రాజమండ్రి

ఒక ఊరి కథ (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్ జిల్లాలో ఓ ఊరు. రెండు వేల గడప.

సుమారు 10 వేల జనాభా. 8 వేల ఓటర్లు. ఆ

ఊళ్లో చక్కని వరి పొలాలు. సంవత్సరానికి

రెండు పంటలు పండుతాయి. పాఖల చెరువు

నీరు పారకం. కమ్మ, రెడ్డి, కాపు, తెలగ, గౌడ,

పద్మశాలీలు ఎక్కువగా ఉన్నారు. మరో పది

కుటుంబాలు ముస్లింలు. ఊరికి ఒక

కిలోమీటర్ దూరంలో శివారు పల్లెలో

దళితులు యాభై కుటుంబాల వారున్నారు.

ఆ ఊరి పటేలు రమణారెడ్డి. ఆయనకు వంద

ఎకరాల భూమి ఉంది. ఊరి బయట పెద్ద

కొట్టం. ముప్ఫై అరకల ఎడ్లు. పాతిక పాడి

గేదెలు. పెద్ద దిగుడు బావి. ఓ వంద మంది

పనివాళ్లు. ఆయన గారికి ఇద్దరు కొడుకులు.

పెద్దోడు బాగా చదువుకొని తన వాటా

భూములమ్ముకొని హైదరాబాదులో

సెటిలయ్యాడు. పెద్ద సినిమాలకు నిర్మాతగా

పెట్టుబడులు పెడుతుంటాడు. అపార్టుమెంట్లు

కట్టించి అమ్ముతుంటాడు. పల్లె నుంచి

తెచ్చుకున్న సొమ్మును మూడింతలు

పెంచేశాడని అందరూ అంటుంటారు.

ఎప్పుడూ పుట్టినూరుకు రాడు. ఊళ్లో ఏదైనా

శుభ కార్యక్రమాలకు పిలిచినా రాడు.

సినిమా షూటింగ్‌ల కోసం పాఖాల

అడవులకు వచ్చినా అక్కడే బస చేస్తాడు

కానీ, ఊళ్లోకి రాడు గాక రాడు. చిన్నోడు

వెంకటరెడ్డి ఇంజనీరింగ్ చదివి విదేశాలకు

వెళ్లాడు. అక్కడో నాలుగైదు

సంవత్సరాలుండి తన ఊరికి వచ్చాడు.

కులాంతర వివాహం చేసుకున్నాడు. తన

బాల్యమిత్రుడు శివరాంను పిలిచి ఒకరోజు

తన మనసులోని మాట చెప్పాడు.
‘శివా! మనం మన ఊరికి ఏదైనా చేయాలి.

ఏం చేద్దాం?’ అని అడిగాడు. చిన్నప్పటి

నుంచి వెంకటరెడ్డికి శివ సలహాలు

తీసుకోవటం అలవాటు. శివ సలహాతోనే

విదేశాలకు వెళ్లాడు. కానీ, ఎక్కువ

రోజులక్కడ ఉండలేకపోయాడు. శివరాంకు

కూడా చెప్పకుండా వచ్చేశాడు. ఊరికి ఏదో

చేయాలనే తపన అక్కడ వుండనీయలేదు.

వచ్చేశాడు.
‘నువ్వు ఏం చేద్దామనుకుంటున్నావు?’

అడిగాడు శివరాం.
‘నువ్వు చెప్పరా’ అన్నాడు వెంకటరెడ్డి.
‘నేను చెప్పింది నువ్వు చేసినట్టు, పేద్ద

కబుర్లు చెప్పొద్దు’
‘అరేయ్ రాస్కెల్! నువ్వు చెప్పింది ఏం

చేయలేదురా?’
‘నాకు చెప్పే ఇండియా వచ్చావా?’
‘నీకు చెప్పేకదా విదేశాలకు వెళ్లింది!’
‘చెప్పి వెళ్లావ్, చెప్పకుండా వచ్చావ్’
‘నీకు చెపితే రానిచ్చేవాడివా?’
‘నీకు నేను చెప్పిందేమిటి? అక్కడి రాజకీయ,

ఆర్థిక పరిస్థితుల్ని అధ్యయనం చేసి

రమ్మన్నాను. అదెంతవరకు వచ్చింది

చెప్పావా?’
‘నా స్థాయిలో నేను చేశాను. ప్రాక్టికల్‌గా మన

ఊళ్లో మనమిద్దరం కలిసి ప్రయోగాలు

చేద్దాం. ఎంతవరకు పనికొస్తాయో చూద్దాం’
‘రేయ్! నీకంటే కూర్చుని తిన్నా తరగని ఆస్తి

వుంది. ఎన్ని ప్రయోగాలైనా చేస్తావ్. నా

పంతులుద్యోగం చేయకుండా మానేసి

ప్రయోగాలు చేస్తుంటే నా భార్యబిడ్డలు పస్తే!’
‘అరేయ్ శివా! నువ్వు మారిపోయావురా.

మన ఊరు, మన దేశం అంటూ పేద్ద

ఉపన్యాసాలిచ్చేవాడివి. ఇప్పుడేమిటి నా

భార్య, నా బిడ్డలు అంటున్నావ్? అయినా

రోజంతా నువ్వేం చేయవలసిన పనిలేదు. నీ

పంతులుగిరి వెలగబెట్టాకే రా. ఇద్దరం కలిసి

ఆలోచిద్దాం. ఓకేనా?’
‘అలాగే! కాదంటే ఊరుకుంటావా?’
వారిద్దరి ఆలోచన ప్రకారం సర్పంచ్‌ను కలిసి

ఒకరోజు గ్రామసభ ఏర్పాటు చేశారు.
‘ఈరోజు మన ఊరి దొరగారి అబ్బాయి

వెంకటరెడ్డి ఏదో ముఖ్యమైన విషయం

మాట్లాడాలంటే అందరినీ పిలిపించాను.

విదేశాల్లో పెద్ద చదువులు చదువుకొని మన

ఊరి మీద ప్రేమతో అక్కడ చేస్తున్న ఉద్యోగం

కూడా మానేసి వచ్చాడు. వారేం చెబుతారో

నాకూ తెలియదు. మీతో పాటు వినాలని

నాకూ ఆసక్తిగా ఉంది. మాట్లాడండి

రెడ్డిగారూ!’ అంటూ సర్పంచ్‌పరిచయ

వాక్యాలు పలికి కూర్చున్నారు.
‘సభకు నమస్కారం! గ్రామ సర్పంచ్ గారికి,

గ్రామ పెద్దలకు, నా బాల్యమిత్రుడు

శివరాంకు నా నమస్కారాలు. దొర, దొరగారి

అబ్బాయి వంటి కాలంచెల్లిన మాటలు వద్దు.

నేను మీలో ఒకడ్ని. ఈ పంతులుగారు.. అదే

నా మిత్రుడు శివరాంను ఎలా పిలుస్తారో

అలాగే పిలవండి. విదేశాల్లో నా మిత్రులు

వెంకట్ అని ముద్దుగా పిలిచేవారు. అలా

పిలిస్తే నాకు చాలా సంతోషం. ఇక అసలు

విషయానికి వస్తే.. నేనూ, మిత్రుడు శివరాం

కలిసి ఒక ఆలోచన చేశాం. అదే ఇప్పుడు

మీతో చెబుతాను. ఇది మన ఊరి విషయం.

మనందరి విషయం. జాగ్రత్తగా వినండి.

ఆలోచించండి. సహకరించండి. నా తండ్రి

వారసత్వంగా నాకు ఏభై ఎకరాల భూమి

వచ్చింది. రెండు పంటలు పండే

సారవంతమైన భూమి. నా భూమి గురించి

నాకంటే ఎక్కువగా మీకే తెలుసు. ఆ

భూమిని నేను...’
‘అమ్ముతారా?’ జనం ఒక్కసారిగా అడిగారు.
వెంకటరెడ్డి ముసిముసిగా నవ్వుతూ

‘అమ్మడానికి మీ అందరినీ ఇక్కడికి

పిలవాల్సిన పనిలేదు. నా భూమిని

పంచుదామనుకుంటున్నాను!’. జనం

ప్రతిస్పందన కోసం నిరీక్షించాడో క్షణం.
‘అదేంటి రెడ్డీ..! ఇప్పుడీ భూమి విలువ ఎంతో

తెలుసా నీకు?’ ఆశ్చర్యంగా అడిగాడు

సర్పంచ్.
‘తెలుసు సర్పంచ్ గారూ. నాకు ఈ

భూముల విలువ బాగా తెలుసు. ఎకరం

ఆరు నుంచి 10 లక్షల రూపాయల దాకా

వుంది. కానీ, నేనీ భూమి పంచబోతున్నాను.

దునే్న వాడికే భూమి- అనే పెద్దపెద్ద

మాటలు నేను చెప్పటం లేదు. కానీ నేను

నా భూమిని దునే్నవారికే ఇస్తాను. నేను

చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇక్కడ సర్పంచ్

గారున్నారు. వార్డు సభ్యులున్నారు. అన్ని

పార్టీల వాళ్లూ ఉన్నారు. అందరం కలిసి

చర్చించి నిర్ణయం చేస్తాం. నా ఆలోచన

ఏమిటంటే.. ఐదెకరాల చొప్పున పది మందికి

భూమి రాసిస్తాను. అయితే ఆ పది మందీ

కష్టపడి పనిచేసే వారై ఉండాలి. ఆ పది

మందిని ఇప్పుడు నేను చెప్పిన వారంతా

కలిసి ఏకాభిప్రాయంతో ఎంపిక చేస్తారు.

వారికి కొన్ని షరతులతో భూమి ఇద్దాము.

ఆ షరతులేమిటంటే, స్వయంగా భూమి

దున్నుకోవాలి. అందులో వచ్చిన పంటను

మీరు, మీ కుటుంబ సభ్యులు హాయిగా

అనుభవించవచ్చు. అది మీ సొంతం. కానీ,

ఆ భూమిని మీరు అమ్ముకోటానికి వీల్లేదు.

మీరు వ్యవసాయం చేయలేని రోజు, కష్టపడి

పనిచేసే మరో వ్యక్తికి ఆ భూమి

బదలాయిద్దాము. ఈ పద్ధతి సక్రమంగా

అమలు జరిగేట్టు చూడటానికి గ్రామ

కమిటీని ఏర్పాటు చేస్తాం. ఈ కమిటీనే

పర్యవేక్షిస్తుంది. కనుక భూమి కావలసిన

వారు గ్రామ సర్పంచ్ గారిని సంప్రదించండి.

మీమీ పూర్వ పనితీరు, కుటుంబ చరిత్రను

బట్టి భూమి కేటాయిస్తారు. ఈ పని ఈ ఏప్రిల్,

మే నెలల్లోనే పూర్తి చేసుకుంటే జూన్ నుంచి

మీకిచ్చిన భూమిలో మీరు సేద్యం పనులు

ప్రారంభించుకోవచ్చు. దీని రాతకోతలు,

పద్ధతులు నా మిత్రుడు శివరాం, గ్రామ

కమిటీ కలిసి పూర్తి చేస్తారు. అంతేకాదు,

మీకు ఇచ్చిన భూమిలో ఎవరైతే మంచి

పంటలు పండిస్తారో వారిని గ్రామ కమిటీ

ఉత్తమ రైతుగా గుర్తించి, 50 వేల

రూపాయలు బహుమతిగా ఇస్తుంది. సరేనా?

అడిగిన వెంటనే ఈ సభ ఏర్పాటు చేసిన

సర్పంచ్ గారికి, పిలవగానే వచ్చిన వివిధ

పార్టీల వారికి కృతజ్ఞతలు. సెలవు’ అంటూ

ముగించాడు వెంకటరెడ్డి.
కొందరికి అర్థమైంది, మరికొందరికి ఇదేదో

గందరగోళంగా తోచింది. అమ్ముకోటానికి

వీల్లేకపోతే మనకిచ్చినట్లు ఎట్లైతది? అని

ఇంకొందరికి అనుమానం కలిగింది.

‘వ్యవసాయం చేయలేక ఇదో రకం వేషం’

అనుకున్నారు ఇంకొందరు. నెలరోజుల్లో ఒక

లిస్టు తయారైంది ఇరవై మంది పేర్లతో. ఇంకా

వడపోత పోసి, వారానికో సమావేశం జరిపి

చర్చించి, అందరూ కలిసి పది మంది రైతుల

పేర్లు ఖరారు చేశారు. అలాగే గ్రామ కమిటీని

ఏర్పాటు చేశారు. గౌరవాధ్యక్షునిగా

వెంకటరెడ్డి, అధ్యక్షునిగా సర్పంచ్,

కార్యదర్శిగా శివరాం, ఇతర సభ్యులుగా

వివిధ పార్టీల నాయకులతో మొత్తంగా ఇరవై

మందితో కమిటీ ఏర్పాటైంది. ఆ సభలోనే

ఎంపిక చేసిన పది మంది రైతులకు

భూమిని పండించుకొని అనుభవించే

హక్కుని రాసిస్తూ గ్రామ కమిటీకి

అప్పగించారు. ఆ పది మందిలో ముగ్గురు

అగ్రవర్ణాలకు చెందిన పేదలు, ముగ్గురు

దళితులు, ఇద్దరు ముస్లింలు, ఇద్దరు

లంబాడీలు ఉన్నారు. ఆ సభలోనే మరో

తీర్మానం చేశారు. ఈ భూముల్లో పదహారేళ్ల

లోపు పిల్లల్ని వ్యవసాయ పనులకు

ఉపయోగించకూడదు. అలాగే ఈ రైతులు

తమ పిల్లల్ని కనీసం డిగ్రీ వరకు

చదివించాలి. ఈ భూముల్లో పండించిన పంట

ఒకవేళ వారి చదువులకు సరిపోకపోతే,

గ్రామ కమిటీ వారికి కావలసిన ఆర్థిక

సహాయం చేస్తుంది. ఈ కార్యక్రమాన్ని

కళ్లారా చూసిన కొందరు గ్రామాభివృద్ధి కోసం

అదే గ్రామ కమిటీ ద్వారా ఆర్థిక సహాయం

చేయటానికి ముందుకొచ్చారు. గ్రామంలో

వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు.

ముందుగా మంచినీటి ఏర్పాటు, ఊర

చెరువు నుంచి వ్యర్థంగా వాగులోకి పోతున్న

నీటికి చెక్‌డ్యాం నిర్మించారు. వాటర్ బెడ్,

ట్యాంకు నిర్మించుకున్నారు. ఇంటింటికీ

రక్షిత నీటి పథకం కుళాయి ఏర్పాటు

చేసుకున్నారు. ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి

కట్టుకున్నారు. ఆర్థికంగా చేతనైన వారు

వారే స్వయంగా ఖర్చులు భరించారు. ఆ

స్థితి లేనివారికి తలో చెయ్యివేసి దొడ్లు

కట్టించారు. వెంకటరెడ్డి, శివరాం పర్యవేక్షణలో

సంవత్సరం తిరిగేసరికి ఊరు ఎంతగానో

మారిపోయింది. ఆ సంవత్సరం ఉత్తమ

రైతుగా జానీమియాను ఎంపిక చేశారు. ఏభై

వేల రొఖ్ఖం బహుమతిచ్చారు. జానీమియా

కొడుకు ఇంజినీరింగ్ చదువుకు కావలసిన

ధన సహాయం చేయటానికి కొందరు

గ్రామస్తులు ముందుకొచ్చారు.
రెండో సంవత్సరం ఊళ్లో రహదారుల

నిర్మాణం చేపట్టారు. ప్రభుత్వం పంచాయతీకి

ఇచ్చి గ్రాంట్లతో పాటు గ్రామస్తులంతా తలో

చేయి వేశారు. వేసవిలో వ్యవసాయ

కార్మికులకు చేతినిండా పని దొరికింది.

ఊరూ బాగుపడింది. ఐదేళ్లు గడిచేటప్పటికి

ఊరి పేరు రాష్టమ్రంతా మారుమోగింది. జిల్లా

అధికారులు, రాష్ట్ర మంత్రులు తరచుగా

గ్రామానికి రావటం, అభివృద్ధి పనులు చూసి

ప్రోత్సాహకాలు ప్రకటించటం చేస్తున్నారు.

‘అసలు ఇది మన ఊరేనా?’ అన్నంతగా

మారిపోయింది. వెంకటరెడ్డి భూములు

తీసుకున్న రైతులు పంటలు బాగా

పండిస్తున్నారు. వారి కుటుంబాలు ఆర్థికంగా

నిలదొక్కుకున్నాయి. వారి పిల్లలు బాగా

చదువుకుంటున్నారు. ఆరో సంవత్సరం

గ్రామసభలో మరో చిత్రం జరిగింది.

తనకిచ్చిన ఐదెకరాల భూమిని మరో

రైతుకు ఇవ్వాల్సిందిగా జానీమియా కోరాడు.

ఎందుకంటే, అతని కొడుకు రఫీ ఇంజినీరింగ్

పూర్తిచేసి టిసిఎస్‌లో ఉద్యోగం

సంపాదించాడు. నెలకు 60 వేలు జీతం. తన

ముగ్గురు చెల్లెళ్లని డిగ్రీ వరకు చదివిస్తానని,

తల్లిదండ్రులను ఏలోటూ రాకుండా

చూసుకుంటానని గ్రామసభలో రఫీ అందరి

ముందూ ప్రకటించాడు. ఇది గ్రామ కమిటీకి

మరో ఆలోచన కలిగించింది. రొటేషన్ పద్ధతి

పెట్టి ఆ భూమిని మరో పేద రైతుకు

ఇచ్చారు. మరో దళిత రైతు తాను ఇక

వ్యవసాయం చేయలేనని, రెక్కలొచ్చిన

కొడుకులు ఎగిరిపోయారని చెప్పాడు. ఆ

భూమిని మరొకరికిచ్చారు. ఆ భూమిని

తీసుకున్నవాడు ఆ దళితునికి

సంవత్సరానికి పది బస్తాల ధాన్యం

ఇవ్వాలని గ్రామసభ తీర్మానించింది.
కాలచక్రం ఎవరి కోసమూ ఆగదు కదా!

పదేళ్లు గడిచిపోయాయి. దేశ విదేశాల నుంచి

ఈ ఊరిని చూడటానికి అనేక మంది

ఔత్సాహికులు వస్తున్నారు. ముఖ్యమంత్రి

స్వయంగా వచ్చి, జరుగుతున్న అభివృద్ధిని

చూసి తన నిధుల నుంచి గ్రామ కమిటీకి

ప్రత్యేక నిధులు మంజూరు చేశారు. ప్రధాని

దేశంలోనే ఉత్తమ గ్రామ పంచాయతీగా

ప్రకటించి మరిన్ని నిధులు ఇస్తున్నట్లు

ప్రకటించారు. ఆ ఊరు ఇప్పుడో స్మార్ట్ విలేజ్.

పత్రికలు, టీవీ చానళ్లు ప్రత్యేక కథనాలు

రాస్తూ, డాక్యుమెంటరీలు తీస్తున్నాయి.

దేశంలోనే ఇది ఆదర్శ గ్రామంగా నిలిచింది.
పాతికేళ్లు గడిచిపోయాయి. ఆ ఊరిలో ప్రతి

కుటుంబం హాయిగా గడుపుతోంది. ఈ

పాతికేళ్లలో పుట్టి పెరిగిన పిల్లల్లో చాలామంది

ఉన్నత చదువులు చదివారు. దేశ విదేశాల్లో

ఉన్నతోద్యోగులుగా స్థిరపడ్డారు. లక్షల కోట్ల

రూపాయల బడ్జెట్‌తో డెబ్భై ఏళ్లుగా ఏ

ప్రభుత్వాలూ సాధించలేని అభివృద్ధిని కేవలం

పాతికేళ్లలో ఆ ఊరు చేసి చూపించింది.
కృషి, పట్టుదల వుంటే మనుషులు

సాధించలేనిదేదీ లేదు. ఎవరో వస్తారని

ఎదురుచూడక వెంకటరెడ్డి, శివరాం వంటి

ఒకరిద్దరు మంచి మనసుతో ముందుకొస్తే

ఊరంతా కదిలివస్తుంది. భూతల

స్వర్గవౌతుంది మాతృభూమి.

- మండవ సుబ్బారావు, భద్రాద్రి కొత్తగూడెం, చరవాణి : 949333510