నెల్లూరు

స్వచ్ఛ్భారత్ (హాస్య నాటిక)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వ్యాఖ్యాత : ప్రియమైన ప్రేక్షక మహాశయులకి నా హృదయపూర్వక నమస్కారములు. మన భారతీయులకు సాటి మనిషిపై జాలి, దయ, కరుణ, ప్రేమ, సానుభూతి వగైరా చాలాచాలా ఎక్కువ. ఇప్పుడు ఉదయం పదిగంటలవుతుంది.. ఇక్కడ అంటే మన నెల్లూరు ట్రంకురోడ్డులోని నాలుగురోడ్ల కూడలిలో మనమంతా చూస్తున్నాం. ఇదిగో చీపిరి చేతిలో పట్టుకుని నడిరోడ్డులో ఒక శవం పడి వంది.
అదిగో అటు చూడండి, ఒక వ్యక్తి ఇటుగా వస్తున్నాడు.

వ్యక్తి : (శవాన్ని పరిశీలనగా చూసి రెండు చేతులతో గుండెల మీద బాదుకుంటూ) ఓ ప్రభూ ఎంత అన్యాయం జరిగిపోయింది. మా యాకోబు చచ్చిపోయాడు. అయ్యో ఇంత దారుణంగా ఆత్మహత్య చేసుకున్నాడు, ఎంత అన్యాయం జరిగిపోయింది ప్రభూ (అంటూ అటు ఇటు దిక్కులు చూసి) ఒరే ఒరే ఇటు రండిరా, ఇది చూడండి రా, మన దళితుడురా.. చచ్చిపోయాడురా.. దళితులపై జరిగే అన్యాయం నశించాలి
‘దళిత సంఘం’ వర్థిల్లాలి!
‘ప్రభుత్వ వాహనాలు’ తగలబెట్టాలి!
‘ప్రధానమంత్రి’ రాజీనామా చెయ్యాలి!
(అని అరుచుకుంటూ వెళ్లిపోతాడు)

వ్యాఖ్యాత : ఇప్పుడు మరో వ్యక్తి వస్తున్నాడు చూడండి (శవంపైకి వంగి చూసి)
వ్యక్తి : కాసేపు ఆలోచించి, తన రెండు చేతులు పైకి కిందకూ ఊపుతూ గట్టిగా ఒరేయ్.. ఒరేయ్ మన రాజయ్య చచ్చిపోయాడురా ఆత్మహత్య చేసుకున్నాడురా, ఈ అగ్రకులాల వాళ్ల అన్యాయాలు తట్టుకోలేక మనందరిని వదిలిపెట్టి వెళ్లిపోయాడురా ( ఆవేశంగా) ఈ అగ్రకులాల అకృత్యాల వల్ల మన బిసిలకు అన్యాయం జరిగిపోతా వుంది. దీన్ని అరికట్టాలి..మనమంతా పోరాడాలి.
బిసి సంఘం - వర్థిల్లాలి!
అగ్రకులాల ఆధిపత్యం - నశించాలి!
రైళ్లన్నింటిని - ఆపివెయ్యాలి!
(ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి రాజీనామా చెయ్యాలి...అంటూ కేకలు పెడుతూ వాళ్లు వెళ్లిపోతారు)
వ్యాఖ్యాత : మన శవం గారిని పరిశీలించడానికి ఇంకో వ్యక్తి వడివడిగా నడుస్తూ వస్తున్నాడు చూడండి.
వ్యక్తి : యా అల్లా! (అంటూ శవాన్ని పరిశీలనగా చూసి) అరే అల్లా! ఎంత పరేషాన్ జరిగిపోయింది. అరె మన నభీసాహెబ్ ఆత్మహత్య చేసుకున్నాడే, ఈ దేశంలో మా మైనార్టీలకు ఎంత కష్టం వచ్చింది, ఓ భయ్యా.. ఓ భయ్యా ఇదురావో మన మతాన్ని రక్షించుకుందాం. ఈ దుర్మార్గాన్ని ఎదురిద్దాం.
మైనార్టీ సంఘం వర్థిల్లాలి!
మైనార్టీల ఆధిపత్యం - నశించాలి
(అంటూ వెళ్లిపోతారు)
వ్యాఖ్యాత: ప్రేక్షకులారా ఇటు చూడండి టిప్‌టాప్‌గా రెడీ అయి ఒక చేతిలో లాప్‌టాప్ మరో చేతిలో సెల్‌ఫోన్ పట్టుకుని వస్తున్నాడో కుర్రాడు.
కుర్రాడు: (శవం దగ్గరకు రాగానే ల్యాప్‌టాప్ జాగ్రత్తగా కిందపెట్టి సెల్‌ఫోన్‌లో శవాన్ని ఫొటో తీసి ఫోన్‌లో ఆ ఫొటో అటూ ఇటూ తిప్పి చూసి గట్టిగా) ఓ మైగాడ్ ఇతను నా ఫ్రెండ్. ఇది చాలా బాధాకరం (అంటూ సెల్‌ఫోన్ చెవిలో పెట్టుకుని) హలో ఫ్రెండ్స్ మీరంతా అర్జంటుగా యమార్జంటుగా నెల్లూరు ట్రంకురోడ్డుకు వచ్చేయండి (అతడు ఫోన్ కట్ చేసేలోపల వాళ్లు అక్కడుంటారు. అతడు ఆవేశంగా)
మన ఎస్. ఎఫ్. ఐ. విద్యార్ధి చనిపోయాడు. కాబట్టి మనమంతా సమ్మె చేద్దాం.
విద్యాశాఖామంత్రి రాజీనామా చేయాలి
ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి రాజీనామా చేయాలి.
విద్యార్ధులంతా తరగతులను బాయ్‌కాట్ చేయాలి.
అన్ని పాఠశాలలు, కళాశాలలు మూసేయాలి.
విద్యార్ధులందరికి ఉద్యోగాలు ఇవ్వాలి.
ఎస్. ఎఫ్. ఐ. జిందాబాద్ (అంటూ వీళ్ళు కూడా వెళ్ళిపోతారు)

వ్యాఖ్యాత : ప్రేక్షక మహాశయులారా చూస్తున్నారు కదా... ఈ సానుభూతి పర్వాన్ని, ఈ ప్రధాన రోడ్డులో పడివున్న శవం పుణ్యమా అని చుట్టూ నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆ పద్మవ్యూహంలోంచి ఎలాగోలా తప్పించుకొని ఓ శాంతికాముకుడు మన శవంగారిని సమీపిస్తున్నాడు చూడండి.

వ్యక్తి : (నుదుటన నామాలు పెట్టుకొని ఉంటాడు. శవాన్ని ఎడంగా నిలబడి చూస్తూ) గోవిందా.. గోవిందా (అంటూ చుట్టుపక్కల వున్న వానికి ఓ గోవిందా మన నారాయణ శర్మ స్వర్గస్తుడయ్యాడే ఎంతటి దురాగతము జరిగిపోయినది. ఈ దేశంలో అనామకులంతా అగ్రకులాలవారిని దూషిస్తుంటే విని సహించలేక ఆత్మార్పణ చేసుకున్నాడే (అంటూ) ఓ గోవిందా రండి మన శర్మ ఆత్మకి శాంతి చేకూరాలని ఇక్కడే కూర్చుని ఆ గోవిందనామ స్మరణ చేద్దాం. (అంటూ అందరూ శవం చుట్టూ కూర్చుని) హరే రామ్, హరే కృష్ణ (అంటూ భజన చేస్తుంటారు.)
వ్యాఖ్యాత : ఆహా! ఈ శాంతిపర్వం ఇంత శాంతియుతంగా జరుగుతుంటే ట్రాఫిక్ పర్వం చూద్దామొకసారి.
ప్రయాణికుడు : (ఏడుస్తూ) గంటనుంచి ట్రాఫిక్‌లో చిక్కుకుపోయా నేనింటికెళ్లి వంటచేసి మా ఆవిడకి, పిల్లలకి క్యారేజి సర్ది, నాకు సర్దుకుని ఆఫీసుకెళ్లేదెప్పుడు? ఎప్పటికి ఇక్కడనుంచి బయటపడతానో!
రెండో ప్రయాణికుడు: నిద్రలేచి వాకింగ్‌కని ఇలా వచ్చి, ఇక్కడ చిక్కుకుపోయా ఒకటికి, రెండుకి కూడా వెళ్ళలేదు. అమ్మో అన్ని అడ్జస్టయి పోతున్నాయి.
మరో ప్రయాణికుడు : అయ్యో! మా ఆవిడకి నొప్పులొచ్చేస్తున్నాయ్. రోడ్డుమీదే పిల్లోడు పుట్టేసేటట్టున్నాడు.
వ్యాఖ్యాత: ప్రేక్షకులారా! ఇక ఇటు మన శాంతినేతలు స్వర్గారోహణ పర్వంలోకి వచ్చారు.
నామాలావ్యక్తి : గోవిందా! మనమంతా కలిసి ఈ గోవిందకి ఇక్కడే, ఈ రోడ్డుమీదే అంత్యక్రియలు జరిపిద్దాం.
దళిత వ్యక్తి: ఆగండి! మీరెవరూ ఆ శవాన్ని తాకకండి. అది మా శవం. దళిత సంఘం - వర్ధిల్లాలి.
బి.సి. వ్యక్తి: కానేకాదు, అది మా రాజయ్య శవం - బి.సి. సంఘం - వర్ధిల్లాలి.
మైనారిటి వ్యక్తి : అది మా నభీ సాహెబ్ శవం
మైనారిటీ సంఘం - వర్ధిల్లాలి.
ఎస్.ఎఫ్.ఐ.: నో నెవ్వర్ ఇది మా ఎస్. ఎఫ్. ఐ. డెడ్ బాడీ
ఎస్.ఎఫ్.ఐ. - జిందాబాద్
విలేకరి : (వీళ్లందరినీ ఫొటో తీస్తూ) ప్లీజ్ వెయిట్ వన్ మినిట్ ప్రేక్షకులారా మీరు ఇప్పుడు మా దృష్టి ఛానెల్ నుంచి సనే్సషనల్ న్యూస్! నెల్లూరు నుంచి... ఒక శవం చీపిరి పట్టుకుని రోడ్డుపై పడివుంది. అయితే ఈ శవంలో వున్న గ్రేట్‌నెస్ ఏమిటంటే అన్ని కులాల వారిని ఆకట్టుకుంది. చూస్తూనే ఉండండి దృష్టి ఛానల్ ఈ సూపర్ శవానికి జరగబోయే అంత్యక్రియల వేడుకను మీ కళ్ళకు కట్టినట్లు చూపిస్తాం, విరామం తర్వాత!
వాఖ్యాత: ఇప్పుడు మనం శవంగారి స్వర్గయాత్ర ఎలా జరుగుతుందా అని ఉత్కంఠగా ఉంది కదూ! ఈ పాట వింటూ ఆ చివరి సీన్ చూసేయండి.
(పాట: మొదట పెగ్గులో మజా, మజా! మగత మత్తులో ఖుషీ ఖుషీ)
(పాట ప్రారంభమవగానే శవం చిన్నగా కదుల్తూ ఉంటుంది) అందరూ వణుకుతూ దెయ్యం దెయ్యం (అంటూ వెనక్కి అడుగులు వేస్తుంటే పాట ఆగిపోతుంది)
శవం : (పైకి లేచి చీపిరి పట్టుకుని ఊగిపోతూ) ఒరేయ్ ఒక్క పెగ్గు పోయండిరా! నేను నేను రోడ్లు ఊడ్చే చెత్తయ్యనురా, చీపిర్లు పట్టుకుని రోడ్లపై చెత్త ఊడ్చినట్లు ఫొటోలు దిగటం కాదు మీ మనసుల్లో ఉన్న కులం, మతం, వర్గం అనే మురికిని ఊడ్చేయండి. అప్పుడు వస్తదిరా సన్నాసుల్లారా అసలైన స్వచ్ఛ భారతం (అంటూ తన చేతిలోని చీపిరితో అందరిని తరిమికొడతాడు)
వాఖ్యాత: చూశారు కదా! స్వచ్ఛ భారతాన్ని. ఇది పవిత్ర ఇతిహాసం కావాలి అంటే మన బాధ్యతేమిటో గుర్తెరిగి ప్రవర్తించాలి.

- మోపూరు పెంచల నరసింహం - పెండ్యాల గాయత్రి చరవాణి : 9346393501