మెయిన్ ఫీచర్

అపర భగీరథుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆయన ఉన్నచోట అపార జలనిధి ఉబికి వస్తుంది. ఆయను అడుగుపెట్టిన చోట అడుగంటిన బోర్లు నీటితో ప్రాణం పోసుకుంటాయి.. ఎండిన భూములు సైతం పచ్చదనంతో కళకళలాడుతుంటాయి. ఆయన కాలిడినచోట కరవు కాటకాలకు తావేలేదు. ఈ భూమీద పడే ప్రతి నీటి బొట్టును భద్రపరచాలనే తపనతో పాతికేళ్లగా పోరాటం చేస్తున్నాడు. ఆయన చేసే పోరాటం ముందు అసలు భగీరథుని ప్రయత్నం కూడా చిన్నబోతుందేమో. నీటికోసం తన జీవితానే్న ఫణం గా పెట్టిన నిత్య కృషీవలుడు అయ్యప్ప మసాగీ. ఆరు పదులు వయసులోనూ అనంతపురం జిల్లాలో ఆయన అవలంబిస్తున్న సాగు పద్ధతుల వల్ల ఎన్నో విజయాలు, అవార్డులు, రివార్డులు సొంతమయ్యాయి. వీటన్నింటి వెనుక ఉన్న మూ లం చిన్నప్పటి నుంచి పడిన నీటి కష్టాలే.
తండ్రి కష్టాలే కదిలించాయి
కర్నాటకలోని గదగ్‌జిల్లా నాగారావ్‌కు చెందిన అయ్యప్ప మసాగీ చదివింది మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిప్లమో. చిన్నప్పటి నుంచి వ్యవసాయం అంటే మక్కువ. బాగా చదువుకుని తానుండే ప్రాంతంలో నీటి కష్టాలు తీర్చాలని ఆ పసి మనసు ఆరాటపడేది. కాని తండ్రి ఎప్పుడూ పొలం పనులు చేయమని పురమాయించేవాడు. అయ్యప్ప ఏడో తరగతి చదువుతున్న సమయంలో ఆయన తండ్రి మహదేవప్ప మసాగీ ఎందుకూ పనికిరాని బంజరు భూములను కౌలుకు తీసుకొని సాగుచేసేవారు. అయితే భూములు సారవంతమవ్వగానే కౌలుకు ఇచ్చిన రైతులు వాటిని వెనక్కుతీసుకునేవారు. మహదేవప్ప మళ్లీ మొదటి నుంచి తన ప్రయత్నం ప్రారంభించేవారు. షరా మామూలే.. భూములు సారవంతం కాగానే రైతులు వెనక్కు తీసుకునేవారు. ఇలా ఎన్నో సార్లు జరిగింది. ఇదంతా కళ్లారా చూసిన అయప్ప మనసులో తండ్రి పడ్డ కష్టాలు నాటుకుపోయాయి. ఆ కష్టాల కసితోనే ఆయన నేడు వందలాది బంజరు భూములను సారవంతం చేస్తూ రైతుల కళ్లల్లో వెలుగులు నింపుతున్నారు. అయ్యప్ప మసాగీ వివాహం తర్వాత ఎల్ అండ్ టి సంస్థలో వర్క్‌మెన్‌గా విధుల్లోకి చేరి తన ప్రావీణ్యంతో ప్రాజెక్టు ఇంజనీర్‌గా 23 ఏళ్ళ పాటు సేవలు అందించారు. పసి వయసులో నీటి కోసం పడిన కష్టాలను గుర్తొచ్చి మిగతావారు అలాంటి కష్టాలు ఎదుర్కోకూడదని భావించాడు. ఎక్కడైతే తన తండ్రి అన్యాయానికి గురయ్యారో అక్కడే సత్తాచాటాలనుకున్నారు.
14 ఎకరాలతో ఆరంభం
ఉద్యోగం చేస్తూ పైసా పైసా కూడబెట్టిన డబ్బుతో భార్య వద్దన్నా 1994లో తన సొంత ఊరు నాగారావ్‌కు సమీపంలోని గజేంద్ర గ్రామంలో 14 ఎకరాల బంజరు భూములను కొనుగోలు చేశారు. బెంగళూరు నుండి దాదాపు 400 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. ఓ వైపు విధులు నిర్వహిస్తూనే మరో వైపు శని, ఆదివారాల్లో గ్రామానికి వెళ్ళి బంజరు భూములను సారవంతం చేసేందుకు ఎంతో కష్టపడ్డారు. మూడేళ్ళలో ఆ బంజరు భూముల్లో వక్క, కాఫీ, ద్రాక్ష, టెంగు తదితర మొక్కలు నాటి అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఆ భూముల విలువ రూ.10 కోట్లకు చేరుకుంది. అదే విధంగా పక్కనే ఓ రైతు 72 ఎకరాలు కొనుగోలు చేయగా అందులో రాతిని చదును చేస్తుండగా జలం ఉబికి ఆ బంజరు భూములన్నీ సారవంతమయ్యాయి. అందుకు కారణం తన పొలంలో నీటి వనరుల పెంపునకు తీసుకున్న చర్యలేనని నిపుణులు అభినందించినట్లు భావోద్వేగంతో అయ్యప్ప పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో మిగిలిన కరవు ప్రాంతాలను అభివృద్ధి చేయాలని
‘జన సాక్షరత’ పేరిట చైతన్య కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. నీటి సంరక్షణ కోసం తాను చేస్తున్న ప్రయత్నాలు రైతులందరికీ తెలియజేసి వారిని కరవు నుంచి కాపాడేందుకు 2002లో ఉద్యోగానికి రాజీనామా చేసి సేంద్రియ వ్యవసాయానికి నడుం బిగించారు అయ్యప్ప.

ఉప్పొంగుతున్న జలచైతన్యం
భూగర్భజలాలు పెంపే ధ్యేయంగా రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రతి రాష్ట్రంలో ఆయా ప్రాంతాల్లోని రైతులతో ప్రత్యేకంగా క్లస్టర్లను ఏర్పాటు చేసి చైతన్యం తీసుకువస్తున్నట్లు వివరించారు. తాను చేస్తు న్న జల చైతన్యానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెం డు భారీ సోలార్ ప్లాంట్‌లను మంజూరు చేయగా ఒక్కో దానికి రూ.10 లక్షల దాకా రాయితీ కల్పించిందన్నారు. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో వర్షపు, వృథా నీటిని సద్వినియోగ పరచడంతో 2.56 లక్షల బోర్లలో నీటిమట్టం పెరిగిందని సగర్వంగా చెప్పారు. ప్రస్తు తం అయ్యప్ప చేస్తున్న నీటి పొదుపు, ప్రకృ తి వ్యవసాయంతో కోడూరు ప్రాం తంలో పచ్చదనంతోపాటు ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తోంది. బెంగళూరు, చెన్నై, ముంబాయి వంటి మహానగరాల్లో నీటిఎద్దడి నివారణలో భాగంగా వృథా నీటి సద్వినియోగంపై చైతన్యం కలిగించి 300 అపార్టుమెంట్లు, 15 వేల ఇళ్ళకు ఇం కుడు గుంతలు తవ్వించడంతోపాటు 38 గ్రామాల్లో నీటి ఎద్దడిని నివారించినట్లు పేర్కొన్నారు. టాటా, బిర్లా, మెట్రో వంటి 176 ప్రముఖ పరిశ్రమలకు వర్షపు, వృథా నీరు సద్వినియోగం ద్వారా నీటి సమస్య లేకుండా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.
నీటి పొదుపుతోనే భవిష్యత్తు బంగారం
వర్షాలు కురవడం లేదని, కరవు విలయ తాండవం చేస్తోందని బెంగ పడితే భవిష్యత్తు అంధకారమేనంటారు అయ్యప్ప. కనీసం మూడేళ్ళకు ఒకసారైనా కురిసే వర్షపు నీటి నిల్వకు రైతులు తమ పొలాల్లో నీటికుంటలు, కందకాలు తవ్వుకుంటే తప్పకుండా భూగర్భజలాలు మెరుగు పడటంతోపాటు పాడుబడిన బావులు, బోర్లు కూడా ఉపయోగంలోకి వస్తాయంటున్నారు.
ప్రముఖుల చేయూత
అడుగంటిపోతున్న భూగర్భజలాలను పెంపొందించేందుకు వర్షపు నీరు, వృథా నీటిని సద్వినియోగం చేస్తున్న అయ్యప్పకు వివిధ సంస్థలు, ప్రముఖులు సహకారం అందిస్తూ భాగస్వాములవుతున్నారు. ఇందులో భాగంగా వాటర్ లిటరసీ ఫౌండేషన్ పేరిట ట్రస్టు, రెయిన్ వాటర్ క్యానెఫ్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా దేశవ్యాప్తంగా జల చైతన్యం తెచ్చేందుకు కృషి చేస్తున్నారు.

అనంతపురం జిల్లాపై దృష్టి
దేశంలో జైసల్మార్ తర్వాత అత్య ల్ప వర్షపాతం నమోదవుతున్న అనంతపురం జిల్లాపై అయ్యప్ప దృష్టి పడింది. ఇందులో భాగంగా చిలమత్తూరు మండల పరిధిలోని 44వ నెంబర్ జాతీయ రహదారి పక్కనే కోడూరు వద్ద 2012లో 84 ఎకరాల బంజరు భూములను 9 మంది భాగస్వామ్యంతో కొనుగోలు చేశారు. కొండలు, గుట్టలతో కూడిన ఆ భూములను బాగుపరచి వ్యవసాయానికి శ్రీకారం చుట్టారు. ఆ బంజరు భూముల్లో ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో పెద్దపాటి చెరువు తరహాలో కందకాన్ని తవ్వించి వర్షపు నీరు భూములోకి ఇంకేలా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఈ ప్రాంతం తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఉన్నా ఆ కందకం నీటితో కళకళలాడుతోంది. దీనికి తోడు చిన్నపాటి 676 నీటి కుంటలను తవ్వించగా ఇటీవల కురిసిన వర్షాలతో ఆ కుంటలన్నీ నిండాయి. తద్వారా బోర్లు వేయించగా దాదాపు ఐదు బోర్లలో సమృద్ధిగా నీరు లభ్యం కావడంతో ఆ నీటితోనే అక్కడ వ్యవసాయం సాగిస్తున్నట్లు అయ్యప్ప సంతోషం వ్యక్తం చేశారు. వివిధ రకాలకు చెందిన ఆరువేల చెట్లు ఏపుగా పెరిగి పచ్చదనంతోపాటు కాసులు కురిపిస్తున్నాయి. మొత్తం భూమిని 37 విభాగాలుగా చేసి నీటి కుంటలను తవ్వించి 250 టెంగు, 1200 గోవా టేకు, 1000 దాకా రోజ్ ఆపిల్, వెయ్యి నిమ్మకాయ, వెయ్యి మిలియా దునియా చెట్లు పెంచాడు. దీంతో ఆ భూములు పచ్చదనంతో కళకళలాడుతోంది. ఇటీవల మేఘాలు కమ్ముకోగా పరిసర ప్రాంతాల్లో అంతంత మాత్రంగానే వర్షం పడగా తమ భూముల్లో మాత్రం 11 రోజులపాటు వర్షాలు పడ్డాయని ఆనందం వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తితో కర్నాటక, ఆంధ్ర, తెలంగాణ, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, జార్ఖండ్ తదితర 14 రాష్ట్రాల రైతుల్లో జల చైతన్యం తెచ్చి ఇప్పటి వరకు 30 వేల హెక్టార్ల బంజరు భూములను వ్యవసాయోగ్య భూములుగా మార్చినట్లు మసాగీ చెప్పారు.

ఎన్నో అవార్డులు..
అటు జలచైతన్యం ఇటు ప్రకృ తి వ్యవసాయం చేస్తూ రైతులు, ప్రజలకు అవగాహన కల్పిస్తున్న అయ్యప్పకు అందిన అవార్డులకు లెక్కేలేదు. గిన్నిస్‌బుక్‌లో స్థానం సంపాదించడంతోపాటు 2009లో రాష్టప్రతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. 2010లో కర్నాటక ప్రభుత్వం జల గాంధీ అవార్డు ఇచ్చి సత్కరించింది. ఇలాంటి అవార్డులను ప్రముఖ సంస్థలు, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఆయనకు ప్రదానం చేశాయి. గ్రామీణ ప్రాంతాల్లో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నీటి వృథాను అరికట్టి భూగర్భజలాలు పెంపుదలకు చేస్తున్న కృషికి అయ్యప్ప మసాగీకి అంతర్జాతీయ అవార్డు కూడా దక్కింది.

- కె.ఎస్. సుధాకర్, హిందూపురం