పశ్చిమగోదావరి

అవినీతి రహిత పాలన అందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఆగస్టు 29: అవినీతిరహిత పాలన అందించడానికి ప్రతిఒక్కరూ ముందుకురావాలని జిల్లా కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన జిల్లాస్ధాయి అధికారుల సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో బరువుపెట్టనిదే పనులు కావనే విమర్శలకు తావివ్వకుండా ప్రతిఒక్కరూ నీతివంతమైన సేవలు అందించాలని కోరారు. జిల్లా ట్రజరీ కార్యాలయం నుండి అవినీతి ప్రారంభమవుతుందని, జిపిఎఫ్ సొమ్ము పొందాలన్నా, టిఎ బిల్స్ ఆమోదం జరగాలన్నా ఇలా ఏ బిల్లు ఆమోదం పొందాలన్నా సొమ్ము ఇవ్వకపోతే జరగవనే వాస్తవాలపై చర్చించి ఇకపై అవినీతికి ఆస్కారం లేని పాలనను అమలుచేసేలా ఆలోచన ప్రతిఒక్కరిలో పెరగాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో వివిధ పనుల కోసం వచ్చే ప్రజలకు సత్వరసేవలు అందించాలన్న ఉద్దేశ్యంతో ఇ-ఫైలింగ్ విధానాన్ని అమలుచేస్తున్నామని, అయితే కొన్నిచోట్ల ఇంకా అవినీతి విధానాలు అమలుజరుగుతున్నాయని, త్వరలోనే పూర్తిస్దాయిలో పారదర్శక పాలన అందించే మరో నూతన విధానాన్ని అమలుచేస్తామన్నారు. ప్రభుత్వ కార్యాలయానికి వచ్చే ప్రతి ధరఖాస్తు స్కాన్ చేసి ఆన్‌లైన్‌లో పొందుపర్చాలని, గుమాస్తా పరిధిలో మూడురోజుల్లో పనిచేయకపోతే ఆటోమేటిక్‌గా ఆ ధరఖాస్తు పైలెవెల్ అధికారికి వెళుతుందని, అక్కడకూడా మూడురోజుల్లో పనిజరగకపోతే జిల్లా అధికారి దగ్గరకు ఫైలు వెళ్లి అక్కడ ఆటోమేటిక్‌గా పరిష్కరించే నూతన సాంకేతిక విధానాన్ని త్వరలో అమలుచేస్తామన్నారు. మీ-సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసిన ప్రజలకు నిర్ణీత కాలవ్యవధిలో అయా సర్ట్ఫికెట్లు నేరుగా దరఖాస్తుదారుని ఇంటికి పంపించే నూతన విధానాన్ని కూడా అమలు చేయనున్నామన్నారు. జనన, మరణ, నివాస, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు వంటివి పోస్టల్‌లో దరఖాస్తుదారుని ఇంటికే పంపుతామని, పోస్టల్ ఖర్చులు దరఖాస్తుదారుడే భరించాల్సి ఉంటుందని కలెక్టరు చెప్పారు. జిల్లాలో వివిధ ప్రభుత్వశాఖల్లో ఇ-ఫైలింగ్ విధానంలో నిర్దేశించిన మూడురోజుల్లో పనులు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించేవారిని గుర్తించి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టరు హెచ్చరించారు. జిల్లాలో 80శాతం మంది సర్వేయర్లు చేతిలో డబ్బుపడకపోతే క్షేత్రస్ధాయిలో పనులు చేయటం లేదనే విమర్శలు విన్పిస్తున్నాయని ఇకనైనా వారు మారాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు రెండులక్షలకు పైగా ఫైల్స్ ఆన్‌లైన్‌లో పొందుపర్చటం జరిగిందన్నారు. బయోమెట్రిక్ హాజరు మరింత పెరగాలన్నారు. సెప్టెంబర్ 1వ తేదీ నుండి ప్రతి ప్రభుత్వ ఉద్యోగి జీతం బిల్లుతో బయోమెట్రిక్ హాజరు సమర్పించాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇకపై ప్రతినెల మొదటిశనివారం కార్యాలయ పరిశుభ్రత, క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలను అమలు చేయాలని, మూడవ శనివారం ఖచ్చితంగా కార్యాలయంలో చిన్నచిన్న రిపేర్లు, అవసరమైన చోట్ల రంగులు వేసే కార్యక్రమాలను అమలు చేయాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టరు పి కోటేశ్వరరావు, జెసి-2 షరీఫ్, డిఆర్వో కె ప్రభాకరరావు, డిఆర్‌డిఎ పిడి కె శ్రీనివాసులు, డ్వామా పిడి వెంకటరమణ, హౌసింగ్ పిడి ఇ శ్రీనివాసరావు, డిపిఓ సుధాకర్, డిఎస్‌ఓ శివశంకర్‌రెడ్డి, ఎస్‌డిసి ఆర్‌వి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.