పశ్చిమగోదావరి

నల్లకుబేరులపై ప్రత్యేక దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, సెప్టెంబర్ 30 : ఇంతకుముందు ఎన్నడూ లేని రీతిలో ఆదాయపుపన్ను శాఖ ఈసారి మరింత క్రియాశీలకంగా కనిపిస్తోంది. ఆదాయం స్వచ్ఛందంగా వెల్లడించేందుకు శుక్రవారం వరకు ఆ శాఖ వ్యాపారులకు, ఇతర ధనికులకు అవకాశం ఇవ్వడం తెలిసిందే. అయితే ఈ గడువు ముగుస్తున్నా జిల్లా వ్యాప్తంగా చూస్తే అంచనావేసిన స్థాయిలో ఆదాయం బయటపడకపోవడంపట్ల ఆ శాఖ అధికారులే కొంత అసంతృప్తి వ్యక్తంచేస్తూ వస్తున్నారు. ఈ నేపధ్యంలో గత కొద్ది రోజులుగా జిల్లా వ్యాప్తంగా సమాచారం వున్నచోట్ల ఆ శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ఆదాయాన్ని కనుగొన్నట్లు సమాచారం. దానిలో భాగంగానే గత కొద్దిరోజులుగా ఏలూరు నగరంలో ప్రముఖుల ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులు కొనసాగుతూ వస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం ఏలూరు రామచంద్రరావుపేటలోని పలువురు డాక్టర్లపై దాడులు నిర్వహించి భారీ ఎత్తున అపరాధ రుసుం వసూలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా శుక్రవారం ఏలూరు వన్‌టౌన్ ప్రాంతానికి చెందిన ఒక ఫైనాన్స్ వ్యాపారి ఇంటిలో ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు అదాయపుపన్ను శాఖాధికారుల సోదాలు కొనసాగుతూ వచ్చాయి. అయితే ఈ దాడిలో ఏ మేరకు అధికారికంగా ఆదాయాన్ని వెలికితీశారన్నది తెలియాల్సి వుంది. కాగా ఆదాయపుపన్ను శాఖ స్వచ్ఛందంగా ఆదాయాన్ని వెల్లడించేందుకు అవకాశం కల్పించడం తెలిసిందే. దానికి సంబంధించి నిబంధనల ప్రకారం పన్ను చెల్లిస్తే సరిపోతుందని కూడా పేర్కొంది. అయితే ఆ గడువు పూర్తవుతున్న నేపధ్యంలో ఆ శాఖ అధికారులు నేరుగా రంగంలోకి దిగి దాడులు నిర్వహించడం విశేషంగా చెప్పుకోవాలి.
వాస్తవంగా చూస్తే జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున ఆక్వా పరిశ్రమే కాకుండా వ్యవసాయం, ఇతర పరిశ్రమలు కూడా కొనసాగుతూ వస్తున్నాయి. ప్రధానంగా ఆక్వా రాజధానిగా వున్న భీమవరం పరిసర ప్రాంతాలపై ఆ శాఖాధికారులు గట్టిగా దృష్టిపెట్టిపెట్టినట్లు కనిపిస్తోంది. అదే విధంగా వాణిజ్య రాజధానిగా వున్న తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాలపైనా అధికారుల దృష్టి నిశితంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఆశించిన స్థాయిలో నల్లధనం బయటపడకపోవడం, శాఖాధికారులు అంచనావేసిన స్థాయిలో వ్యాపారస్తుల నుంచి ఆదాయం వెల్లడించే పరిస్థితి కనిపించకపోవడంతో అధికారులు సమాచారం వున్నచోట్ల నేరుగా దాడులకు దిగుతున్నట్లు కనిపిస్తోంది. దీని ద్వారా భారీ ఎత్తున అక్రమ ఆదాయాలను, అక్రమాస్తులను వెలికితీస్తున్నట్లు కనిపిస్తోంది. ఏదేమైనా ఈ పరిణామాలు మాత్రం వ్యాపార వాణిజ్య వర్గాల్లో తీవ్ర ప్రకంపనలను సృష్టిస్తున్నాయి. పలు చోట్ల పెద్ద వ్యాపారులు దాదాపుగా అండర్‌గ్రౌండ్‌కు వెళ్లిపోయినట్లుగా చెబుతున్నారు. దుకాణాలకు, ఇళ్లకు తాళాలు వేసి మరీ వారంతా జారుకున్నట్లు చెబుతున్నారు. అయితే ఇలాంటి సమాచారంపై కూడా ఆదాయపుపన్ను అధికారులు కొంత ప్రత్యేకంగా దృష్టిపెట్టినట్లు చెబుతున్నారు. చాలా చోట్ల వ్యాపారులు తమ వ్యాపారాలను అధికారికంగా చేసుకుంటూనే అధిక శాతం ఆదాయాలను, ఆస్తులను మాత్రం గుట్టుచప్పుడు కాకుండా వేరే చోట్లకు తరలించి ఈ గండం నుంచి బయటపడేందుకు నానా తంటాలు పడుతున్నట్లు చెబుతున్నారు. ఏదేమైనా ప్రధానంగా వ్యాపార వాణిజ్య కేంద్రాలుగా నిలుస్తున్న ప్రాంతాల్లో ఐటిదాడుల వ్యవహారం ఇప్పుడు తీవ్ర సంచలనాన్ని సృష్టిస్తోంది.