పశ్చిమగోదావరి

కుల మతాలకు అతీతంగా నిరుపేదల అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొవ్వూరు, జనవరి 11: కొవ్వూరు నియోజకవర్గంలో కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల వారికి కార్పొరేషన్లు ఏర్పాటుచేసి నిరుపేద ప్రజలను ఆర్థికంగా ఆదుకుంటున్నట్టు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కెఎస్ జవహర్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక 23వ వార్డులో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. కొవ్వూరు పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 16వేల గ్రామాల్లో జన్మభూమి కార్యక్రమాలు, గ్రామ సభలు నిర్వహించినట్టు తెలిపారు. గోదావరి ఉత్సవాలను ఈ నెల 19, 20 తేదీల్లో కొవ్వూరులో నిర్వహించనున్నట్టు చెప్పారు. కొవ్వూరు నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న నియోజకవర్గ సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. ఈ నెల 12వ తేదీ శనివారం స్థానిక సంస్కృతోన్నత పాఠశాలలో మధ్యాహ్నం 2నుంచి 6 గంటల వరకూ ఈ సంబరాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో వై సత్యనారాయణరావు, మున్సిపల్ ఛైర్‌పర్సన్ జె రాధారాణి, వైస్ ఛైర్మన్ జి రాజారమేష్, కమిషనర్ టి నాగేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.

జన్మభూమిలో వైసీపీ, సీపీఎం నేతల ఆందోళన
ఆకివీడు, జనవరి 11: ఆకివీడులో శుక్రవారం జరిగిన జన్మభూమి సభలో వైసీపీ, సీపీఎం నాయకులు ఇళ్లస్థలాల పంపిణీ తదితర సమస్యలపై ఆందోళన నిర్వహించారు. సభలో తొలుత అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తున్న ఎంపీడీవో ప్రభాకర్‌రావుపై వైసీపీ, సీపీఎం నాయకులు విరుచుకుపడ్డారు. తెలుగుదేశం కార్యకర్త మాదిరి అభివృద్ది కార్యక్రమాలు చెబుతారా అంటూ మండిపడ్డారు. ఆందోళనకారుల విమర్శలతో సభాస్థలి ప్రాంతం మార్మోగింది. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శివరామరాజును సమస్యలపై నిలదీసే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే తన ప్రసంగమైన తరువాత మళ్లీ నాయకులు తమ ఆందోళన కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అయితే ఎమ్మెల్యే శివరామరాజు మాట్లాడుతూ ప్రసంగాలు వద్దు సమస్యలు ఉంటే వినతిపత్రం ఇవ్వండని సూచించారు. సమస్యలకోసం జన్మభూమి కార్యక్రమానికి వస్తే సమస్యలు వినరా అంటూ వైసీపీ, సీపీఎం నాయకులు ఎమ్మెల్యేను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. నాయకులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ముగించుకుని వెళ్లిపోయారు.
టీడీపీ, వైసీపీ నేతల మధ్య తోపులాట
టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య శుక్రవారం జరిగిన జన్మభూమి కార్యక్రమం అనంతరం తోపులాట జరిగింది. టీడీపీ నాయకులుపై వైసీపీ కార్యకర్తలు చేసిన వ్యాఖ్యలతో కొద్దిసేపు గందరగోళం జరిగింది. టీడీపీ నాయకులు, వైసీపీ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలవారిని వారించి పంపించి వేశారు.

జన్మభూమి విజయవంతం
వీరవాసరం, జనవరి 11: సంక్రాంతి సంబరాల్లో భాగమే కోడి పందాలని నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. జన్మభూమి ఆరవ విడత కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వీరవాసరం మండలం నందమూరి గరువు గ్రామంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సంక్రాంతి ఉత్సవాలు ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా కొనసాగుతాయన్నారు. ప్రజలు ఎంతో ఉత్సాహంగా చేసుకునే పండుగల్లో ప్రభుత్వం కానీ, ఇతరుల జోక్యం కానీ ఎప్పుడూ ఉండదన్నారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తోందన్నారు. సంక్రాంతి సందర్భంగా సాంప్రదాయకంగా నిర్వహించుకునే భోగి మంటలు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల నృత్యాలు, కోడి పందాలు తదితర వాటితో ప్రజలంతా సంతోషంగా ఉంటారన్నారు. భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ ఈ నెల 2నుంచి ప్రారంభమైన జన్మభూమి కార్యక్రమం విజయవంతమైందన్నారు. ప్రత్యేక శ్రద్ధ వహించి జన్మభూమి కార్యక్రమాలను విజయవంతం చేసిన అధికారులను ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశంసించారు. ప్రజలంతా గత అయిదు సంవత్సరాలుగా టీడీపీ ఆధ్వర్యంలో చేసిన అభివృద్ధి పనులను చూసి తిరిగి తమ పార్టీని గెలిపించాల్సిందిగా ఆయన కోరారు. అనంతరం నందమూరి గరువు గ్రామస్థులు ఎమ్మెల్యే రామాంజనేయులను, రఘురామకృష్ణంరాజులను ఘనంగా సత్కరించారు. తొలుత ఎమ్మెల్యే రామాంజనేయులు, రఘురామకృష్ణంరాజులు భోగి మంటను వెలిగించారు. కార్యక్రమాల్లో తహసీల్దార్ ఎం ముక్కంటి, ఎంపీడీవో స్వాతి, టీడీపీ నేతలు పోలిశెట్టి దాసు, పంజా రామచంద్రయ్య, ఆకుల బాలరాజు, గొలగాని సత్యనారాయణ, నూకల అప్పాజీ, గెడ్డం భాస్కరరావు, పంజా సురేష్, పాలా వెంకటేశ్వరరావు, వీరవల్లి చంద్రశేఖర్, మేకల కొండలరావు, ఎ చిరంజీవిరావు, రొంగల కృష్ణవేణి, నక్కెళ్ల అప్పారావు, ఆదిరెడ్డి గంగారావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

కోడి పందాలు సంక్రాంతి సంబరాల్లో భాగమే
వీరవాసరం, జనవరి 11: తెలుగువారి సంస్కృతీ, సంప్రదాయాల్లో భాగమే కోడి పందాలని నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. శుక్రవారం నందమూరి గరువు గ్రామంలో జన్మభూమి కార్యక్రమానికి విచ్చేసిన ఆయన కోడి పందాలను లాంఛనంగా ప్రారంభించారు. రఘురామకృష్ణంరాజు ఈ పోటీలను ప్రారంభించటంతో అక్కడకు చేరుకున్న టీడీపీ నేతలు, అధికారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ కోడి పుంజులకు కత్తులు కట్టకుండా పందాలు నిర్వహించుకోవచ్చునన్నారు. ఇది తెలుగువారి సాంప్రదాయంలో ఒక భాగమేనని అన్నారు. రఘురామకృష్ణంరాజు పందాలు ప్రారంభించే సమయానికి భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పెర్కిపాలెం గ్రామంలో నిర్వహించిన జన్మభూమి గ్రామ సభలో ఉన్నారు. పందాలు నిర్వహిస్తున్నట్టు మండలంలోని ప్రజలకు తెలియటంతో సభ వద్దకు భారీగా తరలివచ్చారు.

కోడిపందాల నిర్వాహణకు ముమ్మర యత్నం
తాళ్లపూడి, జనవరి 11: సంక్రాంతి నేపథ్యంలో కోడి పందాలు, జూదాలపై నిషేధం ప్రకటిస్తూ హైకోర్టు ఉత్తర్వులను అమలు చేసేందుకు పోలీసు శాఖ ఒక వైపు ప్రచారం నిర్వహిస్తుంటే..కోడి పందాల్లేని సంక్రాంతి పండుగే ఉండదంటూ నిర్వాహకులు తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే గత సంవత్సర సమాచారంతో కోడి పందాల బరులు వద్ద వివిధ గ్రామాల్లోను, అటు రెవెన్యూ ఇటు పోలీసు శాఖలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తాజాగా శుక్రవారం తాళ్లపూడి పోలీసు శాఖ ఆటో ద్వారా కోడి పందాలపై నిషేధం ఉందంటూ ప్రచారం చేసింది. ఇదిలా ఉంటే..అధికారుల దృష్టి మళ్లించేందుకు నిర్వాహకులు కోడి పందాల స్థానే ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామంటూ ఫ్లెక్సీలను కోడి పందాల బరుల వద్దే ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా తాళ్లపూడి మండలంలో సుమారు ఏడు ప్రాంతాల్లో కోడి పందాలు నిర్వహించే పరిస్థితి ఉండగా, ఆయా ఏర్పాట్లలో నిర్వాహకులు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసు అధికారులను, ఇతర అధికారులను కలిసి ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైన ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోండి
- ఐటీడీఏ పీవో హరీంద్రియ ప్రసాద్
వేలేరుపాడు, జనవరి 11: ప్రజా శ్రేయస్సుకై ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలను అర్హులైన వారంతా సద్వినియోగం చేసుకోవాలని ఐటీడీఏ పీవో హరీంద్రియ ప్రసాద్ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జన్మభూమి- మా ఊరు, సంక్రాంతి సంబరాలు, ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమంలో పీవో ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. వేలేరుపాడు మండలంలోని తొమ్మిది గ్రామ పంచాయతీల్లో జన్మభూమి కార్యక్రమం శుక్రవారంతో ముగిశాయి. దీంతో స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా పీవో హరీంద్రియ ప్రసాద్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు వారి వారి జీవనోపాధికి అనుగుణంగా చేయూత పథకాలు అందిస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగానే అర్హులైన వారికి వివిధ రకాల పెన్షన్లు, రేషన్ కార్డులు తదితర వాటిని తక్షణమే మంజూరు చేయటమే జన్మభూమి ప్రధాన ఉద్దేశ్యమన్నారు. జన్మభూమి కార్యక్రమాల్లో నిర్వహించిన పలు రకాల ఆట పాట పోటీల్లో విజేతలైన విద్యార్థినీ విద్యార్థులకు, ముగ్గుల పోటీల్లో గెలుపొందిన మహిళలకు బహుమతులు అందజేశారు. అర్జీలు పెట్టుకుని అర్హులుగా గుర్తింపబడిన వారికి మంజూరు అర్హత పత్రాలను ఈ కార్యక్రమంలో అందజేశారు. ఇంకా ఎవరైనా సమయానికి హాజరు కాలేకపోయిన వారు తమ వినతులను స్థానిక మండల అధికారులకు అందజేయవచ్చునన్నారు.

చెత్త రహిత పట్టణంగా ‘్భమవరం’
* కౌన్సిల్ సమావేశంలో కమిషనర్ నాగనరసింహారావు ప్రకటన
భీమవరం, జనవరి 11: చెత్త రహిత పట్టణంగా భీమవరం రూపాంతరం చెందిందని మున్సిపల్ కమిషనర్ సీహెచ్ నాగనరసింహారావు ప్రకటించారు. స్వచ్ఛ సర్వేక్షణ్-2019లో భాగంగా స్టార్ రేటింగ్ పద్ధతిని అనుసరించి చేసిన పని ఆధారంగా గార్బెన్ ఫ్రీ సిటీగా నోటిఫై చేయడం జరిగిందన్నారు. శుక్రవారం భీమవరం మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశాన్ని కౌన్సిల్ హాల్లో చైర్మన్ కొటికలపూడి గోవిందరావు అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కౌన్సిల్ సభ్యులు యధావిధిగా సమస్యలను విన్నవించారు. వాటికి చైర్మన్ వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్ సీహెచ్ నాగనరసింహారావు మాట్లాడుతూ పురపాలక సంఘం పరిధిలో ఉత్పత్తి అవుతున్న చెత్తను ఇంటింటికీ వెళ్లి సేకరించడం నుంచి పని ప్రారంభించడం జరిగిందన్నారు. ఆ తరువాత తడిచెత్త, పొడిచెత్తను వేరు చేసి సేకరించామని, పబ్లిక్, కమర్షియల్, రెసిడెన్షియల్ ఏరియాలుగా విభజన చేసి రోజువారి స్వీపింగ్ నిర్వహించామన్నారు. వీటితోపాటు పట్టణంలో చెత్తను ఎక్కువగా ఉత్పత్తిచేసే ఇళ్ల సముదాయాలను, వ్యాపార సంస్థలను గుర్తించి వారికి యూజర్ ఛార్జీలను కూడా వసూలు చేసినట్లు కమిషనర్ నాగనరసింహారావు కౌన్సిల్ సభ్యులకు వివరించారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్తవేసే వారి నుంచి 40 మైక్రాన్లుల కన్నా తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్‌ను వినియోగించే వారి నుంచి స్పాట్ ఫైన్స్ వసూలు చేసినట్లు చెప్పారు. పురపాలక సంఘానికి వచ్చే ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు స్పందించి వాటిని పరిష్కరించడం, సిటిజన్ ఫీడ్ బ్యాక్ సిస్టం ద్వారా మంచి ఫలితాలు రాబట్టామన్నారు. డ్రైయిన్లలోని సిల్టు తొలగించడం తదితర కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడం జరిగిందని, ఇప్పుడు పట్టణంలో చెత్తను వేయాలనుకుంటే మున్సిపాల్టీ ఏర్పాటుచేసిన డస్ట్‌బిన్లలో మాత్రమే వేయడం జరుగుతోందని, రహదారులపై చెత్తవేసే సాహసం ఎవరూ చేయడం లేదన్నారు. దీనికి మున్సిపల్ కౌన్సిలర్లు కమిషనర్ నాగనరసింహారావును అభినందించారు. కష్టపడి పనిచేసిన వారికి ప్రజల్లో ఎప్పుడూ మంచి గుర్తింపు ఉంటుందని ఛైర్మన్ వ్యాఖ్యానించారు.

కోడి పందేలు నిర్వహిస్తే చర్యలు తప్పవు
* వెంప గ్రామసభలో డీఎస్పీ
భీమవరం, జనవరి 11: సంప్రదాయంగా జరుపుకునే సంక్రాంతి పండుగ ముసుగులో కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని నరసాపురం డీఎస్పీ టి ప్రభాకర్‌బాబు, భీమవరం తహసీల్దార్ చవాకుల ప్రసాద్ పందాల రాయుళ్లను హెచ్చరించారు. భీమవరం మండలం వెంప గ్రామంలోని గ్రామప్రజలతో కలిసి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేశారు. గ్రామంలోని అభివృద్ధి కమిటీతోపాటు గ్రామ ప్రజలు, పెద్దలు తదితరులు పెద్దఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి డీఎస్పీ మాట్లాడుతూ వెంప గ్రామం పేరు భారతదేశం అంతటా చాలా ఎక్కువగా వినపడుతుందన్నారు. ఇందుకు కారణం ఇక్కడ కోడిపందేలు జరపడమేనన్నారు. దీంతో ఈ పందేల పేరుతో జూదం జరుగుతోందని అనేక విమర్శలు వినపడుతున్నాయన్నారు. చివరకు ఈ విషయంలో కొందరు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించడం జరిగిందని వివరించారు. ఈ నేపధ్యంలో గ్రామంలో స్నేహ పూరిత వాతావరణం రావాలని, ఇందుకోసం పదేపదే గ్రామంలో సమావేశాలు ఏర్పాటుచేస్తున్నట్లు వెల్లడించారు. తహసీల్దార్ చవాకుల ప్రసాద్ మాట్లాడుతూ పండుగను చేసుకోవద్దని మేమెవ్వరూ చెప్పడం లేదని, సంక్రాంతి పండుగను కన్నుల పండువగా జరుపుకోవాలని, కాని ఆ పండుగ మాటున జూదం ఆడవద్దని హితవుపలికారు. భీమవరం రూరల్, నరసాపురం రూరల్ పోలీసు అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారి చేత జూదానికి దూరంగ ఉంటామని తహసీల్దార్ ప్రసాద్ ప్రతిజ్ఞ చేయించారు.

వచ్చే నెల నుండి పేదలకు రెట్టింపు పెన్షన్
జన్మభూమిలో ఎమ్మెల్యే పీతల సుజాత
జంగారెడ్డిగూడెం, జనవరి 11: వచ్చే నెల నుండి పేదలకు ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్లను రెట్టింపు చేసి రూ.2వేలు ఇవ్వనున్నట్టు మాజీ మంత్రి, ఎమ్మెల్యే పీతల సుజాత వెల్లడించారు. పట్టణంలోని 19వ వార్డు జన్మభూమి-మావూరు కార్యక్రమం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే సుజాత మాట్లాడుతూ ఫిబ్రవరి నెల నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెయ్యి రూపాయల పెన్షన్‌ను రూ.2వేలకు పెంచి ఇవ్వనున్నట్టు తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మొదటి నెల మూడు వేలు ఇవ్వనున్నట్టు చెప్పారు. రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతూనే ప్రజలకు ఇంకా ఏమేమి చేస్తే సంతోషంగా ఉంటారో అవన్నీ చేయడానికి చిత్తశుద్ధితో పని చేస్తున్నారని చెప్పారు. రూ.2వేల పింఛన్లతో పాటు ప్రతి ఇంటికి స్మార్ట్ ఫోన్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి తగిన ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పారు. ఎన్ని కష్టాలొచ్చినా ఇచ్చిన మాట తప్పని నాయకుడు చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజలు మాకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నామని ఎమ్మెల్యే సంతోషంగా చెప్పారు. పట్టణంలో నాలుగున్నరేళ్లల్లో వందల కోట్ల నిధులతో అభివృద్ధి చేసినట్టు, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్టు చెప్పారు. 19వ వార్డులో రూ.5.10 కోట్ల నిధులతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేసినట్టు తెలిపారు. ఇంకా ఎవరికైనా అర్హత ఉండి ఏదైనా సంక్షేమ పథకం అందకపోతే స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావాలని కోరారు. పట్టణ ప్రాంతంలో మెప్మా ద్వారా మహిళలకు అందించే సంక్షేమ పథకాలను మెప్మా అధికారులు ప్రజల్లోకి సరిగా తీసుకువెళ్ళడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో వెలుగు అధికారుల్లో ఉన్న చురుకుతనం మెప్మా అధికారుల్లో లేదని, ఇకనుంచైనా వారి పద్ధతి మార్చుకోవాలని సూచించారు. పది రోజుల పాటు నిర్వహించిన జన్మభూమి-మావూరు కార్యక్రమంలో అనేకమంది ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో సమర్పించారని, వాటన్నిటినీ పరిష్కరించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులను జన్మభూమి-మావూరు సక్రమంగా నిర్వహించినందుకు అభినందించారు. వారికి ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు ఈ కార్యక్రమంలో అందజేసారు. పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని గెలుపొందిన విద్యార్థులకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు ఎమ్మెల్యే అందజేశారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సీమంతాలు కార్యక్రమంలో గర్భిణులను ఆశీర్వదించి నూతన వస్త్రాలు, పౌష్టికాహారం అందించారు. చిన్నారులకు అన్నప్రాశనలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ బంగారు శివలక్ష్మి, కమిషనర్ ఎజె మాథ్యూ, టౌన్ ప్లానింగ్ అధికారి ఎ లక్ష్మీనారాయణ, టీడీపీ పట్టణ కార్యదర్శి చెరుకూరి శ్రీ్ధర్, కౌన్సిలర్లు బొబ్బర రాజ్‌పాల్‌కుమార్, తూటికుంట దుర్గారావు, టీఎన్‌ఎస్‌ఎఫ్ జాతీయ సమన్వయ కమిటీ సభ్యులు దాసరి శ్యామ్‌చంద్రశేషు, టీడీపీ నేతలు గుమ్మడి వెంకటేశ్వరరావు, చేను ప్రసాద్, పలువురు అధికారులు పాల్గొన్నారు.

ఆరుపదుల వయస్సులో డిగ్రీ
ఆదర్శంగా నిలిచిన యింటి దంపతులు
నరసాపురం, జనవరి 11: చదువుకు వయస్సుతో నిమిత్తం లేదని నిరూపించారు 60 ఏళ్ల యింటి రామలింగం దంపతులు. విద్యపై మక్కువతో ఆరు పదుల వయస్సులో డిగ్రీ పట్టా సాధించి అందరితో ఔరా అనిపించి నేటి తరానికి అదర్శంగా నిలిచారు. పాలకొల్లు మండలం తిల్లపూడి పాలెం గ్రామానికి చెందిన యింటి రామలింగం ఇంటర్ వరకు చదివి పోలీసు కానిస్టేబుల్‌గా పనిచేసి 2012లో ఏఎస్సైగా పదవీ విరమణ చేశారు. రామలింగం భార్య పుష్పావతి 6వ తరగతి వరకు చదువుకుని గృహిణిగా స్థిరపడ్డారు. వీరి నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడిని ఉన్నత విద్యావంతులను చేసి జీవితంలో స్థిరపడేలా తీర్చిదిద్దిన సంతృప్తి ఈ దంపతుల్లో నెలకొంది. అయితే తాము డిగ్రీ చదవలేదనే వెలితి మాత్రం వారిలో మిగిలిపోయింది. దీంతో డిగ్రీ చదవాలనే పట్టుదలతో 2015లో పట్టణంలోని వైఎన్ కళాశాల దూర విద్యా కేంద్రం ద్వారా బీఏ హిస్టరీ, పాలిటిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగాన్ని ఎంచుకున్నారు. కళాశాలలో అడ్మిషన్ తీసుకోవడమే కాకుండా ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా తరగతులకు హాజరయ్యారు. నిత్య జీవితంలో తమ కార్యక్రమాలు, కుటుంబ బాధ్యతలు నెరవేరుస్తూనే రోజుకు రెండు, మూడు గంటల పాటు చదువుపై దృష్టిసారించి పాఠ్యాంశాలపై పట్టు సాధించారు. ఫలితంగా 2015-18 విద్యా సంవత్సరానికిగాను ఆంధ్రా విశ్వ విద్యాలయం నుంచి వారు బీఏ డిగ్రీ సొంతం చేసుకున్నారు. 60 ఏళ్ల వయస్సులో విద్యనభ్యసించడం ఒకెత్తయితే అన్ని సబ్జెక్టుల్లోనూ మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించడం మరొక ఎత్తు. ఈ సందర్భంగా ఆరు పదుల వయస్సులో డిగ్రీ సాధించిన యింటి రామలింగ దంపతులను వైఎన్ కళాశాల యాజమాన్యం ఘనంగా సత్కరించింది. చదువుపై మక్కువతో 60 ఏళ్ల వయస్సులో డిగ్రీ సాధించడం కళాశాల చరిత్రలోనే ప్రథమంగా నిలుస్తుందని కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ చినిమిల్లి సత్యనారాయణరావు పేర్కొన్నారు.

తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా సంక్రాంతి సంబరాలు
ఏలూరు, జనవరి 11: జిల్లాలో సంక్రాంతి సంబరాలను తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ ఎం వేణుగోపాలరెడ్డి అధికారులను ఆదేశించారు. సంక్రాంతి సంబరాల ఏర్పాట్లపై స్థానిక కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం ఆయన అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జెసి వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయివరకు సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా స్థాయిలో ఈ నెల 13వ తేదీన ఉదయం 10 గంటల నుండి స్థానిక ఇండోర్ స్టేడియంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. సంక్రాంతి సంబరాలు ప్రతిబింబించేలా సంక్రాంతి ముగ్గులు, బొమ్మల కొలువులు, కోలాటాలు, గంగిరెద్దులు, బోగి మంటలు, నృత్యాలతో అంబరాన్నంటేలా సంక్రాంతి సంబరాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించాలని, మన సంస్కృతీ సాంప్రదాయాలపై విద్యార్థినీ విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేయాలన్నారు. పాఠశాలల పిల్లలతో సాంస్కృతిక కార్యక్రమాలునిర్వహించాలన్నారు. జిల్లాలో ఉత్తమ వ్యవసాయదారులను ఎంపిక చేసి అవార్డులను అందించాలన్నారు. పంటలుఇంటిక ఇవచ్చి రైతులు చేసుకునే పండుగ కాబట్టి అటువంటి సన్నివేశాలు ప్రతిబింబించే విధంగా వ్యవసాయ అధికారులు స్టాల్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఏలూరు ఆర్డీవో జి చక్రధర్, జిల్లా విద్యాశాఖాధికారి రేణుక, సర్వశిక్షా అభియాన్ పివో బ్రహ్మానందరెడ్డి, సెట్‌వెల్ సీఈవో సుబ్బిరెడ్డి, ఐసిడిఎస్ ఏడివిజయకుమారి, జిల్లా క్రీడల అభివృద్ధి అదికారి అజీజ్, సహాయ పర్యాటక శాఖాధికారి పట్ట్భా రామయ్య, సెట్‌వెల్ మేనేజర్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

సంక్రాంతి సంబరాల ఏర్పాట్లు పరిశీలన
ఏలూరు, జనవరి 11: ఈ నెల 12న జిల్లా స్థాయిలో నిర్వహించనున్న సంక్రాంతి సంబరాలు కార్యక్రమ ఏర్పాట్లను అధికారులతో కలిసి ఏలూరు ఆర్డీవో జి చక్రధర్ శుక్రవారం పరిశీలించారు. స్థానిక ఇండోర్ స్టేడియంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించేందుకు జరుగుతున్న స్టేజి ఏర్పాట్లను పరిశీలించారు. వ్యవసాయ శాఖచే సంక్రాంతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా స్టాల్స్ ఏర్పాటుకు, ముగ్గుల పోటీలు నిర్వహించేందుకు ప్రత్యేక ప్రదేశాలను పరిశీలించారు. వివిధ శాఖలచే ఏర్పాటు చేయనున్న స్టాల్స్, భోగిమంటలు, కోలాటాలు, హరిదాసులు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్డీవో వెంట ఐసీడిఎస్ పీడి విజయకుమారి తదితరులు ఉన్నారు.

గుండుగొలనులో కోడిపందాల బరి ధ్వంసం
భీమడోలు, జనవరి 11: భీమడోలు మండలం గుండుగొలను గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలు వేసేందుకు ఏర్పాటు చేసిన బరిని శుక్రవారం రాత్రి భీమడోలు పోలీసులు ధ్వంసం చేశారు. గుండుగొలను గ్రామ పరిధిలోని ఎస్‌ఎఎఫ్‌ఎన్ గోల్డెన్ సిటీ ఆవరణలో ప్రతి సంవత్సరం పెద్దయెత్తున కోడి పందాలు నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా కోడిపందాలు నిర్వహించేందుకు బరిని ఏర్పాటు చేశారు. సమాచారం అందుకున్న భీమడోలు సిఐ కొండలరావు పర్యవేక్షణలో ఎస్‌ఐ శ్రీరామ గంగాధర్ సంఘటనా స్థలానికి వెళ్లి బరిని తొలగించారు. మండల పరిధిలో కోడిపందాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగితే తమకు సమాచారం తెలియజేయాలని సిఐ కొండలరావు ఈ సందర్భంగా ప్రజలను కోరారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలే గాకుండా అనుబంధంగా ఇతర అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించినట్టయితే వారిపై కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. ధ్వంసం చేసిన బరి వద్ద కోడిపందాలు వేయడం నేరమంటూ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.

కోడి పందాల బరులపై పోలీసు యాక్షన్
కొనసాగుతున్న బరుల ధ్వంసం
జంగారెడ్డిగూడెం, జనవరి 11: సంక్రాంతి పేరుతో లక్షలు దండుకునేందుకు తహతహలాడిపోతున్న కోడిపందాల నిర్వాహకుల ఏర్పాట్లపై పోలీసు యాక్షన్ ప్రతిబంధకమైంది. ఒకపక్క రాజకీయ పలుకుబడితో కోడిపందాలు నిర్వహించి లబ్ధిపొందాలని ఉరకలు వేస్తున్న నిర్వాహకుల ఉత్సాహంపై పోలీసులు నీళ్లు చల్లుతున్నారు. కోడిపందాల జాతరపై ప్రతి ఏటా జరిగే తంతే ఈ ఏడాదీ కొనసాగక తప్పదని తెలిసినప్పటికీ పోలీసు అధికారులు చివరి వరకు నిలిపివేసేందుకు తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే జంగారెడ్డిగూడెం పోలీస్ సబ్ డివిజన్‌లోని అన్ని పోలీస్‌స్టేషన్ల ఎస్సైలు యాక్షన్‌లోకి దిగిపోయారు. బరులు ధ్వంసం చేసే పనిలో నిమగ్నమయ్యారు. బరుల వద్ద పోలీసు నిఘా ఏర్పాటు చేసారు. బరులు ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉన్న ప్రదేశాల్లో కోడిపందాలు చట్టరీత్యా నేరమని, జూదాలు, పేకాటలు, గుండాటలు ఆడినా చర్యలు తప్పవంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. శుక్రవారం స్థానిక బైసాస్ రోడ్డుకు సమీపంలో శ్రీనివాసపురం రోడ్డు వద్ద డాక్టర్ కె చిరంజీవికి చెందిన మామిడి తోటలో కోడిపందాలు నిర్వహించేందుకు శ్రీనివాసపురానికి చెందిన ఒక రాజకీయ నాయకుడు, ఆయన అనుచరులు బరులు ఏర్పాటు చేస్తుండటంతో ఎస్సై అల్లు దుర్గారావు జెసిబి, ట్రాక్టర్లతో వెళ్ళి బరుల ప్రదేశాన్ని దున్నిచి వేసారు. అక్కడ హెచ్చరిక ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పోలీసులు ఎంత యాక్షన్ చేసినా 14వ తేదీన పోలీస్ బాస్‌ల నుండి వచ్చే వౌఖిక ఆదేశాల మేరకు బరుల నుండి తప్పుకోక తప్పదని నిర్వాహకులు బాహాటంగా చెబుతున్నారు. ఎన్నికల సంవత్సరం కావడంతో కోడిపందాల జూదాల జాతర ఇంకా యథేచ్ఛగా జరుగుతుందని చెబుతున్నారు. ఇప్పటి వరకు పోలీసు అధికారులు చేసిన కృషికి పోలీసు బాస్‌లు, ప్రజా ప్రతినిధులు సహకరిస్తే కోడి పందాలు, జూదక్రీడలు అరికట్టవచ్చని ప్రజలు భావిస్తున్నారు.