మంచి మాట

ఆరోగ్య ప్రదాత ధన్వంతరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ సృష్టి అంతంలో జలావధిలో మునిగిపోకుండా ఉన్న ఏకైక ధరాతలం నైమిశారణ్యం. విధాత రాబోయే సృష్టి రచన కోసం సప్త ఋషి వర్గాన్ని ఉంచడానికి నిలిపి ఉంచిన భూమి కనుక దానిని నైమిశారణ్యం అన్నారు. ఒకనాడు నైమిశారణ్యంలో అగస్త్య మహర్షి, గౌతమ మహర్షి, భరద్వాజ మహర్షి సమావేశమై లోకంలో మనుషులకు కనిపించని రోగాలు కొన్ని, కనిపించి బాధపెట్టే రోగాలు, శరీరానికి సంబంధిచిన రోగాలు, మనస్సుకు సంబంధించిన రోగాలతో సతమతవౌతు, బాధలకు గురి అవుతున్నారు.
ప్రకృతి పరివర్తనలో విపరీతాలచే వచ్చేటువంటి సాంక్రమిక జానపద విధ్వంసక వ్యాధులు కలరా, ప్లేగు రోగాలు, మరణ భయాలతో జీవిస్తున్నారు. ఈ వ్యాధుల నిర్మూలనకు వైద్యశాస్త్రాన్ని తెలిసికోవడానికి దేవేంద్రుని వద్దకు భరద్వాజ మహర్షిని పంపారు.
దేవేంద్రుడు మహర్షితో అనంతమైన ఈ కాలగమనంలో రాబోయే మానవ సృష్టి, అతని సుఖదుఃఖాలు, ఆరోగ్య, అనారోగ్యాలు, వృద్ధాప్యం, మరణం వీటన్నింటినీ ముందుగానే విధాత యోచించాడని, అందుకు అధర్వణ వేదానికి ఉపవేదంగా ఆయుష్షును సంరక్షించే సంపూర్ణ వైద్య శాస్త్రాన్ని నిక్షేపించాడని తెలిపాడు. ఇందులో ప్రకృతిలో నిక్షిప్తం చేయబడ్డ మందులు వాటి ఉపయోగం చెప్పబడ్డాయి. లోహ విజ్ఞానం, ప్రకృతి పరిణామం అనుసంధానం చేయబడి చెప్పబడినదే ఆయుర్వేదం.
వేదకాలంలో మొలకెత్తి ఆయుర్‌వేదం శాఖోపశాఖలుగా విస్తరిల్లి దినోదాస, చరక, సుశ్రుత అగ్నివేశ, పైలమహర్షి, వంటి ఎందరో వైద్యశాస్తజ్ఞ్రుల కృషితో సంహితల రూపంగా ఆయుర్వేదం పరిఢవిల్లింది.
క్షీరసాగరాన్ని దేవతలు రాక్షసులు మథించినపుడు ముందుగా హలాహలం పుట్టింది. పరమశివుడు హలాహలాన్ని మింగేసి గరళకంఠుడు అయినాడు. ఆ తర్వాత కామధేనువు, ఐరావతం, చివరగా శ్రీమన్నారాయణుడు పరిపూర్ణ పరంజ్యోతి స్వరూపుడుగా ధన్వంతరి రూపం ధరించి చేతిలో అమృత కలశంతో వెలుపలకి వచ్చాడు. ఆ అమృత కలశంలో సమస్త శారీరక, మానసిక, అజ్ఞాన రోగాలకు ఔషధాలు నిక్షిప్తమై ఉన్నాయి.
‘‘ఓం నమామి ధన్వంతరీ మాది దేవం / సురాసుద్వైర్వందిత పాదపద్మం లోకే జరా రుగ్మయ మృత్యునాశం /దాలూరమీశం వివిధౌషదానాం’’ అని ఆదికాలంలో కీర్తించారు ఆయనను. విధాత నుండి నేను, నా నుండి సూర్య భగవానుడు, ఆ సూర్య భగవానుని నుండి నకులుడు, సహదేవుడు, అశ్వనీ దేవతలు గ్రహించారు అని ఆయుర్వేదాన్ని ఉపదేశించాడు భరద్వాజ మహర్షికి.
అమృతాన్ని భూలోకానికి మొట్టమొదట తీసుకువచ్చిన వారు ధన్వంతరి. విష్ణ్భుగవానుడు దేవతల పంపకంలో సూర్యునికి వంతుగా ధన్వంతరిని పంపాడు.
ఇంద్రుని ప్రార్థించి ధన్వంతరి దేవ వైద్య పదవి స్వీకరించాడు. ధన్వంతరి భవరోగాలను పోగొట్టే దైవం. వైద్య విద్యకు ఆదిదేవుడు. మానవులు ఆరోగ్యానికి అధిదేవతయైన ధన్వంతరిని, సకల రోగాల విముక్తికై పూజించాలి.
దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ధన్వంతరి ఆరాధనవల్ల స్వస్థత చేకూరుతుందని తెలుస్తోంది. నిజానికి సకల సుఖాలు అనుభవించడానికి ఆరోగ్యమే ఉండాలి. శరీరం ఆరోగ్యంగా లేకపోతే మనస్సుకు ఏకాగ్రత ఉండదు.
కేరళ రాష్ట్రంలో త్రిశూర వద్ద ధన్వంతరి ఆలయం ఉన్నది. ఈ ఆలయంలో ధన్వంతరిని స్మరించుకొని హరినామ స్మరణ చేస్తే సకల రోగాలు పటాపంచలై సంపూర్ణ ఆరోగ్యం సంప్రాప్తమవుతాయని విశ్వాసం. ఈ ఆలయంలో విష్ణు సహస్రనామార్చన చేస్తే దీర్ఘకాలిక రోగాలు కూడా నయమవుతాయట.
స్కంద, గరుడ, మార్కండేయ పురాణాలలో ధన్వంతరి చరిత్ర ప్రస్తావింపబడినది. ప్రపంచంలోని ప్రతి వస్తువులలోనూ ఔషధ గుణాలు, ప్రతి చెట్టు ఔషధాలనిస్తుందని ఆయుర్వేదం చెప్తుంది. అద్భుత ఆయుర్వేద శాస్త్రాన్ని అందించి ధన్వంతరిని స్మరిద్దాం. సంపూర్ణమైన ఆరోగ్య నియమాలను పాటిద్దాం!

-రసస్రవంతి కావ్యసుధ