పశ్చిమగోదావరి

ప్రజలే బుద్ధి చెబుతారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మే 15 : ఎన్నికల ముందు ఎన్నో హామీలిచ్చి గద్దెనెక్కిన టిడిపి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని, రైతు సంక్షేమాన్ని విస్మరించి పరిపాలన కొనసాగిస్తోందని, రానున్న ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలే బుద్ధి చెబుతారని పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. కరవు భరోసా యాత్రను పురస్కరించుకుని ఆదివారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయ ఆవరణలో డిసిసి అధ్యక్షుడు రఫీయుల్లాభేగ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌కు రానున్నవి మంచి రోజులన్నారు. దోచుకోవడమే పనిగా టిడిపి నేతలు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంగా ఉండాలని, పార్టీ బలోపేతానికి కృషిచేయాలని పిలుపునిచ్చారు. తాము ఇచ్చిన హామీలు అమలుచేయకుండా బిజెపి, టిడిపి ప్రభుత్వాలు కాంగ్రెస్‌పై అర్ధరహిత విమర్శలు చేస్తున్నాయన్నారు. జరుగుతున్న పరిణామాలన్నీ ప్రజలు గమనిస్తున్నారని, సమయం కోసం నిరీక్షిస్తున్నారని, తగిన గుణపాఠం చెప్పడం తథ్యమన్నారు. సుప్రీంకోర్టు మందలింపులకు కూడా కేంద్రం జంకు గొంకు లేకుండా న్యాయస్థానాలను కూడా లెక్కచేయకుండా వ్యవహరిస్తోందని, బకాయిపడ్డ సొమ్ములు కూడా విడుదల చేయడం లేదన్నారు. తమ పార్టీ పరంగా కరవు భరోసా యాత్రను అన్ని జిల్లాల్లో నిర్వహిస్తున్నామని, అదే విధంగా ఏలూరులో కూడా నిర్వహించామని చెప్పారు. ఈ నెల 23వ తేదీన ప్రకాశం బ్యారేజీ వద్ద రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. తాగునీరు, సాగునీరుకు కూడా ప్రమాదం వాటిల్లే విధంగా ఇతర ప్రాంతాల్లో నీటి ప్రాజెక్టులను కడుతున్నారని, ఈ విషయానే్న ప్రజలకు తెలియజేసేందుకు నిరసన కార్యక్రమాన్ని చేపట్టామని రఘువీరా తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎంపిక చేసిన పాకలపాటి సుభద్ర, కిసాన్‌సెల్ అధ్యక్షునిగా ఎంపిక చేసిన ఉప్పలపాటి శ్రీనివాసరావులకు నియామక పత్రాన్ని అందజేశారు. వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో మాజీ ఎంపి కనుమూరి బాపిరాజు, జిల్లా కాంగ్రెస్ నాయకులు రాజనాల రామ్మోహనరావు, కరాటం రాంబాబు తదితరులు పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తొలుత ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.