పశ్చిమగోదావరి

మూడు కీలక రంగాల్లో సంక్షోభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఆగస్టు 29 : భారతదేశం విద్య, వైద్య, ఉపాధి రంగాల్లో సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, యువత దృష్టిని ఈ అంశాల నుంచి మరల్చడానికి కుహనా జాతీయత పేరుతో దళితులు, ఆదివాసీలు, మహిళలు, మైనార్టీలపై హిందూత్వ వాదులు దాడులు చేస్తున్నారని అఖిల భారత యువజన సమాఖ్య (ఎఐవైఎఫ్) జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ తిరుమలై ఆరోపించారు. ఎఐవైఎఫ్ రాష్ట్ర 20వ మహాసభలు ప్రారంభం సందర్భంగా సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. ఈ సంక్షోభం నుంచి బయటపడటానికి యువత పోరాడాలని పిలుపునిచ్చారు. మైనార్టీలపై జరుపుతున్న దాడులపై ప్రధాని నరేంద్ర మోడీ నోరు విప్పడం లేదని విమర్శించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో ధృతరాష్ట్ర పాలన సాగుతోందని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని, ఎంపిలు, ఎమ్మెల్యేలు, మంత్రులుదోచుకుంటున్నారని ఆరోపించారు. అంతేకాకుండా చంద్రబాబు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ఒక్కొక్క ప్రజాప్రతినిధికి అయిదు కోట్ల రూపాయలు ఇచ్చి సంతలో పశువులను కొనుగోలుచేస్తున్నట్లు కొంటున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు తాను ఎవరికీ భయపడనని, తాను నిప్పు అని చెప్పుకుంటున్న విషయాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబు నిప్పు కాదు తుప్పు అని ఎద్దేవా చేశారు. అదే విధంగా చంద్రబాబును పుష్కరాల ముఖ్యమంత్రిగా అభివర్ణిస్తూ 12 రోజులపాటు పుష్కరాల్లో ఉపన్యాసాలు ఇచ్చిన చంద్రబాబును తన పేరును చంద్రస్వామిగా మార్చుకోవాలని సూచించారు. ప్రధాని నరేంద్రమోడీ దళితులు, మైనార్టీలు, ఆదివాసీలు, మహిళలపై దాడులు జరుగుతున్నా నోరు మెదపడం లేదని విమర్శించారు. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ మాదిరిగా మోడీ కూడా కార్పొరేట్ల కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. కేసులు బనాయించినా, జైళ్లలో పెట్టినా ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా, రైల్వేజోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సిపి ఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్ మాట్లాడుతూ ఏలూరు వేదికగా మూడు రోజులపాటు జరుగుతున్న ఎ ఐ వై ఎఫ్ రాష్ట్ర మహాసభల్లో తమ సమస్యల పరిష్కారం కోసం యువత కీలకనిర్ణయాలు తీసుకోవాలని, పోరాటాలు సాగించాలని పిలుపునిచ్చారు. బహిరంగ సభలో ఎ ఐ వై ఎఫ్ మాజీ నాయకులు వందేమాతరం శ్రీనివాస్ విప్లవ గేయాలు ఆలపించి యువతను ఉర్రూతలూగించారు. ఎఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ లెనిన్‌బాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐ బయ్యన్న, రాష్ట్ర నాయకులు బొద్దాని నాగరాజు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి కృష్ణకిషోర్, యు హేమశంకర్, ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం సుబ్బారావు, జె విశ్వనాధ్, ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం గని, చంద్రనాయక్, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, జెవి సత్యనారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

కామవరపుకోట సొసైటీ పాలకవర్గం రద్దు
రూ.1.14 కోట్ల నిధులు దుర్వినియోగం:త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో పాలన
కామవరపుకోట, ఆగస్టు 29 : కామవరపుకోట సొసైటీలో రూ.కోటి 14 లక్షల నిధులు దుర్వినియోగమైన నేపథ్యంలో పాలకవర్గాన్ని రద్దుచేసి త్రిసభ్య కమిటీతో పాలన సాగించనున్నట్లు చింతలపూడి సబ్ డివిజనల్ ఆఫీసర్ జి వెంకటేశ్వరరావు తెలిపారు. కామవరపుకోట సొసైటీలో ఆగస్టు 26వ తేదీన ఏలూరు జిల్లా ఉన్నతాధికారులు సెక్షన్ 34/1లో 64 ద్వారా రద్దు పరుస్తూ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారని, దానిలో భాగంగా ఎస్‌డిసి చింతలపూడి ఛైర్మన్‌గాను, కామవరపుకోట బ్రాంచి మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్‌ను సభ్యులుగా నియమిస్తూ జిల్లా ఉన్నతాధికారి నివేదిక ఇచ్చారన్నారు. దానిలో భాగంగానే నేడు పాలకవర్గాన్ని రద్దుపర్చినట్లైందని వెంకటేశ్వరరావు చెప్పారు. చింతలపూడి సబ్ డివిజనల్ ఆఫీసర్‌ను ఛైర్మన్‌గా నియమిస్తూ చేసిన ఉత్తర్వులను జిల్లా ఉన్నతాధికారులకు నివేదించామని, ఇంత కాలం కూడా పాలకవర్గానికి నిధులు దుర్వినియోగంపై నివేదికలు ఇచ్చినప్పటికీ సరైన నిర్ణయం తీసుకోకపోవడంతో జిల్లా సహకార అధికారి కె లాజరు ఉత్తర్వుల మేరకు పాలకవర్గాన్ని రద్దు పర్చినట్లు ఆయన చెప్పారు. ఆరు మాసాల వరకు త్రిసభ్య కమిటీలో సొసైటీ పరిపాలన జరుగుతుందని, లేనిపక్షంలో ఆర్నెల్లు తరువాత ఎన్నికలు నిర్వహించే అవకాశం వుందని చెప్పారు.
సొసైటీ సిబ్బందితో సమావేశం
చింతలపూడి సబ్‌డివిజనల్ అధికారి వెంకటేశ్వరరావు సోమవారం సొసైటీ ఆవరణలో సంఘం సిబ్బందితోనూ, రెండు పెట్రోలు బంకుల సిబ్బందితోనూ సమావేశం నిర్వహించి ఎప్పటికప్పుడు సంఘానికి జమా ఖర్చులు నివేదించాలని, ఏరోజుకారోజు ఉదయం, సాయంత్రం కూడా పెట్రోలు బంకుల్లో టిప్పుతో నిర్ధారణ చేసి నిల్వలను చూపించాలని సెక్రటరీ టి సత్యనారాయణను ఇన్‌ఛార్జి సెక్రటరీ బాబూరావును ఆదేశించారు. రెండు బంకుల్లో సూపర్‌వైజర్‌గా నిర్వహిస్తున్న జి గంగాధరరావును ప్రతీ రోజూ మూడు సార్లు జమాఖర్చులు నివేదించి తెలియపర్చాల్సిన అవసరం వుందన్నారు. అలాగే జిల్లా ఉన్నతాధికారులకు నివేదించిన ఆదేశాల ప్రకారం సంఘంలో కోటి 14 లక్షల 79 రూపాయలపై తగు చర్యలు తీసుకునే నిమిత్తం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.

వర్షాలతో మళ్లీ మొదలైన నాట్లు
యలమంచిలి, ఆగస్టు 29: యలమంచిలి మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరినాట్లు మళ్లీ మొదలయ్యాయి. సకాలంలో నారుమళ్లు వేసినా నీరు అందక పోవడం, వర్షాలు కురవకపోవడం తదితర కారణాల వల్ల ఎండిపోయాయి. ఆంధ్రభూమిలో ఏమిటీ ఈ వైపరీత్యం శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఈ సందర్భంగా ఎండిపోయిన చేలను రక్షించుకునేందుకు రెయిన్ గన్స్ ఏర్పాటు చేసుకోవాలని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు రైతులకు సూచించడంతోపాటు ప్రయోగాత్మకంగా మేడపాడులో స్వయంగా ప్రారంభించారు. జిల్లా కలెక్టరు కాటంనేని భాస్కర్ మండలంలో పర్యటించి, ఇంజన్ల ద్వారా నీటిని తోడుకునేందుకు రైతులకు ఉచిత ఆయిల్ కూపన్లు పంపిణీ చేశారు. గత రెండు రోజులుగా వర్షాలు కురవడంతో రైతులు నాట్లు వేయడం ప్రారంభించారు. కాగా నీరులేక ఎండిపోయిన చేలకు ప్రస్తుతం కురిసిన వర్షాల వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని, మళ్లీ నాట్లు వేయాల్సిందేనని రైతులు చెబుతున్నారు.

సాగు అవసరాలకు ఎటువంటి అనుమతులకైనా సిఎం సిద్ధం
పోలవరం ఎమ్మెల్యే మొడియం
పోలవరం, ఆగస్టు 29: సాగునీటి అవసరాలు తీర్చేందుకు ఎటువంటి అనుమతులు ఇవ్వడానికైనా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సిద్ధంగా ఉన్నారని పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు అన్నారు. సోమవారం ఉదయం పోలవరం ప్రాజెక్టు కుడి కాల్వ నుండి గోదావరి నీటిని మోటార్ల ద్వారా మంగపతి బోదె, పాపాయమ్మ చెరువులోకి తరలించే ప్రక్రియను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల కారణంగా సాగునీటి కోసం చెరువుల్లో నీరు లేకపోవడంతో ఆయకట్టు రైతులు ముఖ్యమంత్రి, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు విజ్ఞప్తులు చేయడంతో కుడి కాల్వ నుండి మోటార్ల ద్వారా నీరు తోడేందుకు అనుమతి ఇచ్చారన్నారు. సముద్రంలోకి వృథాగా పోతున్న గోదావరి నీటిని వినియోగంలోకి తేవాలన్న ఉద్దేశ్యంతో రికార్డు సమయంలో పట్టిసం ఎత్తిపోతల పూర్తిచేసి కృష్ణాడెల్టాకు సాగునీరు అందిస్తున్నారన్నారు. పట్టిసం వద్ద రెండు ఎత్తిపోతల పథకాలు నిర్మించి చెరువులకు నీరు అందిద్దామనుకున్నామని, అయితే కొన్ని కారణాల వల్ల ఆది సాధ్యం కాలేదన్నారు. అయితే పట్టిసం ఎత్తిపోతల పథకంలో ఒక పంపు ద్వారా పోలవరం, పట్టిసం, గూటాల రెవెన్యూ పరిధుల్లో చెరువులకు నీటిని తరలించేందుకు ఆలోచన చేస్తున్నామని, దానికి నిపుణులైన ఇంజనీరింగ్ అధికార్లతో డిజైనింగ్ చేయిస్తామన్నారు. ఇక్కడి రైతులు సాగునీటి అవసరాల కోసం ఏమైనా ప్రతిపాదనలు చేస్తే వెంటనే మంజూరు చేస్తున్నారని ఎమ్మెల్యే శ్రీనివాసరావు అన్నారు. సమావేశంలో ఎఎంసి చైర్మన్ పారేపల్లి రామారావు, పోలవరం, టి నరసాపురం ఎంపిపిలు పైల అరుణకుమారి, శీలం వెంకటేశ్వరరావు, జడ్పీటీసీ కుంజం సుభాషిణి, కొవ్వాడ కాల్వ డిఇ అయ్యపురాజు, ఎఎంసి డైరెక్టర్ ఉలవల సత్యనారాయణ, మండల టిడిపి అధ్యక్షుడు కుంచే దొరబాబు తదితరులు పాల్గొన్నారు.

ఫామ్‌పాండ్స్, ఇంకుడుగుంటలతో నీటి కష్టాలకు చెక్
కలెక్టర్ భాస్కర్
ఏలూరు, ఆగస్టు 29: జిల్లాలో సాగు,తాగునీటి కష్టాలను అధిగమించేందుకు ఫామ్‌పాండ్స్, ఇంకుడుగుంటలు విరివిగా ఏర్పాటుచేసుకోవాలని కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ అన్నారు. స్ధానిక కలెక్టరేట్‌లో సోమవారం మీకోసం కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి ఆయన వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాభావ పరిస్దితులు వల్ల భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయని, ప్రతి నీటిచుక్కనూ భూమిలోకి ఇంకేవిధంగా రైతులు, ప్రజలు ఇంకుడుగుంటలు, ఫామ్‌పాండ్స్ ఏర్పాటుచేసుకోవాలన్నారు. పెదవేగి మండలంలోని గార్లమడుగు, పెదవేగి, కొప్పులవారిగూడెం, న్యాయంపల్లి, కూచింపల్లి, రాట్నాలకుంట, రాయుడుపాలెం, జగన్నాధపురం గ్రామాల్లో తాగునీరు, సాగునీరు బోర్లు ఎండిపోయి తీవ్రమైన నీటి ఎద్దడి ఏర్పడిందని పెదవేగి కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు ఉండవల్లి వెంకటరమణ, రాట్నాలకుంట అమ్మవారి ఆలయం ఛైర్మన్ రాయల విజయవెంకట భాస్కరరావు తదితరులు కలెక్టరు దృష్టికి తీసుకువచ్చారు. ఆ గ్రామాల ప్రక్కగా పోలవరం కుడికాల్వ ప్రవహిస్తోందని ఆ కాల్వ నుండి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా చెరువులను నింపి సాగు,తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలని వారు కోరారు. దీనిపై కలెక్టరు స్పందిస్తూ అయా గ్రామాల్లో సుమారు మూడువేల వరకు ఫామ్‌పాండ్స్ ఏర్పాటుచేసుకోవాలని సూచించారు. ఫామ్ పాండ్స్ తవ్వకం పనులు ప్రారంభించిన 72గంటల్లోగా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగునీరు అందిస్తామన్నారు. ఈవిషయమై అవసరమైన చర్యలు తీసుకోవాలని డ్వామా పిడి ఎం వెంకటరమణను కలెక్టరు ఆదేశించారు. తాడేపల్లిగూడెం మండలం కొమ్ముగూడెం, నిడదవోలు మండలం కోరుమామిడి, నడుపల్లి గ్రామాలకు చెందిన రైతులు కె శ్రీనివాసరావు, చుండ్రు సతీష్, ముళ్లపూడి సుబ్బారావు మరికొంతమంది కలెక్టరుకు వినతిపత్రం సమర్పిస్తూ తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెం నుండి నందమూరు వరకు 33 కిలోమీటర్ల పొడవునా యర్రకాల్వ కుడి ఎడమగట్టులను పటిష్టం చేయడానికి, కల్వర్టులు కట్టడం, రాతితో రివిట్‌మెంట్‌లు చేయడానికి ప్రభుత్వం కాంట్రాక్టు పనులు అప్పగించిందని, కానీ ఎక్కడిపనులు అక్కడే వదిలివేయటం వల్ల పంటభూముల్లోని మురుగునీరు యర్రకాల్వలోకి వెళ్లకుండా భూములన్నీ ముంపునకు గురవుతున్నాయని పేర్కొన్నారు. పనులు నాసిరకంగా చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. స్వయంగా పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ ఎస్‌ఇ కె శ్రీనివాసరావును ఆదేశించారు. జంగారెడ్డిగూడెంనకు చెందిన వడ్డూరి అన్నపూర్ణ కలెక్టరుకు ఫిర్యాదు చేస్తూ కొన్ని నెలలుగా ట్రజరీ నుండి తనకు రావాల్సిన పెన్షన్ రావటం లేదని పేర్కొన్నారు. ఇటువంటి కేసులు ఎన్ని ఉన్నాయో సాయంత్రంలోగా నివేదిక అందజేసి మంగళవారం సాయంత్రంలోగా బకాయిలతో సహా అందరికి చెల్లింపులు జరిగేలా చూడాలని లేకుంటే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హెచ్చరించారు.

డిఆర్‌వోగా ప్రభావతి !
ఏలూరు, ఆగస్టు 29 : జిల్లా రెవిన్యూ అధికారిగా ఆలపాటి ప్రభావతి నియమితులు కానున్నట్లు తెలుస్తోంది. గతంలో కృష్ణాజిల్లా డిఆర్‌వోగా పనిచేసిన ప్రభావతి ప్రస్తుతం సెలవులో వున్నట్లు సమాచారం. కాగా డిఆర్‌వోగా పనిచేస్తున్న కె ప్రభాకరరావు ఈ నెలాఖరున ఉద్యోగ విరమణ చేయనున్నారు. దీనితో ఆ పోస్టు కోసం పలువురు తమ వంతు ప్రయత్నాలు చేశారు. ఆలపాటి ప్రభావతిని డి ఆర్‌వోగా నియమిస్తూ ఒకటి రెండ్రోజుల్లో ఉత్తర్వులు విడుదలవుతాయని సమాచారం.