పశ్చిమగోదావరి

తల్లడిల్లుతున్న ఏజెన్సీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూలై 15: వరుస వర్షాలతో జిల్లావ్యాప్తంగానే ఇబ్బందికర పరిస్దితులు తలెత్తగా ప్రధానంగా వ్యవసాయరంగం దారుణమైన నష్టాల దిశగా పయనిస్తోంది. దీనికి మించి ఏజన్సీ ప్రాంతం దాదాపుగా తల్లడిల్లే పరిస్ధితి తలెత్తింది. భారీవర్షాలకు ఒక్కసారిగా చేరుకున్న వాననీటికితోడు పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు తీవ్ర నష్టాలను మిగులుస్తున్నాయి. ఈప్రాంతంలో సాధారణ జనజీవనం కూడా ఆస్తవ్యస్ధం అయ్యే పరిస్దితులు నెలకొన్నాయి. పలుచోట్ల ఏజన్సీ గ్రామాలకు వెళ్లే రహదారులు ఛిద్రం కావటంతో పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. ఏజన్సీలో ఆర్టీసీ బస్సులను కూడా నిలిపివేశారు. దీనికితోడు పలు గ్రామాల్లో విద్యుత్ కోతలు ప్రజలను మరింత ఇబ్బందికర పరిస్దితుల్లోకి నెట్టివేస్తున్నాయి. ఏదీఏమైనా ఈవరుస వర్షాలు సామాన్య ప్రజానీకాన్ని తీవ్ర ఇబ్బందుల్లో పడవేశాయి. ఇక వ్యవసాయరంగాన్ని చూస్తే గత సీజన్‌లో పండిన పంటతో కొంత సంతోషంగా ఉన్నా ధర విషయంలో రైతులకు నిరాశ తప్పలేదు. అయినప్పటికీ ఖరీఫ్‌కు సన్నద్ధమై పూర్తిస్దాయిలో నారుమళ్లు పోసుకుని పంటకు సిద్ధమైన రైతుల పరిస్దితి ఇప్పుడు ఆగమ్యగోచరంగా మారిపోయింది. ఎక్కడికక్కడ వాననీరు పొలాల్లోనే నిలిచిపోవటం, కిందకు వెళ్లే మార్గాలు కూడా మూసుకపోవటంతో గత నాలుగైదు రోజులుగా నారుమళ్లు నీటిలోనే నానుతున్నాయి. ఈకారణంగా చాలాచోట్ల నారుమళ్లు పూర్తిగా దెబ్బతిని ఉపయోగించే అవకాశాలు రైతులు కోల్పోయారు. మరోవైపు ఇప్పటికిప్పుడు మరోసారి నాట్లు వేసేందుకు ప్రయత్నిద్దామన్నా నారు దొరికే పరిస్ధితి ఎక్కడా కన్పించటం లేదు. ఈకారణంగా ఈసారి ఖరీఫ్ ఏవిధంగా ముందుకెళుతుందన్నది ప్రశ్నార్ధకంగా మారిపోయింది. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా వ్యవసాయరంగం పరిస్దితి చూస్తే అధికారిక లెక్కల ప్రకారమే 362 హెక్టారులలో వరి నారుమళ్లు దెబ్బతిన్నాయి. 1098 హెక్టారులలో వరి నారుమళ్లు ముంపునకు గురయ్యాయి. 2714 హెక్టారులలో వరినాట్లు ముంపునకు గురయ్యాయి. ఆచంట, ఇరగవరం, అత్తిలి, తణుకు, పెరవలి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, పెంటపాడు, గణపవరం, భీమడోలు, ఉంగుటూరు, దెందులూరు, పెదపాడు, కొవ్వూరు, గోపాలపురం, చాగల్లు, ఉండ్రాజవరంలలో వేసిన నాట్లు కూడా పూర్తిగా నీటమునిగాయి. ఈపరిస్ధితి చివరకు వ్యవసాయరంగాన్ని పూర్తి ప్రశ్నార్ధకంలోకి నెట్టివేసింది. వరి పరిస్ధితే ఇలా ఉందంటే మొక్కజొన్నతోపాటు ఇతర పంటల పరిస్దితి మరింత ఆధ్వాన్నంగా మారింది. తొలకరి సజావుగా ముందుకు సాగటంతో అన్ని పంటల రైతాంగం వ్యవసాయానికి పూర్తిస్దాయిలో పెట్టుబడులతో సిద్ధమయ్యారు. అయితే చివరకు పెట్టుబడుల స్ధాయిలోనే వరుస వర్షాలు వారిని కుదిపివేయటంతో ఇప్పుడు పెట్టిన పెట్టుబడి నిరర్ధకంగా మారిపోయే పరిస్ధితి తలెత్తింది. ఈకారణంగా వరితోపాటు అన్నిపంటల రైతులు కూడా ఇప్పుడు కష్టాల్లోనే ఉన్నారని చెప్పాలి. దీనికితోడు డెల్టా, ఏజన్సీ పరిధిల్లోని డ్రైన్లలో చాలావరకు స్తంభించిపోవటంతో పొలాల్లో ఉన్న నీరు కిందకు దిగకపోవటం ఒక సమస్య కాదు, దీనికితోడు నీరు పారే మార్గం లేక ఆ వాననీరు అంతా నివాసప్రాంతాల వైపు ప్రయాణిస్తోంది. ఈకారణంగా కొన్ని డెల్టా పరిధిలోని మండలాల్లో వాననీటికి పల్లపుప్రాంతాలు కూడా పూర్తిగా జలమయమయ్యే పరిస్ధితి నెలకొంది. అయితే ఆదివారంనాటికి కొంత పరిస్దితి కుదుటపడినట్లు కన్పిస్తున్నా ఈరెండురోజుల్లో మరోసారి భారీవర్షాలు పలకరిస్తే మాత్రం జిల్లావ్యాప్తంగానే తీవ్ర ఇబ్బందికర పరిస్ధితులు తలెత్తుతాయన్న అనుమానాలు ఉన్నాయి. అంతేకాకుండా రానున్న రోజుల్లో అల్పపీడనాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాస్తవ్రేత్తలు ఇప్పటికే ప్రకటించటం, వాతావరణం కుదుటపడే పరిస్దితి కన్పించకపోవటంతో రైతుల పరిస్ధితే కాకుండా సామాన్య ప్రజానీకం పరిస్ధితి కూడా అగమ్యగోచరంగానే మారిపోయింది. గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు ముఖ్యంగా ఏజన్సీ ప్రాంతం దారుణంగా దెబ్బతిందని చెప్పవచ్చు. జంగారెడ్డిగూడెం మండలం కృష్ణంపాలెంలోని ఎస్సీ పేట పూర్తిగా నీటమునగటంతో ఇళ్లల్లోకి కూడా నీరు చేరిపోయింది. అధికారులు ప్రొక్లెయినర్లు పెట్టి నీటిని తోడిస్తున్నారు. చిన్నంవారిగూడెంలో 200 సంవత్సరాలనాటి వేపచెట్టు ఒక ఇంటిపై పడిపోయింది. ఆసమయంలో ఇంటిలో ఎవరు లేకపోవటంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఏజన్సీలో జల్లేరు, బైనేరు, పెదవాగు పొంగిపొర్లుతున్నాయి. ఈకారణంగా చాలా ఏజన్సీ గ్రామాలకు రాకపోకలు బంద్ అయిపోయాయి. జీనజీవనం స్తంభించింది. బుట్టాయిగూడెం మండలంలోని అంతర్వేదిగూడెం, రెడ్డిగణపవరం తదితర 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొన్నిచోట్ల పూరిల్లు నెలకూలాయి. ఆర్టీసీ బస్సులు రద్దు కావటంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వేలేరుపాడు కొయిర రోడ్డు పూర్తిగా దెబ్బతినటంతో రాకపోకలు నిలిచిపోయాయి. పోలవరం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతుండటంతో అధికారులు ముందుజాగ్రత్త చర్యలుగా లాంచీల రాకపోకలను రద్దు చేశారు. కొవ్వూరులోని గోష్పాదక్షేత్రం వద్ద శివలింగం వరకు నీటిమట్టం రావటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
వర్షపాతం వివరాలు
గడచిన 24 గంటల్లో జిల్లాలో 1916.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కుకునూరు మండలంలో 124 మిమిల వర్షపాతం కురిసింది. మండలాల వారీగా వర్షపాతం వివరాలు ఈ విధంగా వున్నాయి. వేలేరుపాడు 90.8 మిమి, టి నర్సాపురం 79.8, కామవరపుకోట 75.4, చింతలపూడి 70.2, జీలుగుమిల్లి 67.8, బుట్టాయిగూడెం 64.2, జంగారెడ్డిగూడెం 61.4, తాళ్లపూడి 56.2, కొయ్యలగూడెం 51.4, దేవరపల్లి 50.8, నల్లజర్ల 49.6, కొవ్వూరు 48.6, నిడదవోలు 47.8, చాగల్లు 47.4, లింగపాలెం 45.2, గోపాలపురం 36.8, పెదపాడు 36.8, తాడేపల్లిగూడెం 36.6, పెదవేగి 36, భీమడోలు 35.8, ఉంగుటూరు 34.2, దెందులూరు 33.4, పెనుగొండ 32.4, ఇరగవరం 31.2, నిడమర్రు 30.6, పోలవరం 29.6, ఏలూరు 29, పెంటపాడు 29, గణపవరం 28.4, పోడూరు 27.4, ఆకివీడు 25.6, ఉండి 25.4, నర్సాపురం 25.2, యలమంచిలి 24.8, తణుకు 24.6, భీమవరం 24.6, కాళ్ల 24.4, ఉండ్రాజవరం 24.2, పెనుమంట్ర 23.4, మొగల్తూరు 23.4, ఆచంట 23.2, ద్వారకాతిరుమల 22.6, అత్తిలి 22.6, వీరవాసరం 22.4, పాలకొల్లు 21.4, పెరవలి 20.6, పాలకోడేరు 20.4 మిమిల వర్షపాతం నమోదైంది.