మెయిన్ ఫీచర్

శ్రీ గణనాథం భజామ్యహమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘వినయతి శిక్షయతి దుష్టాన్ విఘ్నాం శ్రీతి వినాయకః’.. దుష్టులను విఘ్నములను శిక్షించేవారు వినాయకుడు.
‘విగతో నాయకః ప్రభుః యిస్వ’.. తనకు ఎవరు నాయకుడు లేడు, కాలేడు కనుక స్వతంత్రుడగు నాయకుడు.
వినాయకుడు. ‘విశిష్టః నాయకః’ ఒకానొక చక్కని విశేషముగల నాయకుడు, నాయకులందరిలోను విశిష్టుడు.
మహా మహిమలుగల సమర్థుడైన నాయకుడు - వినాయకుడు. కనుకనే, నిత్య జీవితంలో ప్రతి పనికీ వినాయకునికి నమస్కరించి ‘ఆదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్థం గణపతి పూజాం కరిష్యే’ అని చెపుతూ విఘ్నాలను తొలగించమని
కార్యసిద్ధికోసం ‘ఆదౌ పూజ్యో గణాధిపః’ అని గణపతిని మొదటగా ఆరాధించటం అనాదిగా వస్తోంది. ఆ గణపతే
విఘ్నేశ్వరుడు, ఆయనే వినాయకుడు - ఆది అంతం లేని ఆనందమయ తత్త్వమూర్తి. అకుంఠిత దీక్షతో
భక్తిప్రపత్తులతో కొలిచేవారి కోరికలను సకల సౌభాగ్యాలను ప్రసాదించే ‘హేరంభుడు’.
(నేడు వినాయక చవితి)
నరకుంజరుడు
మన దేవతలలో విచిత్రమైన రూపాలలో దర్శనమిచ్చే దేవతలలో నరసింహుడొకడు, నరకుంజరుడొకడు. నరసింహడు - శ్రీమహావిష్ణువైతే, నరకుంజరుడు మహాగణపతి. ఇద్దరూ, దుష్టశిక్షణ శిష్ట రక్షణ కోసం అవతరించిన వారే. హిరణ్యకశిపుణ్ణి సంహరించి, ప్రహ్లాదుణ్ణి కాపాడి, పరమాత్మ సర్వాంతర్యామి అని నిరూపించటానికి నరసింహావతారమైతే, మానవులను బాధించే విఘ్నాలనే దుష్టశక్తులను పారద్రోలి వారి కార్యాలను నిర్విఘ్నంగా సాగించటానికే వినాయకుడి అవతారం.
గణపతి ఆవిర్భావం, ఆధ్యాత్మిక విశేషాలు
‘గ’ అంటే బుద్ధి, ‘ణ’ అంటే ‘జ్ఞానం’. గణాధిపతి అయిన విఘ్నేశ్వరుడు బుద్ధిని ప్రసాదిస్తే, సిద్ధి ప్రాప్తిస్తుంది. భాద్రపద శుక్ల చవితి నాడు వినాయకుడు ఆవిర్భవించాడు. భద్రమైన పదం - భాద్రపదం శ్రేయస్కరమైన స్థానం. ఏమిటది? జీవిత గమ్యమైన మోక్షం. శుక్లమైన తేజోరూపం. చతుర్థి అనగా చవితి. జాగ్రత్, స్వప్న, సుషుప్తులనే మూడవస్థలను దాటిన తరువాతది నాల్గవది. తురీయావస్థ - నిర్వికల్ప సమాధి. ఆయన నక్షత్రం హస్త. హస్తా నక్షత్రం కన్యారాశిలో ఉంటుంది. రాశ్యాధిపతి బుధుడు. విజ్ఞాన ప్రదాత. మేషరాశి మొదటిరాశి. మేషరాశి నుంచి ఆరవరాశి కన్యారాశి. ఈ షష్టమ (ఆరవ) భావం - శతృ, ఋణ, రణ, రోగములను తెలియజేస్తుంది. మనిషి ఆధ్యాత్మిక ప్రగతికి, లౌకిక ప్రగతికి ఏర్పడే విఘ్నాలను విశదపరుస్తుందీ భావం. అటువంటి షష్ట భావంతో (హస్తా నక్షత్రం, కన్యా రాశి) చంద్రుడుండగా ఆవిర్భవించిన విఘ్నేశ్వరుడు, చవితినాడు పుట్టిన వినాయకుడు, ఈ నాలుగు విధములైన విఘ్నాలను తొలగిస్తానని అభయమిస్తున్నాడు.
జ్యోతిష శాస్త్రాన్వయం
కన్యా రాశికి సప్తమరాశి మీనరాశి, మీనరాశి, కాలరాశిచక్రంలో పనె్నండవ రాశి. అనగా వ్యయరాశి. మేషరాశికి వ్యయరాశి. పనె్నండవ భావం వ్యయాన్ని, బంధనాన్ని, అజ్ఞాత శత్రువుల్ని తెలియజేస్తుంది. ఇక్కడ శతృవులంటే అంతశ్శత్రువులు - కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు (ఆరు). ఇవి మానవుని ప్రగతికి విఘ్నాలను కలిగించేవి. హస్తా నక్షత్రాధిపతి అయి కన్యారాశిలో ఉన్న చంద్రుడు సప్తమ దృష్టితో నేరుగా మీనరాశిని వీక్షిస్తున్నాడు. కనుక వాటిని తొలగించి, జీవితాన్ని సుఖమయం సుసంపన్నం చేసి, లౌకిక అలౌకిక ఆధ్యాత్మిక ఆనందాన్నిచ్చి, మోక్షగతిని ప్రసాదించే వాడు వినాయకుడని జ్యోతిషశాస్త్ర అన్వయం.
ప్రణవనాద స్వరూపుడు
‘దేవీం వాచమజనయన్తదేవాః తాం విశ్వరూపాః పశవోవదంతి’.. మానవుని అంతశ్శరీరమందున్న చిదాకాశమందు ప్రాణవాయువు, అగ్ని కలయికలో నాదమేర్పడుతుందని మహాయోగులు విశదీకరించారు. ‘ప్రాణానల సంయోగమువల్ల ప్రణవనాదము సప్త స్వరములై బరగ’’ అన్న సారమతిరాగ కీర్తనలోనే చెప్పాడు - నాదయోగి సద్గురు త్యాగరాజు స్వామి. ఇంద్రియాధిష్ఠాతలైన దేవతలు దైవీవాక్కును సృజించారు. ఆ వాక్కే నాదము. ఆ నాదాన్ని విశ్వమందున్న జీవులు పలుకుతున్నారు. నాదము చిన్మయము. పరమాత్మ ప్రథమ ఆవిర్భావం - ప్రణవనాదమే. వేదపురాణాగమ శాస్త్రాదులకు, అదే ఆధారం. గణపతి శబ్ద బ్రహ్మ స్వరూపం; అంటే ఓంకారార ప్రణవనాదానికి ప్రతీక. ‘యో వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతేషు ప్రతిష్ఠితః’ అన్నది వేదం. ఆ ఓంకార ప్రణవనాద స్వరూపుడే మహాగణపతి.
ముత్తుస్వామి దీక్షితుల ఏం చెప్పారు?
‘వారణాస్యం వరప్రదం, భూతాది సంసేవిత చరం, భూత భౌతిక ప్రపంచ భరణం, విశ్వకారణం విఘ్నవారణం’ అంటూ ‘పురా’ అనగా సనాతనుడైన అశాస్ర్తియుని వరునిచే పూజింపబడినవాడు, త్రికోణాకారముగల మూలాధార మధ్యముడు ఉండేవాడు, మురాసురుని సంహరించిన శ్రీకృష్ణుడు మొదలైన ముఖ్యులచే ఉపాసింపబడిన వాడు, పరాపశ్యతి మధ్యమ వైఖరి అనే నాలుగు విధములైన వాగ్రూపుడు, ప్రణవ స్వరూపుడు, పాపములను తొలగించగలవాడు.
‘వాతాపి గణపతి’ అని చెప్తూ ‘హరాది గురుగుహ తోషిత బంబం హంస ధ్వని భూషిత హేరంభం’ అని గణపతిని కీర్తిస్తూ అద్భుతమైన యోగ రహస్యాలను వివరించాడు. అంతేకాదు, ‘కరాంబుజ పాశ బీజా పూరం కలుష విదూరం, భూతాకారం... అన్నాడు. అసలు విశేషాన్ని కలాడ చెప్పాడు. ‘్భతాకారం’ అంటే భూతాలు, దెయ్యాలు కాదు. పంచభూతములలో ఒకటైన జల భూతాకారం. కనుక మట్టి వినాయకుణ్ణి పూజానంతరం, జలములో నిమజ్జనం చేయమని చెప్పాడు. ‘జలభూత శుభాకారం చతుర్గణ సమన్వితమ్ సర్వ విఘ్నహరం దేవం భజామి గణనాయకమ్’ పంచ భూతములలో జల భూతాకారుడు గణాధిపతి. శబ్ద, స్పర్శ, రూప, రసములను నాలుగు గుణములు గలవాడు. జల భూతాకారుడగుట చేతనే శ్రీ గణపతి నవరాత్రోత్సవములు జరిపి ఆ మూర్తిని జలములో నిమజ్జనం చేసే ఆచారం సంప్రదాయం వచ్చింది.
కాలుష్య నివారణ
యజుర్వేద తైత్తిరీయ ఆరణ్యకంలో, జలమును పవిత్రంగా చూడాలని, శుభ్రంగా ఉంచాలని చెప్పింది. మరి అటువంటి జలములో ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో చేసిన విగ్రహాలను నిజ్జనం చేయటం తగునా? విగ్రహములలో ఉపయోగించే జిప్సం, ఫాస్పరస్, మెగ్నీషియం, సల్ఫర్ వంటివి, భూమిలోకి నీరు యింకకుండా అడ్డుపడతాయి. హానికరమైన రంగులవలన నీటిలో జీవులు మృత్యువాతపడతాయి. కనుక మన గొప్పదదాన్ని దర్పాన్ని ప్రదర్శంచటానికి కాకుండా, నిర్మలంగా నిశ్చలమైన మనసుతో, పవిత్రమైన భావనతో, సాత్విక సాధనతో, మట్టితో చేసిన సాకారగణపతిని సంపూర్ణ భక్తితో అర్చించి, అనంతరం జలముల నిమజ్జనం చేసి, వాతారణ, జల, హృదయ కాలుష్య నివారణ గావించండని హితవు చెప్తున్నాడు మహాగణపతి. అందుకే ‘మహాగణపతిం మనసా స్మరామి’ అన్నాడు దీక్షితార్, నాటరాగ కీర్తనలో.

వినాయకుని ఆహార్యంలోని అంతరార్థం
ఆయన చేతిలోని పాశ అంకుశాలు - రాగ ద్వేషాలను నియంత్రించే సాధనాలు. ప్రియమైన భక్ష్యం - మోదకం. ఆనందాన్నిచ్చేది మోదకం. ఆయన కృపాకటాక్షములతో ఆనందం లభిస్తుంది. నాగ యజ్ఞోపవీతం, కుండలినీ శక్తికి సంకేతం. మానవుడు క్రోధాన్ని విడిచి, అనురాగాన్ని వృధ్ధి చేసికొని, శాంతి సహజీవనంతో సంపూర్ణ శరణాగతితో భగవంతుని యందు ప్రేమ భావనా భక్తిని పెంపొందించుకొని జీవితాన్ని చరితార్థత నొందించుకోవాలని సూచించే ఆయుధదారుడు, విఘ్నేశ్వరుడు.
అహంకారానికి చిహ్నం - మూషికం (ఎలుక). అహంకారం బుద్ధిమంతుల్ని పతనం చేస్తుంది. బుద్ధిపతి అయిన మహాగణపతి దానిని మలిచి జయించి సద్వినియోగం చేస్తాడు. మూషిక వాహనుడైన గణపతి సద్బుద్ధినిస్తాడు.
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్...
శుక్లమైన అంబరం అంటే పరిశుద్ధ జ్ఞానం. అది అంబరం లాగా సర్వవ్యాపకం. విష్ణువంటే వ్యాపమైన తత్త్వం. దానే్న ఒక వస్త్రం లాగా ధరించారాయన. దాన్ని మనకు ప్రసాదించాలంటే శశివర్ణుడౌతాడు. శశి అంటే చంద్రుడు. చంద్రుడంటే మనస్సు. మనోభూమికకు దిగి వచ్చి బోధిస్తాడు. మనకు ఆచార్యుడు. బోధించే స్థోమత ఎలా వచ్చింది గణపతికి? చతుర్భుజం. ధర్మజ్ఞాన వైరాగ్య ఐశ్వర్యాలనే సిద్ధిచతుష్టయం ఉన్నదాయనకు. వాటిని నిత్యమూ అనుభవించే మహనీయుడు. కనుకనే ప్రసన్న వదనం. తనకు ప్రసన్నమైన శివశక్తి సామరస్య రూపమైన ఏ జ్ఞానముందో, దాన్ని మనకు ‘వదనం’ అంటే బోధించగలడు. ఆ బోధనందుకుంటే అదే మనకు సర్వ విఘ్నోప శాంతయే సకల విఘ్నాలను సాధన మార్గంలో కలగకుండా తొలగజేస్తుంది. అహంకారాన్ని దరికి రానీయక, భూతదయ కలిగి, స్వార్థరహితంగా త్యాగబుద్ధితో, అమృతమైన మనస్సుతో సర్వమానవ సౌభ్రాత్రతతో విశ్వమానవ కల్యాణాన్ని వీక్షించేవారి విఘ్నాలను నేను తొలగిస్తానని చెప్తున్నాడు, మహాగణపతి వినాయక చవితి పండుగరోజున.

మట్టి విగ్రహానే్న ఎందుకు పూజించాలి?

భాద్రపద మాసంలో గణపతిని, ఆశ్వయుజ మాసంలో అంబికను, కార్తిక మాసంలో పరమశివుణ్ణి, మార్గశిర మాసంలో విష్ణువుని, పుష్య, మాఘ మాసాల్లో ఆదిత్యుణ్ణి ఆరాధిస్తాం. అందుకే ఆది శంకరాచార్యులవారు ‘పంచాయతన’ పూజా విధానాన్ని ఏర్పాటు చేశారు. ‘ఆదిత్య, మంబికాం, విష్ణుం, గణనాధం, మహేశ్వరం’. పంచ భూతములకు సంకేతం. అందులో గణపతి పృథ్వీతత్త్వం సంకేతం. అందుకే పార్వతీదేవి మట్టిబొమ్మను చేసి ప్రాణం పోసి వాకిట కాపలాపెట్టి, ఎవ్వరినీ రానివ్వద్దని చెప్పి వెళ్లినట్లు కథా భాగంలో ఉంటుంది. పృథ్వీతత్త్వమంటే, భూతత్త్వం, అనగా మూలాధారతత్త్వం. వెనె్నముక ప్రారంభంలో ఉండేది ‘మూలాధారం.’ తరువాదది ‘స్వాధిష్ఠానం’ ‘జలతత్త్వం’, ‘మణిపురం-అగ్నితత్త్వం, అనాహతం-వాయుతత్త్వం, విశుద్ధి-ఆకాశతత్త్వం. ఐదింటిలో మూలాధారం అనగా పృథ్వీతత్త్వం, భూతత్త్వంలో ఉండేవాడు మహాగణపతి. అందుకే ‘మూలాధార చక్ర వినాయకా మూల్య వర ప్రదాయక, మూలాజ్ఞానశోక వినాశక మూలకంద, ముక్తి ప్రదాయక...’ అని మహాగణపతిని, శ్రీరాగంలో కీర్తిస్తూ ముత్తుస్వామి దీక్షితులు మూలాధార చక్రమునకు అధిపతి మహాగణపతి అన్నాడు.కనుక, పృథ్వీతత్త్వమైన (్భమి, మట్టి) మూలాధార నిలయుడైన గణపతి ఆరాధన, మట్టి వినాయక విగ్రహానికే చేయటం శుభప్రదం, శాస్త్ర సమ్మతమవుతుంది.
ఈ విషయాన్ని, హంసధ్వని రాగంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ‘‘వాతాపి గణపతింభజే’ కీర్తనలో వివరించాడు ముత్తుస్వామి దీక్షితులు. ఈ కీర్తనలోని ఆధ్యాత్మిక విషయాల్ని పరిశీలిస్తే మట్టి గణపతినే ఎందుకు పూజించాలి, నవరాత్రి పూజానంతరం నీళ్లలో (జలమునందు) ఎందుకు నిమజ్జనం చేయాలి అన్నది మనకే తెలుస్తుంది.
‘‘మూలాధార క్షేత్ర స్థితం’’ అన్నారు దీక్షితార్. వెనె్నముక చివరి భాగంలో ఉన్న మూలాధార చక్రం, గణపతి స్థానం. ఇంద్రునికి వాహనం ఐరావతం - గజం - ఏనుగు, మూలాధారంలో ఉంటుంది. ఇంద్రుడు సహస్రారంలో ఉంటాడు. యోగి అనగా సాధకుడు, తన సాధనలో మూలాధార చక్ర తత్వాన్ని అర్ధ చేసికొని పృథ్వీతత్వాన్ని జయించి, ఆత్మానాత్మ విచారణతో ఇచ్ఛాశక్తి సుషుమ్నామార్గంగా ఊర్థ్వాభిముఖియై స్వాధిష్ఠానాది ఆరు చక్రములను, గ్రంధిత్రయాన్ని అతిక్రమించి అమృతమయమైన సహస్రారాంతర్గత చంద్రమండలమును చేరితే, బ్రహ్మానందాన్ననుభవిస్తాడు. అటువంటి స్థితిని, ప్రసాదించే ప్రణవనాద స్వరూపుడు మహాగణపతి. ఆయనుండేది మూలాధారం - పృథ్వీతత్వం. కనుక మట్టి వినాయకుణ్ణే ఆరాధించాలి, పూజించాలి.

నీటిలో నిమజ్జనం ఎందుకు చేయాలి?

పంచ భూతములకు అవినాభావ సంబంధాన్ని చెప్పింది వేదం. ‘తస్మాద్వా ఏతస్మాదాత్మాన ఆకాశ స్సంభూతః ఆకాశాద్వాయుః వాయోరాగ్నిః అగ్నేరాపః అద్భ్యః పృథివీ పృథివ్యా ఓషధయః ఓషధీభ్యోన్నమ్ అన్నాత్పురుషః సవాఏష పురుషోన్నరసమయః’’ అన్నది ఆనందవల్లి. పరబ్రహ్మతత్త్వము నుండి ఆకాశము, ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి భూమి, భూమి నుండి ఓషదులు, ఓషధుల నుండి (మొక్కల నుండి) ఆహారము, అన్నము, అన్నము నుండి పురుషుడు క్రమముగా ఉద్భవించాయి. అన్నరసమయుడైన ఈ పురుషుడే, ఆ పరమ పురుషుడు అనగా పరబ్రహ్మతత్త్వము. కనుక మూలాధారంలో ఉన్న గణపతిని మట్టి విగ్రహంతోనే పూజించి, అనంతరం, మూలాధారంపై నున్న స్వాధిష్ఠానం, జలతత్త్వంలో నిమజ్జనం చేయాలని వేదశాస్త్రాలు పేర్కొంటున్నాయి.

గణపతికి ఘనంగా..
పిల్లలు, పెద్దలూ గణపతిని పూజించే సమయం ఇది. ఉండ్రాళ్లు, కుడుములు, ఇతర పిండి వంటల రుచుల్ని నివేదిస్తే బొజ్జ గణపయ్య ఆనందంగా ఆరగిస్తాడు. గణపతి పూజలో అన్నీ ప్రత్యేకతలే. ఈ పండుగలో నైవేద్యానికి అనువైన పదార్థాలు ఇవి.
బొబ్బర్ల ఉండ్రాళ్లు
కావల్సినవి: బియ్యపు రవ్వ రెండు కప్పులు, తెల్ల బొబ్బర్లు- యాభై గ్రాములు, జీలకర్ర - రెండు చెంచాలు, ఉప్పు- తగినంత, నెయ్యి - ఐదు చెంచాలు, శెనగపప్పు- యాభై గ్రాములు.
ముందుగా గినె్నలో నాలుగు కప్పుల నీళ్లు తీసుకుని బొబ్బర్లు, శెనగపప్పు వేయాలి. అవి కొద్దిగా ఉడికిన తరువాత తగినంత ఉప్పు, జీలకర్ర, బియ్యపురవ్వ కలపాలి. మంట తగ్గించి మూత పెట్టుకోవాలి. దగ్గరగా అయి, రవ్వ ఉడికిన తరువాత నెయ్యి కలిపి దింపేయాలి. వేడి కొద్దిగా తగ్గాక కావల్సిన ఆకారంలో ఉండ్రాళ్లు చుట్టుకోవాలి. వీటిని ఆవిరిపై ఉడికించాల్సిన అవసరం లేదు.
తీపి కుడుములు
కావల్సినవి: గోధుమ రవ్వ- అరకేజీ, బియ్యం పిండి - కప్పు, పొట్టు పెసరపప్పు- పావు కేజీ, బెల్లం తురుము- అర కేజీ, పచ్చిపాలు- పావుకేజీ, కొబ్బరి కాయ ఒకటి, నెయ్యి- వంద గ్రాములు, యాలకుల పొడి - ఒక టీ స్పూన్
ముందుగా పెసరపప్పుని పొడి చేసి ఉంచాలి. కొబ్బరి తురుముకుని పెట్టుకోవాలి. గోధుమరవ్వలో పెసరపప్పు పొడి, బియ్యం పిండి, బెల్లం తరుము, పాలు, కొబ్బరి తురుము, నెయ్యి, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు చల్లుకుని గట్టి ముద్దలాగా చేయాలి. దీన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసి, ఒక్కో ముద్దను అరచేతిలో పెట్టి నాలుగు వేళ్లతో కోలగా ఒత్తాలి. ఇప్పుడు వీటిని కుక్కర్‌లో 20 నిమిషాలు పాటు ఆవిరి మీద ఉడికించి తీయాలి. చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.

-పసుమర్తి కామేశ్వర శర్మ 9440737464