పశ్చిమగోదావరి

జనం సహనాన్ని పరీక్షించవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఫిబ్రవరి 20 : పశ్చిమ ప్రజానీకానికి సహనం ఎక్కువ... నిర్ణీత కాల వ్యవధిలో సమస్యలను పరిష్కరించకపోయినా ఎంతో ఓపిగ్గా ఎదురు చూస్తూంటారే తప్ప అధికార్లను ప్రశ్నించరని దానిని అలుసుగా తీసుకోవద్దని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ అధికారులకు హితవు పలికారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం జిల్లాస్థాయి అధికారుల సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన ప్రజా సమస్యల పరిష్కార తీరును సమీక్షించారు. నిర్ణీత కాల వ్యవధిలో సమస్యలు పరిష్కరిస్తామని మీ-సేవ కేంద్రాలు ఏర్పాటుచేయడం జరిగిందని అక్కడ ప్రజలురుసుము చెల్లించి ప్రభుత్వపరంగా సేవలు పొందడానికి దరఖాస్తులుచేస్తే వాటిని పరిష్కరించడంలో నెలల తరబడి జాప్యం చేస్తే ఎలా అని కలెక్టర్ ప్రశ్నించారు. భవిష్యత్తులో ప్రజలు సహనం కోల్పోకుండా బాధ్యతగా నిర్ణీత కాల వ్యవధిలో సమస్యలు పరిష్కారానికి క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ హితవు పలికారు. ప్రజాసమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహించవద్దని మీ-సేవ కేంద్రాల ద్వారా వచ్చిన సమస్యలను నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించకపోతే ప్రస్తుతం ఆ శాఖ జిల్లా అధికారికి ఒక్కొక్క సమస్యకు పది రూపాయలు పెనాల్టీ విధిస్తున్నామని ఇకపై దరఖాస్తు దారునికి ఎంత ఖర్చయిందో ఆ ఖర్చు ఇచ్చేలా నిర్ణయం చేస్తామని కావున ప్రతి అధికారి తమ పరిధిలో ప్రజా ఫిర్యాదులను పరిష్కరించాలని కోరారు. సర్వే శాఖలో నాలుగు సమస్యలు పెండింగ్‌లో వుండటాన్ని కలెక్టర్ తప్పు పట్టారు. మీ- సేవా కేంద్రాల ద్వారా నిర్ణీత కాల వ్యవధిలో ప్రజల దరఖాస్తులను పరిష్కరించాల్సి వుందని, కాని సకాలంలో స్పందించకపోతే ఎలా అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలను ఒక మనిషిగా గౌరవించి సమస్యను ఎలా పరిష్కరించాలో ఆలోచిస్తే ప్రజలు ఆనందంగా ఇంటికి వెళతారని అంతేతప్ప పది సార్లు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ త్రిప్పుకోవద్దని ఆయన హితవు పలికారు. ట్రాన్స్‌కో పరిధిలో 1825 సమస్యలు పెండింగ్‌లో వుండటాన్ని కలెక్టర్ తప్పుపట్టారు. ఏదేమైనా సమస్య పరిష్కరించాలని ఒకటి, రెండు సార్లు చెపుతామే తప్ప 20 సార్లు చెప్పినా చేయకపోతే ఆ అధికారిని ఏమనాలో ఊహించుకోవాలని కోరారు. మీ-కోసం అర్జీలను పరిష్కరించడంలో ఖచ్చితంగా సెల్ఫీ, వీడియో అప్‌లోడ్ చేయాలని ప్రజలకు సత్వర సమస్యల పరిష్కారం జరగాలన్నదే ప్రధాన ఉద్దేశ్యమని చెప్పారు. ప్రజల మనోభావాలకనుగుణంగా క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో ఇప్పటి వరకు ఆరు లక్షల ఫైల్స్ ఆన్‌లైన్ చేశారని, ఇంకా 4.17 లక్షల ఫైల్స్ రికార్డురూముల్లో ఉన్నాయని వాటిని కూడా స్కాన్ చేసి ఆన్‌లైన్‌లో పొందుపర్చాలని సూచించారు. ఏళ్ల తరబడి రికార్డురూముల్లో ఫైల్స్ అలానే ఉంచితే వాటికి చెదలు పట్టి పనికి రాకుండా పోతాయని అలా కాకుండా ప్రతీ ఫైల్‌ను జాగ్రత్తగా స్కాన్ చేసి ఆన్‌లైన్‌లో భద్రపర్చాలని సూచించారు. వారంలో ఒక్క ఫైల్ కూడా ఆన్‌లైన్ చేయని శాఖలెన్నో వున్నాయని వచ్చే వారం ప్రభుత్వ కార్యాలయాలకు ఆకస్మికంగా వస్తా... ఫైల్స్ చూస్తానని తప్పుడు సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. బయోమెట్రిక్ హాజరు విధానం ఎవరికీ మినహాయింపు లేదని అన్ని శాఖలు ఖచ్చితంగా ఈ విధానాన్ని అమలుచేయల్సిందేనని స్పష్టం చేశారు. సమావేశంలో జెసి పి కోటేశ్వరరావు, జెసి-2 షరీఫ్, డి ఆర్‌వో కె హైమావతి, హౌసింగ్ పిడి శ్రీనివాసులు, డి ఎంహెచ్‌వో డాక్టర్ కోటేశ్వరి, డిసిహెచ్ ఎస్ డాక్టర్ శంకరరావు, డి ఇవో గంగాభవాని, డిపివో సుధాకర్, డ్వామా పిడి వెంకటరమణ, పంచాయితీరాజ్ ఎస్ ఇ మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.
టెలికాన్ఫరెన్స్‌లో నూతన కమిటీల ప్రమాణ స్వీకారం
టిడిపి జిల్లా అధ్యక్షురాలు తోట
మొగల్తూరు, ఫిబ్రవరి 20: తెలుగుదేశం పార్టీ జిల్లాస్థాయిలో టెలికాన్ఫరెన్స్ ద్వారా నూతన కమిటీల ప్రమాణ స్వీకారం చేసే ఆలోచన ఉందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి పేర్కొన్నారు. సోమవారం మండలంలోని శేరేపాలెం గ్రామంలో మాజీ జడ్పీటీసీ నిప్పలేటి లక్ష్మీదేవి స్వగృహంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజాసేవ కోసం రోజుకు 18 గంటలు కష్టపడుతూ అర్హులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. జిల్లాలో సంస్థాగత కమిటీల ఎంపిక విధానంలో పార్టీ నాయకత్వం గతంలో మాదిరిగా కాకుండా మార్పుచేసినట్టు చెప్పారు. గ్రామ స్థాయిలో టిడిపి శ్రేణుల అభిప్రాయాల నివేదికను రాష్ట్ర పార్టీ దృష్టికి తీసుకువెళ్లడం, వారు పరిశీలించిన అనంతరం కమిటీలను ఎంపిక చేస్తారని ఆమె తెలిపారు. శేరేపాలెం గ్రామాభివృద్ధికి గ్రామ దాత డాక్టర్ నిప్పలేటి మాణిక్యాలరావు చేసిన కృషిని ఈ సందర్భంగా ఆమె అభినందించారు. సమావేశంలో ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు, ఎఎంసి ఛైర్మన్ రాయుడు శ్రీరాములు, జడ్పీటీసీ జి నాగరాజు, సర్పంచ్ కత్తుల వాసు తదితరులు పాల్గొన్నారు.
పట్టిసీమను పరిశీలించిన కవులు, రచయితలు
పోలవరం, ఫిబ్రవరి 20: పట్టిసీమ ఎత్తిపోతల పథకంను, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాలను కృష్ణాజిల్లా కవులు, రచయితల సంఘం సభ్యులు సోమవారం సందర్శించారు. పట్టిసం ఎత్తిపోతల పథకం వద్దకు కృష్ణాజిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి జివి పూర్ణచంద్ ఆధ్వర్యంలో 30 మంది కవులు, రచయితలు వచ్చారు. ముందుగా ఎత్తిపోతల నమూనాను పరిశీలించిన వారికి డిఇ భాస్కర రామకృష్ణ, ఎఇ లలిత ఎత్తిపోతల పథకం గురించి వివరించారు. ఈ సందర్భంగా పూర్ణచంద్ మాట్లాడుతూ కృష్ణాడెల్టాను ఆదుకున్న పట్టిసీమ ఎత్తిపోతలను మేధావులు సందర్శించాలని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కోరారని, అందుకు ఆయన అన్ని ఏర్పాట్లు చేశారన్నారు. రాష్ట్రానికి నీటి సమస్య పరిష్కరించే పోలవరం ప్రాజెక్టు ప్రాంతాలను కూడ సందర్శించాలని మంత్రి కోరారన్నారు. అనంతరం వారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాలకు వెళ్లారు.
సంస్థాగత ఎన్నికల్లో పార్టీలు బిజీ బిజీ
* ఊసేలేని జనసేన* అలంకార ప్రాయంగా వైసిపి * ముందంజలో టిడిపి, బిజెపిలు

భీమవరం, పిబ్రవరి 20: రాజకీయ పార్టీలు సంస్థాగత ఎన్నికలకు ఎంత ప్రాధాన్యత ఇస్తాయో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం సంస్థాగత ఎన్నికల పండుగ జిల్లాలో కొనసాగుతోంది. వీటిలో టిడిపి సంస్థాగత ఎన్నికల్లో దూసుకుపోతుంటే..దాని వెనకాలే మిత్రపక్షమైన బిజెపి పోటీ పడుతోంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్ధాపించిన జనసేన రాజకీయ పార్టీలో కమిటీల ఊసేలేదు. గత ఎన్నికల్లో పోటీచేసి ప్రతిపక్ష స్థానాన్ని పోషిస్తున్న వైసిపి కమిటీలు అలంకార ప్రాయంగానే ఉన్నాయి. ఇక కాంగ్రెస్ కొంతలో కొంత నాయకులను,కార్యకర్తలకు బాధ్యతలను అప్పగిస్తూ తన ఉనికిని జిల్లాలో చాటుకుంటోంది. సంస్ధాగత ఎన్నికలకు సిఎం నారా చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాటి నుంచి జిల్లాలోని టిడిపి అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో గ్రామస్థాయి నుంచి వార్డు, మండల, పట్టణ స్ధాయి వరకు కమిటీలు వేసేస్తున్నారు. అంతే కాకుండా జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో ఉండే మండలాలు కూడా కలవడంతో ఆ మండలాల్లో టిడిపి కమిటీలను పటిష్టంగ ఏర్పాటుచేసుకుంది. ఇక నియోజకవర్గ, జిల్లాస్ధాయి ఎన్నికలకు తేదీలను కూడా పార్టీ ఖరారుచేసిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు జిల్లాలో 1202 గ్రామ కమిటీలకుగాను 800 కమిటీలను టిడిపి పూర్తిచేసుకుని ప్రధమ స్ధానంలో నిలిచింది. ఇక బిజెపి సంస్థాగత ఎన్నికలను ఇంతకు ముందే పూర్తిచేసుకుంది. అన్ని గ్రామ, మండల స్ధాయి కమిటీలు పూర్తి చేసుకుని ముందుకు వెళ్తున్నా..జిల్లాస్ధాయి కమిటీ గాల్లో ఉంది. దీంతో బిజెపి కమిటీలకు పూర్తిగా ఒక రూపం దాల్చలేదని చెప్పవచ్చు. ఆ కమిటీలను పూర్తిచేసుకున్న బిజెపి బూత్ స్ధాయి కమిటీలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఆలిండియా పార్టీ అధ్యక్షులు అమిత్ షా ఆదేశాల మేరకు జిల్లాలో బూత్‌స్ధాయి కమిటీలను వేసుకుంటూ ముందుకు వెళ్తోంది. ఇప్పటికే ఈ కమిటీలను పూర్తిచేసుకోవాల్సి ఉండగా, అనివార్య కారణాల రీత్యా ఆలస్యమైంది. ఫిబ్రవరి నెలాఖరుకు పూర్తి చేసుకోనుంది బిజెపి. ఇక జనసేన పార్టీ కమిటీల ఊసే లేదు. రాజకీయ పార్టీగా ఆవిర్భవించిన తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమిటీలను వేస్తారని ఆ పార్టీకి చెందిన వారంతా సేవా కార్యక్రమాలు చేయడం ప్రారంభించారు. కానీ ఇంత వరకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వద్ద నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. 2019 ఎన్నికల సమయం సమీపిస్తున్న తరుణంలో ఇప్పటి నుంచే పార్టీని సంస్ధాగతంగా పటిష్టం చేసుకోకపోతే ఆ పార్టీకి గత ఎన్నికల్లో వైసిపికి ఎదురైన అనుభవాలే ఎదురవుతాయని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక జగన్మోహన్‌రెడ్డి స్ధాపించిన వైసిపికి ఆది నుంచి పూర్తిస్ధాయిలో కమిటీల్లేవ్. పార్టీ తరుపున అన్ని విభాగాల్లోని కీలకమైన పోస్టులను మాత్రమే జగన్మోహన్ రెడ్డి భర్తీచెయ్యడం జరిగింది. మిగిలినవన్నీ ఖాళీగానే ఉన్నాయి. గతంలో కొత్తపల్లి సుబ్బారాయుడు ఆ పార్టీ జిల్లా అధ్యక్షునిగా ఉన్నా ఆయన టిడిపిలో చేరారు. దీంతో ఆ పోస్టు ఖాళీగా ఉండటంతో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నానికి ఆ బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసిపి పూర్తిస్ధాయిలో కమిటీలతో ఎన్నికలకు వెళ్తే విజయం తధ్యమంటున్నారు. ఇక కాంగ్రెస్ జిల్లాలో తాము ఉన్నామంటోంది. జిల్లా అధ్యక్షులు రషీయుల్లా భేగ్ తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు. పార్టీలో ఉన్న వారికి పదవులు ఇస్తూ వారిని కాపాడుకుంటున్నారు. మొత్తం మీద అటు తెలుగుదేశం, ఇటు భారతీయ జనతా పార్టీలు కమిటీ పనుల్లో బిజీ బిజీగా ఉన్నాయి.