పశ్చిమగోదావరి

డిఇఒ కార్యాలయం వద్ద ఉపాధ్యాయుల ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, సెప్టెంబర్ 1 : విద్యార్ధులకు భారంగా మారిన బేస్‌మెంట్ పరీక్షలను రద్దు చేయాలని ఎమ్మెల్సీలు రాము సూర్యారావు, బొడ్డు నాగేశ్వరరావులు డిమాండ్ చేశారు. ఈ విధానాన్ని రద్దు చేయకపోతే ఆరుగురు పిడి ఎఫ్ ఎమ్మెల్సీలు కలిసి ఆమరణ దీక్ష చేస్తామని హెచ్చరించారు. స్థానిక డి ఇవో కార్యాలయం వద్ద గురువారం 13 ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ఉపాధ్యాయ జె ఎసి ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సూర్యారావు మాట్లాడుతూ ప్రభుత్వం ఉపాధ్యాయులతో సమన్వయంగా ఉండి వారి సేవలు వినియోగించుకోవాలని, నియంత్రృత్వ ధోరణి విడనాడాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పట్ల అధికారులు వ్యతిరేక వైఖరితో వ్యవహరిస్తున్నట్లు పరిస్థితులను బట్టి అర్ధమవుతోందన్నారు. ఉపాధ్యాయులను బోధనేతర విధుల్లో వినియోగిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. విద్యార్ధులకు భారమైన బేస్‌మెంట్ పరీక్షలను రద్దు చేయాలని కోరారు. ఇతర జిల్లాల్లో జరిగే విధానాలకు విరుద్ధంగా మన జిల్లాలో ఉపాధ్యాయులపై ఒత్తిడి పెరిగిందని, దాన్ని నిర్మూలించాలని పేర్కొన్నారు. స్కూలు కాలెండర్ ప్రకారం మాత్రమే పాఠశాల సమయాలు, పరీక్షలు నిర్వహించాలని, ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, చివరి పిరియడ్‌లో మాత్రమే క్రీడలు నిర్వహించాలని కోరారు. ఉపాధ్యాయులకు ఎటువంటి ఆన్‌లైన్ చేయు పనులు అప్పగించరాదన్నారు. బడి గంటలు కార్యక్రమాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కోరారు. పాఠశాలలు సందర్శించినప్పుడు గుర్తించిన లోపాలు సంబంధిత ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు మాత్రమే తెలియజేయాలన్నారు. ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు మాట్లాడుతూ బేస్‌మెంట్, బడిగంటలు, ఆన్‌లైన్‌లో ఆఫ్ లోడింగ్ వంటి విధానాలు రద్దు చేయాలని, లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. విద్యార్ధుల మార్కుల అప్‌లోడింగ్ కోసం విద్యాశాఖ ప్రత్యేకంగా సిబ్బందిని నియమించుకోవాలన్నారు. ఉపాధ్యాయులను అవమానించే రీతిలో వున్న డి ఇవో వైఖరిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని చెప్పారు. యుటి ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి బాబురెడ్డి మాట్లాడుతూ అప్‌లోడింగ్ పేరుతో ఉపాధ్యాయులను వేధించే విధానానికి స్వస్తి పలకాలన్నారు. పి ఆర్‌టియు రాష్ట్ర అధ్యక్షులు ఎం కమలాకరరావు మాట్లాడుతూ స్కూలు క్యాలెండరు ప్రకారం మాత్రమే పాఠశాల సమయాలు, పరీక్షలు నిర్వహించాలన్నారు. ఎపిటి ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సిసి ఇ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని, అయితే జిల్లా అధికారుల మెప్పు కోసం డి ఇవో సొంతంగా బేస్‌మెంట్ లాంటి పరీక్షలునిర్వహించాలని ఆదేశాలు జారీ చేస్తూ విద్యార్ధులను, ఉపాధ్యాయులను ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. సర్వశిక్ష అబియాన్ అధికారులు కూడా జాబ్‌చార్టుకు వ్యతిరేకంగా తనిఖీలు చేస్తున్నారన్నారు. జిల్లా రెవిన్యూ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షులు ఎల్ విద్యాసాగర్ మాట్లాడుతూ డి ఇవో హోదాలో వున్న వ్యక్తి విద్యాశాఖ ప్రతిష్టను పెంచే విధంగా వ్యవహరించాలని సూచించారు. ఉపాధ్యాయుల శ్రమ కారణంగానే టెన్త్‌లో 98.7 శాతం ఉత్తీర్ణత సాధించగలిగిన విషయాన్ని గుర్తు చేశారు. యుటి ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి షేక్ సాబ్జీ మాట్లాడుతూ ఉపాధ్యాయులను అప్రదిష్టపాలు చేసే విధంగా డి ఇవో రూపొందించిన బడి గంటలు, బేస్‌మెంట్ పరీక్షలను రద్దు చేయాలని కోరారు. అనంతరం డి ఇవోతో ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఎన్‌జివో జె ఎసి నేతలు చర్చలు జరిపారు. ఈ చర్చల సందర్భంగా కొన్ని డిమాండ్లు పరిష్కరించేందుకు డి ఇవో అంగీకరించారు. అయితే బడిగంటలు విషయంలో చర్చల్లో స్పష్టత కరువైంది. అనంతరం ధర్నా శిబిరం వద్దకు వచ్చిన నేతలు బడిగంటలను ఎత్తివేయాలని డిమాండ్ చేయగా దీనికి అసహనం వ్యక్తం చేసిన డి ఇవో మధుసూధనరావు చర్చలు విఫలమైనట్లు స్వయంగా ప్రకటించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఉపాధ్యాయ సంఘాల నేతలు, ఎన్‌జివో సంఘ నేతలు డి ఇవోను సరెండర్ చేసేంత వరకు ఆందోళన కొనసాగించాలని నిర్ణయించారు. శనివారం నుంచి నిరాహార దీక్షలుచేపట్టాలని నేతలు నిర్ణయించారు. కార్యక్రమంలో వివిధ ఉపాధ్యాయ సంఘాల నేతలు జయకర్, గోపీమూర్తి, కెవివి సుబ్బారావు, జి కృష్ణ, ఆర్‌వి ఎం శ్రీనివాస్, బాపిరాజు, రాము, నరహరి, ఎన్‌జివో సంఘ నేతలు ఆర్ ఎస్ హరనాధ్, శ్రీనివాస్, రమేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.