పశ్చిమగోదావరి

గోదావరిలోకి భారీగా వరద నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొవ్వూరు, ఆగస్టు 14: గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గోదావరి నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. గోదావరి ఉప నదులు, వాగులు పొంగిపొర్లటంతో ఆ నీరు గోదావరి నదిలోకి వచ్చి చేరటంతో గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. ధవళేశ్వరం హెడ్ వర్క్స్ అధికారులు అందించిన సమాచారం మేరకు..మంగళవారం సాయంత్రం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 8.9 అడుగుల వరద నీటిమట్టం నమోదైనట్టు తెలిపారు. భద్రాచలం వద్ద 36 అడుగుల వరద నీటి మట్టం నమోదైనట్టు చెప్పారు. ధవళేశ్వరం వద్ద బ్యారేజ్ నుంచి 6.66 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదిలినట్టు తెలిపారు. తూర్పు డెల్టాకు 3,600, పశ్చిమ డెల్టాకు 2వేలు, మధ్య డెల్టాకు 1500 వెరశి 7,100 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్టు తెలిపారు. గోదావరికి వరద మరింత పెరుగుతోందని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా..గోదావరి నదికి వరద ఉధృత కారణంగా కొవ్వూరు గోష్పాద క్షేత్రంలోని ప్రధాన స్నాన ఘట్టాలు వరద నీటిలో మునిగాయి.

ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఐటీడీఏ పీవో
వేలేరుపాడు, ఆగస్టు 14: గత ఐదురోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వేలేరుపాడు మండలంలో ముంపునకు గురైన పలు రహదారులపై వంతెనలు, పంట పొలాలను మంగళవారం కెఆర్ పురం ఐటీడీఏ పీవో హరీంద్రియ ప్రసాద్ పలువురు అధికారులతో కలిసి సందర్శించారు. ప్రధానంగా ఉప్పొంగుతున్న వాగులు, గోదావరి వరద ముంపునకు గురైన ఎత్తువాగును సందర్శించారు. అక్కడ రెవెన్యూ అధికారులు ఏర్పాటుచేసిన పడవలను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఎత్తువాగుపై వరద రావడంతో దాదాపు 20 గ్రామాల ప్రజలకు మండల కేంద్రానికి వచ్చే అవకాశం లేకుండాపోయింది. దీనితో వివిధ వ్యాధులతో బాధపడేవారు వైద్యం చేయించుకునేందుకు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేందుకు ఇబ్బంది పడుతున్న సంగతి పత్రికల్లో చూసిన పీవో తక్షణం అక్కడ పడవను చూసి ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించాలని ఇచ్చిన ఆదేశాల మేరకు స్థానిక తహసీల్దార్ రవికుమార్ నేతృత్వంలో పడవను ఏర్పాటుచేయడంతోపాటు ఏవిధమైన ప్రమాదం జరిగినా ప్రజలను కాపాడేందుకు గజ ఈతగాళ్లను, రెస్క్యూ సిబ్బందిని అక్కడ ఉంచి మంగళవారం రవాణా సౌకర్యాన్ని ఏర్పాటుచేశారు. అదేవిధంగా ఆరోగ్య సిబ్బందిని సైతం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి గ్రామాల్లో విజృంబిస్తున్న వ్యాధుల నివారణ చర్యలు చేపట్టాలని, పోలీసు సిబ్బంది సైతం ఎక్కడ ఏవిధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎస్సై మధు వెంకటరాజా, సిబ్బంది రాజు, ఆరోగ్య సిబ్బంది, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.

నేడు మద్యం విక్రయాలు పూర్తిగా బంద్
జంగారెడ్డిగూడెం, ఆగస్టు 14: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బుధవారం జిల్లాలో మద్యం విక్రయాలు పూర్తిగా బంద్ చేసినట్టు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ బోయపాటి శ్రీలత తెలిపారు. స్థానిక ఎక్సైజ్ స్టేషన్‌లో మంగళవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ స్వాతంత్య్ర దినోత్సవం రోజు మద్యం విక్రయించినా, సరఫరా చేసినా కఠిన చర్యలు తప్పని హెచ్చరించారు. మద్యం దుకాణాలు మంగళవారం రాత్రి 10 గంటలకు మూసివేయాలని, దుకాణాలకు వేసిన తాళాలపై సీళ్ళు వేస్తామని చెప్పారు. మరల 16వ తేదీ ఉదయమే దుకాణాలు తెరుచుకోవాలన్నారు. బార్ అండ్ రెస్టారెంట్లు కూడా మూసివేయాలని స్పష్టం చేశారు. వారికి కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయన్నారు. ఎక్సైజ్ సీనియర్ అధికారులు మద్యం విక్రయాలు నిరోధించేందుకు నిఘా వేసి పర్యవేక్షిస్తూనే ఉంటారని, ఎక్కడైనా అమ్మినట్టు తెలిస్తే లైసెన్స్‌లు రద్దుచేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే లైసెన్స్ దారులకు సమావేశాలు పెట్టి చెప్పామన్నారు. జంగారెడ్డిగూడెం స్టేషన్ పరిధిలో 26 మద్యం దుకాణాలు ఉన్నాయని, జిల్లాలో 474 దుకాణాలు, 38 బార్‌లు ఉన్నాయని, వీటన్నింటిపైన నిఘా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. జిల్లాలో బెల్ట్‌షాపులు పూర్తిగా నిరోధిస్తున్నట్టు చెప్పారు. ఎక్కడైనా ఉంటే సమాచారం ఇవ్వాలన్నారు. ఇప్పటికే గ్రామ స్థాయి, మండల స్థాయిలలో కమిటీలు వేసి బెల్ట్‌షాపుల నిరోధంపై అవగాహన కల్పించినట్టు తెలిపారు. దీనిపై కరపత్రాలు కూడా వేసి అధికారుల నెంబర్లు ముద్రించినట్టు తెలిపారు. నాటు సారా అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని, ముద్దప్పగూడెం వంటి కొన్ని గిరిజన గ్రామాలలో తప్ప సారా కనిపించడం లేదన్నారు. మద్యం దుకాణాలలో 21 సంవత్సరాల లోపు వారికి మద్యం విక్రయించరాదన్నారు. షాపుల్లో లూజు మద్యం విక్రయించరాదన్నారు. కేవలం పర్మిట్ రూమ్‌లలో మాత్రమే మద్యం సేవించాలన్నారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న మద్యం కల్తీ జరగడం లేదని స్పష్టం చేశారు. జీలుగుమిల్లి మండలంలో కల్తీ జరుగుతున్నట్టు వస్తున్న సమాచారంపై విచారణ చేస్తామన్నారు. మద్యం బ్రాండ్ సీసాల్లో చీప్ లిక్కర్ కలిపి విక్రయాలు చేస్తున్నట్టు తమ దృష్టికి కూడా వచ్చిందన్నారు. ఇప్పటికే ఏలూరులో ఒక కేసు కూడా నమోదు చేసినట్టు తెలిపారు.
జిల్లాలో 12 శాతం పెరిగిన ఆదాయం
ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖకు జిల్లాలో ఈ ఏడాది 12 శాతం ఆదాయం పెరిగిందని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ వై.శ్రీనివాసచౌదరి తెలిపారు. గత ఏడాది మద్యం విక్రయాల ద్వారా 123 కోట్ల రూపాయల ఆదాయం రాగా, ఈ ఏడాది 141 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందన్నారు. గత ఏడాది కంటే 18 కోట్ల రూపాయలు అదనంగా వచ్చినట్టు తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక సీఐ బి.శ్రీనివాసరావు, వివిధ హోదాల్లోని అధికారులు పాల్గొన్నారు.

జాతీయ రహదారిపై చేపలు వదిలి వినూత్న నిరసన
ఆకివీడు, ఆగస్టు 14: ఆకివీడు జాతీయ రహదారిపై సీపీఎం నాయకులు చేపలు వదిలి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలకు జాతీయ రహదారి మొత్తం గోతులుపడి ఛిద్రమైంది. మంగళవారం సీపీఎం నేతలు స్థానిక ఏఎంసీ కార్యాలయం సమీపాన్న ధ్వంసమైన రహదారిపై గోతులు పూడ్చాలంటూ నిరసన తెలిపారు. రహదారిపై పడ్డ గోతులలో చేపలను వదిలారు. సీపీఎం నాయకులు గేదెల అప్పారావు మాట్లాడుతూ ప్రజల ప్రాణాలు పోతున్నా అధికారులకు పట్టదా అని ప్రశ్నించారు. తక్షణమే అధికారులు వర్షపునీరు బయటకు వెళ్లేలా చర్యలు చేపట్టాలన్నారు. రహదారుల మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సందక సూరిబాబు, షేక్ బాజీ, కింజరపు శంకర్, గోపిశెట్టి రాంబాబు, కింజరపు శంకర్‌లు పాల్గొన్నారు.

ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా
*పవన్‌కు జడ్పీ ఛైర్మన్ బహిరంగ లేఖ
ఏలూరు, ఆగస్టు 14: జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ తనపై వ్యక్తిగత విమర్శలకు పాల్పడటం సమంజసం కాదని, పవన్ వంటి బాధ్యతాయుతమైన వ్యక్తి తమపై నిరాధారమైన ఆరోపణలు చేయటం తగదని జడ్పీ ఛైర్మన్ ఎం బాపిరాజు పేర్కొన్నారు. ఈమేరకు పవన్‌కళ్యాణ్ చేసిన విమర్శలను ఖండిస్తూ పవన్‌కు ఆయన బహిరంగలేఖ రాశారు. స్ధానిక జడ్పీ అతిధిగృహంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో దాన్ని ఆయన విడుదల చేశారు. 25ఏళ్ల తన రాజకీయచరిత్రలో ఏనాడూ చెడ్డను ప్రోత్సహించలేదని, మంచిని ప్రోత్సహించేందుకే కృషిచేశానన్నారు. అలాంటి తనపై పవన్ వ్యక్తిగత విమర్శలు చేయటం భావ్యం కాదన్నారు. తాము చేసిన సంక్షేమం, అభివృద్దిపై బహిరంగచర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. జిల్లాలో ప్రధానంగా తాడేపల్లిగూడెంలో రోడ్లు బాగోలేదని పవన్ చేసిన విమర్శలపై ఆయన స్పందిస్తూ వందకోట్ల రూపాయలతో ఆర్‌అండ్‌బి, పిఆర్ రోడ్లు వేశామని, జిల్లాలో మరో 250 కోట్ల రూపాయలతో ఆర్‌అండ్‌బి, పిఆర్ రోడ్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తన సంగతి చూస్తానని పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా విమర్శలు చేయటం మంచిదికాదన్నారు. వారంరోజుల్లో తమ బహిరంగలేఖకు స్పందించకపోతే వారు చేసిన విమర్శలు, ఆరోపణలు అవాస్తం, నిరాధారమని భావిస్తామని లేఖలో పేర్కొన్నారు. బహిరంగ చర్చకు సిద్ధమైతే ఎక్కడికి రమ్మంటే అక్కడకు వచ్చి చర్చ పెడతానని చెప్పారు. కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన చెప్పినట్లు అంతగా తమకు సహకరించి ఉంటే అంతకుముందు జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికల కన్నా అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ ఎలా తగ్గిందని ఆయన ప్రశ్నించారు. తనపై చేసిన ఆరోపణలు వాస్తవమని తేలితే తాను రాజకీయాలు వదిలి, తాడేపల్లిగూడాన్ని కూడా వదిలి బయటకు వెళ్లిపోతామని చెప్పారు. విలేఖరుల సమావేశంలో డిసిసిబి డైరెక్టరు దాసరి అప్పన్న, తాడేపల్లిగూడెం మాజీ మున్సిపల్ వైస్‌ఛైర్మన్ గొర్రెల శ్రీ్ధర్, టిడిపి నాయకులు దాసరి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.