పశ్చిమగోదావరి

యధేచ్ఛగా జూదాల జాతర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జంగారెడ్డిగూడెం, జనవరి 15: సంక్రాంతి పేరుతో ఏజన్సీ, మెట్ట ప్రాంతాల్లో మూడు రోజులూ కోడి పందాలు, జూదాల జాతర విచ్చలవిడిగా జరిగింది. ఫ్లడ్‌లైట్ల వెలుతురులోనూ కోడి పందాలు నిర్వహించారు. కోడి పందాలతో పాటు రాత్రివేళల్లోనూ జూదాలు కొనసాగాయి. గ్రామ గ్రామాన పేకాట, గుండాటలు, కోడి పందాలు నిర్వహించారు. పట్టణ శివార్లలో బైపాస్ రోడ్డు శ్రీనివాసపురం జంక్షన్ వద్ద తోటలో జరిగిన కోడి పందాలకు దర్శకుడు వి.వి.వినాయక్ హాజరయ్యారు. నిర్వాహకుల్లో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు ఉన్నప్పటికీ ఐక్యత ప్రదర్శించారు. జూదాల జాతరలో రాజకీయ ఐకమత్యాన్ని ప్రజానీకానికి చాటిచెప్పారు. కోడి పందాల పేరుతో పేకాట గ్యాంబ్లింగ్, గుండాటలు ఆడేవారి వద్ద భారీ మొత్తాలు తీసుకుని కోడి పందాల నిర్వాహకులు కోట్లు గడించారు. సంప్రదాయం ముసుగులో ప్రజాప్రతినిధులు ఈ మూడురోజుల్లో లక్షలు గడించారు. కోడి పందాలు, పేకాటలకు అనుమతి తామే తెచ్చామని అధికార పార్టీ నేతల్లో కొందరు బాహాటంగా చెప్పుకున్నారు. జంగారెడ్డిగూడెం మండలంలోని శ్రీనివాసపురంలో భారీగా పందాలు, జూదాల జాతర జరిగింది. పగలు రాత్రి తేడా లేకుండా పందాలు, పేకాటలు ఫ్లడ్ లైట్ల వెలుగులో తెల్లవార్లూ వేస్తూనే ఉన్నారు. జంగారెడ్డిగూడెం సాయిబాబా గుడి వద్ద పామాయిల్ తోటలో సైతం ఫ్లడ్ లైట్ల వెలుగుల్లో కోడి పందాలు, గుండాటలు వేశారు. స్థానిక మార్కెట్ పాత శ్రీనివాసా థియేటర్ వద్ద పేకాట గ్యాంబ్లింగ్ రాత్రివేళల్లో భారీగా నిర్వహించారు. పందాలు జరగనీయబోమని ముందస్తు హెచ్చరికలు చేసిన పోలీసు బాసులు రాజకీయ వత్తిడులకు తలొగ్గి మొహం చాటేయడంతో ఈ మూడు రోజులు పోలీసు శాఖ లేని రాజ్యం నడిచింది. మరోపక్క జిల్లా కలెక్టర్ జారీ చేసిన 144 సెక్షన్ నిషేధాజ్ఞలు అవహేళన అయ్యాయి. పట్టణ శివార్లలోని శ్రీనివాసపురం జంక్షన్ వద్ద కాంగ్రెస్ నేత పోల్నాటి ప్రసాద్, సొసైటీ అధ్యక్షుడు బల్లే రాజారావు ఆధ్వర్యంలో నిర్వహించిన కోడి పందాల బరిలో ఆదివారం సినీ దర్శకుడు వి.వి.వినాయక్ తళుక్కున మెరిశారు. ఆయన రాకతో ఒక్కసారిగా కోడి పందాల బరిలో సందడి వాతావరణం నెలకొంది. కోళ్లను పట్టుకుని, పందాలకు వదిలిన వినాయక్ మాట్లాడుతూ తెలుగువారి సంప్రదాయ క్రీడ కోడి పందాలని, సంక్రాంతికి కోడి పందాలు వేయడం ఆనవాయితీ అయిందన్నారు. మండలంలోని శ్రీనివాసపురం, లక్కవరంలో రెండుచోట్ల, పేరంపేట, ఎ.పోలవరం, గురవాయిగూడెం, దేవులపల్లి, కేతవరం, తాడువాయి తదితర గ్రామాల్లో కోడి పందాలు, పేకాటలు జోరుగా జరిగాయి. శ్రీనివాసపురం బరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పోల్నాటి బాబ్జీ ఆధ్వర్యంలో పలువురు ప్రముఖులు కోడి పందాలు తిలకించారు. ఈ ప్రాంతంలో నిర్వహించిన అధిక బరుల్లో ఖమ్మం జిల్లాకు చెందిన పందాలరాయుళ్లు స్థానిక బృందాలను ఎదుర్కొన్నారు. విలీన మండలాలైన వేలేరుపాడు, కుక్కునూరు నుండి కూడా భారీగా కోళ్లతో తరలివచ్చారు. చిన్న బరుల్లో పదివేల నుండి పెద్ద బరుల్లో లక్ష, రెండు లక్షల రూపాయల వరకు పందాలు కాశారు. సామాన్యులు తెచ్చుకున్న కోడి పుంజులు వేరే చిన్నబరిలో పందెం వేశారు. జూదాల జాతరలో మద్యం, బిర్యానీ విక్రయాలు ఊపందుకున్నాయి. ఈసారి పందాలు ఎక్కడపడితే అక్కడ జరగడంతో రోడ్లన్నీ జనంతో నిండిపోయాయి. పందాల రాయుళ్ళు, మైసూర్, ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లాల నుండి వచ్చిన పేకాట గ్యాంబ్లర్లతో పట్టణంలోని లాడ్జీలు నిండిపోయాయి. ఈ మూడు రోజుల్లో కోట్ల రూపాయలు చేతులు మారినట్టు తెలుస్తోంది. కనుమ రోజుతో పందాలకు పోలీసులు ముగింపు పలికే సూచనలు సైతం కనిపించడం లేదు. ఆదివారం రాత్రి కూడా పందాలు నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకున్నారు. సోమవారం ముక్కనుమ పేరుతో కొన్ని బరుల్లో పందాలు నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. సోమవారం నుండి కోడి పందాలు నిర్వహిస్తే సహించేది లేదని పోలీసు అధికార్లు హెచ్చరికలు జారీ చేశారు.
తాళ్లపూడి: సుప్రీంకోర్టు ఆదేశాలున్నా, 144 సెక్షన్ అమలులో ఉన్నా కోడిపందాల నిర్వహణకు ఎటువంటి అడ్డంకి కలగలేదు. తాళ్లపూడి మండలంలో మూడురోజులపాటు తొమ్మిది ప్రాంతాల్లో పందాలు నడుస్తూనే ఉన్నాయి. ముగ్గుల పోటీల సందడి అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటుచేసి, ఆ వెనుక కోడిపందాలు, కోడిపందాలు, జూదం, మద్యం అమ్మకాలు నిర్విరామంగా సాగాయి. మండలంలో కోడిపందాల నిర్వహణ సామాజిక వర్గపరంగా కూడా నడిచాయి. అంతా తెలుగుదేశం పార్టీ వర్గాలే అయినప్పటికీ గజ్జరంలో ఒక సామాజికవర్గం, పెద్దేవం, తాళ్లపూడి, వేగేశ్వరపురం గ్రామాల్లో మరో సామాజికవర్గం పందాల నిర్వహణ చేపట్టారు. సంక్రాంతి సంబరాల పేరుతో జరిగిన కోడిపందాల్లో మొత్తం లాభసాటి వ్యాపారంగానే సాగిందని చెప్పవచ్చు. భోగి రోజున 10 గంటల వరకు ప్రతీ బరి వద్ద నిఘా పేరుతో ఉన్న పోలీసు యంత్రాంగం పది గంటల తరువాత హఠాత్తుగా మాయమయ్యారు. కత్తులు లేని కోడి పందాల నిర్వహణకు ఎటువంటి ఇబ్బంది లేదని పోలీసులు తెలిపారు. నాయకుల పంతానికి చట్టం తలొగ్గక తప్పలేదు.
ద్వారకాతిరుమల: సంక్రాంతి పండుగ మూడు రోజులు కోడి పందాల రాయుళ్లు బరితెగించారు. మండలంలోని పలు గ్రామాల్లో విచ్చలవిడిగా కోడి పందాలు నిర్వహించారు. వందల కొద్దీ మూగ జీవాలు నేలకొరిగాయి. ఈ క్రమంలో లక్షలాది రూపాయలు చేతులు మారాయి. మండలంలోని గుణ్ణంపల్లి, జి కొత్తపల్లి, దొరసానిపాడు, రాళ్లగుంట, తిమ్మాపురం తదితర ప్రాంతాల్లో పందాలు యధేచ్ఛగా సాగాయి. పందాలతోపాటు మద్యం, మాంస విక్రయాలు, గుండాట వంటి జూదాలు బరుల వద్దే నిర్వహించారు. గుణ్ణంపల్లిలో రాత్రింబవళ్లు ఈ పందాలు నిర్వహించారు.