రివ్యూ

మడమ తిప్పని మరుగు పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

** ఫర్వాలేదు ** ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కహాని
తారాగణం: అక్షయ్‌కుమార్, భూమి పడ్నేకర్, దివ్యేందు, సుధీర్ పాండే, అనుపమ్‌ఖేర్ తదితరులు
రచన: సిద్దార్థ సింగ్
సంగీతం: సురీందర్ సోథి
నిర్మాతలు: అరుణ్ భాటియా - శీతల్ భాటియా, అక్షయ్‌కుమార్
దర్శకత్వం: శ్రీ నారాయణ్ సింగ్

2012 -ఏప్రిల్ 13. పెళ్లైన మరునాడే అత్తవారింటి నుంచి వచ్చేసింది పెళ్లికూతురు ప్రియాంక భారతి. ఆమె తల్లిదండ్రులు కోప్పడ్డారు. పెళ్లికొడుకంటే ఇష్టం లేదా? గయ్యాళి అత్తగారా? ఏ కారణం లేకుండా ఉన్నపళంగా వచ్చేస్తే ఎలా? అని అరిచి నానా బీభత్సం సృష్టించారు. కొట్టినంత పని చేశారు. మొక్కవోని ఆత్మస్థైర్యంతో నిలిచింది భారతి. తన మాట నిలబెట్టుకోనిదే తిరిగి వెళ్లనని భీష్మించుక్కూర్చుంది. ఒక ఆలోచన జీవితానే్న మార్చివేస్తుందంటారు. భారతి ఆలోచన ఒక్క గ్రామానే్న కాదు.. చుట్టుపక్కల అనేక ఊళ్లకు చేయూతగా నిలిచింది. ప్రభుత్వాన్ని కదిలించింది. దేశీ విదేశీ ప్రతినిధులు ఊళ్లో కాలుమోపేట్టు చేయగలిగింది. ఈ సంఘటన జరిగింది -గోరఖ్‌పూర్ జిల్లాకి ఉత్తరంగా 60 కిలోమీటర్ల దూరంలోని మహరాజ్‌గంజ్ ప్రాంతానికి చెందిన విష్ణుపూర్ ఖుర్ద్ అనే పల్లెటూరిలో. ఇంతకీ భారతి మాట ఏమిటి? మేలిముసుగు లేనిదే ఎవరి ఎదుట పడని ఆ పల్లెటూరి అమ్మాయిలు.. ‘బహిర్భూమి’కి వెళ్లే సంప్రదాయాన్ని ఇనే్నళ్లయినా మార్చరేం? అన్నది ఆమె ప్రశ్న. మొదటిరోజు అత్తగారు సర్దిచెప్పే ప్రయత్నం చేసింది. ఊళ్లో అందరూ వెళ్లినట్టుగానే.. అని సమాధానం చెప్పింది. కానీ భారతికి ఆ మాటలు రుచించలేదు. మంకు పట్టు వీడలేదు. తానేమీ కాని కోరిక కోరటం లేదనీ.. సహజ సిద్ధమైందే అడుగుతున్నాననీ అంది. అత్తవారింటి వారు వినకపోవటంతో పుట్టింటికి ప్రయాణమైంది. ఇది సంచలన వార్తగా మారింది. వివాహ బంధాన్ని సైతం వదులుకొనేందుకు సిద్ధపడిన ఆ అమ్మాయి ఆలోచన సబబేనా?
దీంతో -ఇండియాలో అతి పెద్ద ఆర్గనైజేషన్ అయిన సులభ్ ఇంటర్నేషనల్ దృష్టి ఆ గ్రామంపై పడింది. సామాజిక చైతన్యం బయల్దేరింది. కుటుంబ పెద్దల ఎదుట ధైర్యంగా మాట్లాడలేని అమ్మాయి.. తన కనీసావసరం కోసం ప్రశ్నించిన తీరు ప్రభుత్వాల్ని నిలదీసినట్టయింది. ప్రియాంక భారతి అత్తగారింట్లో ‘టాయిలెట్’ నిర్మాణం జరగటమే కాదు.. 2 లక్షల రూపాయల నగదు బహుమతిని ప్రకటించింది ప్రభుత్వం. ఇదీ టూకీగా ‘టాయిలెట్’ కథ. స్వచ్ఛ భారత్ అభియాన్ కథగా మారింది. దీన్ని ఆధారం చేసుకొని.. ‘రామ్‌లీలా’ రచయితలు ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కహాని’ కథని అందించారు.
కేశవ్ (అక్షయ్‌కుమార్), మనుస్మృతిని అనుసరించే ఓ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన సంప్రదాయవాది. ముప్పై ఆరేళ్లు వచ్చినా పెళ్లి కాని కారణం -రాసుల గమనం సరిగ్గా లేకపోవటం. దోషంవల్ల వివాహం కోసం ఎదురుచూట్టంతోనే సరిపోయింది. పురోహితులు దీనికో నివారణ సూచించారు. ఓ గేదెతో సంప్రదాయ రీతిలో వివాహం జరిపిస్తే దోషం పోతుందని. ఆ తంతు జరిగి.. ఎట్టకేలకు కేశవ్ పెళ్లి జయ జోషితో నిశ్చయమవుతుంది. ఆమె స్టేట్ టాపర్.. ‘అంగ్రేజీ పడీ లిఖీ లడ్కీ’. కేశవ్ ఇంట్లో ‘టాయిలెట్’ లేదన్న విషయం తెలిసిన జయ మొదటిరోజే తన అభ్యంతరాన్ని వెలిబుచ్చుతుంది. ‘లోటా పార్టీ’ (మన భాషలో ‘చెంబు’ సంస్కృతి)కి తాను ప్రాతినిధ్యం వహించలేనని స్పష్టంగా చెబుతుంది. అనుక్షణం సంస్కృతీ సంప్రదాయాల గురించీ.. ఆడవాళ్ల ‘ముసుగు’ గురించీ మాట్లాడే పెద్దలు.. ఏ తెల్లవారుజామునో ‘లోటా’ పుచ్చుకొని.. బహిర్భూమికి వెళ్లాల్సిన ఆడవాళ్ల ఇబ్బందిని ఎందుకు గుర్తించరని ప్రశ్నిస్తుంది. తాను ‘మల్లిక బాబీ’ (కేశవ్ మొదటి భార్యయిన గేదె పేరు)ని కాదని అంటుంది.
పెద్దలు తన మాటని అంగీకరించక పోవటంతో విడాకులకు దరఖాస్తు చేస్తుంది జయ. ఆ తర్వాత ఏం జరిగిందన్నది ‘ప్రియాంక’ కథని ఫాలో అయిపోతుంది సినిమా.
ఇదొక సామాజిక సమస్య. దేశంలో 58% మంది ‘శానిటేషన్’ సమస్యని ఎదుర్కొంటున్నారన్నది ప్రభుత్వం తేల్చిన లెక్కలు. ఇది చిన్న సమస్యగానే కనిపించినా.. వీధుల వెంట ‘లోటా’ పుచ్చుకొని వెళ్లటం వెనుక.. ఆడవాళ్ల ఇబ్బందిని గ్రహించటానికి ఇనే్నళ్లు పట్టింది. తెల్లవారుతూండగా ఏ పొలం గట్లకో.. ఏ చెట్టు చాటుకో.. వెళ్లటం అనే సున్నితమైన సమస్యని తలకెత్తుకొని.. ఎంతో సమర్థవంతంగా కథని నడిపించాడు దర్శకుడు. ‘బీవీ పాస్ చాహియే తో ఘర్ మే సాందాశ్ చాహియే’ స్లోగన్‌కి సరైన న్యాయం చేశారు.
ఈ కానె్సప్ట్‌ని అనుకున్నది మొదలు.. సగటు ప్రేక్షకుడిలో కాస్తంత ఆసక్తి కలిగిన మాట వాస్తవం. ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కహాని’ అన్న టైటిల్ కూడా పరమ ఛండాలంగా ఉందన్న వారూ లేకపోలేదు. ఆఖరికి ఇదొక డాక్యుమెంటరీ అవుతుందా? అని సందేహం వెలిబుచ్చారు కొందరు. ఏది ఏమైతేనేం- ఆ విమర్శలకు దీటుగా కథ రూపొందింది.
కానీ -తన కానె్సప్ట్‌ని మక్కీకిమక్కీ కాపీ కొట్టారంటూ.. డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ ప్రవీణ్ వ్యాస్ ‘వియాకామ్ 18 మోషన్ పిక్చర్స్’కి లీగల్ నోటీస్ పంపించారు. ‘మానిని’ అన్న తన డాక్యుమెంటరీని డైలాగ్స్‌తో సహా రీమేక్ చేశారంటూ కోర్టులో కేసు దాఖలైంది. గోవాలో 2016లో జరిగిన ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్‌లో 4500 ఎంట్రీల మధ్య.. ‘స్వచ్ఛ భారత్ అభియాన్’ థీమ్‌కి తగ్గట్టుగా రూపొందించిన తమ డాక్యుమెంటరీ అనేకానేక ప్రశంసలు పొందిందని.. దాన్ని ‘టాయిలెట్’ చిత్రంగా మలచారని అభియోగం మోపారు.
‘టాయిలెట్’ నిర్మాణ సంస్థ ఆ అభియోగాలన్నింటినీ త్రోసిపుచ్చింది. యాదృచ్ఛికంగా కొన్ని సన్నివేశాలు దొర్లి ఉండవచ్చు. సమాజాన్ని పట్టిపీడిస్తున్న సమస్య ఇది. దీన్ని ఎలా ప్రెజెంట్ చేసినా.. ఏ విధంగా తీర్చిదిద్దినా.. ఎక్కడో అక్కడ కొన్ని సంఘటనలు ఒకే విధంగా అనిపిస్తాయి అంటూ చెప్పుకొచ్చారు. నటనాపరంగా- అక్షయ్‌కుమార్ తనదైన శైలిని చూపి.. ఆకట్టుకొంటాడు. ‘డ్రై సబ్జెక్ట్’ అనిపించేలా కనిపించినా.. రాన్రాను ఆ అంశం ‘గ్రిప్’లోకి రావటానికి అక్షయ్ కృషి చేశాడు. అతనికి సరిజోడుగా భూమి పడ్నేకర్ చక్కగా నటించింది. మిగతా పాత్రధారులంతా పరిధి మేరకు నటించారు. సంగీతం ఫర్వాలేదు. సామాజికాంశాన్ని సైతం డాక్యుమెంటరీలా కాకండా.. సినిమాగా రూపొందించవచ్చని మరోసారి నిరూపించాడు దర్శకుడు.

-బిఎనే్క