పశ్చిమగోదావరి

53 శాతం మందికి సంతృప్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మే 1 : జిల్లాలో ప్రజా సంక్షేమానికి, వారికి సేవలందించేందుకు ఎంతగానో కష్టపడుతున్నామని, ఈ పరిస్థితుల్లో 53 శాతం మంది పాలనపై సంతృప్తితో వున్నట్లు ఇటీవల ఒక సర్వేలో తేలిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ తెలిపారు. అయితే దీన్ని 80 శాతానికి తీసుకురావాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. ఎంత కష్టపడినా కొంతమంది చేస్తున్న అవినీతి చేటు తెస్తోందని పేర్కొన్నారు. ఇక నుంచి అవినీతి పరుల భరతం పట్టేందుకు కఠిన వైఖరి తప్పదని స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన జిల్లాస్థాయి అధికారుల సమన్వయ కమిటీ సమావేశానికి జిల్లా కలెక్టర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో సమర్ధతతో ఎంత కష్టపడుతున్నారో దానితోపాటు కొంతమంది చేసే అవినీతి వలన జిల్లాకు చెడ్డపేరు వస్తోందని దీని వలన తలెత్తుకోలేకపోతున్నామన్నారు. నల్లజర్ల మండలంలో 90 శాతం ప్రజలకు మేలు జరిగేలా నిర్మాణాత్మకమైన ప్రగతి సాధించామని ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో రెవిన్యూ ఉద్యోగి అవినీతి బట్టబయలు కావడంతో చేసిన అభివృద్ధి కన్నా అవినీతి ప్రధానాంశమైందని చెప్పారు. జిల్లా అధికార యంత్రాంగం అహర్నిశలు కష్టపడి ఎంతో సమర్ధతతో పనిచేస్తున్నదనే భావనతోపాటు అవినీతిలో కూడా ముందంజలో వున్నదన్న మాట వినిపిస్తోందని చెప్పారు. జిల్లాలో అవినీతిని నిర్మూలించడానికి ఇకపై అవినీతిపరుల విషయంలో కఠిన వైఖరిని అవలంభిస్తామని ఆయన హెచ్చరించారు. జిల్లాలో ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో 53 శాతం ప్రజలు సంతృప్తిగా వున్నారని, 13 శాతం ప్రజలు ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారని మిగిలిన 34 శాతం ప్రజలు ఫరవాలేదని పరిపాలన బాగుందని అభిప్రాయం వ్యక్తం చేశారని, రాబోయే రోజుల్లో 80 శాతం ప్రజలు ప్రభుత్వ విధానాలపై సంతృప్తి వ్యక్తం చేసేలా నిర్మాణాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటామని అవినీతి అధికారుల భరతం పడతామని హెచ్చరించారు. జిల్లాలో 80 శాతం ప్రజలు ఆనందంగా సంతోషంగా ప్రభుత్వ సేవలు పొందేలా నిర్మాణాత్మకమైన నిర్ణయాలు అమలుచేస్తామని చెప్పారు. జిల్లాలో అవినీతి తిమింగళాల ఆటకట్టిస్తామని, అభివృద్ధి ముసుగులో అక్రమాలకు పాల్పడే వారిని ఉపేక్షించబోమని ప్రజా సమస్యలు పరిష్కారంలో పూర్తిస్థాయి పారదర్శకత ఉండేలా చూస్తామని ఎక్కడా కూడా పైసా సొమ్ము ఇవ్వకుండా పనులు జరిగేలా పటిష్టమైన యంత్రాంగాన్ని రూపొందిస్తామని అప్పుడే జిల్లా యంత్రాంగంపై ప్రజల్లో సదభిప్రాయం కలుగుతుందని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా అవినీతి పరుల విషయంలో కఠినంగా వ్యవహరించే పరిస్థితులు కనిపిస్తున్నాయని కావున జిల్లాలో డబ్బులు తీసుకుని ప్రజలకు సేవలందించే అక్రమార్కుల భరతం పడతానని ఇప్పటికైనా అవినీతికి పాల్పడే ఉద్యోగులు అధికారులు తమ విధానాలు మార్చుకుని ప్రజలు ఆశ్చర్యపడేలా సత్వర సమస్యల పరిష్కారంపై దృష్టి కేంద్రీకరించాలని కోరారు.
జిల్లాలో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని జీతాల బిల్లుతో అనుసంధానం చేస్తామని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో 60 నుంచి 70 శాతం మంది మాత్రమే వైద్య ఆరోగ్య శాఖలో బయోమెట్రిక్ హాజరు వేస్తున్నారని, మిగిలినవారంతా నెట్ సమస్య పేరుతో ఆఫీసులకే రావడం లేదన్నారు. ఇలా ఉంటే ప్రజలకు వైద్య సేవలు అందుతాయని ప్రశ్నించారు. తొలి దశగా వైద్య, ఆరోగ్య శాఖలో ఈ విధానాన్ని అమలుచేస్తున్నామని, దశల వారీగా అన్ని శాఖలకు వర్తిస్తామని చెప్పారు. దీని వలన జీతాల కోసమైనా ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు నిర్ణీత సమయానికి కార్యాలయానికి వచ్చే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ప్రతీ శాఖలోనూ 80 నుంచి 90 శాతం మధ్య బయోమెట్రిక్ హాజరు వుండి తీరాలని, లేకుంటే ఆ శాఖ ఉన్నతాధికారే బాధ్యత వహించాలని చెప్పారు. జిల్లాలో ఇరిగేషన్ విభాగంపై రైతాంగంలో తీవ్ర అసంతృప్తి కనిపిస్తోందని జిల్లా కలెక్టర్ భాస్కర్ తెలిపారు. ప్రతీ మండలానికి ఒక రిటైర్డ్ ఇ ఇని కాంట్రాక్టు పద్దతిపై తీసుకుని సేద్యపునీటి పధకాలను సకాలంలో అమలు చేయాలని, నీరు - చెట్టు కార్యక్రమం కింద ఆక్రమణలు తొలగించి పనులు వేగవంతం చేయాలని చెప్పారు. సమావేశంలో జెసి పి కోటేశ్వరరావు, జెసి-2 షరీఫ్, డి ఆర్‌వో కె హైమావతి, డి ఆర్‌డి ఏ పిడి కె శ్రీనివాసులు, రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ ఎస్‌ఇ మాణిక్యం, గృహ నిర్మాణ శాఖ పిడి శ్రీనివాస్, డిపివో సుధాకర్, డిఎంహెచ్ ఓ డాక్టర్ కోటేశ్వరి, డిసిహెచ్ ఎస్ డాక్టర్ శంకరరావు, డిఇవో గంగాభవానీ తదితరులు పాల్గొన్నారు.

అసంఘటిత కార్మికుల కోసమే చంద్రన్న బీమా
మాజీ మంత్రి సుజాత
జంగారెడ్డిగూడెం, మే 1: రాష్ట్రంలో రెండు కోట్ల మంది అసంఘటిత కార్మికుల కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చంద్రన్న బీమా పథకం అమల్లోకి తెచ్చారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పీతల సుజాత అన్నారు. పట్టణంలో తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ (టిఎన్‌టియుసి) ఆధ్వర్యంలో సోమవారం జరిగిన మేడే వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. స్థానిక ఆర్డీఒ కార్యాలయం వద్ద ఆమెకు ఆర్డీఒ ఎస్.లవన్న, టిడిపి సీనియర్ నేత మండవ లక్ష్మణరావు, పట్టణ టిడిపి అధ్యక్షుడు షేక్ ముస్త్ఫా ఆమెకు స్వాగతం పలికారు. అక్కడి నుండి ఏలూరు రోడ్డు, పంగిడిగూడెం రోడ్లలో సుజాత ఆటో నడుపుతూ ఆటో ర్యాలీలో పాల్గొన్నారు. స్థానిక హెడ్ పోస్ట్ఫాసు వద్ద గల వినాయకుని గుడి వద్ద టిఎన్‌టియుసి పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సుజాత మాట్లాడుతూ కార్మికులు ఐక్యంగా ఉంటూ హక్కులు సాధించుకోవాలన్నారు. పట్టణ టిడిపి అధ్యక్షుడు షేక్ ముస్త్ఫా అధ్యక్షతన జరిగిన ఈ సభలో పార్టీ సీనియర్ నేత మండవ లక్ష్మణరావు, మున్సిపల్ ఛైర్‌పర్సన్ బంగారు శివలక్ష్మి కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలుపుతూ ప్రసంగించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారం పొందిన జానపద కళాకారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్‌ఆర్ కృష్ణబాబును మాజీ మంత్రి సుజాత సత్కరించారు. అనంతరం సుజాత సిఐటియు అనుబంధ మున్సిపల్ వర్కర్ల యూనియన్ ర్యాలీలో పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి నంబూరి రామచంద్రరాజు, జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు అబ్బిన దత్తాత్రేయ, పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు ముళ్ళపూడి గంగాధర శ్రీనివాసరావు, జిల్లా కార్యవర్గ సభ్యుడు తూటికుంట దుర్గారావు, పార్టీ నేతలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

మాయోపాయమా!
ఉన్నచోటే ఉండేందుకు ప్రయత్నాలు - హడావిడిగా సంఘాల ఎన్నికలు

ఏలూరు, మే 1 : ఇప్పుడంతా బదిలీల ఫీవర్ యంత్రాంగాన్ని ఆవరించుకుని ఉంది. ఈ బదిలీల్లో కావాల్సిన పోస్టు దక్కించుకునేందుకు ఒకరకంగా ఉన్నచోటే ఉండేందుకు మరో రకంగా ఉద్యోగులు, అధికారులు నానా ఫీట్లు చేస్తున్నట్లే కనిపిస్తోంది. అయితే ఇదంతా సాధారణ అధికారులు, ఉద్యోగులు చేసే కుస్తీ అయితే నేతలుగా ముద్రపడ్డ వారికి మాత్రం మరో తరుణోపాయం అందుబాటులోనే ఉండనేవుంది. ఇప్పుడు ఆ ఆయుధానే్న హడావిడిగా బయటకు తీసి వాడేస్తున్నారు. ఇప్పుడు జిల్లాలో చాలాచోట్ల ఉద్యోగ సంఘాలకు సంబంధించి ఆయా స్థానిక శాఖల ఎన్నికలు హడావిడిగా జరిగిపోతున్నాయి. దానిలో భాగంగానే ఏలూరులోనూ మేడే సెలవు రోజున ఎన్నికల ప్రక్రియకు జడ్పీ సంఘం శ్రీకారం చుట్టేసింది. ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్న సంఘాలు అనేకం ఉన్నాయనే చెప్పాలి. ఇంతకీ ఇంత హడావిడిగా ఎన్నికలు ఎందుకు జరుగుతున్నాయంటే సాంకేతికంగా సంఘ నిబంధనల ప్రకారం ఎన్నికలు జరిగే సమయం ఆసన్నమైన సంఘాలు కొన్నైతే, మరికొన్ని చోట్ల నేతల వెసులుబాటు కోసం ఎన్నికలను హటాత్తుగా తెరపైకి తీసుకువచ్చిన వైనాలు ఇంకొన్ని. ఈ విధంగా ఆయా సంఘాల కార్యవర్గంలో కీలక పోస్టుల్లో ఉన్నవారికి సాధారణ బదిలీల నుంచి మినహాయింపు లభిస్తుంది. ఈ మినహాయింపును ఇప్పటికిప్పుడు ఉపయోగించుకునేందుకే కొన్ని ఎన్నికలు జరుగుతున్నాయన్న అనుమానాలు లేకపోలేదు. ఎందుకంటే కొన్నిచోట్ల కీలకపోస్టులకు ఎన్నికైన వారు ఇప్పుడు బదిలీల జాబితాలో స్పష్టంగా ఉండాల్సిన వారే. ఆ విధంగా వారంతా కార్యవర్గం దృష్టిలో బదిలీల బెడద నుంచి తప్పించుకునేందుకు ఈ ఎన్నికలను ఒక మార్గంగా వాడేసుకుంటున్నారు. ఈ విధంగానే రానున్న రోజుల్లోనూ మరికొన్ని స్థానిక సంఘాల ఎన్నికలు హఠాత్తుగా తెరపైకి వచ్చినా రావచ్చు. తాజాగా సోమవారం స్థానిక జడ్పీ కార్యాలయంలో జిల్లా పంచాయితీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం జిల్లా పరిషత్ యూనిట్‌కు ఎన్నికలు జరిగాయి. దీనిలో కీలకమైన పోస్టులో అంతకన్నా కీలకమైన వ్యవహారాలు నడిపిస్తున్న ఉద్యోగ నేత ఎన్నిక కావడంతో ఉద్యోగ వర్గాల్లో ఈ ప్రచారం మొదలైందనే చెప్పాలి. స్థానిక జడ్పీలో జరిగిన ఈ ఎన్నికల్లో జిల్లా పరిషత్ యూనిట్ అధ్యక్షులుగా పివివి ప్రకాష్, అసోసియేట్ అధ్యక్షులుగా వి విజయకుమార్, ఉపాధ్యక్షులుగా వై సుజాత, కార్యదర్శిగా పిఎస్‌ఎస్ సింహాద్రిరావు, జాయింట్ సెక్రటరీగా కెవి జాన్సన్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా కెవి సంతోష్‌కుమార్, కోశాధికారిగా ఎం సత్యసాయిరామ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరు మూడు సంవత్సరాలపాటు పదవుల్లో కొనసాగనున్నారు.