మెయిన్ ఫీచర్

గురువే దైవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వ్యక్తిలో స్వార్థం విజృంభిస్తే, ధర్మం పతనమవుతుంది, సమాజంలో సమన్వయ సమరస భావం ఉండదు. దుర్మార్గం ప్రబలుతుంది. దుష్ట శిక్షణ శిష్ట రక్షణకు, ధర్మాన్ని పునరుద్ధరించటానికి ‘‘గురువు’’ కావాలి. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు అవతరించాడు. ‘‘ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు...’’ అని కీర్తించాడు అన్నమ య్య. మనస్సు ను స్వాధీనం చేసికొని, మాయను జయంచిన వాడు శ్రీకృష్ణుడు. అన్న మయ్య అందుకే ‘‘కృష్ణం వందే జగద్గురుం’’ అన్నారు.
భారతీయ సంస్కృతీ సంప్రదాయంలో గురువుకు, గురు సంప్రదాయానికి అత్యంత ప్రాధాన్యత ఉన్న ది. గురువంటే సాక్షాత్ ఈశ్వరుడే, పరబ్రహ్మ స్వరూపుడే. అందుకే ‘‘గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువేనమః’’ అన్నారు.
‘‘అప్రత్యక్షో మహాదేవః సర్వేషామాత్మ మాయయా
ప్రత్యక్షో గురు రూపేణ వర్తతే భక్తి సిద్ధయే’’
పరమాత్మయే జీవులను ఉద్ధరించటానికి సద్గురువు రూపంలో అవతరిస్తాడన్నది భారతీయ తత్త్వం.
అందుకే, ‘‘గురుర్ గురుతమో ధామః సత్యః సత్య పరాక్రమః’’ అన్నది విష్ణు సహస్రనామం.
‘‘గృణాది హితమస్యేతి గురుః’’ అన్నది బ్రహ్మాండ పురాణం. హితమును చెప్పేవాడు - గురుడు. వేదవాఙ్మయాన్ని వ్యవస్థీకరించి, బహు విధములుగా విస్తరించిన వేద ధర్మంలోని క్లిష్టతను, వైరుధ్యాన్ని తొలగించి, స్పష్టత సమన్వయం చూపట్టే విధంగా వేదవిభాగం చేసి, అష్టాదశ పురాణాలను రచించి, ఆత్మానందానికి, సంపూర్ణ ఆధ్యాత్మిక ఔన్నత్య సాధనకు భాగవతాన్ని, బ్రహ్మ సూత్రాన్ని రచించి, పంచమ వేదమని ప్రసిద్ధి గాంచిన మహాభారతాన్ని వెలయంచిన మహర్షి వేదవ్యాసుడు. మానవ కోటికి ఆది గురువు. ‘‘మునీనామవ్యహం వ్యాసః’’ మునులలో వేద వ్యాసుణ్ణి నేను, అని పేర్కొన్నాడు, అందుకే గీతాచార్యుడు అన్నారు. అప్పటినుంచీ గురుపౌర్ణమిని వ్యాసపౌర్ణమిగా, అత్యంత శ్రద్ధా భక్తులతో జరుపుకుంటారు.
సంవత్సరంలో పనె్నండు పౌర్ణములు వచ్చినా, దేనికదే ప్రాముఖ్యత వహిస్తుంది. అన్నీ విశేషమైనవే. అయతే, పూర్వాషాఢ నక్షత్రంలో వచ్చే పౌర్ణమి ఆషాఢ మాసంలో వస్తుంది. పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం, ధనూరాశిలో ఉంటాయ. ధనూరాశికి అధిపతి - గురుడు. గురుడు విద్యాకారకుడు, ధన కుటుంబ గృహ వాహన కారకుడు. కనుక ఆషాఢమాసంలో వచ్చే పౌర్ణమి ‘‘గురు’’ సంబంధమైనది. అందుకే ఈ పౌర్ణాన్ని ‘‘గురుపౌర్ణమి’’ అని పిలుస్తారు. అదే వ్యాస పూర్ణిమ.
కాలిన ఇనుముపైన పడిన నీటి చుక్క, ఊరు పేరు లేక నశించి పోతుంది. ఆ నీటి బిందువే తామరాకు మీద పడితే ముత్యంలాగా కనపడుతుంది. ఆ బిందువే సముద్రాంతర్గాతమగు ముత్తెపు చిప్పలో పడితే, వౌక్తిక మణి అవుతుంది. కనుక ఆశ్రయము ననుసరించి మార్పు ఉంటుంది. సద్గురువు ఆశ్రయసిద్ధి. గురుపూర్ణిమనాడు జ్ఞప్తి చేసికోవలసిన ముఖ్యవిషయం.
‘‘తామిచ్ఛా విగ్రహం దేవీం గురు రూపాం విచింత యేత్’’. తను కోరుకున్న రూపాన్ని జగన్మాత ధరించగలదు. జగన్మాతయే గురురూపమును ధరించినది. కనుక జగన్మాతా రూపుడైన గురువు సర్వదా పూజనీయుడు.
‘‘గురుమూర్తిర్గుణ నిధి ర్గోమాతా గుహజన్మభూః’’
గణాంబా గుహ్య కారాధ్య కోమలాంగి గురుప్రియా’
అన్న లలితా సహస్రనామ స్తోత్రంలోనివి కూడా గురుపూర్ణిమకు స్ఫూర్తినిస్తాయి.
‘‘గిరతతి గృణాతీతి గురుః’’ అజ్ఞానాన్ని రూపుమాపేవాడు, జ్ఞానాన్నిచ్చేవాడు- గురువు. సూర్యుడు తన కిరణముల ద్వారా నదులు, చెరువులు, ఉప్పగా వుండే సముద్రం నుండి నీటిని తీసుకొని, మంచినీటిని మేఘముల ద్వారా వర్షింపజేస్తాడు. పంట పొలాలు సస్యశ్యామలంగా మారి జీవులకు ఆహారాన్ని అందిస్తున్నాయి. అన్నదాత ఆరోగ్యప్రదాత సూర్యుడు. ఆయన ‘బహుజన హితాయ, బహుజన సుఖాయ’. త్యాగానికి ఉదాహరణ సూర్యభగవానుడు. సమయపాలనకు ఏకైక ఉదాహరణ- ఆదిత్యుడు. కర్తవ్యపాలనలో స్థిరంగా ఉంటాడు. తన కిరణముల ప్రసారంలో అతనికి అందరూ సమానమే. ఆరోపణలు కాకుండా ప్రయత్నం చేయమని, నిరాశకు లోనుకాకుండా ఆశావాదిగా ఉండమని, ఉత్సాహంగా ఉండాలని ఆ విధంగా వుంటే కష్టాలు అనే మేఘాలు చెల్లాచెదురైపోతాయని, సుఖం, ప్రేమ, ఆనందం అనేవి ఒక్కరికే కాదని, అవి సర్వులకు పంచవలసినవని బోధించే మొట్టమొదటి ఆదర్శ గురువు- సూర్యభగవానుడు. అందుకే ఆయన శిష్యుడైన ఆంజనేయుడు అంతటి మహోదాత్త శక్తివంతుడైనాడు. గురుపూజా మహోత్సవం జ్ఞప్తి చేసుకోవలసిన గురుశిష్యులు- సూర్యభగవానులు, ఆంజనేయస్వామి.
రామలక్ష్మణులను, తన యాగ సంరక్షణ నిమిత్తంగా చేసుకొని తీసుకొని వచ్చి, బలాతిబల విద్యలను, అస్త్ర శస్తమ్రులను నేర్పి, అనుగ్రహించిన గురువు విశ్వామిత్రునితో, శిష్యునిగా శ్రీరామచంద్రుడు ఎలా నడుచుకొన్నాడో, సీతా స్వయంవరం సమయంలో గురువాజ్ఞను ఎలా పాటించాడో, గురుశిష్యు సంబంధాన్ని హృద్యంగా చెప్పాడు రామాయణంలో వాల్మీకి మహర్షి. అంతేకాదు, కులగురువైన వశిష్ఠ మహర్షి ఆజ్ఞను పాటిస్తూ, ధీరోదాత్తంగా, గంభీర సౌజన్య భాషణంతో రామరాజ్యాన్ని స్థాపించాడు. రాముని, ఆ గురుశిష్య సంబంధాన్ని జ్ఞప్తి చేసుకోవడం గురుపూర్ణిమ రోజున మన కర్తవ్యం.
గురువంటే ఎవరు? సత్యాన్ని తెలుసుకొని శిష్యులు శ్రేయస్సు కోసం నిరంతరం కృషిచేసే వ్యక్తి- గురువు. అయితే, సత్యమంటే ఏమిటి? మిగిలవన్నీ లేనప్పుడు అది మాత్రమే మిగులుతుంది. అదే సత్యం- అదే తత్వం. సత్యాన్ని తెలుసుకొన్నవాడెవడు? జ్ఞాన సముపార్జన చేసినవాడు. జ్ఞానం ఎలా వస్తుంది? జ్ఞానమే గురువునుండి శిష్యునికి అందుతుంది. ఉపదేశ సహస్రిలో శంకర భగవత్పాదులు సెలవిచ్చారు.
ఆదిశంకరుల అవతారం- మానవ జాతి బహు జన్మల నోము ఫలం. జీవిత పరమార్థమేమిటో దాన్ని ఎలా అందుకుని తరించాలో ఎవరి స్థాయికి తగినట్టుగా వారికి బోధించి, పంచాయతన పూజా విధానాన్ని అందించి, శివకేశవులకు అభేదాన్ని తెలిపి, అనేక స్తోత్రాల్ని రచించి, ప్రకటన గ్రంథాలను వెలయించి, విష్ణులలిత సహస్ర నామములకు, బ్రహ్మసూత్రములకు బాహ్య గ్రంథాల్ని అనుగ్రహించినవారు, దేశం నలుమూలల చతురామ్నాయ పీఠాల్ని స్థాపించి వేదోద్ధరణ ధర్మ సంస్థాపన చేసిన జగద్గురువు- జగద్గురువు ఆదిశంకరాచార్యులు.
ఆదిశంకరుల శిష్యులు- సనందనుడు. గురుపాదాల్నే తలుచుకుంటూ నదిని దాటి వచ్చేశాడు. అతని పాదముల క్రింద పద్మములు ప్రత్యక్షమైనాయి. అతను మునిగిపోకుండా కాపాడాయి. అతనే పద్మపాదుడు. ఇది గురుకటాక్షం.
మరో శిష్యుడు 13 ఏళ్ల మూగబాలుడు. ఆ బాలుని తండ్రి, కుమారుణ్ణి శంకరుల పాదాలపై పడవేసి, వాడికి అన్నీ మీరే అయి కాపాడమని ప్రార్థించాడు. శంకరులు ఆ బాలుణ్ణి ‘నీవెవరు?’ అని ముమ్మారు ప్రశ్నిస్తే, చివరకు ‘సవిత్యోపలబ్ధి స్వరూపోహమాత్మా’- నేను ఆత్మనని మూగబాలుడు సమాధానమిచ్చాడు. చేతిలో వుంచిన ఉసిరిపండులాగా అతడే హస్తోమలకుడు. ఇది గురుకటాక్షం కాదూ? ముమ్మాటికి అవును. మోక్ష విద్య మన పాలిటి దేవి దేవనమంటే, ప్రకాశించుట. జ్ఞానప్రకాశం. తమస్సులాంటి అజ్ఞానాన్ని పారద్రోలి, అంధకారబంధురమైన జీవిత మార్గాన్ని ప్రకాశింపజేయుటయే విద్య చేసే పని. ఆ వెలుగును ప్రసాదించేవాడు సద్గురువు.
నిరంతరం చలంచలములతో కూడినది అశ్వము. మేధ అంటే చిత్తము. అశ్వమేధము అంటే చంచలమైన చిత్తము. దాన్ని భగవంతునికి అర్పించడమే అశ్వమేధము. అంతరార్థాన్ని తెలిసికోవాలి. చదువులు చదివినంత మాత్రాన జ్ఞానికాడు. విద్యతో పాటు ఇంద్రియ నిగ్రహం, సత్వగుణం, అమృతమైన మనస్సు, ఏ కర్మతో భావం రావాలి. వాడే జ్ఞాని. దీన్ని బోధించి జ్ఞానవంతుల్నిగా చేసేవాడు- గురువు. ఎంతటివాడికైనా గురువు వుండాలి. జగద్గురువు అయిన శ్రీకృష్ణుడు కూడా కుచేలునితో సాందీప మహర్షి వారి వద్ద శిష్యరికం చేశాడు. సముద్ర పతితుడైన గురుపుత్రుణ్ణి (మృతిచెందిన) స్వశరీరంతో జీవింపచేశాడు. ఇందుకోసం అగ్నిని ఆరాధించాడు కృష్ణుడు. ‘కమగ్నిం చినుతే వైశ్య శ్రుజ మగ్నించి న్యానః శరీరమ్ వత్యక్షేణ’- ఆ విధంగా గురుదక్షిణ ఇచ్చాడు శ్రీకృష్ణుడు. ఇది గురు శిష్య సంబంధం.
పరమాత్మ జీవులను ఉద్ధరించడానికి, సద్గురువు రూపంలో అవతరిస్తాడని భారతీయతత్వం. కృతయుగంలో దక్షిణామూర్తి త్రేతాయుగంలో దత్తాత్రేయుడు, ద్వాపర యుగంలో వ్యాస భగవానుడు, కలియుగంలో జగదుర్గువు శంకరాచార్య, వాగ్గేయకారత్రయం, వారి గురువులు, రామకృష్ణ పరమహంస, విద్యారణ్య స్వామి, రమణమహర్షి, శ్రీచంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి, దత్తపరంపరలో షిరిడీ సాయి, తాడేపల్లి రాఘవ నారాయణ శాస్ర్తీ, కందుకూరి శివానందమూర్తి.. ఎందరో గురువులు అందరికీ వ్యాసభగవానునితో నమస్కరించే రోజు, స్మరించుకునే రోజు- గురుపూర్ణిమ.
అందుకే త్యాగరాజస్వామి ‘గురు లేక ఎటువంటి గుణికి తెలియకబోదు’ అని గౌరీ మనోహరి రాగంలోనూ, ‘గురువు చిల్లగింజ గురుడే భ్రమరము, గురుడే భాస్కరుడు, గురుడే భద్రుడగు, గురువు నీవనుకొంటి’ అన్న ధన్యారాగ కీర్తనలోనూ, గురుమహిమను, గురుకటాక్ష లబ్ధిని తెలియజేశాడు. మనస్సులో మార్పు తెచ్చేవాడు సద్గురువన్నారు శివానందమూర్తి.
శ్రీ గురుభ్యోనమః

- పసుమర్తి కామేశ్వర శర్మ 9440737464