పశ్చిమగోదావరి

అధికార్లు, ఉద్యోగులపై నిఘా నేత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మే 15: ఇప్పుడు అన్ని స్ధాయిల అధికారులు, ఉద్యోగులపై నిఘా నేత్రం దృష్టి పడింది. అవినీతి అధికారుల వ్యవహారాలపై పూర్తిస్ధాయి ఆరా తీస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావించి అమలుచేస్తున్న ప్రాజెక్టుల విషయంలో అయా అధికారులు, ఉద్యోగుల పనితీరును కూడా అంచనా వేస్తున్నారు. మరోవైపు కొన్ని ప్రభుత్వ పధకాల అమలులో చోటుచేసుకుంటున్న అవకతవకలపై కూడా వివరాలు సేకరిస్తున్నారు. ఎక్కడా ఎటువంటి తేడా ఉన్నా దానిపై తక్షణ చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. మొత్తంమీద రెండున్నరేళ్ల పాలన అనంతరం పరిపాలనా వ్యవస్ధ సాగుతున్న తీరుపై ప్రభుత్వం పూర్తిస్దాయిలో దృష్టి పెట్టింది. ఎక్కడెక్కడ ఏవిధమైన అవకతవకలు జరుగుతున్నాయి, అవినీతి ఏస్ధాయిలో ఉంది, అంతేకాకుండా ప్రాజెక్టుల అమలు వేగాన్ని నిరోధించే రీతిలో ఉద్యోగుల, అధికారుల అసమర్ధత ఉందా తదితర అంశాలపై సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం ఈ అంశాలపై పూర్తి సమాచారాన్ని పంపాలని నిఘా సంస్ధలను ఆదేశించింది. గత కొద్దిరోజులుగా రంగంలోకి దిగిన నిఘా సంస్ధల ఉద్యోగులు ఆదిశగా పూర్తిస్ధాయి సమాచారాన్ని సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. అతిత్వరలోనే వారు ప్రభుత్వానికి తమ నివేదికలు అందజేస్తారని సమాచారం. దీని ఆధారంగా కొన్నిస్ధాయిలో అధికారులకు, ఉద్యోగులకు స్ధానచలనాలు కూడా చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో అన్నిస్ధాయిల్లోనూ పరిపాలనాపరంగా ఎక్కడెక్కడ ఏవిధమైన వ్యవహారాలు సాగుతున్నాయి, ఏ అధికారి ఎటువంటి వారు అన్న కోణంలో సమాచార సేకరణ జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అ అధికారి సమర్ధులా? కాదా? సమర్ధులైనా అవినీతిపరులా? వంటి సమాచారాన్ని కూడా సేకరిస్తున్నారు. ప్రధానంగా ప్రాజెక్టుల విషయంలో మాత్రం పూర్తిస్ధాయి సమాచారాన్ని సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రాజెక్టుల పరిధిలో పనిచేసే ఇంజనీర్లు, అధికారులు, ఉద్యోగులు పనితీరును అన్ని కోణాల నుంచి పరిశీలిస్తున్నారు. అయా ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళ్లే విషయంలో వీరి పనితీరు ఏవిధంగా ఉందన్నది అంచనా వేస్తున్నారు. ఉన్న లక్ష్యానికి తగ్గట్టుగా పనిచేయగలుగుతున్నారా, లేక వెనుకడుగు వేస్తున్నారా అన్న సమాచారాన్ని తీసుకుంటున్నారు. సమర్ధులా కాదా అన్న విషయాన్ని స్పష్టంగాతేల్చాలని ప్రభుత్వం సూచించినట్లు సమాచారం. ప్రధానంగా భూసేకరణ విభాగం అధికారులపై కూడా ఈపరిశీలన సాగుతోంది. అదేవిధంగా కొన్నిచోట్ల ఇటీవల పలు అరోపణలు వస్తున్న నేపధ్యంలో వాటిపై కూడా క్షేత్రస్ధాయి సమాచారాన్ని అందించాలని కోరినట్లు తెలుస్తోంది. ఇక ప్రభుత్వ పధకాల అమలులో జరుగుతున్న అవినీతి, అలసత్వం వంటి విషయాలపై కూడా వివరాలు సేకరిస్తున్నారు. కొంతమంది అధికారులు, ఉద్యోగులు ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే రీతిలో వ్యవహరిస్తున్నారన్న స్పష్టమైన సమాచారం ఉండటంతో అటువంటివారి నిగ్గు తేల్చేందుకు నిఘా సంస్ధలు అతిక్షుణ్ణంగా పరిశీలన జరుపుతున్నారని తెలుస్తోంది. మొత్తంమీద ప్రభుత్వ నిర్దేశించిన అంశాల మేరకు అధికారుల హోదా, స్ధాయిని పక్కనపెట్టి జరుగుతున్న వాస్తవ సమాచారాన్ని అందజేయాలని సూచించినట్లు సమాచారం.