పశ్చిమగోదావరి

ఈసారీ గెలిచింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జనవరి 15: ఇంతకుముందు ఎన్నడూ లేనిరీతిలో పందాల విషయంలో అనుమానాలు వచ్చినా వాటిని తోసిరాజంటూ ఈ సంక్రాంతి సీజన్‌లోనూ కోడిపుంజు పూర్తిస్ధాయి విజేతగా నిలిచింది. నేతల ప్రతిష్ఠను నిలబెడుతూనే ఖాకీలకు అప్రతిష్టను మూటగడుతూ, యంత్రాంగం ఏర్పాట్లను మంటగలుపుతూ ఈ మూడురోజులు పందాల జాతర సాగిపోయింది. వందల కోట్లలోనే నగదు చేతులు మారింది. అవికూడా కొత్త నోట్లే కావటం గమనార్హం. తరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని చెక్కుచెదరకుండా ఉంచేందుకు కోడిపందాల నిర్వాహకులు, రాజకీయనేతలు జిల్లా, పోలీసు ఉన్నతాధికారులపై తీసుకువచ్చిన వత్తిళ్లు ఫలించాయి. వ్యసనపరులు అమాయక పుంజులకు కత్తులు కట్టి పోటీలో దింపి వాటి గాయాల నుంచి ఒలికే నెత్తురుతో తమ జూదపిపాసను చల్లార్చుకున్నారు. మరోవైపు సంక్రాంతి కోడిపందాలు నిర్వహిస్తే నాన్‌బెయిల్‌బుల్ కేసులు కడతామని హెచ్చరికలు చేసిన పోలీసులు చివరకు నిశే్చష్టులుగా ఉండిపోవాల్సి వచ్చింది. గతంతో పోలిస్తే ఈ ఏడాది కోడిపందాలు రెట్టింపుగా జరుగగా నోట్ల కష్టాలు కారణంగా ప్రేక్షకుల కొరత స్పష్టంగా కన్పించింది. ఈపందాలు కొంతమంది జేబులు కూడా నింపాయి. విచ్చలవిడిగా పందాలు, సరదాలు తీర్చే మద్యం పరవళ్లు, జూదం ఆకలిని తీర్చే అంగళ్లు... ఈవిధంగా పందెగాళ్లు కలల్లో మాత్రమే ఊహించగలిగే వాతావరణం ఈసారి పెద్దగా శ్రమపడకుండానే సంక్రాంతికి వారి కళ్లముందు నిలిచింది. రాజకీయనేతలు కూడా తమ పరువు,ప్రతిష్ఠలను ఊహించనంత ఎత్తుకు పెంచుకోగలిగారు. ఏ భయం లేకుండా పందాలు నిర్వహించగలిగే వాతావరణాన్ని సాధించటంలో నేతలు ఈసారి ఘనవిజయం సాధించారు. జిల్లా మొత్తం పందెగాళ్ల బరిగా మారిపోయింది. పోలీసుస్టేషన్ల సమీపంలోనూ, జనం సంచరించే ప్రాంతాల్లో బాహాటంగానే కోడిపందాలు నిర్వహించగలిగారు. కోట్లకు పడగలెత్తిన ధనవంతులు తమ సరదా కోసం పందాలు అడగా కూటికోసం శ్రమపడే నిర్భాగ్యులు సైతం ఈసారి భారీగా పందాలు కాసి నష్టపోయారు. ఈనెల 13వ తేదీ ఉదయం ప్రారంభమైన కోడిపందాలు ఆదివారం అర్ధరాత్రి వరకు కూడా కొనసాగాయి. మరోరెండురోజులపాటు ఈ స్వర్గం నడుస్తుందని చెపుతున్నారు. శుక్రవారం నుంచి మూడురోజులపాటు అన్నిచోట్ల పెద్దపందాలు భారీఎత్తున కొనసాగాయి. ఏ చోట చూసినా పెద్ద పందాల వద్ద పెద్దసంఖ్యలో జనం హాజరయ్యారు. సంప్రదాయకంగా వస్తున్న పేరుమీద కోడిపందాల్లో కోట్ల రూపాయలు చేతులు మారినా దానికి మించి పేకాట, ఇతర జూదాలపై కూడా పందాలు సాగాయి. కోతాట, గుండాట ఇలా అనేక రకాల జూదాలకు కూడా పందెం జరిగే ప్రాంతాలలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేశారు. వీటివద్ద కూడా అధికసంఖ్యలో ప్రజలు తమ అదృష్టాలను పరిక్షించుకున్నారు. లక్షల రూపాయలు నష్టపోయారు. ఐ భీమవరం, భీమవరం, ఉండి, పాలకొల్లు, ఆకివీడు, గణపవరం, నర్సాపురం, మొగల్తూరు, కొణిజెర్ల, ములగలంపాడు, జంగారెడ్డిగూడెం, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి తదితర మండలాల్లో భారీఎత్తున కోడిపందాలు జరిగాయి. ఇక ఈ మూడురోజులు మద్యం పరవళ్లు తొక్కింది. ఎక్కడ చూసినా బెల్టుషాపులు ఏర్పాటుచేసి ఎక్కడ కావాలంటే అక్కడ మద్యాన్ని సరఫరా చేశారు. పందెం జరిగే ప్రాంతాల్లోనైతే మొబైల్ సర్వీసులు కూడా ఏర్పాటుచేశారు. పోలీసులు తీరు మాత్రం ఈసారి కూడా దయనీయంగా మారిపోయింది. ముందు ఉత్తరకుమారుని ప్రగల్భాలు పలికిన పోలీసులు ఆతర్వాత ఎక్కడా కన్పించలేదు. గతంలో కనీసం కొన్నిచోట్లైనా ఈపందాలను నిరోధించే ప్రయత్నం సాగింది. అవి ఫలితాన్ని ఎంతవరకు ఇచ్చాయన్నది వేరే విషయమైనా కనీసం విధినిర్వహణలో కొంతమందైనా కన్పించారు. ఈసారి అలాంటి వాతావరణం ఏదీ కన్పించలేదు. ఎక్కడా పోలీసు జీపు మచ్చుకైనా కంటపడలేదు. మొత్తంమీద మూడురోజులపాటు జిల్లా పందేగాళ్లకు స్వర్గ్ధామంగా విరాజిల్లింది.
ఖాకీల జేబులు గలగల
ఏలూరు, జనవరి 15: కోడిపందాల్లో ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు అన్న విషయాన్ని పక్కనపెడితే రెండువైపులా లాభపడింది మాత్రం క్రిందిస్దాయి పోలీసు అధికారులు, సిబ్బందే. ముందస్తు అనుమతులు ఎలాగూ వస్తాయన్న నమ్మకంతో, ఉన్నతాధికారులు కూడా మిన్నకుండిపోతారన్న ఉద్దేశ్యంతో కొన్నిచోట్ల క్రిందిస్ధాయిలో భారీగానే వసూళ్లు జరిగాయనే తెలుస్తోంది. అటు పందెం నిర్వాహకులు కూడా అనందంగానే ముందుకు వచ్చి అడిగినంత సమర్పించుకుని పందెం ఏర్పాట్లు చేసుకున్నారని తెలుస్తోంది. డెల్టా, మెట్ట ప్రాంతాల్లో కూడా ఈ వసూళ్లు లక్షల రూపాయలు దాటాయని విశ్వసనీయ సమాచారం. ఈసారి పోలీసుస్టేషన్ల వారీగా వసూళ్ల పర్వానికి తెర తీశారని తెలుస్తోంది. ముందస్తు రాయభారాలు జరిపి స్టేషన్‌కు వేల రూపాయల్లో నజరానాలు అందుకున్నారని సమాచారం. దీనికి అదనంగా పందాలు సాగిన రోజుల్లో పందెంలో ఓడిన రెండుకోళ్లతోపాటు ఇద్దరు మనుషులను కూడా తమకు అప్పచెప్పాలని ముందస్తు బేరం కుదుర్చుకున్నారు. పై అధికారులు అడిగితే సమాధానం చెప్పడానికి వీలుగా తమకు అప్పచెప్పిన ఇద్దరు మనుషులపై కేసులు పెట్టి రికార్డులో చూపించుకున్నారని తెలుస్తోంది. మరీ విడ్డూరం ఏమిటంటే భోగిరోజున మప్టీలో కన్పించిన పోలీసు సిబ్బంది ఎటువంటి ఇబ్బందులు తలెత్తకపోవటంతో ఆతర్వాత రోజు నుంచి కొన్నిచోట్ల నేరుగా పందాల బరుల వద్దకు చేరుకుని వారు కూడా పందాలు కాయటం. విశేషమేమిటంటే... జిల్లా పరిధిలో కోడిపందాలను ఆదివారం సాయంత్రం 5గంటలకు నిలుపుదల చేయాలని హెచ్చరించిన పోలీసులు ఆ గడువు సమీపిస్తున్న సమయంలో మరో గంట అదనపు సమయం కేటాయించినట్లు కొంతమంది నిర్వాహకులకు ఫోన్ చేసి చెప్పడం.

గోగులమ్మ తల్లి జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం
నరసాపురం, జనవరి 15: శ్రీగోగులమ్మ తల్లి మహిళల, పురుషుల జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. శనివారం స్థానిక రుస్తుంబాద కబడ్డీ స్టేడియంలో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ఈ పోటీలను ప్రారంభించారు. నరసాపురం డిఎస్పీ పూర్ణచంద్రరావు క్రీడా జ్యోతిని వెలిగించారు. పోటీల కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకీరామ్ పావురాలను గాలిలోకి వదిరారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాజీ మంత్రి కొత్తపల్లి మాట్లాడుతూ పండుగ రోజుల్లో యవత చెడువ్యసనాలకు దూరంగా ఉంచేందుకు ప్రతీ ఏటా కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. అలాగే గ్రామీణ క్రీడ కబడ్డీని ప్రోత్సాహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మరో అతిథి డిఎస్పీ పూర్ణచంద్రరావు మాట్లాడుతూ 22 ఏళ్లుగా క్రమం తప్పకుండా కబడ్డీ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కబడ్డీ పోటీల కన్వీనర్ కొత్తపల్లి జానకీరామ్ మాట్లాడుతూ ఎంతో వ్యయప్రయాసలకోర్చి జాతీయ స్థాయిలో కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వం కబడ్డీ క్రీడకు గుర్తింపునిచ్చి ప్రోత్సహించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు కొత్తపల్లి భుజంగరాయులు, వనె్నంరెడ్డి శ్రీనివాసు, గౌరు సత్తిబాబు, కబడ్డీ సంఘం రాష్ట్ర కార్యదర్శి వి వీర్లవెంకయ్య, రాష్ట్ర కార్యదర్శి ఎం రంగారావు, సిపిఐ రాష్ట్ర నాయకులు నెక్కంటి సుబ్బారావు, టిడిపి నాయకులు గుగ్గిలపు మురళీ, పెంటపాటి మోహన్, యర్రంశెట్టి బాబులు తదితరులు పాల్గొన్నారు.
చెలరేగిన పందెగాళ్లు
*చేతులు మారిన కోట్లు*గాంధీ సూత్రం పాటించిన పోలీసులు*నిఘా బృందాలు కూడా నిస్తేజం

ఏలూరు, జనవరి 15: పొలిటికల్ పవర్ ముందు పోలీసు పవర్ మరోసారి తలవంచింది... న్యాయస్ధానాల ఆదేశాలతో రంగంలోకి దిగిన జిల్లా యంత్రాంగం కూడా చోద్యం చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది... ఎలాగైనా కోడిపందాలు వేస్తామని రాజకీయనేతల రూపంలోని నిర్వాహకులు, ఏమైనా అడ్డుకుంటామని పోలీసులు ప్రకటించుకున్నారు... కోడిపందాలకు పేరొందిన డెల్టా, మెట్టప్రాంతాల్లో ప్రత్యేకంగా పందాల నిరోధక కమిటీలను కూడా ఏర్పాటుచేశారు... అయితే ఇవేమి పందాలను నిరోధించలేకపోగా ప్రశాంత వాతావరణంలో పందాలు జరిగేందుకు దోహదపడ్డాయి... భోగి రోజు ఉదయం పరిస్ధితిలో ఒక్కసారిగా మార్పువచ్చింది....కింది స్దాయి అధికార్లకు ‘పండుగ’ చేసుకోండంటూ ఉన్నతాధికార్ల నుండి వౌఖిక ఆదేశాలు రావటంతో ఒక్కొక్కరుగా సిఐలు, ఎస్సైలు, సిబ్బంది యూనిఫాంలు వదిలి మఫ్టీలోకి మారిపోయారు... మధ్యాహ్నం నుంచి పోలీసులు పూర్తిగా చాపచుట్టేయడంతో పందాల రాయుళ్ల వీరంగానికి అంతులేకుండాపోయింది... మరోవైపు నిఘా బృందాల జాడ కూడా ఎక్కడా కానరాలేదు... మూడురోజులపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్న పందాల్లో కోట్ల రూపాయలు చేతులు మారాయి... వందలసంఖ్యలో మూగజీవాలు రక్తమోడుతూ నేలకొరిగాయి. పందాలను ఆడించటంలో ప్రజాప్రతినిధులు చూపిన పట్టుదల సమస్యల సాధనలోనూ చూపితే బాగుంటుందని పలువురు వ్యాఖ్యానించటం కొసమెరుపు.
భోగిపండుగ ప్రారంభం అయ్యేదాక కూడా జిల్లాలో కోడిపందాలు జరుగుతాయా అన్న మీమాంస నెలకొంది. అయితే శుక్రవారం ఉదయం నాటి పరిణామాలను పరిశీలిస్తే ఒక్కసారిగా ఊహించిన ఆదేశాలు వౌఖికంగా వచ్చాయో, లేక మరోవిధంగా వచ్చి చేరాయోగాని జిల్లావ్యాప్తంగా అన్ని బరుల్లోనూ పందాల హడావిడి ప్రారంభమైపోయింది. ఇక అక్కడినుంచి పందాల మారథాన్ మాదిరిగా ఆదివారం రాత్రి పొద్దుపోయేవరకు కూడా ఈ జాతర సాగిపోతూనే వచ్చింది. ఏదశలోనూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా, కేసులు, పోలీసుల భయం లేకుండానే ఈ జాతర సాగిపోయింది. ఒకదశలో కలెక్టరు బరుల ప్రాంతాల్లో 144 సెక్షన్ అంటూ ప్రకటన వెలుగులోకి రాగానే పరిస్దితి మారుతుందేమోనన్న సందేహనికి తావిచ్చినా అలాంటిది ఏమి లేకుండానే అన్నిచోట్ల ఈ జాతర యధాప్రకారం సాగిపోయింది. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో జరిగిన కాల్పుల ఘటనతోపాటు కొన్ని ప్రాంతాల్లో వైసిపి, టిడిపిల మధ్య ఘర్షణలు మినహాయిస్తే పెద్దగా చెప్పుకోదగ్గ అవాంఛనీయ ఘటనలు ఏమి చోటుచేసుకోలేదు. అవిధంగా మొత్తంమీద ప్రశాంతంగానే ఈ మూడురోజుల పందాల పండుగ సాగిపోయింది. ఇక అక్కడ,ఇక్కడ అన్న తేడా లేకుండా అలవాటు ఉన్న అన్నిప్రాంతాల్లోనూ ఒక మోస్తారు నుంచి పెద్దపందాలే సాగిపోయాయి. ఆ పందాల చుట్టూరా వాటిని తలదనే్నలా జూదాల ప్రక్రియ సాగిపోయింది. అసలు పందాల కన్నా ఈ జూదాల్లోనే భారీగా కరెన్సీ చేతులు మారినట్లు కన్పించింది. దీనికితోడు బెల్టుషాపుల నిరంతర మద్యం సరఫరా సాగిపోయింది. పందెగాళ్లకు అడిగినంత మద్యం, తిన్నంత తిండి, అడుకున్నంత జూదం ఈ మూడురోజులపాటు దక్కాయంటే ఆశ్చర్యం ఏమాత్రం కాదు. డెల్టా పరిధిలోని వెంప, భీమవరం, ఐ భీమవరం, ఉండి, మహాదేవపట్నం, పాలకొల్లు, యలమంచిలి, వీరవాసరం, మొగల్తూరు, నరసాపురం, ఆచంటతోపాటు మెట్టలోని జంగారెడ్డిగూడెం, చింతలపూడి, కామవరపుకోట, పెదవేగి, ద్వారకాతిరుమల, దెందులూరు, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి తదితర మండలాల్లో కోడిపందాలు యదేచ్చగా సాగిపోయాయి. కొన్నిప్రాంతాల్లో పందాల నిర్వాహకులకు పోలీసుల నుంచి పూర్తిస్ధాయి సహకారం అందటంతో రాత్రి, పగలు అన్న తేడా లేకుండా ఫ్లడ్‌లైట్ల వెలుగుల్లో కూడా పందాలు నిర్వహించారు. తొలిరోజు మప్టీలో కన్పించిన పోలీసులు ఆతర్వాత నుంచి కన్పించటం మానివేశారు. కొంతమంది పోలీసులు అయితే బరుల వద్దకు చేరి పందాలను వీక్షించటం, కొందరు పందాల్లో పాల్గొనడం కూడా జరిగింది. ఖమ్మం, గుంటూరు, తెనాలి, విజయవాడ, హైదరాబాద్ వంటి ప్రాంతాల నుంచి ఈసారి పెద్దఎత్తున ఔత్సాహికులు పందాలను వీక్షించడానికి వచ్చారు. మరోవైపు పక్క జిల్లాల నుంచి పందెగాళ్లు కూడా పెద్దసంఖ్యలో జిల్లాకు వచ్చారు.
విఆర్వో ట్యాబ్ గోవిందా...
కోడిపందాల సందట్లో ఒక విఆర్వో భూ, రెవిన్యూ రికార్డులు నమోదు చేసుకున్న ట్యాబ్‌ను పోగొట్టుకున్నారు. ఆడడానికో, చూడడానికో వెళ్లిన ఆ విఆర్వో చివరకు పందాల సరదా తీరకపోగా అధికారికంగా ఉండాల్సిన ట్యాబ్‌ను పొగొట్టుకుని గగ్గోలు పెట్టడం వెంపలో జరిగిన కోడిపందాల సందర్భంగా సంచలనం సృష్టించింది. చివరకు నిర్వాహకులు పలుమార్లు మైక్ ఎనౌన్స్‌మెంట్ ఇచ్చినా ఆయన ట్యాబ్ మాత్రం లభ్యం కాలేదని తెలుస్తోంది.