకపోయాడు. సమాచార చట్టం ప్రకారం భవనానికి అయిన ఖర్చు, వాడిన మెటీరియల్ వివరాలు సేకరించాడు. స్కూలు బిల్డింగ్ నిర్మాణంలో రికార్డుల్లో వున్న మెటీరియల్ ఏదీ వాడలేదని నిపుణుల కమిటీతో పరిశీలించాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రికీ, ఉన్నతాధికారులకు ఫిర్యాదులు పంపించాడు.
దానితో స్కూలు ప్రారంభోత్సవం ఆగిపోయింది. రాష్ట్ర స్థాయి చీఫ్ ఇంజనీర్స్ స్కూలు బిల్డింగ్ నిర్మాణాన్ని పరిశీలించడానికి వచ్చారు. వారితోపాటు జిల్లా అధికారులు వచ్చారు.
చివరగా అందరూ ఏకమై జగన్ మీద వ్యక్తిగత కక్షతో చైతనే్య మొదటినుండీ ఫిర్యాదులు చేస్తూ భవన నిర్మాణానికి అంతరాయం కలిగిస్తున్నాడని తీర్మానించారు. దానికి ఊరు.. ఊరందరూ వత్తాసు పలికారు. మళ్లా చైతనే్య ముద్దాయిగా అందరి ముందూ తల వంచుకు నిలబడ్డాడు. అట్టహాసంగా స్కూలు బిల్డింగ్ ప్రారంభోత్సవం జరిగింది.
వక్తలంతా పరోక్షంగా ఆదినుండి భవన నిర్మాణానికి ఆటంకం కలిగించిన చైతన్యని విమర్శిస్తూ మాట్లాడారు.
అప్పుడూ చైతన్య దోషిగా తలవంచుకు నిలబడ్డాడు.
సరిగ్గా.. సంవత్సరం తిరక్కుండానే ఊరు.. ఊరంతా శ్మశానం అయింది.
ఊర్లో.. ప్రతి ఇంట్లో... ఏడుపులు.. పెడబొబ్బలు.
ఊరు.. ఊరంతా ఏడుస్తూ కూర్చుంది.
జిల్లాలో ఉన్న ఉన్నతాధికారులంతా ఊర్లోకి వచ్చి పడ్డారు.
ఆ వార్త దావానంలా జిల్లా.. జిల్లా అంతా పాకిపోయింది. టీవీల పుణ్యమా అని అరక్షణంలో ప్రపంచం అంతా ఆ విషయం సునామీలా చుట్టేసింది.
ఆకాశం మాత్రం ఏమీ తెలియని నంగనాచిలా నిర్మలంగా ఉంది.
ఆ ముందు రోజు...
ఉరుములు... మెరుపులతో పెను తుపానై విరుచుకుపడింది ఆకాశం.
ఉదయం పదిన్నరకు ఆరంభమైన వర్షం మధ్యాహ్నం రెండు గంటలవరకూ ఏకధాటిగా కురుస్తూనే ఉంది మాయదారి వర్షం. నాలుగు గంటల తర్వాత తెరిపిచ్చింది.
వర్షం ఆగింది. ఆకాశం చల్లబడింది.
సూర్యుడు మబ్బుల మాటునుండి పైకి చుర చుర మండుతూ వచ్చాడు.
ఎండ ఉండుండీ చురుక్కుమనిపిస్తోంది.
కానీ, ఆ ఊర్ని మాత్రం చీకటి ముంచేసింది. శోకం చుట్టేసింది.
ఎవరో.. ఎవరెవరో.. తెచ్చిన దుమారం లాంటి వార్త.
వార్త కాదు అది.. ఆర్తనాదం.
ఊరు.. ఊరంతా వినపడేలా అరచిన ఆర్తనాదం.
‘‘దుంపల బడి మొత్తం కూలిపోయిందర్రో!’’ అంటూ ఏడుస్తూ.. అరుస్తూ.. ఆ వ్యక్తి ఊరు.. ఊరంతా గుండెలు బాదుకొని తిరిగాడు.
కొత్తగా కట్టిన స్కూలు బిల్డింగ్ మొత్తం మట్టిబొమ్మలా కూలిపోయింది.
స్కూల్లో పిల్లలు, ఉపాధ్యాయులు అందరూ సజీవ సమాధి అయిపోయారు.
ఊరు.. ఊరంతా ఏడుపులు.. పెడబొబ్బలతో శ్మశానంలా మారిపోయింది.
చైతన్య ఒక్కడే ఏడవలేదు. చలనం లేని మరబొమ్మలా నిలబడిపోయాడు.
ఏడాది క్రితం చైతన్య ఏడుపు ఏ ఒక్కరూ పట్టించుకోలేదు.
ఇప్పుడు వాళ్ళ ఏడుపు వినే నాధుడే కరువయ్యాడు.
ఎవరి బాధ వాళ్ళది. ఎవరి ఏడుపు వాళ్ళది.
ఆ బిల్డింగ్‌ని నాసిరకంగా కట్టిన కాంట్రాక్టర్ జగన్.. జగన్‌కి వత్తాసు పలికిన ఊరు.. ఊరి ప్రెసిడెంట్.. అందరూ ఎవరి పిల్లల కోసం వాళ్ళు పడి.. పడి ఏడుస్తున్నారు. భవన శిధిలాల క్రింద వెదుక్కుంటున్నారు.
ఉన్నట్టుండి పిల్లల ఆర్తనాదాలు పాతాళంలో కూరుకుపోయి రాలేక గొంతు పెగుల్చుకుని ఏడుస్తున్నట్టూ వినిపించాయి. అందరూ ఒక్కసారే ఉలిక్కిపడ్డారు.
భవనం శిథిలాల్లో చిక్కుకున్న పిల్లల ఆర్తనాదాలు విని వినడంతోనే చైతన్య ఉలిక్కిపడి పరుగందుకున్నాడు. చైతన్యను చూసి మిగతా యువజనసంఘం కార్యకర్తలంతా కూలిన భవనం క్రింద ప్రాణాలతో పోరాటం చేస్తున్న పిల్లల కోసం పరుగులు పెట్టారు.
మనకెందుకులే అన్న నిర్లక్ష్యం ఎంతటి భయంకర పరిస్థితిని సృష్టించిందో అందరికీ అర్థమయింది. కానీ, ఏం చేయగలరు? చేతులు కాలాక ఆకులు పట్టుకుని ప్రయోజనం ఏమిటి?
అంతలోనే ప్రభుత్వ అధికారులతో పాటు వచ్చిన క్రేన్ కూలిన భవన శకలాలను తొలగించే ప్రయత్నంలో ఉంది. ప్రాణాలతో ఉన్న పిల్లల్ని రక్షించడానికి ఒకరికొకరు పోటీపడుతూ పరుగులెడుతున్నారు.
శిథిలాల క్రింద క్షేమంగా ఉన్న పిల్లల్ని రక్షించి తెస్తున్న చైతన్యని చూసి ఊరు.. ఊరందరూ తప్పుచేసామన్న భావనతో తలలు బాదుకుంటున్నారు.
ఉన్నట్టుండి జగన్ నడిరోడ్డుమీద పడి దొర్లుతూ రోదిస్తున్నాడు. శిథిలాల్లో నుండి నిర్జీవుడైన తన కొడుకుని ఎవరో బైటకు మోసుకురావడం చూసి జగన్‌తోపాటు వారి కుటుంబ సభ్యులు గగ్గోలు పెట్టారు.
ఒక్కొక్కటిగా బైటపడుతున్న విగతజీవులైన తమ పిల్లల్ని చూస్తూనే ఊర్లో వాళ్ళందరూ ఒక్కొక్కరూ క్రింద కూలబడి తలలు బాదుకొని రోదిస్తున్నారు.
ఎలా కబురందుకున్నాయో.. ఏమో గాని రాబందులు విలాసంగా విన్యాసం చేస్తూ ఆకాశంలోనే పల్టీలు కొడుతూ చిందులేస్తున్నాయి.

**

ఇందూ రమణ