బిజినెస్

జిఎస్‌టిపై భయం వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 12: కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) విషయంలో వ్యాపారులు, వినియోగదారులు భయపడాల్సిన అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. సమాజంలో వివిధ వర్గాల వారిలో జిఎస్‌టిపై అవగాహన కల్పించేందుకు, ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు అవగాహనా సదస్సులను (ఓరియంటేషన్ ప్రోగాం) లను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ (ఖైరతాబాద్)లోని ప్రెస్‌క్లబ్‌లో బుధవారం పాత్రికేయులకు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వాణిజ్య పన్నుల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో జిఎస్‌టి వల్ల వ్యాపారులు, వినియోగదారులకు లాభమే ఉంటుందన్నారు. అన్నింటి ధరలు పెరిగిపోతాయన్న అపోహలు ప్రజల్లో ఉన్నాయని, వాస్తవంగా చాలా వస్తువుల ధరలు తగ్గాయని చెప్పారు. తాజాకూరగాయలు, అన్‌ప్యాక్డ్ ఆహార పదార్థాలు, బ్రాండ్‌కాని గోధుమపిండి, శెనగపిండి, బెల్లం, పాలు, పెరుగు, లస్సీ, గుడ్లు, అన్‌ప్యాక్డ్ పన్నీర్, తేనె, ఉప్పు, పిల్లల పుస్తకాలు, విద్యా సేవలు, వైద్య సేవలపై జిఎస్‌టి పన్నులేదని వివరించారు. ఇతర ఆహార పదార్థాలపై ఐదు శాతం నుండి 18 శాతం వరకు పన్ను ఉంటుందని వివరించారు. గ్రానైట్, బీడి పరిశ్రమలపై 28 శాతం జిఎస్‌టి పడుతోందన్నారు.
వ్యాపారానికి సంబంధించి ఏటా 20 లక్షల టర్నోవర్ కలిగిన వ్యాపారులు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. 20 లక్షల నుండి 75 లక్షల రూపాయల వరకు టర్నోవర్ కలిగిన వారు కేవలం ఒక శాతం మాత్రమే జిఎస్‌టి చెల్లించాల్సి ఉంటుందని, ఆ తర్వాత కొద్దికొద్దిగా పెరుగుతుందని వివరించారు. జిఎస్‌టి వల్ల దేశం మొత్తంలో ఒకే ఒక పన్ను అమల్లో ఉంటుందన్నారు. విలాస వస్తువులపై సెస్ ప్రత్యేకంగా ఉంటుందని, పన్ను చెల్లింపుదారుల్లో ఇప్పటికే 90 శాతం డీలర్లు, వ్యాపారులు తమ పేర్లను, సంస్థల పేర్లను జిఎస్‌టిలో నమోదు చేసుకున్నారని, వీరిలో 15 వేల మంది కొత్తవారేనని సోమేశ్ కుమార్ తెలిపారు. జిఎస్‌టి అమల్లోకి వచ్చిన 90 రోజుల్లోగా వ్యాపారులు, డీలర్లంతా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్సైజ్ పన్నుల వల్ల 26 శాతం, పెట్రోలియం ఉత్పత్తులపై పన్ను వల్ల 22 శాతం ఆదాయం లభిస్తుండగా, జిఎస్‌టి వల్ల వచ్చే ఆదాయం 52 శాతం ఉంటుందని సోమేష్ కుమార్ తెలిపారు.
ఈ క్రమంలో 2017-18 సంవత్సరంలో 21,055 కోట్ల రూపాయలు లభించే అవకాశం ఉంటుందని అంచనా వేశామన్నారు. కాగా, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ తదితర పనులకు సంబంధించిన కాంట్రాక్టర్లపై భారం పడకుండా చూడాలంటూ కేంద్రానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు లేఖ రాశారని గుర్తు చేశారు. జిఎస్‌టిపై వివిధ వర్గాల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ నెలలో 57 చోట్ల అవగాహనా కార్యక్రమాలు నిర్వహించామని వెల్లడించారు. ఈ తరహా కార్యక్రమాలు కొనసాగిస్తామని సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వాణిజ్య పన్నుల కమిషనర్ అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఒకే దేశం.. ఒకే మార్కెట్.. ఒకే పన్ను నినాదంతో దేశవ్యాప్తంగా ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ పరోక్ష పన్నుల విధానం (జిఎస్‌టి)లో 1,200లకుపైగా వస్తువులు, 500ల సేవలకు కలిపి నాలుగు శ్లాబుల్లో పన్ను రేట్లను నిర్ణయించారు. 5, 12, 18, 28 రేట్లలో ఈ పన్నులను వేయగా, బంగారానికి ప్రత్యేకంగా 3 శాతం పన్నును విధించారు. విద్య, వైద్యం, తాజా కూరగాయలకు పన్ను నుంచి మినహాయింపునిచ్చారు. ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్, వ్యాట్ తదితర 16 వేర్వేరు పన్నులను జిఎస్‌టిలో కలిపేశారు. దీనివల్ల రాష్ట్రాల ఆదాయానికి గండి పడుతుండగా, జిఎస్‌టి అమలును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో తొలి ఐదేళ్లు నష్టపరిహారం కూడా ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే లగ్జరీ, ఆరోగ్యానికి హానికరం చేసే ఉత్పత్తులపై 43 శాతం వరకు పన్ను భారాన్ని మోపింది మోదీ సర్కారు. గరిష్ఠ పన్ను 28 శాతానికితోడు 15 శాతం అదనపు పన్ను వేస్తోంది.