యువ

‘కృషీ’వలుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నారుపోసి, నీరుపోస్తే ఏ మొక్కయినా పెరిగి పెద్దదవుతుంది!
చేరదీసి, చేయూతనిస్తే మోడువారిన ఏ జీవితమైనా గాడిన పడుతుంది!
కావలసిందల్లా స్పందించే గుణం.
వెన్నుతట్టి, వెనకుండి నడిపించే మానవతా హృదయం!
జయవేల్ జీవితాన్ని తరచి చూస్తే.. అదే విషయం బోధపడుతుంది.
ఇంతకీ ఎవరీ జయవేల్!
ఒక్క మాటలో చెప్పాలంటే....్ఫట్‌పాత్‌పై బిచ్చమెత్తుకునే స్థితినుంచి కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో చదువుకునే స్థాయికి ఎదిగిన వ్యక్తి.
అయితే ఈ ఘనతను అతనొక్కడే ఒంటిచేత్తో సాధించలేదు.
జయవేల్ విజయాల్లో సింహభాగం అతన్ని చేరదీసి, చేయూతనిచ్చి, అతని జీవితాన్ని తీర్చిదిద్దిన ముత్తురామన్ దంపతులకు దక్కుతుంది.
ఇదంతా తెలుసుకోవాలంటే...ఈ కథనం చదవాల్సిందే.
**
జయవేల్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు పట్టణం. తండ్రి బతికున్నంత వరకూ అతని జీవితం కాస్త బాగానే ఉండేది. తండ్రి చనిపోయాక చిన్న వయసులోనే తల్లితో కలసి ఉపాధి వెతుక్కుంటూ చెన్నై చేరాడు. పని దొరక్క తల్లీకొడుకులు ఫుట్‌పాత్‌పైకి చేరారు. ఎవరైనా దయతలచి బిచ్చం వేస్తే తినడం, లేదంటే పస్తులుండటం. భర్త మరణంతో తల్లి తాగుడుకు అలవాటు పడింది. దాంతో ఎన్ని డబ్బులు వచ్చినా ఆమె తాగుడుకే సరిపోయేది. అలా బతుకీడుస్తున్న దశలో...ఓ రోజు అదృష్టం జయవేల్‌ను వెతుక్కుంటూ వచ్చింది.
చెన్నైలో సూర్యం చారిటబుల్ ట్రస్ట్ అనే స్వచ్ఛంద సంస్థ ఉంది. దానిని ఉమ, ముత్తురామన్ దంపతులు నడుపుతారు. ఓ రోజు అనుకోకుండా ఉమ...జయవేల్‌ను చూశారు. అతనితో నాలుగు నిమిషాలు మాట్లాడాక, కుర్రాడిలో స్పార్క్ ఉందని గ్రహించారు. ‘చదువుకోవాలని ఉందా?’ అని అడిగితే ఓ అని జయవేల్ ఎగిరి గంతేశాడు. వెంటనే అతన్ని (1999లో) ఓ పాఠశాలలో చేర్పించారు. అయితే అతని జీవితం మాత్రం ఫుట్‌పాత్‌పైనే. స్కూల్ ఉన్న సందులోనే ఫుట్‌పాత్‌పై తల్లితో కలసి ఉండేవాడు. క్రమంగా చదువు పట్ల ఆసక్తి పెరగడంతో చకచకా ఇంటర్ వరకూ చదివాడు. ఇంటర్‌లో చక్కటి మార్కులతో పాస్ కావడంతో ఉమ ప్రోత్సాహంతో కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి పాసయ్యాడు. గ్లిండ్వార్ వర్శిటీలో ‘పెర్‌ఫార్మెన్స్ కార్ ఎన్‌హాన్స్‌మెంట్ టెక్నాలజీ ఇంజనీరింగ్’లో జయవేల్‌కు సీటొచ్చింది. మళ్లీ అతన్ని ఆదుకున్నది ఉమ దంపతులే. డబ్బులిచ్చి, వెన్నుతట్టారు. దాంతో లండన్ వెళ్లి డిగ్రీ పూర్తి చేశాడు. ఇప్పుడు పైచదువులకోసం యూనివర్శిటీ ఆఫ్ ట్యూరిన్‌కు వెడుతున్నాడు జయవేల్. ఇప్పుడు జయవేల్ ఆశయం... బాగా చదువుకుని ఊళ్లేలన్నది కాదు. తనలాగే ఫుట్‌పాత్‌కే పరిమితమై, చితికిపోతున్న చిన్నారుల జీవితాలను చక్కదిద్దడం. అంతకంటేముందు, తన జీవితానికి వెలుగునిచ్చిన ముత్తురామన్ దంపతుల ట్రస్ట్ వ్యవహారాలను చూసుకోవడం.

చెప్పుకోవలసి విషయం ఏమిటంటే... జయవేల్ ప్రస్థానంలో ప్రభుత్వం పాత్ర పూచికపుల్ల అంతయినా లేకపోవడం. జయవేల్‌ను లండన్ పంపించేందుకు ముత్తురామన్ దంపతులు అక్షరాలా 17 లక్షలు అప్పు చేశారట. ఇప్పుడు ఇటలీ పంపేందుకు మరో 8 లక్షలు అప్పు చేయాల్సి వస్తోందట. ఒకరిద్దరు పెద్ద మనసు ఉన్నవారు చేయూతనివ్వడమే తప్పిస్తే, ప్రభుత్వం నుంచి ఇప్పటివరకూ జయవేల్‌కు ఒక్క పైసాకూడా అందలేదట.

చిత్రం.. తల్లితో ఫుట్‌పాత్‌పై జయవేల్