పశ్చిమగోదావరి

రాజ్యమేలుతున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, సెప్టెంబర్ 26 : కొన్ని ప్రభుత్వ శాఖల్లో అవినీతి ఉద్యోగులు రాజ్యమేలుతున్నారని, అటువంటి వారిని గుర్తించి పక్కన పెట్టకపోతే సంబంధిత శాఖాధికారులు భారీ కుంభకోణాల్లో ఇరుక్కుపోయే ప్రమాదముందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ హెచ్చరించారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన జిల్లా అధికారుల సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కొన్ని శాఖల్లో గుమస్తా కేడర్‌లో వుంటున్న ఉద్యోగులు అవినీతికి పాల్పడుతూ కార్యాలయ మొత్తాన్ని తమ గుప్పెట్లో పెట్టుకుని నడుపుతున్నట్లు గుర్తించామని చెప్పారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో డిపివో, పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ఇద్దరు గుమస్తాలను బయటకు పంపిస్తే మళ్లీ అదే కార్యాలయానికి వచ్చి తిష్ఠవేశారని, అటు వంటి వారికి సంబంధిత శాఖాధికారులు ప్రాధాన్యత ఇవ్వకుండా వ్యవహరించాలని, అంతేకాకుండా అవినీతి ఉద్యోగులు ఎక్కడైనా తప్పు చేసినట్లు రుజువైతే శాఖాపరంగా చర్యలకు వెనుకాడవద్దని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో కూడా ముగ్గురు అవినీతి ఉద్యోగులు వున్నట్లు తన దృష్టికి వచ్చిందని, వారిని పక్కన పెట్టకపోతే డి ఎంహెచ్ ఓ భారీ కుంభకోణంలో ఇరుక్కునే ప్రమాదం కూడా లేకపోలేదని హెచ్చరించారు. జిల్లాస్థాయి అధికారులు తమ కార్యాలయంలో ఏ ఒక్క అవినీతి ఉద్యోగిని ప్రోత్సహించవద్దని హితవు పలికారు. అవినీతికి ఆస్కారం లేకుండా వుండాలన్న ఉద్దేశ్యంతో ప్రతీ కార్యాలయంలో ఇ-ఫైలింగ్ విధానాన్ని ప్రవేశపెట్టామని, అయినప్పటికీ ఈ విధానాన్ని నీరుగార్చడానికి కొంత మంది అన్ని ఫైళ్లను ఆన్‌లైన్‌లో పొందుపర్చడం లేదని, అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. మత్స్యశాఖలో అత్యధికంగా పెండింగ్ ఫైల్స్ ఉండటాన్ని కలెక్టర్ తప్పు పడుతూ తక్షణమే ఎఫ్‌డివోలు తమ పరిధిలో ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లాలో ఏలూరు కార్పొరేషన్‌తో సహా ఎనిమిది పురపాలక సంఘాల్లోనూ పరిశుద్ధ్య పరిస్థితులు అధ్వాన్నంగా వున్నాయని, ఎక్కడ పడితే అక్కడ చెత్త, అడుగడుగునా దోమల భయంతో ప్రజలు అల్లాడుతున్నారని చెప్పారు. కమిషనర్లు తెల్లవారుఝామున పట్టణాల్లో కనిపించడం లేదని, ఈ విధంగా ఉంటే పారిశుద్ధ్య పరిస్థితులు ఏ విధంగా మెరుగుపడతాయని ప్రశ్నించారు. జిల్లాలోని పురపాలక సంఘాల కమిషనర్లు, సిబ్బంది విధిగా తెల్లవారుజామున 5.30 గంటలకు క్షేత్రస్థాయిలో కనిపించాలని ఆదేశించారు. తాను త్వరలో పల్లెలు, పట్టణాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తానని, ఆ ప్రాంతాల్లో అపరిశుభ్ర వాతావరణం నెలకొని వుంటే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. దేవరపల్లి, టి నర్సాపురం, గోపాలపురం, కుకునూరు, తాడేపల్లిగూడెం, తాళ్లపూడి, పెదపాడు, బుట్టాయిగూడెం, పెరవలి ఇవోపి ఆర్ ఆర్‌డిలు ఉదయమే క్షేత్రస్థాయిలో కనిపించడం లేదని, కొందరైతే ఆఫీసులకే రాని పరిస్థితులు వున్నాయన్నారు. ప్రజలకు సేవలు అందించడంలో పూర్తిస్థాయిలో నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్న దేవరపల్లి, గోపాలపురం, టి నర్సాపురం ఇవో పి ఆర్ ఆర్‌డిలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ పి కోటేశ్వరరావు, జెసి-2 షరీఫ్, జడ్పీ సి ఇవో డి సత్యనారాయణ, డిఎస్‌వో శివశంకర్‌రెడ్డి, హౌసింగ్ పిడి ఇ శ్రీనివాసరావు, డ్వామా పిడి వెంకటరమణ, డిపివో సుధాకర్, ట్రాన్స్‌కో ఎస్‌ఇ సత్యనారాయణరెడ్డి, ఇరిగేషన్ ఎస్‌ఇ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
నరకానికి నకలు
జంగారెడ్డిగూడెం, సెప్టెంబర్ 26: ఉమ్మడి రాష్ట్రంలో తల్లాడ-దేవరపల్లి రాష్ట్ర రహదారిగా పేరున్న, ప్రస్తుత జీలుగుమిల్లి-దేవరపల్లి రహదారి నరకానికి నకలుగా తయారయ్యంది. జీలుగుమిల్లి నుండి జంగారెడ్డిగూడెం వరకు ఈ రహదారి గోతులు గతుకులతో వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. వర్షం వస్తే బురద, ఎండకాస్తే దుమ్ము, ధూళితో ప్రయాణాలు చేయవలసి వస్తోంది. గోదావరి పుష్కరాలకు సుమారు రూ. 30 కోట్ల వ్యయంతో రోడ్లు భవనాల శాఖ మరమ్మతులతో కొత్త రోడ్డుగా తయారుచేసింది. ఆ సంతోషం ప్రజలకు కొన్ని నెలలు మాత్రమే నిలిచింది. ఏడాది తిరక్కుండానే గోతులు పడి, రోడ్డు ఛిద్రమైపోయింది. అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్ల అవినీతికి ఈ రోడ్డు ప్రత్యక్ష సాక్షిగా నిలిచింది.
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కలిపే ఈ రహదారి హైదరాబాద్, విశాఖపట్నంలకు దగ్గరి మార్గం. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ రహదారి ఎప్పుడూ గోతులతోనే ఉంటున్నా అటు ప్రజా ప్రతినిధులు గానీ, ఇటు జిల్లా ఉన్నతాధికారులు గానీ పట్టించుకున్న దాఖలాలు కానరావడం లేదని సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రజాసంఘాలు ఎన్ని ఆందోళనలు చేపట్టినా ఫలితం శూన్యం. ఛిద్రమైన రహదారి కళ్లకు కనిపిస్తున్నా పరిశీలించడానికి ప్రజాప్రతినిధి గానీ, ఉన్నతాధికారి గానీ ఇటువైపు రావడం లేదు. జంగారెడ్డిగూడెం - జీలుగుమిల్లి మధ్య ఈ రహదారి పూర్తిగా ఛిద్రమైపోయింది. భారీ గోతులతో నిత్యం ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. 15 సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియన్ టెక్నాలజీతో నిర్మించిన ఈ రహదారి నిర్మాణమైన కొద్ది నెలలకే అధ్వాన్నంగా తయారైంది. ప్రయాణాలకు అనువుకాకుండా పోయింది. అప్పటి నుండి అడపా దడపా మరమ్మతులు చేస్తూనే వస్తున్నారు. పట్టుమని పది నెలలు కూడా ఈ రోడ్డు చదునుగా లేదు. రాష్ట్ర విభజనకు ముందు ఈ రహదారి తల్లాడ నుండి అశ్వారావుపేట వరకు అద్భుతంగా నిర్మించారు. అశ్వారావుపేట దాటిన తరువాత జీలుగుమిల్లి నుండి జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, గోపాలపురం, దేవరపల్లి వరకు అధ్నాన్నంగానే ఉండిపోయింది. ఈ రహదారికి గోదావరి పుష్కరాలతో మోక్షం లభించిందన్న సంతోషం ఎంతో కాలం నిలవలేదు. వేసిన ఏడాదిలోపే ఈ రహదారి మళ్లీ ఛిద్రమైపోయింది. బి.టి రోడ్డు లేకపోయినా ఫరవాలేదని, కనీసం చదునుగా ఉంటే వాహనాలు నడపగలమని డ్రైవర్లు చెబుతున్నారు. జిల్లాలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా విస్తరించే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ జిల్లా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు ఎందుకు పట్టించుకోరనే విమర్శలు వినిపిస్తున్నాయి. విలీన మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడు వెళ్లాలంటే ఈ రహదారే శరణ్యం. ఈ రహదారిలో హైదరాబాద్ వెళ్లాల్సిన ఆర్టీసీ బస్సులు గత కొన్ని నెలలుగా బుట్టాయగూడెం, రెడ్డిగణపవరం, రాచన్నగూడెం మీదుగా అశ్వారావుపేటకు వేరేమార్గంలో నడుపుతున్నారు. లారీలకు తిప్పలు తప్పడం లేదు. కార్లలో వెళ్లేవారు కూడా డొంక రూటులో వెళుతున్నారు. పుష్కరాల సమయంలో ఇబ్బడి ముబ్బడిగా వచ్చిన పడిన నిధులు కొంతమంది ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు అడ్డూ ఆపూ లేకుండా బొక్కేయడంతో ఇంతటి దురవస్థ దాపురించిందని ప్రజలు వాపోతున్నారు. అంతేగాకుండా జిల్లా ఉన్నతాధికారులు ఈ ప్రాంతం పట్ల వివక్ష చూపుతూ, జిల్లాలో అభివృద్ధి చెందిన ప్రాంతాల పర్యటనలకే పరిమితమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక్కసారి ముఖ్యమంత్రి గానీ, మంత్రులు గానీ, ఉన్నతాధికారులు గానీ ఈ రహదారిపై ప్రయాణించాలని కోరుతున్నారు.