పశ్చిమగోదావరి

శాంతించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఫిబ్రవరి 1: ఆందోళన వద్దు...ఎవరూ కంగారుపడవద్దు...ప్రశాంతత అన్నింటి కన్నా ముఖ్యం...ప్రాణాలు అంతకుమించి ప్రధానం... ఈ సందేశం ఇప్పుడు పోలీసుల నుంచి విన్పిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా తునిలో ఆదివారం రాత్రి వరకు చోటుచేసుకున్న ఘటనల నేపధ్యంలో పశ్చిమలోనూ ఆ ప్రకంపనలు లేకుండా ముందస్తు జాగ్రత్తలను తీసుకున్నారు. వాటినే సోమవారం కూడా కొనసాగిస్తూ మరికొంత ముందడుగు వేసి ఎవరూ కంగారుపడవద్దని, ఇలాంటి అంశాల్లో సంయమనం ఉంటేనే ప్రజల ఆస్తులకు రక్షణ ఉంటుందని, అంతేకాకుండా శాంతిభద్రతల పరిస్దితిని ఉల్లంఘిస్తే చివరకు కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతారంటూ మీ కుటుంబాలను గుర్తు తెచ్చుకోండంటూ పోలీసులు హితవు పలుకుతూ ముందుకుసాగుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు తునిలో కాపు ఐక్యగర్జన కార్యక్రమం రూట్‌మారి హింసాత్మకంగా మారటం తెల్సిందే. ఈప్రాంతానికి వేర్వేరు జిల్లాల నుంచి భారీఎత్తున కాపుసంఘాల నాయకులు, సంఘీయులు పెద్దఎత్తున చేరుకోవటం తెల్సిందే. ఇదే నేపధ్యంలో అక్కడ చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల పరిస్దితిని పరిశీలిస్తున్న పోలీసు యంత్రాంగం ఈ అఘాయిత్యాల్లో ఎవరు పాల్గొన్నారన్న అంశాన్ని కూడా అక్కడి పోలీసులు నిగ్గు తేలుస్తున్నారు. అ అంశం అలా ఉంటే పశ్చిమలోనూ బలమైన సామాజిక వర్గంగా ఉన్న కాపుల్లో ఈ ప్రభావాలు ఆందోళన రేకెత్తించకుండా వాస్తవాలను వివరించి, పరిస్దితులను అర్ధం చేసుకునేలా చూసేందుకు పోలీసు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. దీనిలోభాగంగా పోలీసు అధికారులు అయా ప్రాంతాల్లోని కాపుసంఘాల నాయకులతో చర్చలు నిర్వహిస్తున్నారు. ఈసందర్భంగానే పలు అంశాల్లో సూచనలు చేస్తున్న పోలీసులు తుని ఘటనల నేపధ్యంలో ఆందోళన వద్దని, అనవసరమైన ఘటనలకు పాల్పడితే రానున్నరోజుల్లో ఇబ్బందులు వస్తే కుటుంబాలు కష్టపడతాయన్న అంశాన్ని వారికి వివరిస్తున్నారు. అంతేకాకుండా తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని కలెక్టరేట్‌లో సోమవారం ఒక వ్యక్తి కాపులకు రిజర్వేషన్లు డిమాండ్ చేస్తూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈనేపధ్యంలోనూ ఉద్వేగాలు చెలరేగకుండా నాయకులే ముందుగా జాగ్రత్తలు తీసుకుని తమ వర్గంలో ధైర్యం నింపాలంటూ పోలీసు అధికారులు విజ్ఞప్తులు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగానే అయా ప్రాంతాల్లో ఈ సామాజిక వర్గం అధికంగా ఉన్నచోట్ల సంఘ నాయకులతో ఈవిధంగా సమావేశాలు నిర్వహించి సంయమనం పాటించాలంటూ హితవు పలికారు. మరోపరిణామంలో ఎక్కడా ఎటువంటి అనుకోని ఘటనలు జరగకుండా ప్రధానమైన అన్ని ప్రాంతాల్లోనూ బందోబస్తు ఏర్పాట్లు గట్టిగానే చేశారు. 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించారు. కలెక్టరేట్‌తో సహా అన్ని కీలకప్రాంతాల్లోనూ పోలీసుబలగాలను మోహరించారు. ఎక్కడైనా అల్లరిమూకలు అదుపుతప్పి అనుకోని ఘటనలకు పాల్పడకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. మరోవైపు జిల్లావ్యాప్తంగానే రౌడీషీటర్ల బైండోవర్ కార్యక్రమం భారీఎత్తున చేపట్టారు. తునిలో జరిగిన కాపు ఐక్య గర్జన కార్యక్రమంలో ఇతర శక్తులు చొరబడి హింసాత్మక ఘటనలకు కారణమయ్యారన్న ప్రచారం నేపధ్యంలో జిల్లాలోని రౌడీషీటర్ల కదలికలపై పూర్తిస్ధాయిలో నిఘా ఏర్పాటుచేశారు. గత రెండురోజుల్లోనూ ఎవరెవరు జిల్లా వదిలి వెళ్లారు, వారి కదలికలు ఎక్కడ ఉన్నాయి అన్న అంశంపై ఆరా తీస్తున్నారు. ఇదే సమయంలో వారిని బైండోవర్ చేసే కార్యక్రమం పెద్దఎత్తున చేపట్టారు. అవిధంగా ఏవిధమైన వ్యక్తులు ఆప్రాంతానికి వెళ్లారు, అక్కడ జరిగిన ఘటనలకు, వీరికి ఏవిధమైన సంబంధాలు ఉన్నాయి అన్న విషయంలోనూ సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇక రానున్న రోజుల్లోనూ ఈ ఉద్రిక్త పరిస్ధితులు పూర్తిగా సర్దుమణిగేంతవరకు ఎక్కడ ఎటువంటి ఘటన జరిగినా తక్షణం స్పందించేందుకు అన్ని ప్రధాన ప్రాంతాల్లోనూ పోలీసు ప్రత్యేక బలగాలను మోహరించారు. వీరిని ఆయా ప్రాంతాల్లో కీలక స్ధానాల్లో ఉంచి అవసరమైతే శరవేగంగా తరలించేందుకు అనువుగా ఏర్పాట్లు చేశారు. మరోవైపు జిల్లా కేంద్రమైన ఏలూరుకు సోమవారం ప్రత్యేక బలగాలను రప్పించారు. వీరు స్ధానికంగానే అందుబాటులో ఉంటూ జిల్లాలో ఏ ప్రాంతానికైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉంటారు.
సుబ్బారాయుడిని దర్శించుకున్న సినీనటుడు అల్లరి నరేష్ దంపతులు
అత్తిలి, ఫిబ్రవరి 1: అత్తిలిలో ప్రముఖ దేవాలయమైన వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీహీరో అల్లరి నరేష్ దంపతులు సోమవారం సాయంత్రం దర్శించుకున్నారు. ఆలయ కమిటీ వారు నరేష్ దంపతులకు స్వాగతం పలికారు. ఆలయంలో వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఛైర్మన్ దిరిశాల ప్రభాకరరావు నరేష్ దంపతులను సన్మానించి స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు. సినీహీరో నరేష్ వచ్చినట్లు తెలవడంతో పెద్దసంఖ్యలో అభిమానులు ఆలయాన్ని సందర్శించి ఆయనతో ఫొటోలు దిగడానికి పోటీపడ్డారు. కందుల శ్రీనివాస్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
సారా నిర్మూలనకు అధికారులు
సమన్వయంతో పనిచేయాలి
కలెక్టర్ భాస్కర్
ఏలూరు, ఫిబ్రవరి 1 : జిల్లాలో నాటుసారాను పూర్తిగా నిర్మూలించడానికి ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్, రెవిన్యూ, పోలీసు, అటవీ శాఖాధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ అన్నారు. ఏలూరు కలెక్టరేట్‌లో సోమవారం ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ ఏర్పాటుచేసిన నవోదయం అవగాహనా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటుసారా వలన అనేక కుటుంబాలు ఆర్ధిఖంగా, సామాజికంగా నష్టపోవడం వలన ఆ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. నాటుసారా తాగడం వలన లివర్ సిరోసిస్, ఇతర వ్యాధులకు గురై ఆ కుటుంబ యజమాని మరణించడం వలన ఆయా కుటుంబాలు ఆదరణ, ఆదాయం లేక ఎన్నో బాధలు అనుభవిస్తున్నారని అన్నారు. నాటుసారాను తాగడం మూలంగా విషపూరితమైన కణాలు శరీరంలోకి ప్రవేశిస్తాయని అన్నారు. నాటుసారాలో ఉండే ఫ్యూజెల్ ఆయిల్, పర్‌పురల్ వంటి విష పదార్ధాల వలన కంటిచూపు దెబ్బతింటుందని, దాంతోపాటు జీర్ణక్రియ దెబ్బతిని ఆకలి మందగిస్తుందన్నారు. దీనితోపాటు నాడీ వ్యవస్థ దెబ్బతినడం, కడుపులో పుండ్లు రావడం, సంతానానికి పుట్టుకలోనే అంగవైకల్యం రావడం వంటి అనారోగ్యాలు చోటు చేసుకుంటాయని చెప్పారు. నాటుసారాను అరికట్టేందుకు తయారీదారులు, రవాణాదారులు, అమ్మకందారులపై ఎక్సైజ్ అధికారులు నిరంతరం దాడులు చేసి ఉక్కుపాదం మోపాలని చెప్పారు. మండల, జిల్లాస్థాయిలో నాటుసారా తయారీ, అమ్మకం, రవాణా, తదితర విషయాలపై వచ్చిన సమాచారాన్ని గోప్యంగా ఉంచి వెంటనే సమీప స్టేషన్ హౌస్ ఆఫీసర్స్‌కు చేరవేయాలని సమాచారం చేరవేసిన వారి వివరాలను కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. నాటుసారా తయారీ, విక్రయించడం, రవాణా, తదితర అశాలలో ప్రమేయం వున్న వారు ఎటువంటి వారినైనా ఉపేక్షించబోనని వారిపై కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామన్నారు. పొలాలు, తోటలు, ఖాళీ స్థలాల్లో సారా బట్టీలు ఎవరైనా నిర్వహిస్తుంటే సంబంధిత యజమానులు కౌలు దారులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గ్రామస్థాయి విఆర్‌వో, మండలస్థాయి, జిల్లాస్థాయిలో రెవిన్యూ సిబ్బంది ఏ గ్రామంలోనైనా నాటుసారా సమాచారాన్ని వారి సెల్‌ఫోన్ ద్వారా సమీపంలో ఉన్న పోలీసు స్టేషన్‌కు, రెవిన్యూ, ఎక్సైజ్ అధికారులకు అందించాలని లేదా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నెంబరు 1800 425 4868కు తెలియజేయాలన్నారు. జిల్లాలోని 101 గ్రామాల్లో ఎక్కువుగా నాటుసారా తయారు చేస్తున్నట్లుగా సమాచారం ఉందని కలెక్టర్ అన్నారు. దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ తమ మండలంలోని 48 గ్రామాల్లో ఈ నాటుసారా ప్రభావం ఎక్కువగా వున్నట్లు గుర్తించామన్నారు. వాటిని అరికట్టడానికి అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా ఎక్సైజ్ అధికారులను కోరారు. ఏలూరు ఆర్‌డివో ఎన్ తేజ్‌భరత్ మాట్లాడుతూ ఎక్కడైతే ఈ నాటుసారా ప్రభావం ఉన్నదో ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని కోరారు. కొవ్వూరు ఆర్‌డివో బి శ్రీనివాసరావు మాట్లాడుతూ నాటుసారా నిర్మూలనకు ఒక స్పష్టమైన ప్రణాళికను రూపొందిస్తున్నామని, గ్రామం, మండలాల్లో, డివిజన్‌స్తాయిలో వీటిపై అవగాహనా సదస్సులు ఏర్పాటుచేసి ప్రజలందరికీ ఈ నాటుసారా నష్టాలపై తెలియజేస్తామన్నారు. ఈ సమావేశంలో ఎక్సైజ్ ఉప కమిషనరు వైజె భాస్కరరావు, అసిస్టెంట్ కమిషనరు కెవిబి శాస్ర్తి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఏలూరు శ్రీనివాసచౌదరి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ భీమవరం కె శ్రీనివాస్, ఎక్సైజ్, పోలీసు, అటవీ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తొలుత నాటుసారాకు దూరంగా ఉండడం, నిండు నూరేళ్లు ఆరోగ్యం జీవించండి, నాటుసారాను సమూలంగా నిర్మూలిద్దాం, ఆడపడుచుల ముఖల్లో చిరునవ్వులు చిందిద్దాం కరపత్రాలను పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు.
నరసన్న కల్యాణానికి ఏర్పాట్లు పూర్తిచేయాలి
అధికారులకు సబ్‌కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశం
నరసాపురం, ఫిబ్రవరి 1: తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణ ఉత్సవాలకు విచ్చేసే యాత్రికులకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లను ప్రభుత్వ శాఖలు సకాలంలో పూర్తి చేయాలని సబ్ కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశించారు. సోమవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో అంతర్వేది ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా దినేష్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల 14 నుంచి 23 వరకు ఉత్సవాలు నిర్వహిస్తారన్నారు. సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తులు, యాత్రికులకు అనువైన ఏర్పాట్లు చేయాలన్నారు. పట్టణంలో లలితాంబ రేవులో ఫెర్రి పాయింట్ వద్ద బారికేట్లు, హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే మాధవాయిపాలెం, బియ్యపుతిప్ప పాయింట్ల వద్ద రక్షణ ఏర్పాట్లు చేయాలన్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్, పెర్రీ పాయింట్ వద్ద 24 గంటలూ పనిచేసే విధంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. అంబులెన్స్‌ను సిద్ధంగా ఉంచాలన్నారు. వివిధ ప్రాంతాల నుంచి యాత్రికులను అంతర్వేది క్షేత్రానికి చేర్చేందుకు వీలుగా 45 ఆర్టీసి బస్సులను నడపాలని ఆయన ఆదేశించారు. రెవెన్యూ, పోలీసు, పంచాయతీ రాజ్ శాఖల అధికారులతో బృందాలను నియమించి ఏర్పాట్లను పర్యవేక్షించాలన్నారు. పారిశుద్ధ్యం, మంచినీరు సౌకర్యం కల్పించాలన్నారు. రేవుల వద్ద గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలన్నారు. అదేవిధంగా నరసాపురం మండల రెవెన్యూ కార్యాలయం వద్ద కంట్రోలు రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సబ్ కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశించారు. సమావేశంలో దేవస్థానం ఇఒ యర్రంశెట్టి భద్రాది, డిఎల్‌పిఒ ఎన్ మురళీ గంగాధర రావు, విద్యుత్ శాఖ డిఇఇ సురేష్‌కుమార్, ఆర్టీసీ డిఎం గిరిధర కుమార్, ఎండిఒ కన్నమనాయుడు, సిఐ రామచంద్రారావు తదితరులు పాల్గొన్నారు.
పెండింగ్ కేసులపై కౌంటర్ ఫైళ్లను వేయాలి
అధికారులకు
కలెక్టర్ ఆదేశం
ఏలూరు, ఫిబ్రవరి 1 : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, ట్రిబ్యునల్ పెండింగ్‌లో ఉన్న కేసులపై గురువారం నాటికి కౌంటర్ ఫైళ్లను వేయాలని జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశించారు. సోమవారం జరిగిన జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో హైకోర్టు, ట్రిబ్యునల్‌లో ఉన్న పెండింగ్ కేసులతోపాటు, ఇ- ఆఫీస్, మీ-సేవ, మీ-కోసం, కుకునూరు, వేలేరుపాడు మండలాల్లో భర్తీ చేయవలసిన పోస్టులపై ఆయన అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ జిల్లాలో హైకోర్టులో 347, ట్రిబ్యునల్‌లో ఉన్న 203 కేసులను తక్షణమే కౌంటర్ ఫైళ్లను తయారు చేసి గురువారం కల్లా నివేదిక సమర్పించాలని సూచించారు. 2014 జూలై నుంచి ఇప్పటి వరకూ ఎన్ని కేసులు పరిష్కరించారు, ఎన్ని కేసులకు ఫైనల్ ఆర్డర్స్ వచ్చి వాటిపై ఎంత వరకూ అమలు చేశారు అనే అంశాలపై వచ్చే సమన్వయ కమిటీలో సమర్పించవలసిందిగా అధికారులను ఆదేశించారు. రెవిన్యూ, పశుసంవర్ధక శాఖ, మత్స్యశాఖ, పాల ఉత్పత్తి సంస్థ, పాఠశాల విద్యాశాఖలకు చెందినవి ఎక్కువగా కోర్టులలో పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. కొత్తగా పశ్చిమగోదావరి జిల్లాకు విలీనమైన మండలాలైన కుకునూరు, వేలేరుపాడుల్లో వివిధ శాఖల్లో ఖాళీగా వున్న పోస్టులకు గాను కొన్ని శాఖల వారు కేవలం వారి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించి దానిపై ఏ మాత్రం శ్రద్ధ కనపరచుట లేదని వచ్చే వారంలోగా వారి శాఖల అధిపతుల నుండి ఆదేశాలు పొందుటకు చర్యలు తీసుకోవాలని అన్నారు. సమావేశంలో జెసి పి కోటేశ్వరరావు, జెసి-2 ఎం హెచ్ షరీఫ్, డి ఆర్‌వో కె ప్రభాకరరావు, డ్వామా పిడి ఎం వెంకటరమణారెడ్డి, ఎస్‌సి, ఆర్ అండ్ బి, ఆర్‌డబ్ల్యు ఎస్, పంచాయితీరాజ్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం
*ప్రభుత్వ విప్ చింతమనేని
ఏలూరు, ఫిబ్రవరి 1 : దెందులూరు నియోజకవర్గం అభివృద్దే లక్ష్యంగా ప్రతీ ఉద్యోగి కూడా అంకితభావంతో విధులు నిర్వర్తించాలని, ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాలని ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ స్పష్టం చేశారు. సోమవారం ఏలూరు ఆర్‌డివో కార్యాలయంలో దెందులూరు నియోజకవర్గంలోని దెందులూరు, పెదవేగి, పెదపాడు, ఏలూరు రూరల్ మండలాలకు చెందిన ఉద్యోగులు, అధికారులతో వివిధ శాఖల ప్రగతి తీరుపై వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఏ మండలం నుంచి ఏ ఏ అంశాలకు చెందినవి వచ్చినాయి? వాటిపై అధికారులు తీసుకున్న చర్యలు ఏమిటంటూ వివరణ కోరారు. మంచినీటి సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. మంజూరైన రహదారి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు. ఎంజి ఎన్ ఆర్ ఇజి ఎస్ పనుల ద్వారా చేపట్టిన పనులు ప్రగతి పధంలో వుండే విధంగా ఎంపిడివోలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. రేషన్‌కార్డులు, పెన్షన్లు, ఇళ్ల స్థలాలు తదితర అంశాలపై వివరణ కోరారు. ఏలూరు ఆర్‌డివో నంబూరి తేజ్‌భరత్ ఆయన వెంట వున్నారు.
తుని సంఘటన దురదృష్టకరం
*డిసిసిబి అధ్యక్షులు ముత్యాల రత్నం
ఏలూరు, ఫిబ్రవరి 1 : సమాజంలోని కాపు కులస్తులకు రిజర్వేషన్ల సౌకర్యం కల్పించే విధంగా చంద్రబాబు అడుగులు వేస్తూ కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతోపాటు వంద కోట్ల రూపాయలు నిధులు కూడా కేటాయించడం జరిగిందని డిసిసిబి జిల్లా అధ్యక్షులు ముత్యాల వెంకటేశ్వరరావు (రత్నం) అన్నారు. సోమవారం ఒక ప్రకటనలో ఆయన తునిలో జరిగిన సంఘటన దురదృష్టకరమని, కాపులంతా కూడా సమన్వయం పాటించాలని, ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా గుర్తుచేసుకోవాలని పేర్కొన్నారు. కాపు కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం అందజేస్తున్న రుణ సౌకర్యాన్ని అన్ని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు బ్రాంచీల్లో నిబంధనలకు లోబడి పొందే అవకాశం కల్పించామని, ఈ సౌకర్యాలను కాపుకులస్తులంతా వినియోగించుకోవాలని రత్నం కోరారు.
స్వాతంత్య్ర సమరయోధుడు సత్యనారాయణ మృతి
మొగల్తూరు, ఫిబ్రవరి 1: స్వాతంత్య్ర సమరయోధులు, వడ్లవానిపాలెం మాజీ సొసైటీ అధ్యక్షులు గుండాబత్తుల సత్యనారాయణ (87) ఆదివారం రాత్రి ఆయన స్వగృహంలో మృతి చెందారు. ఈయన కెపిపాలెం గ్రామంలో రైతుల అభ్యున్నతి ఇతోధికంగా సేవలందించి, రైతుల అభిమానాన్ని దోచుకున్నారు. ఉప్పుసత్యాగ్రహం ఉద్యమంలో ఈ ప్రాంత నాయకుడి ఆయన పేరు పొందారు. సత్యనారాయణకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతి పట్ల వైసిపి జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్యే జానకిరామ్, గ్రామసర్పంచ్‌లు కె. వెంకటలక్ష్మి, మార్త రాజ్యం, ఎంపిటిసి సభ్యులు కూనపురెడ్డి గోవిందరాజు, బొక్కా ఏడుకొండలు తదితరులు సంతాపం తెలియచేశారు.
విద్యార్థులచే ఆర్డీవో కార్యాలయం ముట్టడి
జంగారెడ్డిగూడెం, ఫిబ్రవరి 1: ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల్లో జంబ్లింగ్ విధానం వల్ల ప్రతిభ కలిగిన విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని, జంబ్లింగ్ విధానం రద్దు చేసి, పాతపద్ధతి కొనసాగించాలని డిమాండ్ చేస్తూ పట్టణంలోని వివిధ జూనియర్ కళాశాలల ఇంటర్ విద్యార్థులు, వారి తల్లితండ్రులు సోమవారం స్థానిక ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించారు. పట్టణంలోని వివిధ కళాశాలల విద్యార్థులు స్థానిక అశ్వారావుపేట రోడ్డు నుండి ర్యాలీ నిర్వహించి బోసుబొమ్మ సెంటరులో మానవహారం ఏర్పాటు చేసి వాహన రాకపోకలు స్తంభింప చేశారు. అనంతరం ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా చేసారు. ఈ సందర్భంగా ఆర్డీవో ఎస్ లవన్న, డిఎస్పీ జె వెంకటరావుకు వినతిపత్రం సమర్పించారు.
పేదల భూములు ఆక్రమిస్తే కఠినచర్యలు:కలెక్టర్
ఏలూరు, ఫిబ్రవరి 1: పేదల భూములను ఆక్రమించుకోవడమే కాకుండా అడిగినవారిపై దౌర్జన్యం, గూండాయిజం చేసేవారిపట్ల కఠినంగా వ్యవహరిస్తానని జిల్లా కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ హెచ్చరించారు. స్ధానిక కలెక్టరేట్‌లో సోమవారం మీ కోసం కార్యక్రమం సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వారినుండి ఆయన వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల పేదల భూముల్లో కొంతమంది చొరబడి వాటిని ఆక్రమించుకుంటూ అడినందుకు తమపై దౌర్జన్యం చేస్తున్నారంటూ పలు ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. ప్రశాంతంగా ఉండే జిల్లాలో ఎవరైనా గూండాయిజం, దౌర్జన్యం వంటి సంస్కృతులకు పాల్పడితే సహించనని, అటువంటివారిపై తీవ్రచర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. వీరవాసరం మండలం తోలేరు గ్రామంలో తనకున్న ఎకరం 50సెంట్ల జిరాయితీ పల్లం భూమిని కొంతమంది కబ్జా చేశారని డి సూర్యప్రకాష్ అనే వ్యక్తి కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. తనను భూమిలోకి వెళ్లనీయకుండా దౌర్జన్యం చేస్తున్నారని, చంపుతామని బెదిరిస్తున్నారని వారికి భయపడి తాను వేరే ప్రాంతంలో ఉంటున్నానని, తనకు న్యాయం చేయాలని కోరారు. దీనిపై కలెక్టరు స్పందిస్తూ వ్యక్తిగతంగా ఈవిషయమై విచారణ జరిపి నివేదిక అందించాలని నరసాపురం సబ్‌కలెక్టరును ఆదేశించారు. గోపాలపురంలో గొర్రి సుబ్రహ్మణ్యం అనే పెన్షన్‌దారుడు మరణించి మూడునెలలు అయిందని, అయితే ఆ వ్యక్తికి వస్తున్న పెన్షన్‌ను వేలిముద్రలు ద్వారా స్ధానిక ఉద్యోగులు తీసుకుంటున్నారని కె ప్రసాద్‌బాబు అనే వ్యక్తి కలెక్టరు దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై వెంటనే విచారణ చేసి ఈనెల 10వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని డిఆర్‌డిఎ పిడిని ఆయన ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టరు పి కోటేశ్వరరావు, జెసి-2 షరీఫ్, డిఆర్వో కె ప్రభాకరరావు, వికలాంగుల సంక్షేమశాఖ ఎడి వి ప్రసాదరావు, హౌసింగ్ పిడి ఇ శ్రీనివాసరావు, దేవాదాయశాఖ ఎసి వి సత్యనారాయణ, వ్యవసాయశాఖ జెడి వై సాయిలక్ష్మిశ్వరి తదితరులు పాల్గొన్నారు. కాగా మీకోసం కార్యక్రమంలో జిల్లా వైద్యఆరోగ్యశాఖ రూపొందించిన ‘సిజేరియన్ వద్దు-సహజ ప్రసవమే ముద్దు’ న్యూస్‌రీల్‌ను కలెక్టరు, అధికారుల సమక్షంలో ప్రదర్శించారు. దీనిపై కలెక్టరు మాట్లాడుతూ జిల్లాలో 98శాతం వరకు సిజేరియన్‌లు జరుగుతున్నాయని, సహజ ప్రసవం వైపు ప్రజలను చైతన్యవంతులను చేయడానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు.
చంద్రబాబును అప్రతిష్ఠపాల్జేసేందుకు వ్యూహం
గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి
దేవరపల్లి, ఫిబ్రవరి 1: తెలుగుదేశం ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని అప్రతిష్ఠపాల్జేసేందుకు ఒక వ్యూహం ప్రకారం తునిలో అరాచక శక్తులు విధ్వంసకర సంఘటనలకు సృష్టించాయని గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. దేవరపల్లిలో సోమవారం గోపాలపురం నియోజకవర్గానికి చెందిన టిడిపికి చెందిన కాపునేతలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాపు ఉద్యమనేతనని చెప్పుకుంటున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కాపు యువకులను, అరాచక శక్తులను రెచ్చగొట్టిన తుని సంఘటనకు ప్రధాన బాధ్యుడని అన్నారు. సిఎంగా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 19 నెలల కాలంలో కాపు సమస్యలపై ముద్రగడ ఏనాడూ సంప్రదించలేదని, తునిలో కాపుగర్జన పేరుతో సమావేశం నిర్వహించి, తమ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాల్జేసేందుకు అరాచక శక్తులను ప్రోత్సహించి విధ్వంసకర సంఘటనలకు కారణమయ్యారన్నారు. కాపులను బిసిలో చేర్చేందుకు సిఎం చంద్రబాబు గత 19 నెలల నుండీ ప్రయత్నిస్తునే ఉన్నారని, దీనిలో భాగంగా మంజునాధ్ కమిటీని కూడా వేశారన్నారు. తొమ్మిది నెలలో కమిటీ నివేదిక ఇవ్వాలని సిఎం ఆదేశించారని, ఆ నివేదిక రావలసి ఉండగా..తొందరపాటు చర్యగా ముద్రగడ కాపు యువకులను, అరాచక శక్తులను రెచ్చగొట్టారన్నారు. కాపుల సంక్షేమానికి ప్రభుత్వం వంద కోట్లు విడుదల చేసిందని, అదనంగా మరిన్ని నిధులు మంజూరుచేసేందుకు సిఎం సిద్ధంగా ఉన్నారన్నారు. పది సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెసు ప్రభుత్వం కాపులకు ఏమీ చేయలేదని, కాంగ్రెసు నేతలే కాపులకు రిజర్వేషన్ కల్పించాలని ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల నుండి వచ్చిన తెలుగుదేశం పార్టీ కాపునేతలు, సానుభూతి పరులతో కాపుల సంక్షేమం, అభ్యున్నతి తదితర అంశాలపై ఎమ్మెల్యే ముప్పిడి చర్చించారు. సమావేశంలో టిడిపి కాపునేతలు అనిశెట్టి ప్రభాకరరావు, గండ్రోతు శ్రీనివాసరావు, పి ఏడుకొండలు, అనిశెట్టి త్రిమూర్తులు, జివి సద్గుణరావు, ఆకుల రాము, అచ్యుత వెంకటరామారావు, నియోజకవర్గ పరిధిలోని సుమారు 160మంది కాపునేతలు పాల్గొన్నారు.