పశ్చిమగోదావరి

పోటెత్తిన భక్తి భావం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొవ్వూరు, ఆగస్టు 6: కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో అంత్య పుష్కరాల ఏడో రోజు శనివారం క్షేత్రంలోని స్నానఘాట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. అత్యధిక సంఖ్యలో వేలాది మంది భక్తులు గోష్పాద క్షేత్రానికి విచ్చేసి పుణ్యస్నానమాచరించారు. తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. అధిక సంఖ్యలో పిండ ప్రదానాలు నిర్వహించారు. పెరిగిన యాత్రీకులను దృష్టిలో ఉంచుకుని అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. గోదావరి వరద కొద్దిగా తగ్గుముఖం పట్టడంతో గోష్పాద క్షేత్రంలోని అన్ని స్నాన ఘాట్లలో యాత్రీకులు, భక్తులు పుణ్యస్నానమాచరించారు. క్షేత్రంలోని స్నాన ఘట్టాల్లో వరద నీరు మోకాలిలోతు ఉండటంతో యాత్రీకులు చెంబులతో స్నానమాచరించారు. గోదావరి వరద రావడంతో అధికారులు అప్రమత్తమై స్నానఘట్టాల్లో అధిక సంఖ్యలో పడవలు, గజ ఈతగాళ్లను ఏర్పాటుచేశారు. శ్రావణమాసం కావడంతో అధిక సంఖ్యలో మహిళలు పుణ్యస్నానమాచరించారు. పార్వతీపురం నుంచి టూరిస్టు బస్సులో యాత్రీకులు గోష్పాద క్షేత్రానికి చేరుకుని స్నానమాచరించారు. స్థానిక ఎమ్మెల్యే కెఎస్ జవహర్, ఆర్డీవో బి శ్రీనివాసరావు, మున్సిపల్ ఛైర్మన్ సూరపని రామ్మోహన్, ఇతర అధికారులు యాత్రీకులకు సేవలందించారు.
పోలవరం: అంత్య పుష్కరాల సందర్భంగా పట్టిసం పుష్కర ఘాట్‌లో స్నానాలు చేసిన మహిళా భక్తుల సంఖ్య సాధారణంగానే ఉంది. ఇతర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు పుష్కర స్నానం అనంతరం వీరేశ్వరస్వామిని దర్శనం చేసుకునేందుకు లాంచీపై గోదావరి నది దాటి వెళ్లారు. ఇతర ప్రాంతాల నుండి ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు భక్తులు పుష్కర స్నానాలు చేసేందుకు వస్తున్నారు. ఆ తరువాత వచ్చే భక్తుల సంఖ్య అంతంతమాత్రంగానే ఉంది. మండలంలో ఉన్న ఇతర ఘాట్లలో పుష్కర స్నానాలు చేసే మహిళలు అధికంగానే ఉన్నారు. ఇఒపిఆర్డీ సుబ్రహ్మణ్యం పట్టిసం రేవులో పరిస్థితిని సమీక్షించారు.

అధికారుల సేవలు భేష్
మంత్రి మాణిక్యాలరావు

కొవ్వూరు, ఆగస్టు 6: అంత్య పుష్కరాలకు ప్రభుత్వం, వివిధ శాఖల అధికారులు సమన్వయంతో కలసి పనిచేయడంతో కొవ్వూరు గోష్పాద క్షేత్రానికి విచ్చేస్తున్న భక్తులు ఏవిధమైన ఇబ్బందులు పడకుండా పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారని దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. శనివారం రాత్రి మంత్రి మాణిక్యాలరావు కొవ్వూరు గోష్పాద క్షేత్రానికి విచ్చేసి గోదావరి నది హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 11న అంత్య పుష్కరాల ముగింపును రాజమహేంద్రవరంలో అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటారని, అదేరోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు గోదావరి మాతకు హారతి కార్యక్రమం నిర్వహిస్తారని తెలిపారు. అనంతరం 8 గంటలకు రాజమహేంద్రవరం నుంచి విజయవాడ బయలుదేరి వెళ్లి, విజయవాడలో గోదావరి సంగమం వద్ద కృష్ణా పుష్కరాలకు స్వాగతం పలికి, హారతి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారని మంత్రి మాణిక్యాలరావు తెలిపారు. మంత్రి వెంట ఆర్డీవో బి శ్రీనివాసరావు, మున్సిపల్ ఛైర్మన్ సూరపని రామ్మోహన్ తదితరులున్నారు.