పశ్చిమగోదావరి

జనసేనాని బిజీ బిజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, సెప్టెంబర్ 25 : జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంగళవారం ఏలూరులో ఉదయం నుంచి పూర్తి బిజీ బిజీగా గడిపారు. వివిధ వర్గాలతో ఏకధాటిగా సమావేశమవుతూ వారి సమస్యలను తెలుసుకుంటూ వాటికి పరిష్కారాలను అనే్వషిస్తూ ముందుకు సాగారు. స్థానిక క్రాంతి కళ్యాణ మండపం కేంద్రంగా ఆయన వివిధ వర్గాలతో ఉదయం నుంచి భేటీ అయ్యారు. మంగళవారం ఆటో డ్రైవర్ల సంఘ ప్రతినిధులతో, దివ్యాంగుల సంఘ ప్రతినిధులతో, రైతు సంఘాల ప్రతినిధులు, ఆలిండియా దళిత హక్కుల నేతలు, హమాలీలు, పాస్టర్ల అసోసియేషన్ నేతలతో వరుసగా భేటీ అయ్యారు. వారితో మాట్లాడించి వాటిని అవగతం చేసుకున్నారు. అవసరమైన చోట్ల జోక్యం చేసుకుంటూ వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను కొన్నిసార్లు అడిగి తెలుసుకుని, మరికొన్ని సార్లు తానే సూచిస్తూ ఈ భేటీలను అర్ధవంతంగా ముందుకు తీసుకువెళ్లారు. ప్రధానంగా వివిధ వర్గాలతో సమావేశమైన సందర్భంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే అందించే ప్రయోజనాలను శాస్ర్తియమైన పరిష్కారాలను సూచిస్తూ ఆయన తన ప్రసంగాన్ని ముందుకు తీసుకువెళ్లారు. ప్రధానంగా సాయంత్రం జరిగిన రైతు సంఘాల ప్రతినిధులతో సమావేశం కూలంకషంగా జరిగినట్లు కనిపించింది. ఆయా పంటల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. అలాగే కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా అర్ధం చేసుకుని వాటికి ఏ విధమైన పరిష్కారాలు చూపాలి అన్న అంశంపై చర్చలు కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రతినిధులు ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మద్దతు ధర అందడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ సాలోచనగా విని పలు సందర్భాల్లో ప్రశ్నల వర్షం కురిపించారు. ఆ విధంగా వున్న పరిస్థితిని తనంత తానుగా అర్ధం చేసుకునేందుకు ప్రయత్నించారు. అంతకుముందు మాట్లాడుతూ ఎక్కడ సమస్యలున్నా తాను వస్తే పరిష్కారం అవుతుందంటే తప్పనిసరిగా హాజరవుతానని, అంతేకాకుండా సమస్యలు ఎవరో చెబితే విని అర్ధం చేసుకోవడం కాకుండా తానే రంగంలోకి దిగి స్వయంగా అన్ని పక్షాలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ఆ విధంగానే రైతులతో జరిగిన భేటీలో రైతులు లెవనెత్తిన అనేక అంశాల విషయంలో ఆయన సునిశితంగా ప్రశ్నల వర్షం కురిపించి వారి నుంచి అసలు సమస్య ఎక్కడుందీ అన్న అంశాన్ని రాబట్టారు. ఆ తరువాత రైతులకు అండదండగా నిలబడేందుకు జనసేన పార్టీ అన్ని విధాలా ముందుంటుందని హామీ ఇచ్చారు. ఆయా సమస్యలకు సంబంధించి శాస్ర్తియమైన పరిష్కారాలను అందిస్తానని, మరింత అధ్యయనంతో ఏ వర్గానికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఉదయం జరిగిన ఆటో డ్రైవర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మర్యాదలేకుండా ఆటో డ్రైవర్లను పిలిచినా, అవమానకరంగా మాట్లాడినా న్యాయపరంగా చర్యలు తీసుకునేలా జనసేన పార్టీ కృషి చేస్తుందని చెప్పారు. పోలీసులు, రవాణా శాఖాధికారులతో సమస్యలు వుంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలని, వారిపైన కూడా ఒత్తిళ్లు వుంటాయి కాబట్టి వారు నడుపుతున్న వ్యవస్థలపై పోరాటం చేద్దామంటూ పేర్కొన్నారు. ప్రాణం వున్నంత వరకు ఆటో డ్రైవర్లను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని హామీ ఇచ్చారు. పార్టీ పెట్టి నాలుగేళ్లు గడచినా నిర్మాణం పూర్తిచేయకపోవడానికి కారణం అది కష్టతరంతో కూడిన బాధ్యతని చెప్పారు. తన బంధువులనో, కుటుంబ సభ్యులనో పెట్టి పార్టీ నిర్మాణం చేయడం చాలా తేలికైన పని అని, కానీ జనం నుంచే నాయకులను తయారు చేయాలన్నదే జనసేన ప్రధాన లక్ష్యమని చెప్పారు. జనసేన మానిఫెస్టో కమిటీ సభ్యులను ఆటో డ్రైవర్ల వద్దకు పంపి వారి సమస్యల పరిష్కారానికి సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఆలిండియా దళిత హక్కుల నేతలు, హమాలీలతో జరిగిన సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వాధికారులను కొట్టడం, పోలీసులను తుపాకీతో బెదిరించడమే కాకుండా తాజాగా ఏలూరులో ఒక హమాలీ కార్మికుడిని కొట్టడమే కాకుండా కులం పేరుతో దూషించడాన్ని చూస్తుంటే ఆయన ప్రభుత్వ యంత్రాంగాన్ని నిర్వీర్యం చేస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. ఆయన బెదిరింపులు, దౌర్జన్యాలు చూస్తుంటే రౌడీషీటర్‌ను తలపిస్తున్నారని చెప్పారు. 37 కేసుల్లో ముద్దాయిగా వున్న ఆయనపై ఇది 38వ కేసని, మనం ప్రజాస్వామ్యంలో వుంటున్నామని మరచి ప్రభాకర్ రాచరికంలా నడుసుకుంటున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా స్పందించి ప్రభాకర్‌ను క్రమశిక్షణలో పెట్టకపోతే ఆ బాధ్యత ప్రజలే తీసుకుంటారని హెచ్చరించారు. రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టే క్రమంలో జనసేన పార్టీ క్రైస్తవులకు అండగా వుంటుందని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. పాస్టర్ల అసోసియేషన్‌తో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్రీస్టియానిటీ అంటే అందరి దృష్టిలో ఒక మతం కావచ్చునని, తనకు మాత్రం బాధ్యతని పేర్కొన్నారు. చిన్ననాటి నుంచి సర్వమతాల సారాన్ని అర్ధం చేసుకుంటూ వస్తున్నానని పేర్కొన్నారు. దివ్యాంగుల కోసం పార్టీలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 2019లో అధికారంలోకి వస్తే ఆరోగ్య శ్రీతో సంబంధం లేకుండా దివ్యాంగులకు ప్రత్యేక హెల్త్‌కార్డులు ఇస్తామని హామీ ఇచ్చారు. దివ్యాంగ సంఘాల సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ సామాజిక న్యాయం కోసం ప్రారంభమైందని, ఆ సామాజిక న్యాయాన్ని దివ్యాంగులతోనే ప్రారంభిస్తామని తెలిపారు. జనసేన అధికారంలోకి వస్తే దివ్యాంగుల కోసం ప్రత్యేక వసతిగృహాలు, ఇళ్లు, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు ఇర్రింకి సూర్యారావు, బొమ్మదేవర శ్రీ్ధర్, మహేంధర్‌రెడ్డి, హరిప్రసాద్, యర్రా నవీన్, నారా శేషు, మంచనపల్లి శ్రీనివాస్, సాగర్, అర్జా ప్రసాద్, మత్తే బాబి తదితరులు పాల్గొన్నారు.

జనం తిరుగుబాటు చేస్తారు
రౌడీ ఎమ్మెల్యేలను కాపాడితే అదే పరిస్థితి *జనసేనాని పవన్ కళ్యాణ్ బహిరంగ హెచ్చరిక
ఏలూరు, సెప్టెంబర్ 25 : ప్రజలపై జులుం చలాయిస్తున్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై చర్య తీసుకోవాలని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకి బహిరంగంగా విజ్ఞప్తి చేశారు. ప్రజలు కావాలో, రౌడీ ఎమ్మెల్యేలు కావాలో తేల్చుకోవాలని పవన్ బహిరంగంగా ప్రకటించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు విఫలమైతే ప్రజలే తిరుగుబాటు చేస్తారని, అప్పుడు ఎలా వుంటుందో ఊహించలేమని పవన్ పరోక్షంగా ముఖ్యమంత్రిని హెచ్చరించారు. హమాలీ కార్మికుడు రాచీటి జాన్‌పై దాడి చేసి కులం పేరుతో దూషించిన చింతమనేని ప్రభాకర్‌ను అరెస్టు చెయ్యకుండా పోలీసులు తాత్సారం చేస్తున్నారని, అతన్ని వెంటనే అరెస్టు చేయించాలని కోరుతూ అఖిలపక్షం మంగళవారం ఏలూరు వచ్చిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌ను క్రాంతి కళ్యాణ మండపంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. క్రాంతి కళ్యాణ మండపంలో పవన్ కళ్యాణ్ ఈ సమస్యను వినడానికి ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేశారు. బాధితుడు రాచీటి జాన్, అఖిలపక్ష నాయకులు చెప్పింది మొత్తం వివరంగా విన్న తరువాత పవన్ మీడియాతో మాట్లాడారు. దళితుడైన హమాలీ కార్మికుడిని కులం పేరుతో తిట్టి, కొట్టి దౌర్జన్యం చేస్తే చింతమనేనిపై ఎందుకు చర్య తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అధికారులపైన, మహిళలపైన, దళితులపైన, చివరకు కార్మికులపైన ఒక ప్రజాప్రతినిధి అయి వుండి దాడి చేస్తే ప్రజలకు రక్షణ ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి, డిజిపిలు వెంటనే స్పందించి చింతమనేనిపై చట్ట ప్రకారం చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి పనులు చెయ్యడానికి తాను టిడిపిని గత ఎన్నికలలో బలపర్చలేదని, ప్రజలకు మేలు చేస్తారని ఆశించానని, ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమని చెప్పారు. బాధితుని పక్షాన జనసేన ఖచ్చితంగా నిలబడుతుందని స్పష్టం చేశారు. తొలుత బాధితుడు జాన్, సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా అధికార ప్రతినిధి యు వెంకటేశ్వరరావు, సిపి ఎం నాయకులు జి నరసింహారావు, సిపి ఐ నాయకులు పి కన్నబాబు, ఇఫ్టూ నాయకులు బద్దా వెంకట్రావు, ఎ ఐటియుసి నాయకులు బండి వెంకటేశ్వరరావు తదితరులు పవన్‌కు చింతమనేని ఆగడాలను వివరంగా తెలియజేశారు. ఎస్‌సి, ఎస్‌టి చట్టం క్రింద కేసు నమోదైనందున అతన్ని అరెస్టు చేయాలని కోరారు. అఖిలపక్షంతో పలువురు హమాలీలు కూడా పాల్గొన్నారు.